[బాలబాలికల కోసం ‘నీతిగా ఉంటే..’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]
[dropcap]కో[/dropcap]సల దేశం రాజు ధర్మతేజ ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ప్రజల మన్ననలు పొందాడు. కానీ ఆయనకు రకరకాల దుస్తుల మీద మోజు ఎక్కువ.
అన్ని దుస్తులు ఉన్నాయి కనుక రోజూ కనీసం రెండు జతలు పోగుపడేవి. వాటిని ఉతకడానికి చాకలి ధవళయ్య రాజు గారి బట్టలను అంతఃపురం నుండి తీసుకవెళ్ళి చెరువులో ఉతికేవాడు. ఆ విధంగా ఒకరోజు రాజుగారి పట్టు బట్టలు చెరువుకి తీసుకువెళ్ళాడు. మూట లోని బట్టలు తీసి పెద్ద గోళెంలో తడుపుతుంటే అంగీ జేబులో ఏదో గట్టిగా తగిలింది! ఏమిటో చూద్దామని తీస్తే ఇంకేముంది? అది వజ్రాలు పొదిగిన హారం!
అది చూసే సరికి ధవళయ్య గుండె జల్లుమంది! దానిని తానే తీసుకోవాలని మనసులాగింది. కానీ అది తప్పు అని మెదడు హెచ్చరించింది. రాజు గారి దగ్గర తన గురించి ఉన్న మంచి పేరు పోవచ్చు అదిగాక తాను తీసుకున్నట్టు తెలిస్తే తాను శిక్షకు గురి కావచ్చు! ఇలా ఆలోచిస్తూ ధవళయ్య మనసు కకావికలమయిపోయింది! ఏది ఏమయినా న్యాయంగా ఆయన సొత్తు ఆయనకు ఇవ్వడమే అన్ని విధాల శ్రేయస్కరం అని తనకు తోచింది.
ఇక ధవళయ్య ఆలోచించ లేదు. వెంటనే హారాన్ని తీసుకుని పరుగున రాజు గారి అంతఃపురానికి వెళ్ళి సభలో ఉన్న రాజు గారిని కలసి ఆ హారం అంగీలో ఉందని చెప్పి అప్పగించాడు.
ధవళయ్య మంచితనానికి రాజుగారు సంతోషించి “నీవు కాబట్టి ఇచ్చావు ఇంత విలువైన హారం పట్ల నీవు ఆకర్షితుడవు కాలేదు, నీ మంచితనం సదా నిన్ను కాపాడుతుంది, అందుకే నీకు ఒక ఇంటిని బహూకరిస్తున్నాను” అని సభాముఖంగా చెప్పాడు.
సభలో అందరూ చప్పట్లు కొట్టారు.
చూశారా మనం మంచిగా అత్యాశ, అన్యాయం లేకుండా జీవితం గడిపితే రావలసిన గౌరవం, ఏమో ధనం కూడా రావచ్చు!
Image Courtesy: Internet