Site icon Sanchika

నీలో.. నేనై..!!

[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘నీలో.. నేనై..!!’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]కు నీడన చేరిన పువ్వులా,
నీ నీడన నేను –
గాలి తట్టినప్పుడల్లా
తెరిపె కోసం తొంగి చూసే పూవులా
నీ కోసమే చూస్తుంటా..!

నేల కురిసిన వాన –
భూమిలో ఇంకినట్టు,
నీలో ఇంకిపోయిన నేను
నవ్వులు చిందిస్తూ నువ్వు..!

నింగి నుండి రవి కిరణాలు
మెల మెల్లగా..
గరిక కొసల మీద,
ఉదయిస్తున్నట్టు –
నీ కనుల నిండా నేను..

ప్రతి కిరణ –
వర్ణాలద్దుతున్న అందం!
నీ కనులలో,
నా రూపు చూసిన –
మహాదానందం
మన మనసునద్దం పడుతూ
ప్రకృతి సౌందర్యం..!

ఎన్ని మెరుగులున్నా..
ఒదిగి ఉండాలని,
మౌనంగా ప్రేమను పంచాలని,
ప్రేమకు తలవొంచనిదేదీ లేదని,
మనం ప్రకృతి ఒడిలో..
ఒకరికొకరమై..
ఆ దైవం ఆధీనంలో ఉన్నామని
ప్రమాణంచేసుకుందామా..!!

Exit mobile version