నీలమత పురాణం-87

1
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]నీ[/dropcap]లమత పురాణంలో పండుగల వర్ణనలు, పండుగలు జరుపుకొనే విధానాల వివరణలు భారతీయులకు జీవితాన్ని ఆనందంగా అనుభవించడం తెలిసినంతగా ప్రాచీన నాగరికతలలో ఇతర ఏ నాగరికతకు తెలియదని అర్థమవుతోంది. ‘నిత్య కళ్యాణం పచ్చ తోరణం’ అన్నట్టు ప్రతి రోజూ పండుగనే. ఆ పండుగ కూడా ఇంటిల్లిపాదీ, కలిసి ఆనందంగా అనుభవించటం, ఆపై ఊళ్ళోని ప్రజలందరూ కలసి సంబరాలు చేసుకోవడం, కలసి భోజనాలు చేయటం, ఉన్నది పంచుకోవటం, ఆనందంగా గడపటం కనిపిస్తుంది. ముఖ్యంగా వెన్నెల రాత్రులలో, దట్టమైన అమావాస్య చీకటి రాత్రులలో సైతం అందరూ కలసి భజనలు చేయటం, పురాణలు వినటం, నాటికలు ఆడటం, నృత్యాలు చేయటం వంటి సంబరాలు అడుగడుగునా కనిపిస్తాయి. మంచు పడగానే మద్యం తాగమని చెప్తుంది నీలమత పురాణం. ఆ వెంటనే మళ్ళీ పవిత్రంగా పూజలు చేయమని చెప్తుంది. నాట్యగత్తెల నృత్యాలు చూడమంటుంది. మహిళలను పూజించమంటుంది. ఆడవాళ్ళ అలంకరణకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, పండుగల నాడు ఇల్లు, వాకిలి, వీధుల అలంకరణలకూ అంతే ప్రాధాన్యం ఇస్తుంది. అంటే ప్రజలంతా రంగురంగుల దుస్తులతో అలంకరించుకుని, ఊరూ వాడా అలంకరించి ఆనందించాలన్న మాట. ఒకసారి నీలమత పురాణంలోని వర్ణనలు చదివితే కళ్ళముందు అందమైన దృశ్యాలు, పంచవర్ణాలతో అలంకరించబడి ప్రత్యక్షమవుతాయి. రంగురంగుల దుస్తులలో ప్రజలు, రంగురంగుల అలంకరణలతో ఊరూ వాడా, అందమైన అలంకరణలతో మందిరాలు, దేవీదేవతలు, చుట్టూ సుందరమైన ప్రాకృతిక సౌందర్యం, ఆకాశాన్ని తాకే హిమాలయాలు, జలజల దూకే జలపాతాలు, గలగల పారే నదులు. ఇలా ఎటు చూసినా అందం. ఆనందం ఉట్టిపడే అత్యంత సౌందర్య భరితమైన దృశ్యాలు కళ్ళముందు నిలుస్తాయి. ఆనాటి ప్రజలకు జీవితం ఒక ఆనందభరితమైన ప్రయాణం అన్న భావన కలుగుతుంది.

ఇక రాజును కూడా ప్రత్యేకంగా చూడటం నీలమత పురాణంలో కనబడదు. రాజు సైతం సామాన్యుల్లా అన్ని ఆచారాలు ఆచరించాలి. పైగా ప్రజలు అతడికి స్నానం చేయించాలి. రాజ్యం నలుమూలల నుంచి, పవిత్ర స్థలాల నుంచి తెచ్చిన మట్టితో, జలాలతో అతడికి స్నానం చేయించాలి, రాజు విగ్రహాలు తలపై పెట్టుకుని రాజ వీధుల్లో ఊరేగాలి, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు రాజుకు స్నానం చేయించాలి… ఇలా పలు ఆచార వ్యవహారాలలో ఆ కాలంలో ‘రాజు’ ఈనాటి మంత్రుల్లా ప్రత్యేకం కాదనీ, ప్రజలలో ఒకడిగా కలిసిపోయేవాడని స్పష్టం అవుతోంది. రాజ్యభారం అన్నది దైవదత్తమైన పవిత్ర బాధ్యత తప్ప, అది ‘హక్కు’ కాదని తెలుస్తుంది. ప్రజలు రాజును నిలదీయటం, ఆజ్ఞాపించటం, వారి ఆజ్ఞలను అనుసరించి రాజు తన భవంతిని సైతం విడిచి పెట్టి వెళ్ళటం కనిపిస్తుంది.

‘నీలమత పురాణం’ లోని అంశాలను విశ్లేషిస్తుంటే మనసుకు స్పష్టంగా అర్థమయ్యే విషయం – ఈనాడు మనం పాశ్చాత్య పాలన ప్రభావంతో సంపూర్ణంగా రూపాంతరం చెందిన సమాజాన్ని చూస్తూ, ఆ పాశ్చాత్యుల దృష్టితో ఆనాటి సమాజాన్ని ఊహిస్తున్నాము, విశ్లేషిస్తున్నాము. కానీ అది పొరపాటు. భారతీయ సమాజం dynamic society. ఒక సజీవ నదీ ప్రవాహం. ఈ సజీవ ప్రవాహంలోకి కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉంటుంది. ప్రవాహానికి అడ్డు వచ్చినప్పుడు పక్కకు తిరిగి, వంపులు తిరిగి ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ ఆరంభంలోని జలానికి, ప్రయాణంలోని జలానికీ నడుమ తేడా ఉంటుంది. అంత మాత్రాన ప్రవాహంలోని జలాన్ని చూసి నది ఆరంభంలో జలం ఇలాగే ఉండేదని ఊహించటం పొరపాటు. భారతీయ సమాజం గురించి జరిగే చర్చలలో, చేసే వ్యాఖ్యలు విశ్లేషణలలో ఇదే పొరపాటు పదే పదే జరుగుతోంది. ఇకనైనా ఈ పొరపాటును సవరించుకునేందుకు నాందీ ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. భారతీయులకు చారిత్రక చైతన్యం లేదని దుర్వ్యాఖ్యానం చేసి భారతదేశ చరిత్రను వక్రీకరించిన విధానాన్ని గమనించి, మన చరిత్రను మనం మరోసారి మన దృష్టితో చూసి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, స్థానిక గాథలను అని పనికిరావన్న దృష్టితో కాక, అవి ఏం చెప్తున్నాయో నిలిచి విని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాచీన గ్రీకు పౌరాణిక గాథను సామాజిక, మానసిక, ధార్మిక, ఆధ్యాత్మిక కోణాల్లో విశ్లేషిస్తాం. దాని నుంచి అనేక విషయాలు గ్రహించాలని తపన పడతాం. ఆ గాథల ద్వారా ఆనాటి సమాజాన్ని, వ్యక్తుల వ్యక్తిత్వాలను ఆవిష్కరించాలని తపన పడతాం. అదే మన పురాణ గాథల దగ్గరకు వచ్చేసరికి పెదవి విరుస్తాం, తీసి పారేస్తాం. ఈ పరిస్థితి మారాలి.

(ముగింపు త్వరలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here