నీలమత పురాణం-92

2
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]ఆ[/dropcap] మధ్య కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయెంగే’. అంటే ‘ప్రేమించే హృదయం ఉన్నవాడు లేక ప్రేమికుడు, పెళ్ళికూతురుని ఎత్తుకుపోతాడు’ అని అర్థం. తల్లిదండ్రులకు చెప్పకుండా కూతురిని ఎత్తుకుపోయి వివాహమాడే విధానాన్ని ‘పైశాచిక వివాహం’ అంటారు. భారతీయ ధర్మంలోని అష్టవిధ వివాహాలలో ఇదొక రకమైన వివాహం. ఇది ప్రచారంలో ఉన్న వివరణ పైశాచిక వివాహానికి. కానీ, మనుస్మృతి ప్రకారం నిద్రపోతున్న, లేక మత్తులో ఉన్న, లేక మెదడు ఎదగని అమ్మాయిని మోసం చేసి, దొంగతనంగా వివాహం చేసుకోవటం పైశాచిక వివాహం. దీన్ని ఇప్పటి ‘డేట్ రేప్’‌తో పోలుస్తున్నారు. అమ్మాయికి బలవంతంగా మత్తుమందు ఇచ్చి ‘అనుభవించటం’గా అర్థం చేసుకుంటున్నారు. ఇలా ఎత్తుకుపోయి చేసుకునే వివాహాన్ని రాక్షస వివాహం లేక పైశాచిక వివాహంగా పరిగణించి, ఇలాంటి వివాహం సాంప్రదాయంగా వున్న ప్రాంతాలను వెతికి అవన్నీ పిశాచ స్థానాలుగా భావించి విశ్లేషించారు చరిత్రకారులు. అలా  పిశాచాల గురించి పరిశోధించేవారు పురాణాల ప్రకారం హిమాలయ ప్రాంతాలు, భారతదేశ వాయువ్య ప్రాంతాలలో పిశాచజాతికి చెందిన మనుషులు ఉంటారని నిర్ణయించుకుని  పరిశోధనలు సాగించారు.

‘పంజాబ్’ ప్రాంతాలలో ఒకప్పుడు వధువు కుటుంబం వారు వరుడి కుటుంబాన్ని దుర్భాషలాడుతూ దూషించటం, వరుడి తరఫు వారు పెళ్ళి మంటపాలను, తోరణాలను విరుస్తూ వధువు ఇంట్లో ప్రవేశించి పిల్లని ఎత్తుకుపోవడం సాంప్రదాయంగా ఉండేది. ఇలాంటి రాక్షస, పిశాచ వివాహ పద్ధతి ‘పంజాబ్’లో అమలులో ఉండేది  కాబట్టి అక్కడివారు పిశాచి జాతి వారని కొందరు తీర్మానించారు. అబ్బాయి, అమ్మాయి ఇళ్ళు వదిలి పారిపోవటం ఆనవాయితీగా ఉన్న ప్రాంతాలు పిశాచాల ప్రాంతాలుగా భావించారు. చిత్రాల్ ప్రాంతంలో ‘నా అమ్మాయిని ఎత్తుకుపోయినవాడే నా అల్లుడు’ అన్న మాట ప్రాచుర్యంలో ఉండేది. కాబట్టి ఇదే పిశాచాల ప్రాంతం అన్నారు ఇంకొందరు. టిబెట్టులో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ తాను ఇష్టపడిన అమ్మాయిని రహస్యంగా ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకునే పద్ధతి అమలులో ఉంది. దీనికి తోడు పిశాచ భాషలో వధువుకి ‘హానెనె’ అన్న పదం వాడతారు. దీని అర్థం ‘తన్నులు తినాల్సిన అమ్మాయి’. కాబట్టి ఇక్కడివారు ‘పిశాచాలు’ అన్నారు.

ఇక ‘పైశాచిక భాష’ ఆధారంగా కూడా పిశాచ జాతుల నివాసాలను ఊహించాలని ప్రయత్నించారు. ఇవన్నీ చర్చిస్తూపోతే ఇదొక ప్రత్యేక గ్రంథం అవుతుంది. ‘పైశాచిక భాష’ ఆర్యన్ భాష జాతికి చెందినదనీ, ఇది ఆర్యన్, ఇరానియన్ భాషల నడుమ భాష వంటిదని ‘గ్రియర్‌సన్’ తీర్మానించాడు. అంటే ఈ పిశాచాల పూర్వీకులు ఆర్యులు అయి ఉంటారన్న మాట. మధ్య ఆసియాలో మేరు, మానస సరస్సు ప్రాంతం ఆర్యుల నివాసం అని, వారు పశ్చిమ దిశగా కొత్త నివాస స్థలాలు వెతుకుతూ బయలుదేరారని, దాన్లో కొందరు ఇరాన్ వెళ్తే, కొందరు కశ్మీరులో ఉండి  నాగులతో పోరాడేరని తీర్మానించారు. తరువాత ఇండోఆర్యన్లు వచ్చి నాగులను, పిశాచాలను కశ్మీరు నుంచి తరిమివేశారని, దాంతో వారు పంజాబ్ ప్రాంతాలలో స్థిరపడి, నాగుల తరఫున పాండవులతో పోరాడేరని ఓ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు. మన పురాణ గాథలు కల్పిత, కట్టు కథలుగా కనిపించి, ఇలాంటి గాథలు నిజాలుగా, చారిత్రక సత్యాలుగా చలామణి అవటం మన గొప్పతనం!

నిజానికి ‘నీలమత పురాణం’లో పిశాచాలకు, నాగులకు, మనుషులకు నడుమ గొడవలేవీ లేవు. పిశాచాలతో కలిసి ఉండం అన్నందుకు కశ్యపుడు నాగులకు శాపం ఇస్తాడు. మంచి పిశాచాలు కశ్మీరులో ఆరు నెలలు ఉంటాయి. ఆరు నెలలు దుష్ట పిశాచాలతో పోరాడి వాటిని అదుపులో పెడతాయి. ఇక మానవులు కశ్మీరులో నాగులు, పిశాచాలతో కలసి సహజీవనం చేయాలంటే అవలంబించాల్సిన నియమాలు, నిబంధనలే ‘నీలమత పురాణం’. దీన్లో ఇండో ఆర్యన్ల పోరాటల ప్రసక్తే లేదు. మానవులు నాగులను పూజించారు, పిశాచాలను పూజించారు. నాగులను, పిశాచాలను మానవులు తరిమివేసే ప్రసక్తి లేదు.

ఇంకా దార్వులు, అభిసారులు, గాంధారులు, జుహుందరులు, శకులు, ఖాసాలు, తంగణాలు, మూందవులు, మాద్రులు, అంతరగిరులు, బాహిరగిరులు, యవనులు వంటి వారి ప్రసక్తి కూడా నీలమత పురాణంలో ఉంది. ఈ జాతుల గురించి స్పృశిస్తూ, నీలమత పురాణం విశ్లేషణలో ముందుకు సాగుదాం.

(ముగింపు త్వరలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here