[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
భూయో వితస్తా మహత్యం కథయస్య ద్విజోత్తమ।
యచ్భృత్యైవ భవిష్యామి ద్విజేన్ద్ర గత కల్మషః॥
[dropcap]క[/dropcap]శ్మీరులోని పవిత్ర స్థలాలు, తీర్థ స్థలాల వివరాలు, కశ్మీరు ప్రాచీన చరిత్ర వంటి విషయాలన్నీ నీలమత పురాణం వివరించింది. గోనంద మహారాజుకు అంతా వివరించిన తరువాత బృహదశ్వుడు రాజు అనుమతి తీసుకుని తీర్థయాత్రలకని వెళ్ళిపోయాడు. ఇదంతా జనమేజయుడికి వైశంపాయనుడు వివరించాడు. బృహదశ్వుడి ద్వారా కశ్మీరు ప్రాశస్త్యం, పవిత్రత వంటి విషయాలను తెలుసుకున్న గోనందుడు శాస్త్రానుసారం విధులన్నీ పాటిస్తూ, ధర్మబద్ధంగా రాజ్యం చేశాడు అంటుంది నీలమత పురాణం. నీలమత పురాణం గోనందుడిని వర్ణిస్తూ ‘సమరప్రియః’ అనే విశేషణం వాడుతుంది. ‘సమరప్రియః’ అంటే యుద్ధం లేక క్రీడా ప్రియుడు అన్న అర్థం వస్తుంది. కానీ ఆంగ్లానువాదంలో ‘సమరప్రియ’ను militant అన్న పదానికి సమానార్థకంగా భావించారు. ఇక్కడే అనువాదాలలో పాటించాల్సిన జాగ్రత్త స్పష్టమవుతుంది.
‘Militant’ అన్న పదం ‘సమరప్రియ’కు సమానార్థకం కాదు. రాజులు సాధారణంగా యుద్ధప్రియులు. క్రీడా ప్రియులు. ‘క్రీడ’ అంటే మృగయావినోదం. వేటాడడం. అదీ క్రూర జంతువులను వేటాడడం. కానీ ‘militant’ అన్న పదం వాడడంతో రాజు ప్రతీదాన్ని హింసాత్మకంగా వ్యతిరేకించేవాడు అన్న అర్థం వస్తుంది. కానీ తరువాత పాదంలో “రాజు శాస్త్రాలను అనుసరించి ధర్మబద్ధంగా రాజ్యం చేశాడు” అని ఉంటుంది. ప్రతీదాన్నీ హింసాత్మకంగా వ్యతిరేకించేవాడు ధర్మబద్ధంగా, శాస్త్ర విహితంగా రాజ్యపాలన చేయటం కుదరదు. కేవలం ఆంగ్లానువాదాలపై ఆధారపడడం వలన మన శాస్త్రాలను, ప్రాచీన గ్రంథాలను అర్థం చేసుకోవటంలో, విశ్లేషించటంలో పొరపాట్లు జరుగుతాయి. అందుకే అనువదించేవారు అత్యంత జాగరూకత వహించాల్సి ఉంటుంది. భారతీయులు చేసిన అనువాదంలో ఇలాంటి పొరపాట్లు దొర్లితే భారతీయ పండితులు, ఆంగ్లేయుల ప్రాపకం పొందటం కోసం వారే వినాలనుకుంటున్నారో అలాంటి అర్థాలే చెప్తుండగా, వాటిపై ఆధారపడి చేసిన అనువాదాలు, వ్యాఖ్యలను ప్రామాణికంగా భావించటం ఎంత వరకు సమంజసం అన్నది భారతీయులంతా ఆలోచించాల్సిన అంశం. అందుకే భారతీయ శాస్త్రాలను, ప్రాచీన గ్రంథాలను భారతీయ దృక్కోణంలో నుంచి అనువదించి, విశ్లేషించి, అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో militant అన్న పదానికి ఉన్న అర్థాన్ని ఆనాటి రాజు గోనందుడికి ఆపాదిస్తే అనర్థం అవుతుంది. శాస్త్ర విహితంగా, ధర్మబద్ధంగా పాలించిన రాజు తీవ్రవాది అవుతాడు. భారతీయ రాజులను పాశ్చాత్య దేశాల ‘ఫ్యూడల్ లార్డ్స్’ స్థాయికి దింపిన చరిత్ర రచయితలు ఇప్పుడు భారతీయ రాజులను తీవ్రవాదులుగా స్థిరీకరించాలని ప్రయత్నించినా ఆశ్చర్యం కలుగదు.
వైశంపాయనుడు చెప్పినదంతా విన్న గోనందుదు “వితస్త గొప్పదనం వినాలని ఉంది నాకు. వితస్త గొప్పతనం వినటం వల్ల పాపాలను నశింపజేసుకుని పాప విముక్తుడిని అవ్వాలని వుంది” అని కోరిక కోరాడు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. ఉపనిషత్తులలో శాంతిపాఠంలో ‘మా చెవులు మంచిని వినాలి. మేం మంచిని చూడాలి. మంచిపనులు చేస్తూ వందేళ్ళు కలిసిమెలిసి బ్రతకాలి’ అని కోరుకోవటం కనిపిస్తుంది. పురాణాలలో ఆ కోరిక ప్రతిధ్వని కనిపిస్తుంది. దీని వెనుక మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన అంశం ఉంది. ‘You are what you think’ అంటారు. అంటే మనిషి వ్యక్తిత్వాన్ని అతని ఆలోచనలు నిర్దేశిస్తాయి. ‘You think what you hear’ అంటారు. మనం చూస్తున్నవి, వింటున్నవి మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. అంటే, మనం మంచి వింటూ, మంచి చూస్తూ ఉంటే మన ప్రమేయం లేకుండానే మనకు మంచి ఆలోచనలే వస్తాయన్న మాట.
రెండు పిట్టలు బాల్యంలోనే తప్పిపోయి, ఒకటి ఓ సన్యాసి ఆశ్రమంలో, రెండో దొంగల స్థావరంలో పెరుగుతుంది. సన్యాసి ఆశ్రమంలో పెరిగినది అందరినీ సాదరంగా ఆహ్వానిస్తుంది. మంచి మాటలు చెప్తుంది. దొంగల స్థావరంలో పెరిగింది ‘చంపండి, దోచండి’ అని అరుస్తూంటుంది. మంచిని చూడటం, మంచిని వినటం వెనుక ఉన్న ఆలోచన ఇది. అందుకే కశ్మీరు గొప్పతనం గురించి ఇంత విన్నా సరే, జనమేజయుడికి ఇంకా వినాలన్న కోరిక కలిగింది. వితస్త ప్రాశస్త్యం గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది.
‘మంచి చెప్పటమే నేరం’ అన్నట్టు ప్రవర్తించే ఆధునిక సాహిత్యవేత్తలు, విమర్శకులు, మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు అందరూ గమనించాల్సిన విషయం ఇది. సమాజంలో విచ్ఛిన్నకర ధోరణులు, విద్వేషాలు ప్రజ్వలింపజేసే వాదనలు మాత్రమే అభ్యుదయం, వాంఛనీయం అని ప్రచారం చేస్తున్న వారంతా ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది.
‘ఒక ప్రాంతం పవిత్రత’ అనగానే మూర్ఖత్వం, ‘ఒక నది పవిత్రం’ అనగానే వెనుకబాటుతనంగా భావించి హేళన చేసి, వెక్కిరింతగా వ్యాఖ్యానిస్తూ తమని తాము మేధావులు భావించుకుంటున్న వారంతా ఒకసారి నిలిచి ఆలోచించాల్సిన విషయం ఇది. ‘మంచి ఎంత విన్నా తనివి తీరదు.’ చెడు వినకూడదు, అనకూడదు. చూడకూడదు. కానీ ఈనాడు ప్రసార మాధ్యమాలు, పండితులు, పామరులు, మేధావులు అంతా అవకాశం దొరికిన ప్రతీ చోటా ‘చెడు ప్రచారాని’కిచ్చే ప్రాధాన్యం ‘మంచి’ చెప్పడానికి ఇవ్వడం లేదు. దాని ఫలితాలు అందరం అనుభవిస్తున్నాం.
ఈ ‘వితస్త గురించి వింటే పాపాలు నశిస్తాయి’ అన్నది కూడా అంధవిశ్వాసమో, మూఢ నమ్మకమో కాదు. మంచి వింటే మనస్సు మంచితో నిండుతుంది. పవిత్రమవుతుంది. ఆ పవిత్ర భావన సజీవంగా ఉన్నంత కాలం మనసు పవిత్రంగానే ఉంటుంది. నిజానికి ఈ ప్రపంచమంతా మెదడు ఆడించే ఆట. చెడు పని చేస్తున్నవాడు కూడా తాను చేస్తున్నది మంచి పనే అని మెదడుకు చెప్పుకుంటాడు. తన వాదనను సమర్థించేందుకు అధారాలు సేకరిస్తాడు. కాబట్టి స్వర్గమయినా, నరకమయినా మెదడులోనే ఉంటుంది. ఇవి వింటే నా మనస్సు పవిత్రమవుతుందని నమ్మితే అవుతుంది. కాదనుకుంటే కాదు.
జనమేజయుడి కోరికను మన్నించి వైశంపాయనుడు వితస్త ప్రాశస్త్యం చెప్పటం ప్రారంభించాడు. దక్షుడి కూతురు, హరుడి భార్య అయిన సతి వితస్త. వైవస్వత మన్వంతరంలో ఈమెనే ఉమ అంటారు. ఆమెనే హిమాద్రి కూతురు. ఆమెనే పాపనాశని యమున అంటారు. మన్వంతరంలో ముల్లోకాలను దాటించే నావ ఇది. ఆ దేవతనే కశ్మీర అంటారు. ఆ కశ్మీర దేవతయే వితస్త.
కశ్మీరా కథితా దేవీ వితస్తా సైత నిమ్నాగా।
పాతాలాదుర్ధిలా దేవీ వితస్తా శూలఘాతాత్తరంగిణీ॥
వితస్తనే కశ్మీర దేవత. శూలఘాతంతో పాతాళం నుంచి పైకి ఉబికిన తరంగిణి వితస్త. వితస్తలో స్నానం చేయటం వల్ల పాపాలు నాశనమై పవిత్రమవటం వల్ల వ్యక్తి తనంతట తానే తన స్వస్వరూపం కనుగొంటాడు. పాపభారం నశించి తేలికయిపోతాడు. గంగ ఏ రకంగానూ వితస్త కన్నా అధికం కాదు. నిజానికి గంగ కన్నా పవిత్రం వితస్త. ఏ విషయంలో గంగానది వితస్త కన్న అధికం అంటే, గంగా నదిలో మనుషుల ఎముకలు అధికంగా ఉంటాయి. అంతే తప్ప, ఏ విషయంలోనైనా గంగా, వితస్త ఒకటే.
(ఇంకా ఉంది)