నీలమత పురాణం-88

4
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]భా[/dropcap]రతీయ పురాణాలను ‘పనికిరానివి కావు’, ‘వాటి నుంచి గ్రహించేది ఎంతో ఉంది’ అన్న దృష్టితో చూస్తే కల్పవృక్షాల్లా కోరిన సమాచారాన్ని అందిస్తాయి. నీలమత పురాణంలో ప్రస్తావించిన పలు జాతులు, వాటి లక్షణాలు – ఇతర పురాణాలలో వీటి గురించి ప్రస్తావించిన అంశాలతో పోల్చి – ఆధునిక ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీల పరిశోధనలతో సమన్వయం చేస్తే – అనేక అద్భుతమైన విషయాలు అవగాహనకి వస్తాయి. అయితే ఇందుకు మన చరిత్రను, మన ప్రాచీన గ్రంథాల ద్వారా గ్రహించిన విషయాలను ఇతర దేశాల గ్రంథాలలోని అంశాలతో పోల్చాలన్న దృష్టితో చూడకూడదు. మన చరిత్ర ఆధారంగా విదేశీయుల చరిత్రను సరిపోల్చాలి తప్ప విదేశీయుల చరిత్రకు సరిపోయేలా మన చరిత్రను కుంచించకూడదు. ఇందుకు ప్రధాన దృష్టాంతం భారతదేశంలోకి ఎక్కడి నుంచో మనుషులు వచ్చారనే మనం ఆలోచిస్తున్నాం తప్ప, ఇక్కడ మనిషి పుట్టి ఉంటాడన్న ఆలోచనకు తావివ్వడం లేదు కూడా. అంటే, ముందే మనం, ఒక విషయాన్ని నిర్ణయించేసుకుని, మొత్తం దానికి సరిపోయేట్టు చేస్తున్నాం అన్న మాట. అంతే తప్ప, ఎలాంటి అపోహలు, దురూహలు లేకుండా భారతదేశానికి సంబంధించిన  ఏ అంశాన్నీ మనం పరిగణనలోకి తీసుకోవడం లేదు.

‘నీలమత పురాణం’లోని అంశాలను విశ్లేషించే ముందు, మనం మన మెదడును ఓ తెల్ల కాగితంలా, దానిపై ఎలాంటి రాతలు, ప్రభావాలు లేనట్టు చేసుకోవాల్సి ఉంటుంది. ‘నీలమత పురాణం’లో నాగులు, పిశాచాలు, దార్యాలు, అభిసారులు, గాంధారులు, జహందరులు, శాకలు, ఖాసాలు, తంగణాలు, మాందవులు, మాధులు, అంతర్గిరులు, బాహిర్గిరులు వంటి వారి ప్రసక్తి పలు సందర్భాలలో వస్తుంది. వీరిలో నాగులు, పిశాచాలు కశ్మీరుకు చెందినవారు. మిగతా వారంతా కశ్మీరుకు ఇరుగు పొరుగు ప్రాంతాలలో ఉన్నవారు. వీరిలో ఒక నాగ జాతి వారు యవనప్రియులు. యవన అంటే గ్రీకులు కాదు. భారతదేశానికి ఆవల ఉండి, వేదాలను గౌరవించని వారంతా యవనులే భారతీయుల దృష్టిలో.

‘నీలమత పురాణం’లోనే కాదు, భారతీయ పురాణాలన్నింటిలో మానవుడు ‘జంబూద్వీపం’లోనే జన్మించాడని స్పష్టంగా చెప్పటం కనిపిస్తుంది. జంబూద్వీపం అంటే ‘జంబూ ఫలం లభించే ప్రాంతం’. ‘జంబూ ఫలం’ అంటే నేరేడు పండు. జంబూ ద్వీప వర్ణన  పురాణాలలో విపులంగా, స్పష్టంగా వుంది.

జంబూద్వీపః సమస్తానా మేతేషాం మధ్య సంస్థతః
భారతం పథమం వర్షం తతః కింపురషం స్మృతమ్
హరివర్ణం తథైవాన్యన మేరోర్దక్షిణతోద్విజ।
రమ్యకం చోత్తరం వర్ణం తస్యైవామ హిరణ్యమ్,
ఉత్తరాం కురువశ్చైవ యథావై భారతం తథా।
నవ సాహస్ర మేకైకమేతేషాం ద్విజసత్తమ,
ఇలావృక్షమ్ చ తన్మధ్యే ఆవర్లో మేరు రుచ్ఛితః।
భద్రాశ్యం పూర్వతో మేరోః కౌతుమూలం చ పశ్చిమో।
ఏకాదశ శతా యామః పాద పాగిరి కౌతవః జంబూద్వీపస్య సాంజచూర్నమ్
హేతుర్మమమున్

జంబూద్వీపం విస్తీర్ణం ఒక లక్ష యోజనాలు. పద్మపుష్పం ఆకారంలో ఉంటుంది. ఎనిమిది పర్వతాలు ఈ దేశాన్ని తొమ్మిది దేశాలుగా విభజిస్తాయి. ఈ తొమ్మిది దేశాలు తొమ్మిది పద్మపుష్ప రేకలుగా తోస్తాయి. ఈ తొమ్మిది దేశాలు తొమ్మిది వేల యోజనాల విస్తీర్ణం కలవి. ఉత్తరాన, దక్షిణాన ఉన్న దేశాలు విల్లు ఆకారంలో ఉంటాయి. మిగిలిన వాటిలో నాలుగు దేశాలు మిగతావాటి కన్నా ఎక్కువ వైశాల్యం కలవి. కేంద్రంలో ఉన్న దేశం చతురస్రాకారంలో ఉంటుంది. దీన్ని ‘ఇలావృత’ మంటారు. ఈ దేశం కేంద్రంలో ఒక లక్ష యోజనాలు ఎత్తు కల సుమేరు పర్వతం ఉంటుంది. దీన్ని స్వర్ణ పర్వతం అంటారు. ఈ పర్వత శిఖరం బల్లపరుపుగా ఉంటుంది. దాని విస్తీర్ణం ముప్ఫయివేల యోజనాలు. ఇలావృత ఉత్తరాన నీలగిరి, శ్వేతగిరి, శృంగవాన్ పర్వతాలుంటాయి. వీటి నడుమ రమ్యక, హిరణ్మయ, కురు దేశాలు ఉంటాయి. ఇలావృతకు దక్షిణాన నిషధ, హేమకూటం, హిమాలయ పర్వతాలు ఉంటాయి. వీటి నడుమ హరివర్ష, కింపురుష, భారతదేశాలుంటాయి. ఇలావృతకు తూర్పున గంధమాదన పర్వతం, పశ్చిమాన మాల్యవంత పర్వతం ఉంటాయి. కేతుమాల, భద్రశ్వేత అనే దేశాలు, దాదాపుగా రెండువేల యోజనాల విస్తీర్ణం కలవి; నీల, నిషాధ పర్వతలు సరిహద్దులుగా ఉన్నవి ఉంటాయి. మహామేరు పర్వత పాదాల వద్ద మందర, మేరు, సుపార్శ్వక, కుముదతో సహా పలు పర్వతాలుంటాయి. వీటిపై వివిధ రసాల ఫలాల వృక్షాలుంటాయి. ఇక్కడ నాలుగు సరస్సులుంటాయి. పాలు, తేనె, చెరుకు రసం, తీపి నీటితో ఈ సరస్సులు నిండి ఉంటాయి. ఈ నీటి స్పర్శతో దేవతలు ఐశ్వర్యవంతులు అవుతారు. నందన, చైత్ర రథ, వైభ్రాస, సర్వభద్రక అనే దివ్య వనాలుంటాయి. దేవతా స్త్రీలు, గంధర్వులు ఈ వనాలలో ఆడుకుంటారు. శృంగార కేళీ విలాసాలకు అనువైనవీ వనాలు. ఇక్కడ రాలిపడిన మామిడి కాయల రసంతో ఒక సరస్సు ఏర్పడింది. దీన్ని అరుణానది అంటారు. అరుణ అనే దేవత ఇక్కడ నివసిస్తుంది.  ఏ పురాణంలోనైనా జంబూద్వీప వర్ణన ఒకటే.

పాశ్చాత్యులు మానవుడు ఇక్కడ పుట్టలేదు, ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చాడంటారు. మన పూర్వీకులు మాత్రం విశ్వ ఆవిర్భావం నుంచీ చెప్తూ దేవతలు మనుషులు అంతా ఇక్కడే ఉద్భవించారంటారు. ఇది ‘దేవభూమి’ అంటారు. ఎవరిని నమ్మాలి అన్న సందేహం లేకుండా మనం పరాయి వారినే నమ్ముతాం, ఎలాంటి ఆధారాలు లేకున్నా. పురాణాలలో వారు చేసిన వర్ణనలు, చెప్తున్న పర్వతాలు, నదులు, సరస్సులు, దేశాల పేర్లు అన్నీ అభూత కల్పనలు కావు. కళ్ళతో చూసినట్టు, తెలుసుకున్నట్టు చేసిన వర్ణనలు. ఎక్కడా ఎక్కడి నుంచో ఎవరో వచ్చి ఇక్కడ యుద్ధాలు చేసి, లోబరుచుకున్నట్టు లేదు. పోనీ, తాము ఎక్కడి నుంచో వచ్చి, ఎవరినో గెలుచుకుని వారిపై ఆధిపత్యం చలాయిస్తూ, వారిని ఉద్ధరించి నాగరికత నేర్పించినట్టు కథలు రాయలేదు. ఒకటి కాకపోతే ఒకటి కూడా అలాంటి గాథలు లేవు. అలాగని ఎక్కడి వారో ఇక్కడి కొచ్చి దాడులు చేసి, స్థానికులను అణగద్రొక్కి వారిని తమలాగా మార్చినట్టు ఒక్క ఋజువు ఏ రూపంలో కూడా లభించడం లేదు. అయినా మనం మన పూర్వీకుల మాటను విశ్వసించం, పట్టించుకోం.

‘నీలమత పురాణం’లో కశ్మీరు నీట మునిగి ఉండి, నీరు వెడల నడిచిన తరువాత నాగులు, పిశాచాలు, ఆపై మానవులు వచ్చి సామరస్య పూర్వకంగా నివసించిన గాథలు ఉన్నాయి. కానీ ఫెర్గూసన్ అనే అతడు ‘ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్’ అనే పుస్తకంలో నాగులు ‘ట్యురేనియన్’ జాతికి చెందినవారు, ఆర్యులు ఇక్కడికి వచ్చి నాగులను గెలిచారు అని తీర్మానించాడు. ఎలాంటి ఆధారాలు లేవు. కానీ తీర్మానించాడు. మనం ఆమోదించాం. ‘ట్యురాన్’ అనేది మధ్య ఆసియాను సూచించే పదం. ట్యురాన్‌లు ఇరాన్‌కి చెందిన ఒక జాతి మనుషులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే కశ్మీరుకు వచ్చి నాగులను అణచివేశారు.

ఇంకొకాయన వీరంతా డ్రాగన్లను పూజించేవారు అని తీర్మానించాడు. ఇంకొకాయన నాగులు భారతదేశానికి ‘తుర్కిస్తాన్’ నుంచి వచ్చారన్నాడు. బెనర్జీ అనే ఆయన నాగులు అసురులకు వెన్నెముకలాంటి వారని, నాగులు ఓడిపోవడంతో, అసురుల ప్రాబల్యం తగ్గిందని తీర్మానించాడు. ఎల్.బి.కెన్నీ అనే ఆయన నాగులు ద్రవిడులనీ, ఉత్తర భారతంలో ఆర్యులు రాకముందు ఉండేవారని తీర్మానించాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరికి ఏది తోస్తే అది అనేశారు. ఇవన్నీ నమ్ముతాం. ఇంతకీ నీలమత పురాణం ఏమంటుందో ఒక్కసారి తెలుసుకోవాల్సి ఉంటుంది.

(ముగింపు త్వరలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here