Site icon Sanchika

నీలో నేను..!!

[శ్రీమతి తోడేటి దేవి రచించిన ‘నీలో నేను..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నీ[/dropcap] ఊసులతో నేను
నా ఊహల్లో నువ్వు
సదా ఎప్పుడు నాతోనే..!
ఎదురెదురు లేకున్నా
ఉన్నట్టుగా మాట్లాడే తీరు..
పక్కనే ఉన్నట్టు చెప్పే ఊసులు..
నీకూ నాకూ మధ్య
లెక్కే లేని అడుగుల దూరం!
అయినా సరే..
కనుపాపల ముందు,
రెప్పల వెనుక–
నీ రూపం ప్రతి నిమిషం.
మనసైతే నీతోనే సావాసం!
తలపులు నీవే, తికమకలు నీ వల్లే..
నా ఉచ్ఛ్వాసం..
ఎక్కడి నుండో నువ్వు
నా కోసం పంపిన ఊపిరి!
నా చిరునవ్వు..
నీ ఊహల, ఊసుల గిలిగింతల ఫలితం..!
నువ్వొస్తావేమో అన్న ఊహ చాలు
వేల వాయులీనాలు –
నా కోసం మోగుతాయి!
అద్భుతం..
నిన్ను వెంటబెట్టుకొచ్చిన క్షణం
నా ఎదురుగా.. ఆశ్చర్యంగా..
అందంగా.. ముస్తాబయ్యి..
నువ్వు నేను..
మనసులో మాటలు సైతం
వినిపించేంత దగ్గరగా..!
నీ స్పర్శ తాలూకు పరిమళం
నాతోనే ఉండేంత దగ్గరగా..
నీడలు సైతం చేతులు కలిపి
నడిచేంతగా..
కొత్త లోకం..
రంగుల ఇంద్రజాలం..
నీ వల్లే..!
తెలియకుండా కాలం
రోజుల పేజీలు తిప్పేస్తోంది..!
ఇంకా అందంగా నీతో
ప్రయాణాన్ని రాసుకోవాలి..
మురిసిపోవాలి..!!

Exit mobile version