నీలమత పురాణం-83

0
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

వితస్తాతోధివో రాజన్ స్నానధ్యం తుల్యమేవచ।
భాగీరథేన గంగేయం పురా రాజ్ఞా వతాంతో॥

[dropcap]గం[/dropcap]గానదికి, వితస్త నదికీ తేడా అల్లా వితస్త నీరు పరిశుభ్రంగా ఉంటుంది, గంగా నీటిలో మానవుల ఎముకలు దొరుకుతాయి. ఈ ఒక్క తేడా తప్పిస్తే గంగానది, వితస్త నదుల నడుమ మరో విషయంలో ఎలాంటి తేడా లేదని చెప్పిన తరువాత, ఆ తేడా ఎలా వచ్చిందో కూడా చెప్తున్నాడు.

గంగానదిని భువిపైకి భగీరథుడు తపస్సు చేసి రప్పించింది ఎందుకంటే, ఆ నది తన పూర్వీకుల ఎముకలపై నుండి ప్రవహించి వారిని పవిత్ర లోకాలకు చేర్చాలని. కాబట్టి గంగానదిలో ఎముకలు ఉంటాయి. కానీ వితస్త ఇందుకు భిన్నం. అతి పవిత్రమైనది. సతీదేవి స్వరూపం. పార్వతీమాత రూపం. అతి పవిత్రం. గంగానది సగరుడి సంతానం ఎముకలను తనలో కలుపుకున్నది. అందుకని మానవులు కూడా తమ మరణం తరువాత ఎముకలను గంగలో కలుపుతారు. కానీ వితస్త అలా కాదు. అందుకని ఓ కోణం లోంచి చూస్తే గంగానది కన్నా వితస్త నది ఇంకా పవిత్రంగా తోస్తుంది. అందుకే వితస్తలో మరణించినవారు సోమరస పానం చేసిన వారిలా స్వర్గానికి చేరుతారు. యజ్ఞాలు చేసి హవిస్సులు అర్పించిన దానికన్నా వితస్తలో స్నానం చేసిన వారంటే దేవతలకు ప్రీతి. పవిత్ర స్థలాలలో పూజలు చేసి అర్పించిన నైవేద్యాల కన్నా దేవతలకు వితస్త స్నానమే ప్రీతిపాత్రం.

అన్ని రకాల నాగులు, నదులు, పవిత్ర స్థలాలు, దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు నిరంతరం వితస్తలో స్నానమాడాలని తహతహలాడుతారు. వితస్తలో స్నానం వల్ల పవిత్రులవుతారు. మనుషులు వితస్తలో స్నానం చేయటంతో తమ జన్మను సార్థకం చేసుకుంటారు. వితస్తలో స్నానం చేసిన వారు బొందితో విష్ణులోక ప్రాప్తిని పొందుతారు. సర్వపాపాలు హరిస్తాయి. పుణ్యలోకాలు పొందుతారు. వితస్తలో స్నానం వల్ల ప్రితృదేవతలు సంతృప్తి పొందుతారు. వితస్త జలాలలో స్నానం చేసినవారు వరుణుడి దృష్టిలో పడతారు. వారి పాపాలను నశింపజేసి వారు నరకానికి పోకుండా వరుణుడు కాపాడతాడు.

వితస్తను ఆశ్రయించిన వారికి స్వర్గ సోపాన మార్గం లభిస్తుంది. కోరికలు తీరుతాయి. వారు హంసల రథంలో ఆకాశమార్గన స్వర్గం చేరుతారు. వారి మార్గాన వీణావాదనలు, ఘంటల మ్రోతలు వినిపిస్తాయి. అప్సరసలు వారి పరిచారికలు పలు రకాల పుష్పాలు ధరించి, పవిత్ర నాదాలు చేస్తుండగా, ఆవుల మెడల్లోని గంటల గణ గణల ప్రతిధ్వనులతో వితస్తలో స్నానం చేసిన వారి కోరికలు సిద్ధిస్తాయి. అమృతం వంటి వితస్త జల పానం చేసిన వారు ఆరోగ్యవంతులవుతారు. తల్లిలా వితస్త నది వారి కోరికలను తీరుస్తుంది, వరాలిస్తుంది.

హిమాలయాల రాజయిన హిమవంతుడి పుత్రిక వితస్త. హరుడి భార్య వితస్త. ఈ పవిత్రమైన వితస్తకు ప్రణామాలు ఆచరించు. ఋషులు సైతం పూజించే వితస్తను కొలవడం వల్ల పుణ్యం లభిస్తుంది. సింధు, త్రికోటి, విశోక, హర్షపథ, సుఖ, చంద్రావతి, సుగంధి, పుణ్యోదక, కులారణీ, కృష్ణ, మధుమతి, పరోశ్ని వంటి అతి పవిత్రమైన నదులు, జలరాశులన్నీ వితస్తతో సంగమానికి ఉవ్విళ్ళూరుతాయి. వితస్త పవిత్రమైన నీటిలో మిళితమైపోవటానికి పరుగు పరుగున వస్తాయి.

శివుడి జటాజూటంలో బంధితమై ఉన్న గంగానది నీటిని విముక్తం చేసిన చంద్రుడి పేరు మీద వెలసి, మానవ ప్రపంచంలో చంద్రభాగ పేరుతో ప్రసిద్ధమైన పవిత్ర జలం కూడా వితస్త నది నీటిని కలిసేందుకు ఆత్రంగా వస్తుంది. పవిత్ర స్థలాలు, పవిత్ర జలాలు, సరస్సులు, నదులు, బావులలో నీరు, అన్ని రకాల జలాలు వరాలనిచ్చే వితస్తలో భాద్రపద మాసం శుక్ల పక్షంలో పదమూడవ రోజున పరుగున వచ్చి కలుస్తాయి.

వితస్త నది పవిత్రతను, మహత్యాన్ని వందేళ్ళయినా వర్ణించటం ఎవరి తరం కాదు. ఎంత చెప్పినా తరగని గని వితస్త మాహాత్మ్యం. నా శక్తిని అనుసరించి, నాకు తెలిసిన కొద్దిపాటి విషయం నీకు చెప్పాను. దీన్ని మరచిపోకుండా అనుసరించు. వితస్తను గౌరవించు.

(ముగింపు త్వరలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here