Site icon Sanchika

నీలమత పురాణం-84

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

సంన్దేపతో గ్రంథబహుత్పభీత్యా సమగ్ర శాస్త్రిః ఖలు సంచితం యత।
సర్వత్ర కినైతదుర్యుపయోగ మేతి ఎతో న చోచే భగవాన్ మహాత్మ।
అతీత హృద్యే బహు విస్తరేపి జనాప్రయో భారతపూర్ణ చన్ద్రే॥

వితస్త మాహత్య్మం జనమేజయుడికి వైశంపాయనుడు సంపూర్ణంగా వివరించాడు.

“ఈ వితస్త మాహత్య్మం విన్నవారికి పాపాలు సర్వం నశిస్తాయి. నీలమత పురాణం మొత్తం విన్నవారికి పది గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది” అని ఆశీర్వదించాడు. దీనితో నీలమత పురాణం పూర్తవుతుంది.

అయితే జనమేజయుడు మనకు మహాభారతంలో తారసపడతాడు. మరి ఈ నీలమత పురాణం మహాభారతంలో ఎందుకు భాగం కాలేదు? అన్న సందేహం వచ్చే వీలుంది. మహాభారతాన్ని జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తాడు. నీలమత పురాణం కూడా జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తాడు. ఈ విషయం గోనందుడికి బృహదశ్వుడు చెప్తాడు. మహాభారతంలో 18 పర్వాలలో 2109 అధ్యాయాలున్నాయి. ‘మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేనే లేదు’ అంటారు. అలాంటి మహాభారతాన్ని జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పినప్పుడు, నీలమత పురాణాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీలమత పురాణం కూడా మహాభారతంలో ఎందుకు భాగం కాలేదు? అని వాదించే వీలుంది. ఆ వాదనకు తావు ఇవ్వకుండా నీలమత పురాణం చివరిలో సమాధానం ముందే ఇచ్చేస్తున్నారు.

మహాభారతం పెద్ద గ్రంథం అనటం మహాభారతం గురించి తక్కువ చేసి చెప్పటమే అవుతుంది.

యథా సముద్రో భగవాన్ యథా చ హిమవన్ గిరిః।
ఖ్యాతావుభావు రత్ననిధి తథా భారతముచ్యతే॥

మహాభారతం కేవలం పురాణం మాత్రమే కాదు. భారతదేశ తత్వాన్ని సర్వం తనలో ఇముడ్చుకుని ప్రవహించే సాహిత్య జీవనది. జీవనదిలో అనేక ఉపనదులు వచ్చి కలసి జీవనది ప్రవాహాన్ని పరిపుష్టం చేసినట్టు మహాభారత గాథలో అనేక ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక సజీవధారలా నిలుస్తుంది మహాభారతం. అంటే, ముందే పరవళ్ళూ తొక్కుతూ, ఒడ్డును కోసుకుపోతున్న నదిలాంటిదన్న మాట. దీనిలో నీలమత పురాణం చేరిస్తే ఇప్పటికే అంచుల వరకూ నిండి ఉన్న నీరు పొంగి పొర్లుతుంది. అందుకని నీలమత పురాణాన్ని మహాభారతంలో భాగం చేయలేదు అని చెప్తుంది నీలమత పురాణం.

ఇప్పటికే మహాభారతం గురించి ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంది.  వ్యాసుడు 8800 శ్లోకాలతో మహాభారతం రచించాడనీ, అప్పుడు మహాభారతం పేరు ‘జయం’ అనీ అంటారు. వైశంపాయనుదు వీటికి మరిన్ని శ్లోకాలు, కథలు జోడించాడని, మొత్తం 24000 శ్లోకాలతో జయం, భారత సంహిత అయిందని అంటారు. సూతుడు మరిన్ని కథలు, గాథలు జోడించి దీన్ని ‘మహాభారతం’గా మలచాడంటారు.

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న లక్షకుపైగా శ్లోకాలున్నాయి. నిజానికి మహాభారతంలో ‘నీలమత పురాణం’ ఒక భాగమయి ఉంటే నీలమత పురాణం ప్రత్యేకత ప్రస్ఫుటమయి ఉండేది కాదు. అదీ గాక, మహాభారతంలో ‘నీలమత పురాణం’ అంతగా ఒదగదు కూడా.  ఎందుకంటే, మహాభారతం ఏ ఒక్క ప్రాంతానికీ ప్రత్యేకమైన గాథ కాదు. నీలమత పురాణం కశ్మీరుకే ప్రత్యేకమైనది. కశ్మీరు ‘అస్తిత్వం’ నిరూపిస్తుంది నీలమత పురాణం. అదీ గాక ఇప్పటికే మహాభారతం పెద్దదై పోయింది. దానికి ప్రాంతీయ ప్రత్యేకత కల నీలమత పురాణం జోడించి మరింత విస్తృతం చేయటం ఎందుకని నీలమత పురాణాన్ని ప్రత్యేకంగా ఉంచారు. అంతే తప్ప మహత్యంలో కానీ, పవిత్రతలో కానీ, ఫలంలో కానీ నీలమత పురాణం ఏ మాత్రం తక్కువ కాదు.  గంగానది ఎంత పవిత్రమో, వితస్త నదీ అంతే పవిత్రము. అలాగే మహాభారతం ఎంత ప్రశస్తమో, నీలమత పురాణం కూడా అంత ప్రభావం కలది. మహాభారతంలో దేశంలోని పవిత్ర స్థలాలు, తీర్థాల ప్రస్తావన వస్తుంది. నీలమత పురాణం కశ్మీరులోని పవిత్ర స్థలాలు, తీర్థాలు, నదులను ప్రస్తావిస్తుంది. కశ్మీరుకు భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో ఉన్న సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక అనుబంధాన్ని స్పష్టం చేస్తుంది. నీలమత పురాణం ఎలాగయితే మహాభారతంలోని భాగమో, అలాగే, కశ్మీరు కూడా భారతదేశంలో అంతర్భాగం. అవిభాజ్యమైన అంగం.

శ్రీనివాసం హరిం దేవం వరదం పరమేశ్వరమ్।
త్రైలోక్యనాథం గోవిన్దం ప్రణమ్యాక్షరమవ్యయమ్॥

అంటూ ఆరంభమైన నీలమత పురాణం ‘ఇతి నీలమత వితస్తా మాహాత్మ్యమ్’ అంటూ ముగుస్తుంది.

(ముగింపు త్వరలో)

Exit mobile version