[box type=’note’ fontsize=’16’] “నీరజ్ గీతాలు వినే వాళ్ళు గీతాలలో ఉండే శబ్దసౌందర్యం, శబ్దార్థం, సౌందర్య వైభవం, స్వరసరితలో మునిగి ఊగిపోయేవాళ్ళు. వాహ్.. వాహ్.. అంటూ నోరారా పొగిడేవాళ్ళు. కాని నీరజ్ మాత్రం తనలో తను రమించేవారు. తన మానస తరంగాల జలధారలో తడిసిపోయేవారు” అంటున్నారు డా. టి. సి. వసంత. [/box]
[dropcap]ప[/dropcap]ద్మభూషణ్ గోపాల్ దాస్ నీరజ్ దాదాపు 70 సంవత్సరాల నుండి ప్రజల మనస్సులను జయిస్తూ ఈనాటికి వారి హృదయాలలో శాశ్వతంగా ఉండిపోయారు. వారి గీతాలను వింటూ సహజంగా హృదయపు తలుపులను తెరిచి పెట్టేసారు. నీరజ్ గీతాల రాజకుమారుడిగా హిందీ ప్రపంచంలో అడుగుపెట్టారు. కాని వారి వయస్సు యాత్రతో పాటు వారి పేరు ప్రతిష్ఠల యాత్ర కూడా ముందడుగు వేసింది. వారి వ్యక్తిత్వం, వారి రచనలు సమయాన్ని ఆకళింపు చేసుకుంటూ వాటి వాటి గతి నిర్ధారించుకుంటూ, వారి అధ్యయన ప్రవృత్తి పేరు ప్రతిష్ఠల ఆకర్షణకి దూరంగా ఉంటూ తన లయ సంగీతాలలో తల మునకలయ్యాయి. అసలు నీరజ్‌ని ప్రేమించేవాళ్ళు కోకొల్లలు. కానీ నీరజ్ ప్రేమ ఇంకా ఏదో కోరుకుంటోంది. నీరజ్ మనస్సు భౌతికమైక చమక్-దమక్‌ల మధ్య ఉంటూ కూడా, అసలు భౌతిక ప్రపంచానికి వెలుగునిచ్చే ఆ కాంతిపుంజం కోసం నిరంతరం అన్వేషిస్తునే ఉంది. నీరజ్ భౌతిక జగత్తు నుండి విరక్తి కలిగించే అ సత్యం కోసం అన్వేషిస్తునే ఉన్నారు. ఆత్మానుభూతి (స్వయం తో పరిచయం) అనే రాజ్‌మహల్‌కి తీసుకువెళ్ళే మార్గానికి ఇంకా వైభవం చేకూరుస్తూ వారు ముందుకు వెళ్ళారు. నీరజ్ గీతాలను వింటూ ప్రజలు తమని తాము మరిచిపోయేవారు, ఆనందించేవారు. భౌతికం, ఆధ్యాత్మికం ఈ రెండింటి ఆనందాల మధ్య అనుభవించే తీరులో తేడాలు ఉన్నాయి.
నీరజ్ గీతాలు వినే వాళ్ళు గీతాలలో ఉండే శబ్దసౌందర్యం, శబ్దార్థం, సౌందర్య వైభవం, స్వరసరితలో మునిగి ఊగిపోయేవాళ్ళు. వాహ్.. వాహ్.. అంటూ నోరారా పొగిడేవాళ్ళు. కాని నీరజ్ మాత్రం తనలో తను రమించేవారు. తన మానస తరంగాల జలధారలో తడిసిపోయేవారు. తన అనుభూతికి భావనా శబ్దాలనిచ్చి ప్రజల హృదయాలలో చొచ్చుకు పోయేవారు. వారిని దేశ విదేళాలలో వేల మంది సన్మానాలు చేసి సాహిత్య పురస్కారాలు ఇచ్చి గౌరవించారు. ఎన్నో హిందీ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పొందారు. వారికి లోతైన ఆధ్యాత్మిక తత్వ జ్ఞానం ఉంది. జోతిష్కంలో కూడా ప్రకాండ పండితులు. తన కుమారుడితో ముంబయి వచ్చినప్పుడు ఈ గీత సమ్రాట్‌తో జీవితం, ఆధ్యాత్మిక విషయాలు, గీతాలు, కవితల మీద సర్వేష్ అస్థానా మాట్లాడారు.
సర్వేష్: నీరజ్‌గారూ! మీ దృష్టిలో ఈశ్వరుడంటే ఎవరు?
నీరజ్: ఈశ్వరుడిని మూడు రూపాలలో మూడు పేర్లతో గుర్తించే ప్రయత్నం మనం చేస్తాం. ఈశ్వరుడు, భగవంతుడు, పరమాత్మ. ఈశ్వరుడంటే ఐశ్వర్యవంతుడు. భగవంతుడంటే భగ్ అంటే సృష్టికర్త. పరమాత్మ అంటే పూర్తి జాగృతమైన ఆత్మ. అంటే ఎవరైతే పూర్తిగా జాగృతమైన ఆత్మకలిగి సృష్టితో నడుస్తూ ఐశ్వర్యవంతుడు అవుతాడో అతడే ఈశ్వరుడు.
సర్వేష్: మన నమ్మకం ప్రకారం అవతారాలకు అస్తిత్వం ఉంది. ఇది అవతారవాదమా?
నీరజ్ : సృష్టి పూర్వం అంతా చీకటే. సూర్యుడే సృష్టికి కారణం. ఎప్పుడైనా అగ్ని పూర్తిగా చల్లారిపోయిందో అప్పుడు ఒక అంకురం మొలకెత్తింది. ఆ అంకురమే జీవితం. అవతారాలకి మూలం. మెల్లమెల్లిగా సృష్టి వికాస క్రమంలో అవతారాలు మొదలయ్యాయి. సృష్టి సమజం యొక్క ఆవశ్యకతను బట్టే అవతారాల ప్రారంభం అయింది.
సర్వేష్: వివరంగా చెప్పిండి
నీరజ్: ప్రారంభంలోని మూడు అవతాలలో కేవలం చైతన్యం పదార్థం మాత్రమే ఉండేది, మేధస్సు లేదు.
సర్వేష్: చెప్పండి..
నీరజ్: మొదటి అవతారం మత్స్యావతారం (చేప). అప్పుడంతా జలమయమే. రెండో అవతారం కచ్ఛపం (తాబేలు), ఇక్కడ కూడా కేవలం పదార్థం. చైతన్యం మాత్రమే ఉండేవి. ఈ సమయంలో జలధరాలలో జీవం ఉండేవి. మూడో అవతారం వరకు జలం సంకుచితం అయింది. అంటే తగ్గిపోయింది. భూమి వికాసం పొందింది. మూడో అవతారం వరహవతారం.
సర్వేష్: ఈ విస్తారం చెందడం సత్యమైనదేనా! తర్క సమ్మతమైనదేనా?
నీరజ్: ఏ అవతారం అయినా సరే తర్కబద్ధమైనదే. సృష్టి విజ్ఞానం మీదే ఆధారపడి ఉంది. నాలుగో అవతారం నృసింహవతారం. ఈ కాలం పశుత్వం మానవత్వం సమ్మిశ్రణం. ఈ అవతారం నుండే మేధస్సును మనిషి పొందాడు. ఈ అవతారం నుండే చైతన్యం మేధస్సుతో పాటు మొదలయింది.
సర్వేష్: వామనావతారం?
నీరజ్: వామనావతారం చిన్న మెదడుకి ప్రతీక. అందువలననే వామనుడి ఆకారం చిన్నగా ఉంటుంది.
సర్వేష్: మరి పరశురాముడు వామనుడికి విరుద్ధమైన రీతిలో ఉండేవాడు కదా?
నీరజ్: పరశురామావతారం భౌతిక బుద్ధితో పాటు శక్తి మిళితమైన అవతారం. అందువలనే ఆయన కోపిష్టి. 21 సార్లు క్షత్రియులను సమూలనంగా నష్టపరిచే ప్రయత్నం చేసాడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించి తల్లి ప్రాణాలను తీసాడు. ఈ అవతారంలో బుద్ది – శక్తి రెండు ఉన్నాయి కాని వివేకం లోపించింది.
సర్వేష్: రాముడి అవతారం ఎంతో ప్రజారంజకం, ఆదరణీయం ఎట్లా అయ్యింది? అంతకు పూర్వమే కదా పరశురాముడిని చూసి అందరు భయపడేవాళ్ళు.
నీరజ్: రాముడిలో శక్తి, బుద్ధితో పాటు వివేకం కూడా ఉంది. రాముడిలో వివేకం ఉంది కనకే అతడు మర్యాదా పురుషోత్తముడయ్యాడు.
సర్వేష్: కాని కృష్ణుడు రాముడికి పూర్తిగా వ్యతిరేకం. భిన్న రూపంలో కనిపిస్తాడు.
నీరజ్: అవును కృష్ణడు వేరు. కృష్ణుడు అంటే ఆకర్షించేవాడు అని అర్థం. ఆవశ్యకతను బట్టి ఆయన ఆధ్యాత్మికుడిగా మారుతాడు. అప్పుడప్పుడు పూర్తిగా భౌతికంగా ప్రవర్తిస్తాడు.
సర్వేష్: కృష్ణుడి విరాట్ రూపానికి అర్థం ఏమిటి?
నీరజ్: నేనే జీవితాన్ని, నేనే మృత్యువును, నేనే గాలిని, నేనే భూమిని, నేనే ఆకాశాన్ని, పాపమూ నేనే, పుణ్యమూ నేనే, నేను నిర్మాతను, నియంతను, నా శరణం కోరండి. నేనే నిర్ణయిస్తాను అని కృష్ణుడంటాడు. రెండు రకాల రూపాలు ఆయనలో ఉన్నాయి. ఇదే విరాట్ రూపానికి అర్థం.
సర్వేష్: కృష్ణుడి రూప, స్వరూపాలు, వ్యక్తిత్వం బట్టి ఆయన్ని భగవంతుడు అవతార పురుషుడని అనలేం కదా!
నీరజ్: కృష్ణుడు ఏ సమయంలో అవతారం ఎత్తడో ఆనాడు మానవతా విలువలను విభజన రూపంలో చూపించే ప్రయత్నం జరిగింది.
సర్వేష్: అంటే? నాకర్థం కాలేదు.
నీరజ్: కృష్ణడిలో అనేక రూపాలు ఉన్నాయి. బాల్యంలో కృష్ణుడు దాంగ, వెన్న దొంగిలించేవాడు. యువ కృష్ణుడు చిలిపి కృష్ణుడు, కాని కర్తవ్య పరాయణుడు. ఆవులను మేపేవాడు. పశువులకాపరి గోపికా వస్రాలను అపహరించాడు. గోపికలతో కలిసి గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. సంగీతకారుడు. మురళిని వాయించేవాడు. నృత్యకారుడు. కృష్ణ రాసలీలలు తెలిసినవే కదా! సర్వేష్‌గారు శాంతిదూతగా కౌరవుల పాండవుల మధ్య సంధి చేయడానికి ప్రయత్నించాడు.
సర్వేష్: మరైతే గీతోపదేశం చేయడం ఎందుకు? స్వయంగా కౌరవులను చంపేయచ్చుగా.
నీరజ్: కాని హాక్కు కోసం పోరడటం సమాజానికి నేర్పించాలిగా. అంటే ఆయన హక్కుల పోరాటానికి నాంది పలికాడు. అందువలనే అర్జునుడికి గీతోపదేశం చేశాడు. తనని తాను జ్ఞానిగా నిరూపించుకున్నాడు. అంటే కృష్ణుడు మనిషి రూపాలన్నింటినీ చూపించాడు. ఇక పదవ అవతారం గురించి.. బుద్ధుడు పదో అవతారం. కృష్ణుడి ఆలోచనలకు భిన్నం బుద్ధుడు. కృష్ణుడు తానే అంతా అంటాడు. కాని బుధ్ధడు అప్పదీపోభవం.. స్వయంగా ప్రకాశించు. బుద్ధుడు ఆత్మని స్వీకరించలేదు. పునర్జన్మని నమ్మడు.
సర్వేష్: జన్మ, మృత్యవుల గురించి మీ అభిప్రాయం ఏమిటి?
నీరజ్: జన్మతోనే మృత్యువు ప్రారంభం అవుతుంది. జన్మ మృత్యువు రెండు కలిసే నడుస్తాయి.
క్షణ క్షణం కొత్త జన్మ ఇక్కడ
క్షణం క్షణం కొత్త మృత్యువువిక్కడ
సర్వేష్: మీ దృష్టితో చూస్తే పదవ అవతారం ఏది?
నీరజ్: నా దృష్టిలో పదవ అవతారం విజ్ఞానమే. ఈ శతాబ్దంలోనే మనిషి మృత్యువును జయిస్తాడు. సావిత్రి దీనికి ఉదాహరణ. సావిత్రి అంటే అర్థం సూర్యుడి పుత్రిక. అంటే ప్రకాశానికి ప్రతీక. యముడు అంటే చీకటి. సత్యవంతుడు అంటే సత్యం, చీకటిలో దాగి ఉంది. సావిత్రి యముడితో పోరాడి సత్యవంతుడిని వెనక్కి తీసుకురావడంలో సఫలీకృతురాలయింది. ఇది మృత్యువు పైన మనిషి విజయానికి ఉదాహరణ.
సర్వేష్: మృత్యువుని జయించడమా?
నీరజ్: మొట్టమొదట్లో పదార్థం శక్తి వేరు వేరు అన్న అభిప్రాయం ఉండేది. కాని ఐన్‌స్టీన్ పదార్థాన్ని శక్తిగా, శక్తిని పదార్థంగా మార్చవచ్చని నిరూపించాడు.
సర్వేష్: కాని ఇది మృత్యువును జయించడం ఎట్లా అవుతుంది?
నీరజ్: ఇప్పుడు మానవుడి ఆయుష్షు పెరిగింది. క్లోనింగ్ ప్రారంభం అయింది. ఇదంతా మృత్యువు పైన విజయం అనే యాత్రకు ప్రారంభం. ఆత్మ అమరత్వంతో పాటు దేహం కూడా అమరత్వం పొందుతుంది. ఇది నిశ్చయం.
సర్వేష్: ఆత్మ, అమరత్వం.. అసలు ఆత్మ అంటే ఏమిటి?
నీరజ్: నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః. దేనినైతే శస్త్రం చంపలేదో, దేనినైతే అగ్ని దహించదో.. సమయం.. సమయం అంటేనే ఆత్మ. కాని బుద్ధుడు దీనిని ఇంకా పొడిగించి చెప్పాడు. కాలం నడుస్తూనే ఉంటుంది. కాని మనుష్యులు వెనక ఉండిపోతారు.
కాలం నడవదు – నడిచేది మనమే.
బోగాలని మనం అనుభవించం. మనలనే భోగాలు అనుభవిస్తాయి.
సర్వేష్: ఇందంతా తెలిసిన వాళ్ళు ఎవరు?
నీరజ్: బ్రహ్మజ్ఞాని
సర్వేష్: బ్రహ్మజ్ఞాని అంటే ?
నీరజ్: ఎవరైతే ఋషి, సాధువు, సంత్ మూడు కాగలుగుతాడో..
సర్వేష్: సంత్ అంటే?
నీరజ్: ఎవరైతే సత్యం గురించిన జ్ఞానం ఉంటుందో, కాలం పట్ల ఆసక్తి ఉంటుందో..
సర్వేష్: సాధువు..
నీరజ్: ఎవరైతే సాధన చేస్తారో..
సర్వేష్: సాహిత్యాకరులను సంత్ అని ఎందుకంటారు?
నీరజ్: సమాజానికి మేలు చేసేదే సాహిత్యం, రచయిత సాధన చేస్తాడు. సమాజానికి మేలు జరిగే సత్యజ్ఞనాన్ని అందిస్తాడు. కాలం పట్ల అతడికి ఆసక్తి ఉంటుంది. అందువలన సాహిత్యకారుడు సంత్ అవుతాడు.
సర్వేష్: పశువుకి మనిషికి మధ్య బేధం ఏమిటి ?
నీరజ్: ఆహారం, మిధునం, నిద్ర పశువుకూ ఉంటాయి, మనిషికీ ఉంటాయి. కాని మనిషిలో కరుణ ఉంటుంది. కరుణలో పుచ్చుకోవడం ఉండదు, అంతా ఇవ్వడమే.
సర్వేష్: ప్రేమ..
నీరజ్: కావాలి అన్న కోరిక ఉంటుంది.
సర్వేష్: భక్తి
నీరజ్: శరీరంలో వాసన, మనస్సులో ప్రేమ మనస్సుకి ఇంకా పైన భక్తి సమర్పణ వీటన్నింటికి ఇంకా పైన ఉండే ప్రేమే పరమానందం.
సర్వేష్: మీ దృష్టిలో ధర్మం అంటే ఏమిటి?
నీరజ్: ధారయేత ఇతి ధర్మః అంటే దేనికి ఆచరించగల యోగ్యత ఉన్నదో..
సర్వేష్: ఆచరించగలవి..
నీరజ్: ప్రేమ, కరుణ, క్షమ, దయ, ఉదారత్వం, సహజత్వం, సమభావం.
సర్వేష్: జీవితం అంటే..
నీరజ్: పంచతత్వాల అనుపాతం. అంటే అన్నీ సమపాళ్ళల్లో ఉండాలి. బాలెన్స్‌లో తేడా వస్తే రోగం వస్తుంది. మొత్తం బాలెన్స్ నాశనం అయిపోతే మృత్యువు.
సర్వేష్: అధ్యాత్మికం అంటే..
నీరజ్: ఆత్మ దర్శనం.. జీవితం మృత్యువు రెండిటిని సమానంగా స్వీకరించడం.
సర్వేష్: ఇంకా వివరణ..
నీరజ్: తప్పకుండా..
సూర్యుడి నుండి ప్రాణం, భూమి (మట్టి) నుండి శరీరం పొందాం, మనం శ్వాస తీసుకుంటు వాయువుకు ఋణపడి ఉన్నాం. సముద్రం అశ్రుప్రవాహాన్ని దానం చేసింది. ఆకాశం శూన్యాన్ని వికల విధుర ఉచ్ఛ్వాసాలనిచ్చింది. దేనికి ఏది ఋణపడి ఉన్నామో వాటి వాటికి తిరిగి ఇచ్చి, మృత్యురూపంలో మనం ఇక్కడ ఋణం తీర్చుకుంటాం. దీన్నే కొందరు అభిశాపతాపం అంటారు. మరి కొందరు వరదానం అని అనుకుని సంతోషపడతారు.
(హిందీ మూలం నవనికష్, నీరజ్ విశేష సంచిక, సెప్టెంబరు-2011లో ప్రచురితం. ఈ పత్రిక కాన్పూర్, లక్నో, డెహ్రాడూన్ నుంచి ప్రచురితం, ప్రధాన సంపాదకుడు – డా. లక్ష్మీకాంత పాండే. తెలుగు అనువాదం – డా. టి.సి వసంత).