నీటి గోడలు – ఒక ఉత్తమ కవి ఖండకావ్యం

0
2

తెలుగు సాహితీ ప్రస్థానంలో ‘పద్యం’ ఆత్య స్థానంలో నిలబడి అగ్రతాంబూలం అందుకున్న అద్భుత ప్రక్రియ. పూర్వకాలపు మహోన్నత కవులు పద్యమును ప్రధాన సాధనంగా తమ పాండిత్య ప్రకర్షతో భగవంతుని పూజించారు. రాజులను ప్రస్తుతించారు. గౌరవ స్థానంలో ఉన్న వారిని అభినందించారు. విదేశాల నుండి పోటీదారులుగా వచ్చిన పండితులను ఓడించి గెలిచారు. తమ వంశ స్త్రీలతో, నర్తకీమణులతో సరాగ సంభాషణలు చేశారు. శత్రువులను విశేష సమాస పద గుంభనలతో తెగిడారు. పద్యాన్ని నమ్ముకుని రాజుల చేత అగ్రహారాలను బహుమతులుగా పొందారు.

అన్ని జాతుల పద్యాలను తమ రచనలలో సృష్టించి రచన కొనసాగించడం అందరికీ సాధ్యం కాదు. వ్యాకరణం పట్ల గట్టి పట్టు కలిగి తాను చేస్తున్న వృత్తికి తనలోని ప్రవృత్తికీ సమతుల్యత పాటిస్తూ రచన చేయగలిగిన అసాధారణ ప్రతిభావంతులు కొందరే ఉంటారు. అటువంటి పండితోత్తముడు కీర్తిశేషులు విద్వాన్ కాకుమాను డేవిడ్ గారు.

ఈ కవితా సౌరభాన్ని అంటర్నెత్రంతో పరిశీలిస్తే ఆర్తితో యెహోవా దేవుని ప్రార్థించిన ఆశ్రితుల ఆర్తనాదాలు

‘నీటి గోడలు’లో ప్రతిధ్వనిస్తూ ఉంటే… ‘ప్రబోధం’తో తమ అస్పృశ్యతా దినములు తొలగిపోతాయనే ఆశాభావం వెల్లివిరుస్తుంది పాఠకులకు. ‘మిమ్ములను ఎన్నడు వీడను’ అనే ఆత్మస్థ్యైర్యపు వాణి ‘దివ్యవాణి’ ద్వారా మనకు అవగతమవుతుంది.

ఆగక సాగిరమ్ము తనయా!నిను గాచుచు వెంట నుందునీ
వేగెడు దారి కడ్డమగు నెట్టగు పర్వత రాజికిన్ మహా
సాగర సంచయంబునకు సాదృశ దుఃఖ దురంతవేదనల్
నీ గమనావరోధముగా నిల్చునె వెంట యెహోవ యుండగన్ !

“నీకు ఎటువంటి అవరోధాలు ఎదురైనా నిన్ను గమనిస్తూ నీవెంటనే ఉంటాను’’ అని సాక్షాత్తూ యెహోవా అభయ మిచ్చినట్లు తెలిపిన వారి పద్యం వినడానికి శ్రావ్యంగానే కాదు అలాటి పదాలతో హృద్యంగా ఉంది కదూ…

‘రుధిర’ ప్రాశస్త్యమ్ ‘దివ్య హృదయము’లో ఆవిష్కృతమవుతుంటే ‘ఆవేదన’ ఖండికలో శకుంతల ఒడిలోని బిడ్డతో పడుతున్న మానసిక వేదనను వర్ణించిన తీరు మనసు కలిచివేస్తుంది.

“చందురుని మించు నందాల చిందుమోము
కందిపోయెను గాదె నా కన్నతల్లి
వెన్నెలను మించు మిగుల బ్రసన్నమైన
దృష్టి సరముల గురిసే రోదింపకమ్మ!”

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, గుర్రం జాషువా, జవాహర్ లాల్ నెహ్రూ వంటి మహనీయులపై శ్రీ డేవిడ్ గారు వ్రాసినవి ఆణిముత్యాల్లాంటి పద్యాలు నిత్య నక్షత్రాలు.

‘ఉగాది’ రాకతో జీవితం నందనవనం అవుతుందన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే కరుడుగట్టిన ఎన్నో సమస్యలను పరిష్కారం దిశగా పరిశీలించమని తన పద్య కవితా సంపత్తితో ప్రస్ఫుటించిన తీరు అభినందించ వలసిందే.

ఎంతకాలానికేనియు నించుకేని
ఆర్పునోదని చిక్కుసమస్యలెన్నో
కరడుగట్టి యన్నవి వానిగాంచుమన్న
వీలు మిగిలిన మీ పరిపాలనమున!!!

ప్రపంచ కుష్టురోగ దిన సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనము నందు కవి కలం నుంచి జాలువారిన కవితా ఝరిలో కుష్టు వ్యాధి గ్రస్తుల పాలిట సానుభూతికి కన్ను చమరించక మానదు.

కట్టగా బట్టలేదు నినుగట్టాను జానేడు తావులేదు నా
పొట్టకు నింట గంజియునుబుట్టదు ముట్టరు ఆలుబిడ్డలున్
కట్టాడు కుశ్తిరోగినాయి కాలము బుచ్చుట చూడజూడ నా
మట్టుకు భారతావని యమాలమై కనుపట్టు నెప్పుడున్!!!

స్థానిక ప్రజా పాలన ప్రాభవాన్ని పంచాయతీరాజ్ వివరించిన తీరు హర్షదాయకం బంగ్లాదేశ్ సమస్యలు ఆనాడు చోటు చేసుకున్న దృశ్యాలు వర్ణించిన తీరు చదువరులకు మానసిక అనుభవమై తీరవలసిందే.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ పరిపూర్ణ పండితులు తమ రచనా పటిమను సరితూచగల ‘’తులసిదళపు’’ ఖండిక – వీరి సమస్యాపూరణలు. దత్తపది, దత్త పాదము, పృచ్ఛకుడు కోరిన సన్నివేశ దృశ్యాన్ని కోరిన వృత్తంలో ఛందోబద్ధంగా పూరించిన శ్రీ కాకుమాను డేవిడ్ గారి పాండితీ పరిణితికి ‘విద్వాన్’ అను బిరుదు సర్వవిధాల సమతూకమే.ముఖ్యంగా ఒకే దత్త పాదానికి వేర్వేరు భావాలతోఅల్లిన పద్యాలు వారి క్రమశిక్షణలో ఒదిగిన విద్యార్థుల్లా కనిపిస్తాయి.

‘రాజు జీవించు రాతి విగ్రహములందు
సుకవి జీవించు ప్రజల నాలుకల యందు…’ అని వచించిన స్వర్గీయ గుర్రం జాషువాగారు గారు తన ఆశీర్వాదం అందించే విధంగా తెలుగు సాహిత్యానికి తన సాహితీ కవితా సౌరభాన్నిఅందజేసిన చిరంజీవి డేవిడ్ గారు. కవిగా, తెలుగు పండితుడిగా జన్మ సార్థకత పొందిన మహోన్నతుడు.

బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రయోక్త అయిన లయన్ ఏం.జె.ఎఫ్. కాకుమాను సైమన్ పాల్ తన తండ్రి గారి శతజయంతి కానుకగా ‘నీటి గోడలు’ అను పేరిట సమాజానికి తండ్రిగారి పద్యసౌరభాలను వెదజల్లే ప్రయత్నం చేయడం కడు శ్లాఘనీయం. అడిగిన డబ్బు ఇవ్వలేదని, బతికి ఉండగానే వాటాలు పంచలేదని కన్న తల్లి తండ్రులనే దునుమాడే పిల్లలున్న ఈ సభ్య ఆధునిక సమాజంలో కేవలం వ్రాతప్రతులుగానే మరుగున పడిపోయిన తన తండ్రి సాహిత్యాన్ని తండ్రి గారి ప్రియ శిష్య బృందానికి ఈ విధంగా అందజేయాలనే సంకల్పంతో పుత్రునిగా వారి రుణం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా వేలాది రూపాయలు ఖర్చుపెట్టి పుస్తకరూపాన్ని సంతరింపచేయడం ఆదర్శనీయం, అనుసరణీయం, అభినందనీయం, బహు ప్రశంసనీయం. పులి కడుపున పులే పుడుతుంది అన్న సత్యాన్ని మరొకసారి మనకి పునరుక్తి కావడం యాదృచ్ఛికం. ఈవిధంగా కన్నతండ్రికి నూలుపోగంట రుణం తీర్చుకున్న కొడుకుగా శ్రీ సైమన్ పాల్ ఎందరో యువకవులకు ఆదర్శం అని చెప్పకతప్పదు.

అనేక సమస్యలతో నిత్యమూ కొట్టుమిట్టాడుతున్న సామాన్యులకు ‘’సమస్యాపూరణం’’ అంటేనే తెలియని పామరులకూ అర్ధమయ్యే రీతిని వారు పూరించిన ఒక సమస్యాపూరణం ఒక మచ్చు తునక.

సమస్య : చెడు దైవంబు నుతించి, గొల్చిన గదా – సిద్ధించు వాంఛార్ధముల్

సమస్యా పూరణము :
కడుభక్తిన్ దలిదండ్రులన్ గురులనాకాశాసనుం గోల్చి కా
మూడు క్రోధాధిగ శత్రులార్వూరను నామూలాగ్రముంద్రుంచునా
తాడు దీనా వను భక్తవత్సలుని సంత్రస్తాత్ముడై వేద బ్రో
చెడు దైవంబు నుతించి, గొల్చిన గదా – సిద్ధించు వాంఛార్ధముల్!!!

“సీస పద్య రచనలో శ్రీనాధునిగా, దండక రచనలో పోతన-పింగళ సూరణాలుగా ఈయన మూర్తి, హృదయగోచరం అవుతుంది ఎవరికైనా” అని, విశ్రాంత ప్రాచ్య కళాశాల అధ్యక్షులు, పశ్చిమ గోదావరి జిల్లా పద్యకవితా సదస్సు అధ్యక్షులు డా. భారతం శ్రీమన్నారాయణగారు నుడివినా, “వారి రచనల్లో నవనవోన్మెష రచనా విధానం ఉంది. ‘ఉగాది’ కవితా ఖండికలో సమాస భూయిష్టమైన ప్రయోగాలతోపాటు, తెలుగు వారి సాంప్రదాయాలను పద్యానికెక్కించిన ఘనాపాటి శ్రీ డేవిడ్ గారు” అని నేషనల్ దలిత్ యూనివేర్సిటీ ఆఫ్ ఇండియా వైస్-చన్సిలర్ ప్రొఫెసర్ గుజ్జర్లమూడి కృపాచారి గారు ప్రస్తుతించినా, “అస్పృశ్యతా దురాచారాన్ని ఖండిస్తూ పెక్కు సందర్భాలలో వీరు కవితా ఖద్గాన్ని ఝుళిపించిన సహజాకవి” అని ఆంధ్ర గీర్వాణ శాఖ అధ్యక్షులు, విశ్రాంత రీడర్ డా. తాటవర్తి రాజగోపబాలం గారు అభినందించినా అవన్నీ అక్షరసత్యాలన్నవాస్తవం అని ఈ పద్యకావ్యం చదివినవారికి అవగతమవుతుంది.

పితృ రుణాన్ని చంద్రునికో నూలుపోగు చందాన సమర్పిస్తున్న శ్రీ సైమన్ పాల్ జన్మకు సాఫల్యత పొందారు. ఈ ‘నీటి గోడలు’ కవితా సౌరభం పద్య ప్రియుల మస్తకాలనే కాక యావత్తు సాహితీ లోకాన్ని రంజింప చేస్తుందన్నది నిర్వివాదాంశం. భౌతికంగా మన మధ్య లేకున్నా శ్రీ కాకుమాను డేవిడ్ గారి ఈ పద్య కవిత సౌరభం వారి పాండిత్య విద్వత్తుకు నిశ్చయముగా ‘పునరపి జననమే’.

***

నీటి గోడలు
(డేవిడ్ పద్యహారము)
రచన: కీ.శే. ‘విద్వాన్’ కాకుమాను డేవిడ్
వెల: రూ.50/-
ప్రతులకు:
Ln. MJF. కాకుమాన్ సైమన్ పాల్,
1-8-1/205, శ్రీ సాయి టవర్స్,
రవీంద్రనగర్ కాలనీ, రోడ్ నెంబర్ 1,
హబ్సీగూడ, హైదరాబాద్ 500007.
ఫోన్: 9502644999

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here