[dropcap]శ్రీ [/dropcap]దురికి మోహనరావు రచించిన 20 కథల సంపుటి ఈ ‘నీతిమాలినవాళ్ళ నీతికథలు 2’. నీతిమాలినవాళ్ళ నీతికథలు 1 పుస్తకం విజయవంతం కావడంతో ఈ రెండవ సంపుటిని వెలువరించారు రచయిత.
ఈ పుస్తకంలో – ‘జననం ఎంతటి నరకం!’, ‘కన్నీళ్ళతో పెంచిన శోకం!’, ‘ఇది కాదు నా జీవితం’, ‘ఎవనిచే మరణించు…’, ‘ప్రేమ వ్యాపారం’, ‘ఓ బిచ్చగాడి ఆత్మకథ’, ‘పశువు – బలిపశువు’, ‘నవమాసాల నరకం’, ‘ఒంటి రెక్క పక్షి’, ‘చెదపట్టిన శీలం’, ‘తాళి – ఎంత ‘ఎగ’తాళి?’, ‘నీచులు చెప్పే నీతులు’, ‘అడవి కాయని వెన్నెల’, ‘ఆమెన్’, ‘కొన్ని పేజీలు లేని డైరీ’, ‘వెన్నెల వేడి సెగలు’, ‘కోరికలు గాడిదలై పరుగెత్తితే’, ‘కలువని రైలు పట్టాలు’, ‘సతీలీలావతి కహానీ’, ‘ఓయీ బ్రాహ్మణోత్తమా!’ – అనే కథలు ఉన్నాయి.
“సమాజంలోని అన్ని రంగాలలో జరుగుతున్న దగాకోరు విధానాలను కథలుగా మీకు అందిస్తున్నాను” అన్నారు రచయిత.
ఒక్కో కథకీ ఒక్కో ప్రముఖ వ్యక్తి సంక్షిప్త ముందుమాట వ్రాయడం విశేషం!
~
“చెత్త ఎత్తడానికి ఎవ్వరైనా ముందుకొస్తారు. కాని మురికి తీయడానికి తక్కువ మంది ముందుకొస్తారు. అలాగే సమాజంలోని కుళ్లు చెత్తను ఎత్తడానికి రచయితలు ముందుకొచ్చారు. కాని నేటి సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలు, అక్రమ సంబంధాల మురికిని కడగడానికి తక్కువమంది రచయితలు ముందుకొచ్చారు. అందులో శ్రీ మోహనరావు దురికి ముందున్నారు. నేటి సమాజాన్ని ప్రక్షాళణ చేయడానికి ఇలాంటి రచయితలు, ఇలాంటి రచనలు రావాలి. అయితే కడుపుబ్బా నవ్వించే ఈ రచయిత ఏడిపించగలడని ఈ కథ చదివాక తెలుస్తుంది.” అన్నారు ప్రసిద్ధ రచయిత శ్రీ అంపశయ్య నవీన్ ‘జననం ఎంతటి నరకం’ కథ గురించి.
~
“ఈ కథ మొదలు పెట్టగానే ఇందులో కొత్తదనం ఏముందీ అనిపించింది. కాని మొత్తం చదివాక నాకు మతిపోయింది. మోహనరావు దురికిగారు ఏ కథ రాసినా, ఏ నవల రాసినా ఖచ్చితంగా అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తారు. కథను చుట్టిపడేయరు. ఓ జక్కన్నలా, ఓ రవివర్మలా కళాత్మకంగా తన పదాల గారడీతో తీర్చిదిద్దుతారు. ఎంతపాత కథ తీసుకున్నా కొత్తగా, సరికొత్తగా అద్భుతమైన తనదైన శైలిలో అణువణువునూ కళాఖండంలా చెక్కుతారు. నమ్మరా? అయితే ఈ కథ చదివితే మీరూ నమ్ముతారు.” అన్నారు ప్రముఖ నాటక, సినీ రచయిత శ్రీ వడిమింటి నరసింహారావు ‘ప్రేమ వ్యాపారం’ కథకి తన ముందుమాటలో.
~
“ఓ ఉత్తమ రచయిత ఎంతగా నవ్వించగలడో అంతే ఏడిపించగలడని ఆస్కార్ వైల్డ్ చెప్పింది అక్షరాల నిజమనిపించింది, ‘నీతిమాలినవాళ్ల నీతి కథలు’ మొదటి భాగం పుస్తకం చదివాక. ఇప్పటి వరకు వందలాది హాస్య, వ్యంగ్యం కథలు రాసిన దురికిగారు కంటతడి పెట్టించే ఇలాంటి కథలు రాయడం ఆయనకే చెల్లింది. ఈ కథ చదివాక నా కళ్లు చెమర్చాయి. నా గుండె బరువెక్కి గంట వరకు మామూలు మనిషిని కాలేకపోయాను. ఇది ఓ యథార్థ జీవితం. ఆ ఇన్సిపిరేషన్లో ఈ కథను హృదయవిదారకంగా, నాటకీయంగా రాశారు” అన్నారు ‘ఓ బిచ్చగాడి ఆత్మకథ’ కథకి వ్రాసిన ముందుమాటలో సుప్రసిద్ధ రచయిత్రి కుప్పిలి పద్మ.
~
“మొత్తం కథ గుక్క తిప్పుకోకుండా చదివించారు మోహన్ రావు దురికి గారు. కొత్త కథ కాదు కానీ గొప్ప శిల్పంతో కత్తివేటులా వత్తి చెప్పారు. తప్పు చేసిన ఆడదానికి ప్రతి మగాడు శత్రువులా ఎలా మారతారో, ఆడాళ్ళ మీద ఎన్ని రకాలుగా అన్యాయం జరుగుతోందో చక్కగా చెప్పారు” అన్నారు ‘ఒంటి రెక్క పక్షి’ కథ గురించి సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి.
~
“సినిమా కథకు హీరో ఎంత ముఖ్యమో – కథకు శైలి అంతే ముఖ్యం. ఈ విషయం తెలిసిన మోహనరావు దురికిగారు అటు ప్రేక్షకులకు, ఇటు పాఠకులకు చేరువయ్యారు. ఒక చేత్తో సినిమా కథలు, మరో చేత్తో సాహిత్యం కథలు రాస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుపొందారు. ఈ పుస్తకంలోని ఒక్కొక్క కథ ఆయన స్థాయిని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తోంది. మహిళల మీద జరుగుతున్న అన్యాయాలను సినిమాలో చూపించలేని ప్రతిసారి ఇలాంటి కథలు రాసి మగాళ్ల కళ్లు తెరిపిస్తుంటారు. అటు కమర్షియెల్ ఎలిమెంట్ పోకుండా, ఇటు సామాజిక స్పృహతో ఇలాంటి రచనలు చేయడమంటే రోడ్డు మీద కూర్చుని తపస్సు చేయడంలాంటిదే. నాగుల లచ్చింబయ్ పాత్ర, యాస, భాష, నడక, నడవడిక చదివితే పదాలు ప్రాణం పోసుకుని కళ్లముందు కదలాడుతున్నట్లు ఉన్నాయి. ఇలాంటి ఉన్నతమైన కథలు తెలుగు సాహిత్యంలో కలకాలం నిలిచిపోతాయి.” అన్నారు సుప్రసిద్ధ సినీ రచయిత శ్రీ కె. ఆదిత్య ‘చెదపట్టిన శీలం’ కథని రాసిన ముందుమాటలో.
~
“నాటి సమాజానికి నేటి సమాజానికి బ్లాక్ అండ్ వైట్ సినిమాకు, డిజిటల్ సినిమాకున్న తేడా వుంది. ఆ తేడాను శ్రీ మోహనరావు దురికి చక్కగా రాశారు. నేటితరం యువత తమ జీవితాలను ఎలా పాడుచేసుకుంటున్నారో ఈ కథలో చక్కగా అల్లారు. శైలి గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. మంచి కథలలో ఇంది ముందువరుసలో వుంటుంది” అన్నారు ‘వెన్నెల వేడి సెగలు’ కథ గురించి సీనియర్ నటులు, ప్రసిద్ధ రచయిత శ్రీ రావి కొండలరావు.
***
నీతిమాలినవాళ్ల నీతికథలు 2
రచన: మోహనరావు దురికి
పుటలు: 192
వెల: ₹ 125/-
ప్రచురణ, ప్రతులకు:
సాహితి ప్రచురణలు,
33-22-2, చంద్రం బిల్డింగ్స్,
సి.ఆర్ రోడ్, చుట్టుగుంట విజయవాడ – 520 004
ఫోన్: 0866 – 2436642 | 43
Email: sahithi.vij@gmail.com