Site icon Sanchika

నీరు!

[dropcap]నీ[/dropcap]రెండలో నడుస్తుంటే
నీడ నా వెంటే వున్నది
నన్నంటుకునే నడుస్తున్నది
నాలో తెలీని భద్రం
అంతలోనే తలపుల అభద్రతాభావం
నడినెత్తిన కడవనెత్తి
కళ్ళెర్ర జేస్తున్న యిసుకలో నడుస్తుంటే
నీడేమ్ ఖర్మ, నా దేహమే
నా వెంట ఉండనంటున్నది
ఉప్పు గట్టిన పొర (Sweat) కాస్తా గాలితో నేస్తామంటున్నది
ఎర్రటి ఎండకి
పాదాలు నిప్పు కణికలైతుంటే
ఇసుక దిన్నెలు ఆవురావురు మంటున్నై
నా చెమటలు వాటి దాహం తీరుస్తున్నై
ఆరేడు మైళ్ళ ఆశాజనక నడక
ఉట్టి నింపుకుని ఆస్తానా లేదా ఉట్టి చేతులతో ఒస్తానా
అన్న కలవరపు నీరస నడక
తడవ తడవకీ దొరికే సారా కాదు
కడవ కడవకి మాట్టాడుకునే గుర్తుంచుకునే మంచి బంధమూ లేదు
ఆబగా నడిచి యాభై అడుగుల గుంత తవ్వి
నల్ల కుండలో నీళ్లు నింపుతుంటే, కళ్ళల్లో నీళ్లు
కుండ నిండినందుకా ఇల్లు ఉద్దరించినందుకా
తెల్వక సతమతమైతి
అసలే నల్ల కాగు
అందులో ఇమిడిపోయిన నీళ్లు
లేవనెత్తితే గాని బరువు తెల్వదు
పిల్లగాళ్ళు నీళ్లు తాగితే గాని
నా మనసుల బరువు దిగదు
కన్నీటితో దాహం తీరితే జనం కష్టాలనే కోరుకోరా
తన మన బేధం లేకుండా అందరి మనసులు నొప్పియించరా

నీటి విలువ దాహానికి తెలుసు
దాహం అక్కర దారికి తెలుసు
ప్రతి నీటి చుక్క విలువ అమూల్యం
ప్రతి రోజూ తప్పదు ఈ దుర్భర సాహసం !

Exit mobile version