Site icon Sanchika

నీలమత పురాణం-85

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]నీ[/dropcap]లమత పురాణం మొత్తంగా చదివిన తరువాత భారతీయ ధార్మిక వ్యవస్థ గురించి ప్రచారంలో ఉన్న అనేక ఆలోచనలు మనసుని ముసురుతాయి. భారతీయ చరిత్ర గురించి ప్రచారంలో ఉన్న అభిప్రాయలు, భారతీయ జీవన విధానం గురించి ఉన్న దురభిప్రాయాలు అన్నింటినీ మళ్ళీ ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఎందుకంటే, మన చరిత్రను మనం విదేశీయుల దృష్టితో చూడడం అలవాటు చేసుకున్నాం. మనదన్న ప్రతీదాన్నీ మన పాలకులు, మనల్ని ఓడించిన వారి దృష్టితో అర్థం చేసుకోవటం అలవాటయింది. మనదన్న దృష్టితో మనల్ని మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.

ఎదుటివాడి దృష్టితో మనల్ని మనం చూసుకున్నంత కాలం మనం – ఎదుటివాడు మనం ఎలా ఉండాలనుకుంటున్నాడో, అలా తయారవుతాం తప్ప మనం మనలా మిగలం. ‘నీలమత పురాణం’ లోని పలు అంశాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. నీలమత పురాణం ఎలాంటి మలినాలు కలవని పురాణం. ‘మలినాలు’ అంటే విదేశీ దృక్కులు, వ్యాఖ్యానాల మలినాలు అని అర్థం. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అర్థం చేసుకోవటం కష్టం. సానుభూతితో చూసి అవగాహన చేసుకోవటం కష్టం. అహం లేకుండా ఆలోచించటం కష్టం. అలాంటింది, ఒక జాతి, మరొక జాతిని, సానుభూతితో అర్థం చేసుకుని, అవగాహన చేసుకోవటం ఊహించలేని విషయం. అందునా, ఆ జాతి పాలక జాతి అయి, వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన జాతి పాలిత జాతి అయితే అవగాహన స్థానాన్ని అహంకారం ఆక్రమిస్తుంది. ఆలోచన స్థానాన్ని చులకన భావం ఆక్రమిస్తుంది. ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా మరో సంస్కృతి కలవారిపై ఆధిక్యం సాధించిన వారి ప్రవర్తన చరిత్రను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇక్కడ మరో విషయం మనం గమనించాలి. ఈ ఒక సంస్కృతి, మరో సంస్కృతిపై ఆధిక్యం సాధించటం విషయంలో ప్రాచీన కాలంలోనూ, ఆధునిక కాలంలోనూ తేడా ఉంది. ప్రాచీన కాలంలో గెలువు భౌతికం మాత్రమే. ఆధునిక కాలంలో భౌతిక గెలుపుతో పాటు సాంస్కృతికంగా, ధార్మికంగా, మతపరంగా పరాజితులను రూపాంతరం చెందించటం కనిపిస్తుంది.

చైనాపై దాడి చేసిన మంగోలులు కొద్ది కాలానికి చైనీయులుగా మారిపోయారు. ‘యువాన్’ వంశం చైనీయులతో కలిసిపోయిన మంగోలులు ‘మంచు’ తెగవారు చైనీయులై, ‘క్వింగ్’ వంశంగా రూపాంతరం చెందారు. అంటే, తాము గెలుచుకున్న వారితో కలసిపోయి తామూ వారిలాగే అయిపోయారన్న మాట. రెండు నదులు కలసిన తర్వాత ఏ నీరు ఏ నదిదో విభజించి చూపలేమో, అలాగే విజేతలు, పరాజితులు అన్న తేడాల్లేకుండా కలసిపోయారన్న మాట. ఇది భారతదేశంలోనూ జరిగింది. గ్రీకులు భారతదేశమనే మహా సముద్రంలో కలసిపోయారు. శకులు క్షత్రియులయ్యారు. కుషానులు బౌద్ధులయ్యారు. హుణులు భారతీయులయిపోయారు. ఈ రకంగా చూస్తే యూరప్‌లో గాని, ఆఫ్రికాలో కాని, ఇతర ఏ ఖండంలోనూ విజేతలు తమని తాము ప్రత్యేకంగా భావించుకుని తాము గెలిచిన వారిపై తమ దైవాన్ని తమ సంస్కృతి సంప్రదాయాలను రుద్దటం కనబడదు. ఇది క్రీస్తు శకం ఆరంభమయిన తరువాత కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం నాగరికతలు అంతరించటంలో ప్రాకృతిక వైపరీత్యాలు ప్రధాన పాత్ర పోషించేవి. క్రీస్తు శకంలో మనిషి అహం ప్రధానపాత్ర వహిస్తోంది నాగరికతలు అంతరించటంలో.

రోమన్లు ఎన్ని రాజ్యాలను ఆక్రమించినా, అధికారం చలాయించారు తప్ప సాంస్కృతిక ఆధిపత్యం కోరలేదు. కానీ, తరువాత కాలంలో ఈ పరిస్థితి మారిపోయింది. తమ దైవమే గొప్ప, ప్రపంచంలో ఉన్న ఏకైక దైవం తాము నమ్మిన దైవమే, నమ్మితే తమ దైవాన్నే నమ్మాలి, లేకపోతే ప్రాణాలు వదిలిలేయాలి తప్ప, తమ ‘పంథా’ లోకి రాని వారు ఉండకూడదన్న పట్టుదల క్రీస్తు పూర్వం విజేతలను, క్రీస్తు శకం విజేతలను వేరు చేసి చూపించే అంశం. అందుకే అంతకు ముందు ఎన్ని దాడులు జరిగినా, ఎంత మంది విదేశీయులు భారతదేశంలో అడుగుపెట్టినా పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు.

రెండు నదులు కలసినప్పుడు రెండు నదుల నీళ్ళు తమ ప్రత్యేకతను కోల్పోతాయి. రెండూ కలసి రెండు నదుల లక్షణాల కలయికతో  నూతన నీటి ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తాయి. ప్రాచీన కాలంలో అదే జరిగింది. కానీ తరువాత కాలంలో ఇందుకు భిన్నంగా, సముద్రంలో కలసిన నది తన అస్తిత్వాన్ని కోల్పోయినట్టు విజేత అనే సముద్రంలో పరాజితులు మిళితమై తమ అస్తిత్వాన్ని కోల్పోయారు. ఇందుకు భిన్నంగా తన అస్తిత్వాన్ని నిలుపుకున్న ఏకైక ధర్మం భారతీయ ధర్మం. కానీ ఎలాగయితే సముద్రపు నీటి తాకిడికి గురయిన తరువాత ఎంత అస్తిత్వాన్ని నిలుపుకున్నా, నది నీరు రూపాంతరం చెందక మారదో,  గతం ఛాయలున్నా ప్రస్తుత సమాజం రూపాంతరం చెందక మారదు.

ఈ దృష్టితో భారతీయ చరిత్రను, భారతీయ సమాజాన్ని, భారతీయ ధర్మాన్ని, సంస్కృతి సంప్రదాయాలను మరోసారి దర్శించి విమర్శించుకోవాల్సి ఉంటుంది. భారతీయ దృక్కోణంలో భారతీయ చరిత్రను పునర్నించుకోవాల్సి ఉంటుంది. ‘నీలమత పురాణం’ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. నీలమత పురాణంలో కనిపించే అనేక అంశాలు ఈ ఆలోచనను బలపరుస్తాయి. ఇతర పురాణాల పంథాను అనుసరిస్తూ, ఇతర పురాణాలలానే ఉంటూ కూడా తనదైన ప్రత్యేక పద్ధతిని ఏర్పాటు చేసుకున్న నీలమత పురాణాన్ని విశ్లేషిస్తుంటే భారతీయ ధర్మం ఎంత విభిన్నమైనదో అంతగా ఏకసూత్రత నిబిడీకృతమై ఉన్నదని స్పష్టమవుతుంది.

(ముగింపు త్వరలో)

Exit mobile version