నీళ్ళను చూసి నేర్చుకో

0
2

[బాలబాలికల కోసం ‘నీళ్ళను చూసి నేర్చుకో’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

సుధాకరానికి పట్నంలో ఉద్యోగం వచ్చింది. కానీ సధాకరానికి సొంత ఊరు, స్నేహితుల్ని వదలి పోవాలని లేదు. వచ్చిన మంచి ఉద్యోగంలో చేరకుండా కాలయాపన చేస్తుండటం అతని తండ్రి రామారావు గమనించి “ఎందుకు ఉద్యోగంలో చేరకుండా కాలయాపన చేస్తున్నావు? ఈ కాలంలో ఉద్యోగం రావటమే అదృష్టం ఆలోచించు” చెప్పాడు.

“నాన్నా మిమ్మల్నందరినీ, నా స్నేహితుల్ని ఊరిని వదలి పెట్టి నేను వెళ్ళను. అదిగాక పట్నంలో జీవితం గడపటం నా వల్ల కాదు” అని తన విముఖుత తెలియ చేసాడు.

“నాయనా ఈ కష్ట కాలంలో ఉద్యోగం ఎంతో ముఖ్యం. ముందర నీ ఆలోచన మార్చుకో. ఆ కొత్త ప్రదేశానికి వెళ్ళినా కొద్దిరోజుల్లో అందరితో కసిపోగలవు. అక్కడ కూడా నీకు మంచి మిత్రులు, మంచి సహోద్యోగులు దొరుకుతారు. మనం ఎక్కడికివెళ్ళినా అందరితో కలసిపోవడం అలవర్చుకోవాలి. ఎప్పుడూ ఒకచోట గడిపితే జ్ఞానం, కొత్త పరిచయాలు లేక జ్ఞానం వికసించకపోవచ్చు.. అర్థం చేసుకో. ఇంకా నీకు అర్థం కావాలంటే నీకు నేనొక ఉదాహరణ చూపిస్తాను మరింత బాగా అర్థమవుతుంది” అని చెప్పి ఒక పెద్ద గాజు గ్లాసు, ఒక గాజు కూజా కొన్ని నీటిరంగులు తీసుకవచ్చాడు.

“ఇదిగో నీకు తెలిసిన విషయమే అయినా తెలిసిన విషయాల నుండి ఎంతో నేర్చుకుని మన జీవితాన్ని మెరుగు పరచుకోవచ్చు” అని చెప్పి గాజు గ్లాసులో నీళ్ళు పోసాడు. గాజు గ్లాసులో నీళ్ళు అమరిపోయాయి. గాజు కూజాలో పోస్తే కూజా ఆకారం సంతరించుకొని అందులో అమరిపోయాయి. మరలా గ్లాసు నీళ్ళలో ఎర్ర రంగు కలిపితే ఎర్రగా మారాయి, కూజాలోని నీళ్ళకు నీలం రంగు కలిపితే నీలంగా మారాయి.

చూసావా నీళ్ళు స్వచ్ఛంగా ఏ రంగులూ లేకుండా ఉన్నాయి. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలో అమరి పోతాయి. ఏ రంగు కలిపినా ఆ రంగు నీళ్ళగా మారుతాయి. నీరు స్వచ్ఛంగా ఉండి మన దాహం తీర్చటమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతాయి” అని చెప్పి సుధాకరాన్ని బయటకు తీసుక వెళ్ళి నీరు నిలచిన ఒక గుంటను చూపి ఈ విధంగా చెప్పాడు.

“చూడు సుధాకరం నీళ్ళు గుంటలో ఒకే చోట నిలచి ఉండటం వలన మురికి పట్టాయి. హానీ చేసే పురుగులు, దోమలు పుట్టుకొస్తున్నాయి. అదే నదిలో నీళ్ళు పారుతూ భూముల్ని సస్యశ్యామలం చేస్తూ సందలను సృష్టిస్తున్నాయి. ఇప్పుడు నీకు అర్థం అయిందనుకుంటా. ఒకే చోట ఉంటే నీళ్ళు  మురికి పట్టినట్టు మన మెదడు కూడా అభివృద్ధి చెందక పోవచ్చు. అందుకే మన పెద్దలు ఉద్యోగం, వ్యాపారం కొరకు ఎక్కడికైనా వెళ్ళేవారు. ఇప్పుడు నీకు పూర్తిగా అర్థం అయిందనుకొంటా” వివరించారు రామారావు.

“మీరు చెప్పింది నాకు అర్థం అయింది. తప్పకుండా ఉద్యోగానికి పట్నం వెడతాను. నేనేమిటో నిరూపించుకుంటాను” అని పూర్తి విశ్వాసంతో చెప్పాడు.

సుధాకరంలో వచ్చిన మార్పుకి తండ్రి సంతోషించి ఆశీర్వదించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here