Site icon Sanchika

నీలమత పురాణం-93

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]నీ[/dropcap]లమత పురాణంలో ప్రస్తావనకు వచ్చే కొన్ని జాతుల గురించి టూకీగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, పురాణాలు పనికిరానివంటూ, చారిత్రకంగా వాటి నుంచి ఎలాంటి ప్రధానమైన సమాచారం లభించదని వ్యాఖ్యానిస్తారు. కానీ తరచి చూస్తే పురాణాలు అత్యంత విలువైన సమాచారాన్ని అందించటమే కాదు, ప్రాచీన భారతం గురించి ఒక అవగాహన కలిగిస్తాయని బోధ పడుతుంది. ముఖ్యంగా నీలమత పురాణాన్ని పరిశీలించటం వల్ల భారతదేశంలో ఏ ప్రాంతమైనా, ఎంతగా ఇతర ప్రాంతాలకు దూరంగా ఉన్నా సరే, భారతీయ ధర్మం వల్ల ఇతర ప్రాంతాలతో ఏకత్రితమవటం తెలుస్తుంది. భారతీయ ధర్మం దేశాన్ని నిలపటం అర్థమవుతుంది.

నీలమత పురాణంలో, రాజతరంగిణిలో ‘దార్వు’ల ప్రసక్తి పలుమార్లు వస్తుంది. మహాభారతం సభాపర్వంలో దార్వం అన్న ప్రాంతానికి చెందిన దార్వులనే క్షత్రియుల ప్రసక్తి వస్తుంది. దార్వం అన్న రాజ్యానికి ‘దార్వ’ అన్న క్షత్రియ రాజు అన్న మాట. అయితే ఈ దార్వ అన్నది ప్రాంతం పేరా? జాతి పేరా? అన్న విషయంలో ఇంకా చర్చలు సాగుతున్నాయి. మహాభారతం భీష్మపర్వంలో ‘దార్వ’ అనే ప్రాచీన భారత భూభాగం ప్రస్తావన వస్తుంది. ద్రోణపర్వంలో ‘దార్వాభిసార’ అన్న తక్కువ జాతి వారి ప్రస్తావన ఉంటుంది. దరదలు, షూరులు, ఔదుంబరులు, కశ్మీరీలు, త్రిగర్తలలో పాటు దార్వుల ప్రస్తావన వస్తుంది. దార్వ ప్రాంతాన్ని జమ్మూలోని జిల్లాగా గుర్తించారు.

కైరాతా దరదా దర్వాః షూరా వై యమకాస్తథా।   
ఔదుంబరా దుర్విభాగాః పారదా బాహ్లికైః సహ॥
కశ్మీరాశ్చ కుమారాశ్చ ఘోరకా హంసకాయనాః।   
శిబిత్రిగర్తయౌధేయా రాజన్యా భద్రకేకయాః॥
(మహాభారతం, సభాపర్వం)

దీన్ని బట్టి మహాభారతం కాలం నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలు, అక్కడక్కడి రాజులు, జాతుల గురించిన అవగాహన దేశమంతా ఉందని అర్థమవుతోంది. అంటే, ఎక్కడికి అక్కడ వేర్వేరు రాజ్యాలు, రాజులు ఉన్నా, సంబంధ బాంధవ్యాలు ఉండటమే కాదు, అందరినీ ధర్మం వేర్వేరు పూలను ఒకే దారంతో బంధించినట్టు కట్టి ఉంచిందన్న మాట.

అభిసారులు:

అభిసారులు అలెగ్జాండర్‌కు వ్యతిరేకంగా పోరాడారు. తరువాత అతనితో సంధి చేసుకున్నారు. నీలమత పురాణంలోనూ, రాజతరంగిణిలోనూ దార్వాభిసారం అన్న ఒక ప్రత్యేక రాజ్యంగా ప్రస్తావించటం కనిపిస్తుంది. వితస్త, చంద్రభాగ నదుల నడుమ ఉన్న ప్రాంతం ఒకప్పటి దార్వాభిసారంగా భావిస్తున్నారు. ఇప్పుడు తరచూ వినిపించే ‘పూంఛ్’ ప్రాంతం కూడా దార్వాభిసారంలో భాగమే. మహాభారతంలో ప్రాచీన భారతానికి చెందిన ‘జానపదం’గా అభిసారాన్ని వర్ణించటం ఉంది. అర్జునుడు దిగ్విజయ యాత్రలో ఈ ప్రాచీన నగరాన్ని గెలుచుకున్నాడు.

గాంధారులు:

గాంధారులు మనకు బాగా తెలుస్తారు ‘గాంధారి’ వల్ల. సింధునది తీరం నుంచి కాబుల్ వరకు ఉన్న ప్రాంతాన్ని గాంధారంగా భావిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ‘సుబల’ అనే శక్తివంతమైన రాజు పాలించేవాడు. అతని కూతురు గాంధారి ధృతరాష్ట్రుని వివాహమాడింది. యవనులు, కాంభోజులు, కిరాతులు, బర్బరులతో పాటు గాంధారులను ప్రస్తావిస్తుంది మహాభారతం. ‘మిళిందపన్హా’ కశ్మీరులు, గాంధారుల నడుమ సత్సంబంధాలున్నట్టు చెప్తుంది. గాంధార రాజు కనిష్కుడు కశ్మీరును జయించినట్టు భావిస్తుండటంతో, గాంధారులకు, కశ్మీరులకు నడుమ అనుబంధం ఉండడంలో ఆశ్చర్యం లేదు. రాజతరంగిణిలో కొన్ని సందర్భాలలో రాజులు గాంధారంలో తల దాచుకోవటం కనిపిస్తుంది.

జుహుందరులు:

దరదాన్జ గురారిశ్చైవ గాంధార జూరసాన్కుహున్ అంటుంది మత్స్య పురాణం. జుహుందరులు, జగుడులు, జుహుడాలు అందరూ ఒకటేగా భావిస్తున్నారు చరిత్రకారులు. వీరుండే ప్రాంత్రం దక్షిణ అఫ్ఘనిస్తాన్ అనీ, ‘గజ్ని’ వీరి రాజధాని అని అనుకుంటున్నారు.

యవనులు:

నీలమత పురాణంలో ఒక నాగు పేరు ‘యవనప్రియ’. యవనులు అనగానే పాశ్చాత్యులు ముఖ్యంగా ‘గ్రీకులు’ అన్న ఆలోచన ప్రచారంలో ఉంది. కానీ పురాణాలు పరిశీలిస్తే యవనులు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినవారు కారనీ, వేదభ్రష్టులై దేశం వదిలి వెళ్ళినవారిని యవనులు, మ్లేచ్ఛులు అన్న పదాలతో సూచించేవారని తెలుస్తుంది. పలువురు యవనులు అంటే అయోలు అని తీర్మానించారు. మహాభారతంలో కాంభోజ రాజు సుదక్షిణుడు యవనులతో కలిసి పెద్ద సైన్యం తీసుకుని దుర్యోధనుడితో కలుస్తాడు. వీరు భారత యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడారు. మహాభారత అనుశాసన పర్వం ప్రకారం యవనులు క్షత్రియులు. శాపం వల్ల వారు శూద్రులయ్యారు. దీన్ని బట్టి చూస్తే కూడా యవనులు ఎక్కడి నుండో వచ్చినవారు కాదన్న ఆలోచన కలుగుతుంది. యయాతి కొడుకు తుర్వసు యవనుల ఆవిర్భావానికి కారణం. మరో గాథ ప్రకారం ‘నందిని’ నుండి యవనులు జన్మించారు. ఇవన్నీ చూస్తుంటే మన పురాణాలను పుక్కిటి పురాణాలన్న దృష్టితో కాక, అవి అందించే చారిత్రక, భౌగోళిక, సామాజిఒక, ధార్మిక అంశాల విశ్లేషణాత్మక దృష్టితో చూస్తే నిజం బోధపడుతుంది. ‘నీలమత పురాణం’ ముగించే ముందు చర్చించాల్సిన మరో ప్రధానమైన అంశం- నీలమత పురాణం ఆధారంగా ప్రాచీన కశ్మీరులో స్త్రీల స్థితిగతులను విశ్లేషించటం.

(ముగింపు త్వరలో)

Exit mobile version