నీలమత పురాణం – 9

3
4

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]తే[/dropcap] హన్యమానాః పాపేనా దేశాన్సం ప్రాధ్వన్ భయాత్ ।

శూన్యేషు తేషు దేశేషు విచచార స నిర్భయః॥

దైత్యనాయకుడు సంగ్రహుడి రేతస్సు సతీసరోవరంలో పతనం అయిన తరువాత, సరోవరంలోని నాగులు దాన్ని సంవత్సరం పాటు కాపాడేరు. ఫలితంగా జలోద్భవుడు ఉద్భవించాడు. జలోద్భవుడు జలంలో ఉన్నంత వరకూ మరణం లేదన్న వరం పొంది ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ హింసించడం మొదలుపెట్టాడు. ఫలితంగా సరోవర పరిసర ప్రాంతాలే కాదు, దూర దూర ప్రాంతాలన్నీ జన శూన్యం అయిపోయాయి. ఆ శూన్య దేశంలో నిర్భీతిగా, విచ్చలవిడిగా చరిస్తూండేవాడు జలోద్భవుడు.

ఇది చదువుతుంటే కశ్మీరు చరిత్రలోని ఒక అంశం స్ఫురణకు వస్తుంది. కశ్మీరు ప్రజలు ఓ వైపు అత్యంత సౌఖ్యం అనుభవించారు. మరో వైపు వెంటనే అత్యంత బీభత్సానికి గురయ్యారు. కశ్మీరు వదిలి పారిపోయారు. శూన్యమైన కశ్మీరు పిశాచాల వశం అయింది. మళ్ళీ కశ్మీరు సంప్రదాయాలను పునరుజ్జీవితం చేయటంతో పిశాచాలు బలహీనమై పారిపోతాయి. మళ్ళీ జనులు వచ్చి కశ్మీరులో చేరుతారు. కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్ర పునరావృతం అవుతుంది. శాంతిగా ఉన్న కాలంలో సకల దేశాలకి అన్ని రంగాలలో మార్గదర్శకంగా ఉంటుంది కశ్మీరు. ఆ తరువాత దేశం మొత్తం ఏకమై కశ్మీరును కాపాడుకుంటుంది. ‘కశ్మీరు’ అన్న పేరు రాకముందు నుంచీ కశ్మీరు చరిత్ర ఇంతే. నీలమత పురాణంతో పాటు కల్హణ విరచిత రాజతరంగిణి చదివితే కశ్మీరు పలుమార్లు నాశనం అవటం కనిపిస్తుంది. సర్వనాశనమైన కశ్మీరు నుంచి మళ్ళీ, బూడిద నుంచి జీవం పోసుకునే ‘పక్షి’లా కశ్మీరు కొత్త రూపు ధరించి పునరుజ్జీవమవటం తెలుస్తుంది. నిజానికి ఇప్పుడు ‘శ్రీనగర్’గా చలామణీ అవుతున్న ప్రాంతం అసలు శ్రీనగర్ కాదు. ఆ శ్రీనగరం పలుమార్లు ధ్వంసం అయింది. అయినా శ్రీనగరం ఆ శకలాల నుండి తిరిగి తలఎత్తి నిలుస్తూనే ఉంది. తల ఎత్తినప్పుడల్లా ప్రపంచానికి విజ్ఞానపు వెలుగులను పంచుతూనే ఉంది. భారతీయ ధర్మం ప్రకారం వెలుగు విజ్ఞానం. విజ్ఞానం దైవం, చీకటి అజ్ఞానం. అజ్ఞానం రాక్షసత్వం. ప్రస్తుతం కశ్మీరులో మళ్ళీ రాక్షసత్వం రాజ్యం ఏలుతున్నట్లు కనిపిస్తోంది. పిశాచాలు కరాళ నృత్యం చేస్తున్నాయి. వాటిని తరిమి మళ్ళీ కశ్మీరు తల ఎత్తేట్టు  చేయడం మన కర్తవ్యం.

కశ్మీరు జలోద్భవుడి అకృత్యాలలో అల్లకల్లోలమవుతున్న సమయంలో అక్కడికి కశ్యపుడు వచ్చాడు.

ఏతాస్మిన్నేవ కాలే తు కశ్యపో భగవాన్ ఋషిః।

తీర్థయాత్రా ప్రసంగేన చచార సకలాం మహీమ్॥

వర్షేస్మిన్ భారత పుశ్యే శుభాశుభ ఫలప్రదే।

పుష్కరం దుష్కరగమం బ్రహ్మలోకప్రదం శివమ్॥

ధర్మక్షేత్రం కురుక్షేత్రం నైమిషం పాపనాశనమ్।

పిత్రూణామాలయం పుణ్యం హయశీర్షం మహాత్మానమ్॥

సర్వపాపహరం దివ్యం తథా చామరుకంటకమ్।

వరాహ పర్వతం పుణ్యం పుణ్యం పంచనదం తథా॥

కాలాంజనం సగోకర్ణం కేదారం సమహాలయం।

నారాయణయస్య చ స్థానం సపుణ్యం బదిరాశ్రమమ్ ॥

సుగన్ధాం శతకుంభాం చ కాలికాశ్రమమేవచ।

శాకంబరీం నీలాంతికం శాలిగ్రామం పృథుదకమ్॥

సంవర్లాక్షం రుద్ర కోటిం ప్రభాసమ్ సాగరోదకమ్।

ఇంద్రమార్గం మతంగస్య వాపీం పాపప్రసూదినీమ్॥

ఇలా దాదాపుగా 15 శ్లోకాలలో కశ్యపుడు దేశమంతా పర్యటించి దర్శించిన పుణ్యతీర్థాల జాబితా, వాటి ప్రాశస్థ్యం పొందుపరిచి ఉన్నాయి.

పుష్కరం, ప్రయాగ, కురుక్షేత్రం, నైమిశం, వరాహ పర్వతం, పంచనంద, కాలంజన, గోకర్ణ, కేదార, మహాలయ, లలితిక, శాలగ్రామ, పృథుదకం, సంవర్లాక్ష, రుద్రకోటి, ప్రభాస, సాగరోదక, ఇంద్రమార్గ, మాతంగ వాపి, అగస్త్యాశ్రమం, తండులికాశ్రమం, జంబూమార్గం, వారణాసి, జమున, శతధ్రు, సరయు, గోదావరి, వైతరణి, గోమతి, బహుద, వేదస్మృతి, అస, వర్ల, తామ్రపర్ణోత్పలావతి, శిప్ర, నర్మదా, గోన, పయోంష్ణీ, ఇక్షుమతి, సరట్టు, దుర్గ, కటశు, కావేరి, బ్రహ్మణి, గౌరి, కంపనాం, తమసాం, గంగాసాగర సంధి, సింధుసాగర సంగమం, భృగుతంగం, విశాలం, కుబ్జామ్రం, రైవతం, కుశావర్తం, బిల్వకం, నీలపర్వతం, కనఖలం వంటి తీర్థాలు, తీర్థస్థానాలు దర్శించి పునీతుడయ్యాడు కశ్యపుడు.

కశ్యపుడు దర్శించిన తీర్థాలు, తీర్థస్థానాల జాబితా చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. దేశం మొత్తాన్ని ఒక్క అంగుళం కూడా వదలకుండా దర్శించాడు కశ్యపుడు. అంటే ఈ దేశం మొత్తం అణువణువునా దైవ భావన, పవిత్ర భావన నర్తనమాడుతున్నదన్న మాట. అందుకే ఇది దైవభూమి అయ్యింది. వేదభూమి అయింది.

ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఉన్నాయి. కశ్యపుడు తిరిగిన ప్రదేశాలు ఏ ఒక్క రాజ్యానికో  చెందినవి కావు. ఇవి ఎవరి సొత్తు కావు, ఇవి పవిత్ర స్థలాలు. సకల భారతీయులకు పవిత్ర ప్రదేశాలు. వీటికి మతంతో, రాజకీయంతో సంబంధం లేదు. గమనిస్తే, శ్లోకాలలో ఆయా తీర్థాల ప్రాశస్త్యం, అక్కడ కొలువైన దైవం గురించి చెప్పడం తప్ప ‘ఫలానా రాజ్యంలోని ఫలానా తీర్థం’ అంటూ చెప్పడం కనపడదు. కారణం, ఆ కాలంలో ఇప్పటిలా భౌగోళిక సరిహద్దుల భావన లేదు. రాజులెవరెవరో ఉండవచ్చు. రాజ్యాలు ఎన్నో వుండవచ్చు. కానీ ఈ దేశం కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఒకటే. ఈ దేశాన్ని పట్టి ఉంచేది ధర్మం. దాన్ని పాలించేది దైవం. అంతే తప్ప ‘ఫలానా రాజు పాలిస్తున్నాడు కాబట్టి ఆ రాజ్యం నాది కాదు. నా రాజభక్తి నా భౌగోళిక సరిహద్దుల వరకే’ అన్న భావన ఆనాడు లేదు. అది ఆధునిక భావజాల జనిత వికృతి. ‘తీర్థయాత్రా ప్రసంగేన చచార సకలాం మహీమ్’. తీర్థయాత్ర ఉద్దేశంతో ‘సకలాం మహీమ్’ ప్రయాణించాడు. అంతే తప్ప పలు రాజ్యాలు దాటాడు అన్న ఆలోచన ఆనాడు లేదు. ఈనాటి దృష్టితో ఆనాటి కాలాన్ని దర్శించి, మనకు ‘దేశభక్తి’ భావన ‘బ్రిటీష్ వాడి వల్ల వచ్చింది’ అని తీర్మానించడం మూర్ఖత్వం. చీమ దృష్టితో ఏనుగును చూసి తీర్మానాలు చేయటం లాంటిది. భారతీయులకు దేశం, ధర్మం భావనల నడుమ అభేద ప్రతిపత్తి. దేశ భావనకు రాజుతో సంబంధం లేదు. ధర్మ భావనకు రాజుతో సంబంధం లేదు. భక్తి భావనకు ఎవరితో సంబంధం లేదు. సంబంధం అంతా ధర్మంతో, దైవంతో. అంతే.

అంటే ధర్మ బావన అనే దారంతో ఈ దేశమనే భావనకు పూలమాలను అర్పించే వీలును కల్పించారన్నమాట. అందుకే రాజ్యాలపై విదేశీ దాడులు జరిగినప్పుడు లేని స్పందన మందిరాలపై, పవిత్ర స్థలాలపై దాడులు జరిగినప్పుడు కనిపిస్తుంది. కారణం ఇక్కడి ప్రజలను ఏకత్రితం చేసేది, వారిలో స్పందనలు కలిగించేది ధార్మిక భావన మాత్రమే. ఇక్కడి కథలో కూడా సతీసరోవరం పరిసర ప్రాంతాలలో జలోద్భవుడు పట్టు బిగించి ప్రజలను తరిమేస్తూంటే, తీర్థయాత్రలకు వచ్చిన కశ్యపుడిని కశ్మీరుకు ఆహ్వానిస్తాడు నీలుడు అనే నాగు.

పూర్వదేశే త్వయా బ్రహ్మాన్ దాక్షిణే పశ్చిమే తథా।

దృష్టాని సర్వతీర్థాని యాస్యమోద్యోత్తరాం దిశమే॥

నీలుడు కశ్యపుడిని పితృ సమానుడిగా భావించి సేవలు చేస్తాడు. తండ్రి కూర్చునేందుకు అనుమతినిచ్చిన తర్వాత కూర్చుంటాడు. తరువాత వినయంగా తండ్రి ముందు తన మనసులోని మాటను ప్రస్తావిస్తాడు. ‘ధర్మప్రేమికులయిన తమరు తీర్థయాత్రలు చేస్తున్నరని తెలిసింది. తమను సేవించుకోవాలన్న తపనతో మీ దగ్గరకు వచ్చాను. బ్రహ్మ సమానులైన తమరు దేశంలోని తూర్పు, దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలోని పుణ్యస్థలాలు, తీర్థాలన్నింటినీ దర్శించారు. ఇక ఉత్తర ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలను దర్శించాల్సి ఉంది’ అని ఉత్తర ప్రాంతాలలో ఉన్న పుణ్యక్షేత్రాల గురించి వివరిస్తాడు.

ఇక్కడ గమనించాల్సినదేంటంటే నీలుడు, ‘దేశంలోని తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలోని పుణ్యక్షేత్రాలను కశ్యపుడు దర్శించారు’ అనటం అంటే ‘నీలమత పురాణం’ నాటికే దేశం అన్న భావన ఉంది. మొత్తం భారతదేశంలోని తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలోని పుణ్యక్షేత్రాలను కశ్యపుడు సందర్శించాడు. అంటే అప్పటి ‘దేశ’ భావనలో విభిన్న రాజ్యాలన్నీ మిళితమై ఉన్నాయి. రాజ్యం వేరు, దేశం వేరు. రాజ్యం రాజుకు సంబంధించినది. దేశం ధర్మానికి సంబంధించినది. ధర్మం అందరిది. ధర్మానికి ఎల్లలు లేవు. అంటే, ఆనాటి దేశ భావనకు ఎల్లలతో సంబంధం లేదు. ఎల్లలు రాజులకు, రాజ్యాలకు సంబంధించినవి. ఇంత స్పష్టంగా పురాణాలలో దేశ భావన ఉంటే, ఆధునికులు భారతీయులకు దేశమన్న భావన స్వాతంత్ర్యం తరువాత మాత్రమే వచ్చిందని అనడంలో అర్థం ఏమిటి? వచ్చిన చిక్కు ఏమిటంటే, మనం ఇప్పటి సాంకేతిక పదాల నిర్వచనాన్ని అప్పటి పదాలకు అన్వయించి అర్థం చేసుకోవాలని చూస్తున్నాం. కానీ అప్పటికీ, ఇప్పటికీ నడుమ కొన్ని వేల సంవత్సరాలున్నాయి. ఈనాడు ఒక అయిదారేళ్ళలోకి పదాల అర్థాలు విపరీతంగా మారిపోవటం గమనిస్తున్నామ్. ఒకప్పటి ‘సెల్’ ఇప్పటి ‘సెల్’ కాదు. ఒకప్పటి ‘మౌస్’ ఇప్పటి ‘మౌస్’ కాదు. అలాంటిది కొన్ని వేల సంవత్సరాలలో పదాలు, పదాల అర్థాలలో మార్పులు రావడంలో ఆశ్చర్యం లేదు. అప్పటి పదాల అర్థాలను వివరించడంలో ఈ మార్పులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి ‘దేశం’ అప్పటి ‘దేశం’ పదాలు ఒకే రకంగా ఉన్నా, అర్థాలలో తేడా ఉందని గ్రహించాలి. కశ్యపుడితో నీలుడు అన్న దేశం కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న భూభాగం. దాన్ని పశ్చిమ, తూర్పు, దక్షిణ అన్న ఖండాలుగా సూచించాడు. ఉత్తరం వైపున ఉన్న తీర్థాల గురించి వివరించాడు. ఇక్కడ ఎక్కడా రాజు, రాజ్యం ప్రసక్తి లేదు. ఆ కాలం వారు ఇలాంటి సంకుచిత భావాలను, ఎల్లలను గుర్తించలేదు. ఎల్లలు లేని ధర్మంపైనే వారి దృష్టి. ఆ తరువాత కశ్యపుడితో ‘మాద్ర దేశంలో, హిమాలయాలలో బోలెడన్ని తీర్థప్రదేశాలున్నాయ’ని చెప్తాడు.  దేశం అన్న పదం రెండు మార్లు రెండు విభిన్నమైన అర్థాలలో వాడటం గమనార్హం. ఒక దేశం సమస్త భారతదేశం. మరొకటి మాద్రదేశాన్ని సూచిస్తోంది. కాని మాద్రదేశం అనటంలో వేరు భావన లేదు. భారతదేశమనే మహాదేశంలో మాద్రదేశం ఒక ప్రాంతం మాత్రమే. ఆధునిక గణిత భాషలో చెప్పాలంటే భారతదేశమనే ‘సెట్’ (set) లో మాద్రదేశం ఒక ‘సబ్ సెట్’ (sub-set) లాంటిదన్న మాట. భారతవర్షం, భారత ఖండంలో ఒక దేశం అన్న మాట. ఉత్తర దేశంలోని పుణ్యక్షేత్రాలు కూడా చూడమని అభర్థిస్తూ నీలుడు ఒకటొకటిగా ఉత్తరంలోని పుణ్యక్షేత్రాలను ప్రస్తావిస్తాడు.

శుభప్రదమైన విపాస, పాపాలను కడిగివేసే దేవహృద, స్నానమాచరణతోనే స్వర్గ ప్రాప్తినిచ్చే కరవీరపుర సంగమం (దేవహృద, విపాసలు సంగమించే స్థలం), విపాసలోని కలికాశ్రమం, ఇరావతీ నది (ఈ ఒక్క ఇరావతీ నది వద్దనే 60,000 పుణ్యస్థలాలున్నాయి), ఇంకా కుంభవసుమ్ద, దేవిక నది, విశ్వామిత్ర నది, ఉద్ధనది వంటి పవిత్ర నదులు, ఇంద్రమార్గం, సోమతీర్థం, అంబుజాన, సువర్ణచారు, రుద్రతీర్థ, దుర్గద్వార, కోటితీర్థ, హంసపాద, ఋషిరూప, దేమీతీర్థం, పంచనది, అపాగ, తేశ నది, చంద్రభాగ, , శంఖమార్ణాల, గుహ్యేశ్వర, శతముఖ, ఇష్టకాపథ, వాదందేశ వంటి పవిత్ర స్థలాలు, నదులు ఉన్నాయి. శతముఖ నుండి గుహ్యేశ్వర వరకు ఉన్న పవిత్ర స్థలం, పవిత్రతలో వారణాసి కన్నా మిన్నా. వస్త్రపథ అత్యంత శ్రేష్టమైన పవిత్ర స్థలం. సతి అలోకల తీర్థం సతీసరోవరం. అన్ని పాపాలను హరిస్తుంది విష్ణుపాద సరస్సు. “కాబట్టి ఇలాంటి అత్యద్భుతమైన తీర్థస్థలాలను తమరు దర్శించి తీరాల్సిందే. ఈ దర్శనీయ స్థలాలను దర్శించడం వల్ల అక్కడ ఉండే దుష్టుల పాపాలను కూడా మీరు పక్షాళన చేసినట్లవుతుంది” అని నీలుడు అభ్యర్థించాడు.

ఇవన్నీ వింటుంటే ఒక ఆలోచన వస్తుంది.

ఆ కాలంలో పవిత్ర స్థలాల గురించి ప్రతి ఒక్కరికీ ఎంత బాగా తెలుసో అనిపిస్తుంది. పవిత్ర స్థలాల పేర్లు చెప్పటమే కాదు, వాటి ప్రాశస్త్యం వివరించడంతో పాటు ఏయే తిథి, నక్షత్రాలలో అవి మరింత పవిత్రమో చెప్పటం కనిపిస్తుంది.

అలా నీలుడు ఒకటొకటిగా పవిత్ర స్థలాలను వర్ణించి చెప్తుంటే, కశ్యపుడికి కూడా ఆయా తీర్థాలను దర్శించాలనే ఉత్సాహం కలిగింది. నీలుడితో పాటు ఆయన పవిత్ర స్థలాలను దర్శించేందుకు ప్రయాణమయ్యాడు.

యమున, సరస్వతులను దాటి కురుక్షేత్ర దర్శించాడు. అక్కడి ‘సన్నీతి’ అత్యంత పవిత్రం. ప్రతి అమావాస్య నాడు అన్ని తీర్థాల జలాలు ఈ తీర్థంలో చేరుతాయి. రాహువు వల్ల సూర్యగ్రహణం ఏర్పడిన కాలంలో ఇక్కడ శ్రాద్ధకర్మలు జరిపిన వారికి వెయ్యి అశ్వమేధ యాగాలు జరిపిన పుణ్యం వస్తుంది. సన్నితిని దర్శించిన తరువాత చక్రతీర్థ ప్రయాణమయ్యారు. ఈ చక్రతీర్థ ప్రాశస్త్యాన్ని నారదుడు సైతం పొగిడాడు. ఈ చక్రతీర్థ సందర్శనం వల్ల కలిగే పుణ్యం సూర్యగ్రహణం వల్ల కలిగే పుణ్యం కన్నా పదిరెట్లు ఎక్కువ. చక్ర, పృథుదకలను దర్శించిన తర్వాత విష్ణుపాద, అమర పర్వాతలను దర్శించారు. ఆ తరువాత శతధ్రు, గంగానదులను దాటి అర్జునుడి ఆశ్రమం ‘దేవసుందరం’ చేరుకున్నారు. ఆపై విపాసను దాటారు. అప్పుడు కశ్యపుడు మాద్రదేశం శూన్యంగా ఉండడం చూశాడు. ఆశ్చర్యపోయాడు.

ఉత్తీర్థ చ మహాభాగాం విపాశాం పాపనాశినీమ్।

దృష్టవాన్ సకలం దేశం తదా శూన్యం స కశ్యపః॥

సిరి సంపదలతో, ధన ధాన్యాలతో తులతూగే రమణీయమైన దేశం ఇంత శూన్యంగా ఎందుకు ఉందని నీలుడిని ప్రశ్నిమ్చాడు కశ్యపుడు.

నీలుడికి కావలసింది ఇదే.

తీర్థయాత్రలంటే కేవలం పుణ్య సంపాదన మాత్రమే కాదు, పాపుల పాపాలను హరించి వారికి మోక్షం ఇవ్వటం కూడా మహాపురుషుల తీర్థయాత్రలలో మర్మం.

కశ్యపుడికి ఉత్తర దేశంలోని తీర్థస్థలాలను వివరిస్తూ ‘మాద్ర’ దేశం అని నీలుడు ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక మర్మం ఇదే.

(మళ్ళీ రెండు వారాల తరువాత)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here