నీలమత పురాణం-95

6
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]పు[/dropcap]రాణం ఏదైనా ఒక మహా సముద్రం లాంటిది. సముద్రం గురించి ఎవరు ఎంతగా పరిశోధించినా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో మిగిలిపోయి ఉంటుంది. అదీ గాక సముద్రం గురించి పరిశోధించాల్సిన కోణాలు, అంశాలు అనేకం. పురాణాలు కూడా సముద్రాల్లాంటివే. నీలమత పురాణం అందుకు భిన్నం కాదు. అయితే మన పురాణాలను మనం పరాయి వాళ్ళ దృష్టితో, ముఖ్యంగా, మనల్ని బానిసలుగా చేసుకుని పాలించి, తాము అధికులమని భావించుకున్న జాతి దృష్టితో చూస్తున్నాము. దాంతో మన పురాణాలన్నా, వాటిలో పొందుపరిచి ఉన్న అనేక అత్యద్భుతమైన అంశాలన్నా మనకు విదేశీయుల అభిప్రాయాలే వల్లె వేయటం అలవాటు అయింది. మన గ్రంథాలను, వాటి ప్రతులను విదేశీయులు తమ జీవితాలను సైతం పణంగా పెట్టి సేకరించారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. వాటి సేకరణ కోసం వారు పడరాని పాట్లు పడ్డారు. తమ వద్ద ఉన్న ప్రతులను కాల్చివేసేందుకు సైతం భారతీయ పండితులు సిద్ధపడ్డారు తప్ప వాటిని విదేశీయులకు చూపించేందుకు ఇష్టపడని వారు ఉన్నారు. అలాంటి వారిని నయానో భయానో ఒప్పించి, కొండోకచో మోసం చేసి, మాయ చేసి మరీ ప్రతులను సంపాదించారు. విభిన్నమైన ప్రతులను పోల్చి చూసి, పండితుల సహాయంతో సరి చేసి, పరిష్కరించి, అనువదించి ప్రచురించారు. ఈ విషయంలో వారి స్ఫూర్తిని, పట్టుదలను, చిత్తశుద్ధిని అభినందించక తప్పదు. కానీ, మన పురాణాలను వారు అర్ధంచేసుకున్న రీతిని, వాటిపై వ్యాఖ్యానాలను మనం ప్రామాణికంగా భావించి అనుసరించాల్సిన అవసరంలేదు. మనల్ని మనం మన దృష్టితో అర్ధంచేసుకోవాల్సివుంటుంది.

‘నీలమత పురాణం’ అనేది ఒకటి ఉన్నదని కల్హణుడు రాజతరంగిణి రచనలో  ఇచ్చిన చారిత్రక అంశాలను సేకరించిన పుస్తకాల జాబితా వల్ల అందరి దృష్టికి వచ్చింది. అంతకు ముందు ‘నీలమత పురాణం’ పేరు విన్నా, దాని ప్రతులు దొరకలేదు. కశ్మీరులో ప్రతులు సంస్కృతంలోనూ, శారద లిపిలోను, కశ్మీరీ భాషలోనూ దొరికాయి. దొరికిన ప్రతులను పోల్చి, అక్కడక్కడా ఉన్న తేడాలను అర్థం చేసుకుని, ఏది సరైనది అనిపిస్తే దాన్ని ఉంచి, మిగతావాటి వివరాలు పొందుపరుస్తూ, ‘నీలమత పురాణం’ ప్రతిని తయారు చేశారు. అయితే ఎంతో కాలం మౌఖికంగానే ప్రచారంలో ఉండి, లిపి ఏర్పడిన తర్వాత రాత ప్రతుల రూపంలో రావడం వల్ల వినటం, రాయటం లోని లోపాలు, పొరపాట్లు ప్రతులలో చేరాయి. పైగా ఈ ప్రతులు కొన్ని కుటుంబాలలో వంశపారంపర్యంగా అందుతూండటం, కొన్ని తరాల తరువాత ఇవి ఇంట్లోని చెత్త కాగితాలుగా భావించటం వల్ల పారేయటం, పురుగుల పాలవటం అనేక సందర్భాలలో సంభవించింది. కొన్ని కొన్ని సందర్భాలలో కుటుంబంలోని అన్నదమ్ములు ప్రతిని ముక్కలు చేసుకుని పంచుకోవటం కూడా జరిగింది. ఇలా మనకు లభ్యమయి ఈనాడు ప్రామాణికంగా భావిస్తున్న ప్రతి అసలైనదో, మధ్యలో మార్పులు, చేర్పులకు గురయినదో కూడా నిర్ధారణగా చెప్పలేని పరిస్థితి.  కాబట్టి ప్రతులను పోల్చటం, ఉన్నవాటిల్లో ఏది ఉత్తమమయినదో విచక్షణను ఉపయోగించి నిర్ధారించటం వల్ల ఒక ప్రామాణికమయిన ప్రతిని తయారుచేయటం జరిగింది.  ఇలా ఏర్పరచిన ప్రతినే ఉన్న వాటిల్లో ఉత్తమమైనదిగా భావించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటే మనం మన పూర్వీకులను విమర్శించి, పురాణాలను గురించి వ్యాఖ్యానించే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది.

ప్రస్తుతం అనువదించిన  నీలమత పురాణం సంస్కృత ప్రతి 1924లో ‘ది పంజాబ్ సంస్కృతం సిరీస్’‍లో బాగంగా, మోతీలాల్ బనార్సీ దాస్ వారు ప్రచురించినది. ఈ ప్రతికి సంపాదకుకు రామ్‌లాల్ కన్నయ్యలాల్, పండిత్ జగద్ ధర్ జాదూ. ఈ పుస్తకాన్ని రాజా హరిసింగ్‌కు అంకితం ఇచ్చారు. ఈ ప్రతి తయారు చేసేందుకు మొత్తం అయిదు రకాల ‘నీలమత పురాణం’ ప్రతులను పరిశీలించి, పోల్చారు. కాస్త దేవనాగరి లిపిలో, కాస్త శారదా లిపిలో వున్న  ప్రతిని పండిత ముకుంద రామ శాస్త్రి వద్దనుంచి సేకరించారు. పాతది, పాత శారదా లిపి అక్షరాలతో వున్న ప్రతి పండిత శ్రీకాంత రాజ జనక్ ది. పండిత రాజా రామ శాస్త్రి దగ్గరి ప్రతి శారదాలిపిలో వున్నది. అధునిక శారదాలిపిలో వున్న ప్రతి పండిత మహేశ్వర జనక్ నుంచి సేకరించారు. పండిత రామచంద్ర కాక్ వద్ద మరో ప్రతి లభించింది. . వీటిన్నంటినీ పోల్చి చూసి ‘నీలమత పురాణం’ సంస్కృత ప్రతిని తయారు చేశారు. ఈ ప్రతిని ప్రామాణికంగా భావిస్తున్నారు. ఈ ప్రతిని ఆంగ్లంలోని శ్రీమతి వేద్ కుమారి అనువదించారు. ‘నీలమత పురాణం’ ఆధారంగా కశ్మీరు సాంఘిక, ధార్మిక, సామాజిక, ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ ఆమె పి.హెచ్.డి థీసిస్. సంస్కృత ప్రతి, దానికి వేద్ కుమారి గారి ఆంగ్లానువాదం, ఆమె పి.హెచ్.డి. థీసిస్‌లను ఆధార గ్రంథాలుగా వాడుతూ, ఈ అనువాదం చేశాను. వ్యాఖ్యానం కోసం పలు గ్రంథాలను పరిశీలించాను. అయితే శ్రీ రామగిరి లక్ష్మీనరసింహం గారు నాకు ఈ సంస్కృత ప్రతిని, వేద్ కుమారి గారి అనువాదాన్ని అందించి ఒత్తిడి చేయకపోతే, ‘నీలమత పురాణాన్ని’ అనువదించే ధైర్యం చేయలేకపోయేవాడిని. నేను రాసిన ‘కల్హణ రాజతరంగిణి కథలు’ చదివి, ‘నీలమత పురాణాన్ని’ మీరే అనువదించాలని ఆయన పట్టుపట్టారు. ఆయన అంతలా పట్టుపట్టకపోయి ఉంటే ఈ ‘నీలమత పురాణాన్ని’ అనువదించటం అన్న ఆలోచన కూడా కలిగేది కాదు.

‘నీలమత పురాణం’ అనువదించాలని  అనుకున్న తరువాత , అనువదిస్తే దాన్ని ప్రచురించటం ఎలా అన్న సందేహం వచ్చింది. మన తెలుగు పత్రికలు ఇలాంటి రచనలను ప్రచురించవు, ‘పాఠకులు చదవరు’ అన్న నెపం పెట్టి. నిజానికి పాఠకులు ఎలాంటి రచనలు చదవాలని ఉత్సాహం చూపుతారో, అలాంటి రచనలు అందించరు. కాబట్టి ‘నీలమత పురాణం’ అనువదించినా, ప్రచురించేదెవరు? అన్న ఆలోచనతో నేను అనువదించటాన్ని తాత్సారం చేస్తూ వచ్చాను. ఇంతలో లంకా నాగరాజు, కనకప్రసాద్ బైరాజు, భాను గౌడలు ‘సంచిక పత్రిక’కు శ్రీకారం చుట్టటం, దాని నిర్వహణ బాధ్యత నాకు అప్పగించి పూర్తి స్వేచ్ఛను ఇవ్వటంతో ‘నీలమత పురాణం’ అనువాదం ఆరంభించాను. సంచికలో సీరియల్‌గా ప్రచురితమైంది ‘నీలమత పురాణం’ 95 వారాల పాటు. అంటే ఒకవేళ సంచిక వెబ్ పత్రిక ఆరంభించకుంటే ‘నీలమత పురాణం’ అనువాద ప్రచురణకు వేదిక దొరికేది కాదన్న మాట.

‘నీలమత పురాణం’ సీరియల్‌గా ప్రచురణ ఆరంభించినప్పటి నుంచీ విశేషమైన పాఠకాదరణ లభించటం అత్యంత ఆనందం కలిగించే విషయం. ‘పాఠకులు చదవరు’ అన్నది అర్థం లేని పదం అన్నది నా విశ్వాసం. ప్రతి రచనకు పాఠకులుంటారు. పాఠకులు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలకుంటారు. ఒక రచనను చదవడం వల్ల ఆ రచన నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి, గ్రహించాలి అనుకుంటారు.  రచన తమని ఆలోచింపచేయాలనుకుంటారు. మామూలు విషయాలనే కొత్త కోణంలో రచన చూపించాలనుకుంటారు. ఏమీ లేకపోయినా కనీసం వేగవంతంగా చదివించాలి, తమకు వినోదాన్ని అందించాలి అనుకుంటారు. అంటే, అంశం ఏదైనా రచయిత దాన్ని రచించే విధానంలో రచిస్తే పాఠకులు తప్పనిసరిగా ఆదరిస్తారన్నది నా విశ్వాసం. అందుకే ‘ఇలాంటి రచనలు ఎవరు చదువుతారు?’ అని ఏ రచయిత అయినా అంటే, ‘మీరు రాయండి, పాఠకులను నేను చూపిస్తాను’ అంటాను. పాఠకులపై నా విశ్వాసాన్ని ఇనుమడింపజేస్తూ ‘నీలమత పురాణం’కు విశేషమైన ఆదరణ లభించింది. ఆరంభంలో ‘ఏమిటీ నీలమత పురాణం?’ అని అడిగిన వారే, ‘నీలమత పురాణం’ గురించి ఎంతో పరిచయం ఉన్న పురాణంలా మాట్లాడటం ‘నీలమత పురాణం’ రచన పాఠకులను ఎంతగా అలరించిందో స్పష్టం చేసిన  అంశం. ‘నీలమత పురాణం’ రచన పాఠకులను ఎంతగా అలరించిందో స్పష్టం చేసిన మరో అంశం  సాహితీ ప్రచురణ సంస్థ అధినేత ఎమెస్కో లక్ష్మి ‘నీలమత పురాణం’ అనువాదం అయిపోగానే పుస్తకంగా వేసేద్దాం అనటం. ఒక రచన వైశిష్ట్యాన్ని గుర్తించటంలో దాన్ని పాఠకులకు చేరువ చేయటం ఎమెస్కో లక్ష్మి గారికి వెన్నతో పెట్టిన విద్య. నా ఇతర రచనలలాగే ఈ రచన కూడా సాహితీ ప్రచురణలు ప్రచురించటం నాకు అత్యంత సంతృప్తినిచ్చే అంశం.

‘నీలమత పురాణం’ కశ్మీరుకే ప్రత్యేకమైన పురాణం అయినా, ఇది మన అందరికీ చెందినది. కశ్మీరు భారతదేశంలో అవిభాజ్యమైన అంగం అనీ, అనాది నుంచీ కశ్మీరు భారతదేశంలో భాగమని ‘నీలమత పురాణం’ నిరూపిస్తుంది. అనేకులు వ్యాఖ్యానించినట్టు భారత్ లోని ఇతర భాగాలకూ కశ్మీరుకూ సంబంధాలు అంతగా లేవన్నది ఒక దుష్ప్రచారం, అనృతం తప్ప మరొకటి కాదని నిరూపిస్తుంది. కేవలం భౌగోళికంగానే కాదు, ధార్మికంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా కశ్మీరు భారత శిరస్సుపైని  నవరత్న ఖచిత మకుటం అనీ, భారతదేశమనే శరీరానికి శిరస్సు కశ్మీరం అని నిర్ద్వంద్వంగా  నిరూపిస్తుంది ‘నీలమత పురాణం’.  అలాంటి ‘నీలమత పురాణం’ను తెలుగులో తొలిసారిగా అందించటం ఆనందంతో పాటు కాస్త గర్వకారణం కూడా. దీని తరువాత ఇంకా జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కొనసాగించిన రాజతరంగిణి అనువాదం సంచికలో సీరియల్‍గా వస్తుంది.

‘నీలమత పురాణం’లో ప్రధానంగా  పూజలు, పవిత్ర స్థలాలు, తీర్థాల వివరాలు ఉంటాయి. దాంతో కేవలం అనువాదం చేస్తే ఆసక్తికరంగా ఉండదని వ్యాఖ్యానం కూడా జోడిస్తూ అనువదించాను. అయితే ఆరంభంలో ‘జలోద్భవుడు’ అనే రాక్షసుడి గురించి నీలమత పురాణంలో తప్ప మరే పురాణంలోనూ లేదని రాశాను. కానీ శ్రీ రామగిరి లక్ష్మీనరసింహం గారు జలోద్భవుడి ప్రస్తావన వామన పురాణంలో వస్తుందని చెప్పారు. వారికి కృతజ్ఞతలు.

వారం వారం నీలమత పురాణాన్ని చదివి, టైపు చేసి, ప్రూఫులు దిద్ది, పేజ్ మేకప్ చేసి అందంగా సంచిక ద్వారా పాఠకులకు అందిస్తూ, నాతో పాటు బాధ్యతను పంచుకున్నారు ప్రియమిత్రుడు కొల్లూరి సోమ శంకర్, సంచిక టీమ్ లోని ఇతర సభ్యులు. వారందరి సహాయ సహకారాలు, ఉత్సాహ ప్రోత్సాహాలు లేకుంటే ‘నీలమత పురాణం’ ఇంతగా పాఠకులను అలరించడం సాధ్యం అయ్యేదికాదు.

‘నీలమత పురాణం’, ‘కల్హణ రాజతరంగిణి కథలు’ చదవండి.  తరువాత,   జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టుల ‘కశ్మీర రాజతరంగిణి’నీ చదవండి. ఇవన్నీ కలిపితే కశ్మీరు చరిత్ర మనకు బోధపడుతుంది. కశ్మీరు రూపాంతరం చెందిన విధానం అవగాహనకు వస్తుంది. మన గతం అర్థమవుతుంది. వర్తమానం అవగాహనకు వస్తుంది. గతంలోని పొరపాట్ల ప్రభావం వర్తమానంలో గ్రహించి సరిదిద్ది భవిష్యత్తరాలకు బంగారు బాట నిర్మించే ఆలోచనకు దిశ లభిస్తుంది.

ఈ ప్రపంచం ఒక రిలే పరుగు పందెం లాంటిది. ఒక తరం తాను సాధించిన మంచి చెడులను తరువాతి తరానికి అందిస్తుంది. వారు దానిలో మంచి స్వీకరించి, చెడును విసర్జించి తమ తరువాత తరానికి అందజేయాల్సి ఉంటుంది. నిరంతరం కొనసాగే పరుగుపందెం  ఇది. ఈ పరుగు పందెంలో ఒక సృజనాత్మక రచయితగా నా బాధ్యతను సక్రమంగా, నా శక్తి కొలదీ నిర్వహిస్తున్నానన్న సంతృప్తిని ఇస్తాయి  ఇలాంటి రచనలు. నా ఈ అనువాదం సమగ్రం, సంపూర్ణం, ఇదే సరైనది అన్న అపోహలు నాకు లేవు. నా అవగాహన మేరకు నాకు అర్థమయినట్టు నేను అనువదించాను. భవిష్యత్తు తరాల వారు ఈ అనువాదంలో దోషాలు సవరించి, సరైన రీతిలో తెలుగు సమాజానికి ‘నీలమత పురాణం’ అందించాలన్నది నా ఆకాంక్ష. అది జరుగుతుందన్నది నా విశ్వాసం.

~

ఇతి నీలమతే వితస్తామాహాత్మ్యం।

సమాప్తం చేదం నీలమత పురాణం॥ శివాయాస్తు లేఖక పాఠక శ్రావకాణామ్॥

(అయిపోయింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here