నీలమత పురాణం-90

2
1

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]’నా[/dropcap]గు’ల గురించి విశ్లేషణలో చరిత్రకారులు స్థానిక గాథలు, పురాణాలు, శిలాశాసనాల వంటి వాటి నుంచి గ్రహించిన దానికి తగ్గ నాణేలో, శాసనాలో వంటి ఆధారాలు లభిస్తే తప్ప స్థానిక గాథలను, పురాణాలను పరిగణనలోకి తీసుకోలేదు. కానీ కశ్మీరు, టిబెట్, నేపాల్ వంటి ప్రాంతాల నుంచి మలబార్, కొంకణ్ తీరం, గుజరాత్, బెంగాల్, అస్సాం వంటి ప్రాంతాల వరకూ; శ్రీలంక, జావా, సుమత్ర, కాంబోడియా వంటి దేశాలలోనూ ‘నాగ’ పూజ, నాగులను పవిత్రంగా భావించటం వంటివి కనిపిస్తాయి. ప్రపంచంలోని అన్ని నాగరికతలలో ఏదో ఓ రూపంలో నాగపూజ ఉన్నా, భారతీయ ధర్మం ప్రభావం ఉన్న ప్రాంతాలలో మాత్రం ‘నాగు’ను దుష్టశక్తిగా భావించటం బదులు పవిత్రంగా భావించటం కనిపిస్తుంది. నాగదత్త, నాగాంబిక, నాగభట్టు, నాగరాజు, నాగానీక వంటి పేర్లు ఈ ప్రాంతాలలో సర్వసాధారణంగా వినిపించే పేర్లు చరిత్రలో. ‘నేపాల్’ను ఒకప్పుడు ‘నాగ హృదయం’ అనేవారు. ఇదే ఒకప్పటి ‘ఇస్లామాబాద్’ పేరు కూడా. శ్రీలంక పాతకాలంలో ‘నాగద్వీపం’. నాగ ఖండం, నాగ మంగళ విషయ వంటి పేర్లతో పిలిచేవారు. భారతదేశంలో పలు ప్రాంతాలలో శ్రీలంకను ఈ పేర్లతో పాటు ‘నాగపుర – నందివర్ధన’ అని ప్రస్తావించడం కనిపిస్తుంది. కశ్మీరు ‘నాగమయం’.

కశ్మీరుకు ప్రధాన పురాణమే నీలుడనే ‘నాగు’ చెప్పినది. ఈ నేపథ్యంలో చూస్తే ఎక్కడి నుంచో వచ్చి ఆర్యులు, నాగులతో పోరాడి, వారిని గెలిచి, వారి పద్ధతులను అనుసరించటం అన్న ఆలోచన విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వేళ బయట నుంచి వచ్చినవారు నాగులతో తలపడటం జరిగితే పురాణాల్లో కానీ, శిల్పాలలో కానీ ఎక్కడా అలాంటి ప్రస్తావన లేదు. పైగా, మానవులతో సహజీవనం చేసేందుకు నాగులన్నీ ఎంతో చొరవ తీసుకుని ప్రవర్తించటం ‘నీలమత పురాణం’ ప్రదర్శిస్తుంది. రాజతరంగిణి లోనయితే, తన కూతురుని, అల్లుడిని అవమానించిన కిన్నెరుడనే రాజుపై నాగరాజు ఆగ్రహం ప్రదర్శిస్తాడు. రాజ్యాన్ని ఆగ్రహంలో నాశనం చేస్తాడు (చూ. కల్హణ రాజతరంగిణి కథలులో కిన్నెరుని కోరిక కథ, పేజీ 65). ఆస్తులను ధ్వంసం చేస్తాడు. ప్రాణ నష్టం కలిగిస్తాడు. కానీ ఆ తరువాత తాను చేసిన దారుణమైన పనికి చింతిస్తాడు. ప్రజల నడుమ ఉండే అర్హత తనకి లేదని, ప్రజలకు దూరంగా వెళ్ళిపోతాడు. ఒక వేళ నాగులను గెలిచినవారో, అణచినవారో రాజ్యం చేస్తుంతే, నాగులు వారితో సహజీవనం చేసేందుకు సిద్ధంగా ఉండేవారు కారు. తమతో కలిసి జీవించాలంటే ఏమేం పూజలు చేయాలు, ఏమేం పద్ధతులు పాటించాలో చెప్పేవారు కారు. తన కూతురుని అవమానించిన రాజుని, రాజ్యాన్ని నాశనం చేసిన తరువాత పశ్చాత్తాపంతో క్రుంగేవారు కాదు. విజయ గర్వంతో విర్రవీగేవారు. అదీ గాక, ‘నాగులు’ దేశ విదేశాలలో విస్తరించి, ఈ నాగ వంశాలు రాజ్యాలు ఏలాయంటే, వారిని ఓడించిన వారు చేతకాని వారన్నా అయి ఉండాలి. వారి గెలుపు సంపూర్ణమైనా అయి ఉండకూడదు. అంటే ఏ కోణంలో చూసినా, ఎలా ఆలోచించినా, జరిగింది చెప్పే ఇతిహాసాలు, పురాణాలు కానీ, చరిత్రలో లభిస్తున్న ఆధారాలు కానీ యుద్ధం, అణచివేతల ఆలోచనను మాత్రం సమర్థించడం లేదు. కానీ ఈనాటికీ జరిగిందదేనని, అణచివేతల వాదనలు, విద్వేషాలు చెలరేగుతున్నాయి. ప్రజల మధ్య ద్వేషాగ్నులు రాజుకుంటూనే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణాలు మన గురించి మనకు సరైన అవగాహన లేకపోవటం; మనల్ని మనం మన దృష్టితో చూసుకోకపోవటం; మనల్ని విదేశీయుల కొలమానాల ద్వారా తూచాలని ప్రయత్నించటం.

నీలమత పురాణాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అప్పటి సమాజం ఇప్పటి సమాజంలో వారు ఊహిస్తున్నట్టు లేదన్న ఆలోచన బలబడుతుంది. పండగలప్పుడు ప్రజలంతా కలిసి సంబరాలు చేసుకోవటం, స్త్రీలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వటం, యజమానులు, అధికారులు అన్న వివక్షత లేకుండా ప్రజలంతా కలిసి సంబరాలు చేసుకోవటం, కలిసి భోజనాలు చేయటం, ఆటలు, పాటలు, నాటికలు, పూజలు అన్నీ ఎలాంటి తేడాలు లేకుండా కలిసి చేయటం వంటివి చూస్తూ ఆనాటి సమాజం ఈనాడు మనం ఊహిస్తున్న దానికి భిన్నంగా, ఊహకందని రీతిలో ఉండేదేమో అనిపిస్తుంది.

ఇక్కడ మరో విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలోని ప్రతి అంశాన్ని ఇతర దేశాలతో ముడిపెట్టడం, అక్కడ జరిగినట్టే ఇక్కడ కూడా జరగి ఉంటుందని ఊహించటం, ఇక్కడి వన్నీ ఎక్కడి నుంచో వచ్చాయని తీర్మానించి, ఆ తీర్మానానికి తగ్గట్టు లభిస్తున్న సత్యాలను విశ్లేషించటం పొరపాటు. టాడ్, ఫెర్గ్యూసన్ వంటి వారు భారతదేశంలోకి నాగులు ఎక్కడి నుంచో వచ్చారని ప్రస్తావించారు. ‘నాగులు’ ఇక్కడి వారు కాదు, వారు ఇక్కడికి వచ్చినవారు అన్నారు. కానీ, ప్రపంచంలో ఏ ప్రాంతంలోనూ లభించనన్ని నాగులు, అన్ని రకాల నాగులు భారతదేశంలో లభిస్తాయన్న నిజాన్ని పరిగణనలోకి తీసుకుంటే ‘నాగపూజ’, నాగులను గౌరవించటం, ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడి వారికి నేర్పించాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ‘నాగులు’ అంటే ‘పాములు’ కాదనీ అనిపిస్తుంది. భారతదేశంలో జన్మించి, భారతదేశానికి ప్రత్యేకమైన ఒక జాతివారు అనిపిస్తుంది. వారికీ ఎవరికీ ఎలాంటి గొడవలు, యుద్ధాలు జరగలేదు. ఒకరిని ఒకరు అణచివేయటం, వారి పద్ధతులను కలుపుకోవటం అంటూ కూడా జరగలేదని అనిపిస్తుంది.

‘నీలమత పురాణం’ చెప్పిన నీలుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పూజల గురించి చెప్తాడు. ఏ తిథిలో ఎలాంటి పూజలు ఎలా చేయాలో చెప్తాడు. కశ్మీరులో సుఖంగా బ్రతకాలంటే ఏమేం చేయాలో చెప్తాడు. రాజతరంగిణిలో చంద్రదేవుడి కథ ఉంది. చంద్రదేవుడు ఓ యోగి. కశ్మీరు మంచు తుఫానులో సతమతమవుతూంటుంది. ప్రజల జీవితం అల్లకల్లోలమవుతూంటుంది. అప్పటికి కశ్మీరంలో బౌద్ధం ప్రవేశించింది. పెద్ద ఎత్తున బౌద్ధులు నాగులను హింసించారు. బౌద్ధంలోకి మార్చారు. బౌద్ధం ప్రభావంలో పడి నీలుడు చెప్పినవాటిని ఆచరించటం మానేశారు. ఫలితంగా కశ్మీరు అశాంతి పాలయింది. మంచు విపరీతంగా కురిసింది. ఇది తెలిసిన చంద్రదేవుడు నీలుడిని ప్రార్థించాడు. నీలమతాన్ని ప్రజలకు మళ్ళీ బోధించాడు. మతం అంటే ఇష్టం అని అర్థం. ఈ ప్రకారం పూజలు చేయటం, ధర్మం పాటించటం నీలుడికి ఇష్టం. కశ్మీరు నీలుడిది కాబట్టి నీలుడిని ప్రసన్నం చేసుకోమన్నాడు.  ప్రజలు నీలుడు చెప్పిన పద్ధతిని పాటించారు. కశ్మీరులో జనజీవితం సౌఖ్యమయం అయింది (ప్రజా పుణ్యైః సంభవంతి మహీభుజః – కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, పేజీ.58). అంటే బౌద్ధం పాటించి నీలుడు చెప్పిన పద్ధతులను వదలటం వల్ల అల్లకల్లోలమయిన కశ్మీరు మళ్ళీ నీలమత పురాణం ప్రకారం ప్రజలు ప్రవర్తించటం వల్ల బాగయిందన్న మాట. భావి తరాలకు హెచ్చరిక లాంటిదీ కథ. అంటే నాగులకు, కశ్మీరులో అడుగుపెట్టిన మానవులకు ఎలాంటి ఘర్షణ కలుగలేదు కానీ, బౌద్ధులు కశ్మీరులో అడుగుపెట్టినప్పటి నుంచీ ఘర్షణ ప్రారంభమయింది. పవిత్ర స్థలాలు కూల్చటం మొదలయింది కశ్మీరులో. చరిత్రకారులు ఈ విషయాన్ని విస్మరిస్తారు. ఘర్షణ లేని చోట ఘర్షణను సృష్టించారు. ఘర్షణ ఉన్నచోట ఘర్షణను కప్పిపుచ్చారు. అందుకే కశ్మీరు చరిత్రను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

‘నాగుల’ తరువాత అంత ప్రాధాన్యం వహించిన జాతి ‘పిశాచాలు’.

(ముగింపు త్వరలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here