Site icon Sanchika

నీరజ్ – తీరని కోరికలకు పర్యాయం-2

(సుదర్శన్ చోప్‍డా సంపాదకత్వంలో 1976లో వెలువడిన ‘నీరజ్ – అపూరిత్ కామనావోం కా పర్యాయ్’ అనే రచనని అనువదించి అందిస్తున్నారు డా. టి.సి.వసంత.)

[dropcap]“అం[/dropcap]తరంగంలోని లోయలలో తర్కం కేవలం గోపురంలోని ప్రతిధ్వనిగా మాత్రమే ఉండిపోతుంది. మాటి మాటికి మారు మ్రోగుతుంది. దీనిని వితర్కం కూడా ఏమీ లేదు. ఏ సమాధానం లేదు. పైగా ఇది ఆ లోయలలో భరించలేని ధ్వనిని ప్రసరింపచేస్తుంది. అంతటా అశాంతిగా అనిపిస్తుంది. సరే.. నీలూ ఇవాళ నీకు ‘లీడ్ థింకింగ్’ రూపంలో నీతో కొంత చెప్పాలని ఉంది. నీలోని అసలు వ్యథ భౌతికమైన సంఘర్షణలో సాఫల్యత పొందాలన్నదే అయితే మరి లభించక బాధ తక్కువ కావాలి కదా! శాంతి లభించాలిగా! కాని రోజు రోజుకి ఈ క్షోభ పెరిగిందే కాని తగ్గలేదు. ఈ వ్యథ ఇంకా క్రమంగా ఎట్లా పెరిగిందో చెబుతాను. 1946లో ఢిల్లీని వదిలి కాన్‌పూర్‍కి వెళ్ళిపోయాను. అక్కడ నాకు ఢిల్లీలో కన్నా మంచి ఉద్యోగమే దొరికింది. (‘వోల్కర్డ్’ అనే విదేశీ కంపెనీలో స్టెనో ఉద్యోగం దొరికింది. దీనికి ముందు కాన్‌పూర్ లోనే డి.ఎ.వి. కాలేజీలో ఉద్యోగం దొరికింది. కాని నీరజ్ వోల్కర్డ్ లో ఐదు సంవత్సరాలు పని చేసాడు. జీవితంలో కొంత స్థిరపడ్డాడు. ఈ సమయంలోనే చదువుని కూడా కొనసాగించాడు.) నా వివాహం కూడా జరిగింది. నేను బి.ఎ. కూడా పాస్ అయ్యాను. కాన్‍పూర్‌లో ‘జిల్లా సూచనాధికారి’గా పని చేసాను. గెజిటెడ్ ఆఫీసరుని అయ్యాను కాని నా మానసిక క్షోభ ఇంకా పెరిగింది. 1953లో ఎమ్.ఎ. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను. అయినా అంతరంగంలోని వ్యథ తగ్గలేదు. ఎమ్.ఎ. అయ్యాక నేను రెండు సంవత్సరాలు నిరుద్యోగిగా ఉండిపోయాను. నా మనోవ్యథ కవిత్వ రూపం దాల్చంది. కవితలలో బాధను వ్యక్తం చేసాను. ఈ రెండు సంవత్సరాలలో నాకు ఎంతో పేరు – ప్రతిష్ఠలు వచ్చాయి. అయినా నా అంతరంగంలోని తపన తగ్గలేదు. పేరు – ప్రఖ్యాతులు గడించినా క్షోభ ఏ మాత్రం తగ్గలేదు. అసలు మనస్సుకు శాంతే లేదు. కవి సమ్మేళనాలకి నేను దేశంలోని నలుమూలలకి వెళ్ళాను. అసలు ఈ అస్థిరత వలననే నాకిట్లా మానసిక శాంతి లేకుండా పోతోందా అని అనిపించింది. అందువల స్థిరత్వం కోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను. కొంత సాఫల్యత కూడా లభించింది. మేరఠ్ కాలేజీలో హిందీ లెక్చరర్‌గా స్థిరపడ్డాను. కొన్ని సంవత్సరాల తరువాత అక్కడ నుండి కొన్ని కారణాల వలన వెళ్లిపోవలసి వచ్చింది. అలీఘడ్‍లో ధర్మ సమాజ్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేయడం మొదలుపెట్టాను. ఇక ఇక్కడ స్థిరంగా ఉండవచ్చు అని అనుకున్నాను. లోకం దృష్టిలో నేను అన్ని విధాల స్థిరపడ్డాను. ఉద్యోగంలో స్థిరపడ్డాను. కవిగా నా కావ్య జగత్తు మూడుపూలు ఆరు కాయలుగా విలసిల్లింది. అయినా నా లోపలి వ్యధ తగ్గలేదు. పైగా ఇంకా ఎక్కువ అయింది. ఆ బాధ నన్ను నిలవనీయకుండా చేసింది. నేను దానిని పొందాలని ప్రయత్నిస్తున్నానో అది నాకన్నా పదడగులు ముందే వెళ్ళిపోయింది. నేను వెనకే ఉండిపోయను. అసలు ఇక ఎప్పుడు నేను అక్కడిదాకా చేరలేను. నా ఈ అనుభూతి ‘సాఫల్యం పొందిన నిస్సహాయత’ – ‘కారవాం గుజర్ గయా గుబార్ దేఖతే రహే’ అనే గీతంలో వ్యక్తం అయింది. ఈ గీతం అందరి మనసులను స్పర్శించింది. ఊపేసింది. నాకు కూడా ఈ గీతం అంటే అందరికన్నా ఎక్కువగా బాధపఢే నా సంతానంలా ఎంతో ఇష్టం.”

“నీర్! నీ మాటల్లో మాట మాటకీ నీకు ఏదో కావాలన్న తపన ఉంది. దాన్నే నీవు వెతుకుతున్నావు కాని నీకు ఏం కావాలో నీకే స్పష్టంగా తెలియదు అన్న సంగతి తెలుస్తోంది. కాని నీవు ఆ కావాల్సినది ఒక వ్యక్తా, కోరుకునే ఉపలబ్ధా, లేకపోతే ఏదైనా విశిష్టమైన సత్యమో! అని ఊహించగలగుతావా?”

“లేదు. నేను ఊహించలేకపోతున్నాను. కేవలం ఒక అనుమానం మాత్రమే. తెలియని ఆ బాధను ఆధారం చేసుకునే క్షణక్షణం పోరాడుతునే ఉన్నాను. ఈ బాధ అనేది ఎట్లా ఉంటుందో తెలియదు, దానికి రూపం లేదు. అందువలన ఈ అనుమానం వలన ఊహాలోకి వచ్చిన ఆ మూర్తి కూడా కేవలం నీడ లాగానే ఉంటుంది. దానిని ఈ దేహం పట్టుకోలేదు. అది ఒక వ్యక్తి నీడ అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అది తెలియని తృష్ణకి సంబంధించిన సత్యం అని కూడా అనిపిస్తుంది.”

“తృష్ణకి సంబంధించిన సత్యమా?”

“అవును.. అసలు ఇదే వాస్తవమన సత్యం అని నాకు అనిపిస్తుంది. సృజనకి మూలమైన ప్రేరణ శక్తి ఇదే. సౌందర్య సృష్టి కూడా వ్యక్తి తన తృష్ణ-సత్యం ప్రకారమే చేస్తాడు. సౌందర్యం.. అది ఏ విధమైనదైనా సరే.. సృష్టికి మఖ్యతత్వం అదే. దానినే మూలతత్వం అని అనవచ్చును. ఈ తత్వానికి సారరూపమే ప్రేమ. ఇదే సృష్టిని నడపడంలో శక్తి నిస్తుంది. గతి నిస్తుంది. నియంత్రణ చేస్తుంది.”

నీరజ్ నోటి నుండి అప్రయత్నంగా కావ్య పంక్తులు వెలువడుతున్నాయి.

“ప్యార్ హైకి సభ్యతా సజీ ఖడీ

ప్యార్ హైకి వాసనా బంధీ పడీ

ప్యార్ హైకి ఆంఖోంమే షరమ్ ఝడీ

ప్యార్ బిన్ మనుష్య దుశ్చరిత్ర్ హై”.

“ప్రేమ వలనే సభ్యత (నాగరికత) అలంకరించుకుని నిల్చుంది,

ప్రేమ వలనే వాసనా(తృష్ణ) బందీ అయి ఉంది,

ప్రేమ వలనే కళ్ళల్లో మర్యాద – జడివాన

ప్రేమ లేకపోతే మనిషి చరిత్రహీనుడే.”

“వాహ్! ఎంత బాగా చెప్పావు నీరజ్! అసలు ప్రేమకు దీనికన్నా అందమైన గొప్పదైన పరిభాషను నేను వినలేదు. కాని ఇక్కడ వ్యక్తిగత ప్రేమను ఏ దృష్టితో చూస్తారో నీకు తెలుసు కదా? ఈ ప్రేమను అనైతికంగా చూస్తారు.”

“నైతికత అంటే ఏమిటీ నీలు?” నీర్ అడిగాడు..

“నైతికత.. నీతి.. జీవన నీతి, జీవించే ఒక ప్రణాళిక. వ్యావహారిక జీవితంలో ఒక పద్దతి.”

“అంతా కలిపి ఒక రకమైన క్రమశిక్షణ అంతే కదా?”

“అవును.”

“మరి క్రమశిక్షణ అంటే ఏమిటి? ఒక రకమైన అభ్యాసమే కదా? అభ్యాసం అంటే ప్రయత్నమే కదా? ప్రయత్నం అంటే ప్రయోజనమే కదా? ప్రయోజనం ఒక మాధ్యమం మాత్రమే. అది లక్ష్యం కాదు. మాధ్యమం క్షణికం. శాశ్వతం కాదు. ఏది క్షణికమో అది కృత్రిమం. సహజమైనది కాదు. కాని సత్యం. ఇదే మానవ జీవితానికి లక్ష్యం. సహజం, శాశ్వతమైనది, ప్రయోజనాతీతమైనది. అంటే ప్రయోజనానికి ఆవల ఉంటుంది అని అర్థం. అందు వలన ఆ సత్యాన్ని పొందాలంటే కృత్రిమమైన నైతికత పాటించాలి. నా దృష్టిలో ప్రేమ అన్న సంబంధాలలో సర్వ శ్రేష్ఠ మానవ సంబంధం. ఈ సంబంధం వ్యక్తికి అస్వాభికత్వం నుండి స్వాభికత వైపు తీసుకువెళ్తుంది. నిరంతరం తీసుకుని వెళ్తూనే ఉంది. ప్రేమ ఎవరినీ కిందకి తోసేయలేదు. పైగా సూరదాస్, తులసీ దాస్, షైలీ (షెల్లీ), ఖలీల్ జిబ్రాన్ లాంటి గొప్ప ఆత్మలను నిర్మించింది. దీనికి కారణం ఒకటే, ప్రేమ నైతికతకు ఏ మాత్రం విరోధి కాదు. ప్రేమ అసలు రూపం ఇదే. నా దృష్టిలో అనైతికంగా ఉండే వ్యక్తి అసలు ప్రేమించలేడు. ఏ వ్యక్తి అయితే ప్రేమిస్తాడో అతడు సమాజంలో ఎటువంటి ఆచారాలను లేక సంకెళ్ళను తెంచడు. స్వయంగా తన లోపల ఉన్న బంధాలని తెంచుకుని ముక్తి పొందుతాడు. అప్పుడే ప్రేమించగలుగుతాడు.”

“అదెట్లా?”

“చూడు నీలూ! మనం స్వయంగా బందీలై ఉన్నాము. మన పైన మనమే కాపలా కాస్తున్నాము. కాని బయటి సంకెళ్ళు మనలని కట్టి పడేస్తున్నాయని అనుకుంటున్నాము. ఇది సరియైనది కాదు. దేహాన్ని సంకెళ్ళతో బంధించ వచ్చును కాని మనస్సును బంధించలేము. మనస్సు తనే స్వయంగా బందీ అయి ఉంది. అందువలన సంకెళ్ళకి బానిసత్వం ఎంత మాత్రం బానిసత్వం కాదు. మన లోపల మనలని కట్టి పడేసేదే బానిసత్వం. బయట మనం స్వతంత్రంగా ఉన్నా లోపల ఖైదీలవలే ఒకటి రెండు తాళాలతో కాదు, వేల వేల తాళాలతో. ఈ తాళాలు కూడా మనం స్వయంగా వేసుకున్నవే. ఇదే మన సమస్య. తాళాలు మనవే కనుక మనం వాటిని పగలగొట్టలేం. కాని వాటిని పగలగొట్టకపోతే మనకు విముక్తి లభించదు. మనం దీని నుండే విముక్తం కావాలి.”

“కాని ఈ ముక్తి ఎట్లాంటిదో?” ఈ ప్రశ్నలో జిజ్ఞాస లేదు కేవలం ఒక అడ్డుకోవాలన్న భావం ఉంది.

“మనం అసలైన సంకెళ్ళను గుర్తు పట్టకపోతే ఇది సంభవం కాదు. ఈ బంధాలు, ఈ సంకెళ్ళు అన్నీ మన అహమే. అహం మనస్సు సృష్టి. మనస్సు భూతకాలం సృష్టి.”

“అంటే అర్థం మనం మన భూతకాలం నుండి విముక్తి పొందాలి. అవును కదూ! ”

“అవును నీలూ! భూతకాలం నుండి, పరంపర నుడి మూఢమైన ఆచారాల నుండి కాని మనం మనస్సును జయిస్తేనే వీటి నుండి విముక్తి పొందగలుగుతాం. జ్ఞానం ధర్మం పూజా పునస్కారాలతో కూడా ముక్తి దొరకదు. ఎందుకంటే ఇవన్నీ మన మనస్సు కల్పించినవే. ప్రేమ సహజమైనది. అందుకే కులమతాలకు, దేశాలకు అతీతమైనది. నా దృష్టిలో ప్రేమ మార్గంలో నడిస్తే మనిషి తన గమ్యానికి చేరుకుంటాడు. లక్ష్యాన్ని సాధిస్తాడు. సత్యాన్ని చూడగలుగుతాడు. ఈ దారిలో వ్యక్తికి ఒంటరిగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సత్యాన్ని జూడగలగడం వ్యక్తిగతమైనది. సామూహికంగా సత్యాన్ని చూడలేరు. ఇక ముందు చూడరు. అందువలన సమూహం, సముదాయం, సమాజం పెట్టిన నియమాలను పాటిస్తే సత్యాన్ని శోధించే వ్యక్తి దారికి అవి అడ్డంకులు అవుతాయి. సత్యాన్ని పొందడానికి ప్రేమ కూడా వ్యక్తికి ఒక సాధనమే. ఇదే చివరికి విశ్వసాధన రూపాన్ని పొందుతుంది. ఉదాహరణకి సగుణ భక్తి రూపంలో ఉన్న అవతారవాదం, నా దృష్టిలో అదే మానవతా వాదం లేక ప్రేమ వాదం.”

“అదెట్లా?” నీలిమ అడిగింది.

“ఈశ్వరుడు ఎప్పుడైనా భూమి మీదకి వచ్చాడా?”

“లేదు..”

“మరయితే సగుణ భక్తి అంటే అర్థం ఏమిటి? ఎవరో భక్తుడు ప్రేమ తన్మయత్వంలో, ఆ క్షణాలలో ఎవరో మనిషిలోనే ఈశ్వర తత్వాన్ని చూసాడు. తులసీదాసు రాముడిలో, సూరదాసు, మీరాబాయి కృష్ణుడిలో అందవలన వ్యక్తి వ్యక్తిగతమైన ప్రేమే ఎప్పుడు ఈశ్వర ప్రేమ లేక విశ్వప్రేమగా పరిణితి చెందుతుంది. ”

“అందుకే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను నీర్. ఈ వ్యథ్యే నీ జీవిత శ్వాసయేమో. నీవు దానినే ప్రేమ అంటున్నావు. దీని నుండి విముక్తం కావాలని కూడా నీవు అనుకోవడం లేదు. నీవు ఇంతగా మంచి కవిత్వం రాస్తున్నావంటే ఎన్నెన్ని మంచి కవితలు.. బహుశ దీనికి జనని నీ అంతరంగంలో మథింపబడుతున్న వేదనయేనేమో. ఈ వ్యథ విరిగిన కలలు, తీరని కోరికలు వలన పుట్టినది కాదేమో.. అసలు నీ స్వభావంలోనే ఈ క్షోభ, ఈ వ్యథ ఉన్నాయోమో.. అంటే ఇది నీలో ఉన్న సహజమైన గుణం లేకపోతే నీ ఆత్మ ఎంత విశాలం అయి ఉండాలంటే సంపూర్ణ విశ్వంలోని సుఖదుఃఖాలకి అది అద్దం అయిపోయి ఉంటుంది. అందువలనే మనిషిలోని మూడు రకాల బాధలని – బావాలని వ్యక్తం చేసే కవిని నీవు – దైహిక మానసిక, ఆధ్యాత్మిక వేదనకి ప్రతీకవి నీవు. ఈ మూడు నీ యాత్రపథానికి మూలం. ఇవి నిన్ను ప్రేమ కరుణల గమ్యం వైపు తీసుకుని వెళ్తున్నాయి.”

“తెలియదు నీలూ! అసలు వీటిని స్వయంగా అర్థం చేసుకునే శక్తి నాలో లేదు. నేను అసమర్ధుడిని.”

“నీర్! అసలు నీలో ఉన్న వ్యథ ఏమిటంటే నీకు ప్రాప్తించిందేదో నీవు ప్రోగు చేసుకుని ఉంచుకోలేవు. ఏది ప్రాప్తించిందో లేదో దాని కోసం తపన పడుతావు. వెంపర్లాడుతావు. ఆమె నిన్ను వదలదు. ఆప్రాప్యం దొరకని దాని పట్ల ఉంటే మోహం ప్రాప్తించిన అందిన సుఖాలని భోగాలని అనుభవించనీయదు. మన కలయిక విషయంలోనే చూడు, నన్ను కలవడానికి నీవు ఎన్నో సార్లు వాయిదా వేసావు. ఎందుకంటే నీవు సత్యాన్ని ఎదుర్కున లేవు. పైగా నీ దగ్గర నాకన్నా అమూల్యమైన వాస్తవికత ఏదో ఉండి ఉండాలి. నీవు ప్రేమిస్తున్నావు కాని నీవు స్పర్శించడానికి కూడా భయపడుతున్నావు. ఎందుకంటే నిన్ను ఎప్పటికీ కట్టి పడేస్తుందేమోనన్న భయం నీలో ఉంది. ఎందుకంటే నీవు ఎప్పుడు నడుస్తూనే ఉండాలనుకుంటాను. ఒక చోటే నీవు ఉండలేవు. గతి నీ స్వభావం. విరామం నీకు ఏ మాత్రం ఇష్టం లేదు. నీవు నిరంతరంగా ప్రయాణించాలనే అనుకుంటున్నా. కాబట్టి నీకు ఒక గమ్యం లేదు. ఒక లక్ష్యం లేదు. కేవలం క్షితజమే నీ గంతవ్యం. క్షితిజం మోసం చేస్తుంది. ఎదురుకుండా కనిపిస్తుంటే కాని చేతికి అందదు. ఎప్పుడు అది అప్రాప్తమే. అందువలననే నీ కవితలు నాకు బాధ కలిగిస్తాయి. ఎందుకంటే వీటిలో నీ స్వాభావం కనిపిస్తుంది. లక్ష్యం క్షితిజమే అన్న సత్యాన్ని కూడా నీవు స్వీకరించ లేకపోతున్నావు. అందువలననే పొందడం (ప్రాప్తించడం) పోగొట్టుకోవడం అనే వ్యాపార భాషలో ఆలోచిస్తూ నీవు వ్యథ చెందుతున్నావు. ఈ బాధ, ఈ క్షోభ అందుకే. అందుకే నీవు నీ ఈ ప్రేమ ఎన్నాళ్ళు సాగుతుంది? అని రాసావు నీర్! గుర్తుందా?”

“అవును నీలూ! రాసాను గుర్తుంది నాకు. కాని ఏ పదాలలో దాన్ని పట్టుకోవాలి, వదలాలి, పొందాక దాన్ని పోగొట్టుకున్నప్పుడు పడే బాధని? ఉఫ్! మాట మాటకి పొందడం పోగొట్టుకోవడం, దాని వలన కలిగే నిలవనీయని బాధ, క్షోభ, వేదన.. భరించలేను నీలూ! భరించలేను..”

“కాని నీర్! ఆ పోగొట్టుకోవడం – పొందడం, పొందడం – పోగొట్టుకోవడం ఇదే జీవితం కదా? దీని పేరే జీవితం. మన కలం అమూల్యమైన తారలని ఆడుకోవడం కోసం ప్రపంచంలోని పొగమంచులో, ఎండలో పారేయడం కూడా ఎంతో బాధాకరమైనదే.. అయినా సరే.. మనం ఈ జీవితపు ఆట ఆడాలని బయలుదేరినప్పుడు పోగొట్టుకోవడం పొందడం.. జయాపజయాలని ఒక ఆటగాడి లాగానే చూడాలి.. దీని లెక్కలు ఎందుకు? ఏది ప్రాప్తమో ఎంత వలకు ప్రాప్తమో దాన్ని అనుభవించకుండా ఎందుకిట్లా వంచితులం కావాలి చెప్పు?”

“ఇది క్షణ-జీవి జీవితత్వం కాదా? అసలు క్షణంలో జీవించడం, ఎంత మంది జీవిస్తారు చెప్పు? అందరికి ఇది సాధ్యం కాదు. దీని కోసం కూడా ఒక ప్రత్యేకమైన మానసిక స్థితి అవసరం ఉంటుంది. ఈ సెట్-అప్ ఎంత మంది చేసుకోగలుగుతారు చెప్పు? ఏ క్షణంలో ఏదైతే ఎవరి వలన లభిస్తుందో దాన్నే ప్రసాదం అనుకుని సుఖంగా ఉండటం అన్నది బహుశ నా స్వభావంలో లేదేమో.. ఇది నా ప్రవృత్తికి అనురూపం కాదేమో..”

“చూడు నీర్! దీనికి సమాధానంగా నా ప్రవృత్తి గురించి చెబుతాను. నాది స్వతంత్రంగా ఉండే స్వభావం. అందువలన నాకు ఏదైనా హాని జరిగినా బాధ పడను. ఎందుకంటే ఏదైతే నన్ను ధనవంతరాలిగా చేస్తోందో అది నాకు బయటవాళ్ళ వలన లబించలేదు. అది నా లోపలే ఉంది. ఎవరి వల్లనో ఇవ్వబడినదేదీ వ్యక్తికి అసలూ సిసలైన పెట్టుబడి కాదు. తన సృష్టించుకున్న వాస్తవికమైన ఉపలబ్ధి అది. అదే అసలైన సంపద నీర్! నీ ఎదుట నేను ఈ అభిమాన భారం నుండి ముక్తి పొందాలనుకుంటున్నాను. నన్ను ఎందరో వ్యక్తులు ప్రేమించారు. నా దురదృష్టం నేను ఎవరినీ ప్రేమించలేకపోయాను. నేను ప్రేమించినప్పుడు నా ప్రేమ పాత్రుడు తన సంత్ లాంటి నిర్లిప్తతతో అంటే యోగుల స్వభావంతో నాకు దొరకకుండా పోయాడు. భగవంతుడిలా అప్రాప్తం అయిపోయింది ఆ ప్రేమ. అతడు దొరకని ప్రేమికుడు అయినా ఇది నా ఓటమే అని నేను ఎప్పుడు భావించను. ఎవరినైనా ప్రేమించాలి అంటే కాని ఆ ప్రేమను పొందాలన్న కోరిక లేదు. ఇదే అమితానందం ఇదే అమృతానందం. నీవు ఆ ఆనందానికి వంచితుడై పోతున్నావు నీర్..”

నీరజ్ కొన్ని క్షణాలు ఆలోచనలో పడ్డాడు. అతడి పెదవుల పై చిరునవ్వు.

“నీ అమాయకమైన భావుకత నాకెంతో నచ్చింది నీలూ. కాని ఎందుకో మరెందుకో తెలియదు.. మనస్సులో పూర్తిగా ఐక్యత కావాలి అని నేను అనుకుంటాను. అంటే అర్థం..”

“నేను అర్థం చేసుకున్నాను నీర్! నీవు చెప్పే ఆ ఐక్యతను కాని ఇంతకు ముందే చేప్పాను కదా, నేను భావుకత వలన ప్రేరేరితురాలనై ఏ పని చేయాను. కాని నీదంతా వేరుగా ఉంది. నీ ఆత్యసఖి – నీ జీవిత సత్యం, సౌందర్యం – శోధించడానికి నీకు నేను సహాయపడతాను. మనం ఒకరినొకరు గాఢంగానే ప్రేమించుకుంటున్నాం. కాని మనం నడిచే మార్గాలు వేరు. నీకు చూడని – తెలియని ఆ ఆత్మసఖిని గురించిన తపన ఉంది. నీ అన్వేషణ ఇందుకోసమే.. కాని నేను జీవితంలోని ఏకాంతాన్ని ప్రకాశంతో, సత్యంలోని యథార్థమైన జ్ఞానంతో నింపాలని అనుకుంటాను. వస్తువుల నిజరూపాన్ని చూడాలని కోరుకుంటున్నాను. మన మధ్య హృదయం – మనస్సుల పూర్ణఐక్యత ఎప్పుటికీ కాదు. అయినా మన ఇద్దరం స్నేహితులం, స్నేహితులుగానే ఉండగలుగుతాం. నీ మనస్సు తోటే నీకు పూర్ణఐక్యత లభిస్తుంది. ఎందుకంటే ఏ ద్వైతభావాన్ని మనం త్యజించడం సంభవం కాదు. ఇక్కడ తిరోభవం కుదరదు. ఒకవేళ నేను తెలుసుకోగలగితే నీ దగ్గరికి తీసుకువస్తాను. నీకు సంపూర్ణ ప్రాప్తి కోసం సహాయ పడతాను. ఏ రోజైతే నీవు మనస్ఫూర్తిగా సుఖంగా ఉండగలుగుతావో ఆ రోజు నాకు పండగ. నేను అమృతానందంతో తబ్బిబైపోతాను. కాని నీర్! ఒక మాట అడగనా?”

“అడుగు నీల్!”

“సరే అడగను, కాని చెబుతాను.”

“చెప్పు ప్లీజ్..” నీరజ్ ఇక ఆగలేకపోయాడు.

“నీవు ఏ గమ్యాన్ని అయితే శోధిస్తున్నావో అది నీకు లభ్యం అవడం అసంభవం అని నీవు తెలుసుకోగలిగితే ఎంత బాగుటుంది.” నీల్ చెప్పేసి హమ్మయ్య అని అనుకుంటూ శ్వాస తీసుకుంది. చూపులు కింద వాలాయి.

నీరజ్‌కి గుర్తుకు వస్తోంది. ఎదురుకుండా కూర్చున్న నీలూ, తనకు అర్థం అయ్యేలా చేయాలని తపన పడుతున్నట్లుగా తనకి ఎన్నోసార్లు అనుభవం అయింది.

కాని అతని ఈ కోరిక కూడా తక్కిన కోరికల్లాదే తీరనిదే. అతడి పేరు ‘నీరజ్’ కూడా ఏదో ఒక రోజు తీరని కోరికలకు పర్యాయం అవుతుందేమో అని నీరూకి అనిపించింది.

(సమాప్తం)

Exit mobile version