[dropcap]అం[/dropcap]దరి కన్నా వేరైన నీవెవరు, నీవింతలా నా తలపులలో నిండిపోయి,
నా కష్టసుఖాలను సైతం నీతో పంచుకొనే విధంగా చేసిన నీవెవరు?
నేనెంత విసుక్కున్నా, కసురుకున్నా, ఎందుకు నా తలపుల వెన్నంటే తిరుగుతావు?
ఎందుకు నాకేదిష్టమో గుర్తుంచుకొని మరీ తెచ్చి నన్ను వేధిస్తావు?
నేనంతగా వదలమన్నా నా చేయి వదలకుండా, నా కన్నుల నీరును తుడిచేందుకు ప్రయత్నిస్తావు!
ఏంటి నీకూ, నాకున్న బంధం, అనుబంధం?
అది కూడా నా చేతనే చెప్పిస్తావు, నీకూ నాకున్న స్నేహ బంధం, దాంతో నన్ను బంధించి,
నీవే నా లోకంలా అయిపోయి, నా వారిని సైతం నీకోసం ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చి,
అంతలోనే, నీకై వగచే పిరికిదాన్ని చేసి, ఆలంబనలా నన్నల్లుకుపోయావు?
స్నేహ మాధుర్యానికి నీవు నిర్వచనమైతే, నేనీ మధురిమనవుతా,
స్నేహమే నీ రూపమైతే, నేనీ ప్రతిబింబాన్నవుతా,
స్నేహానికే నీవు తోడైతే, నే నీడనై నిలువనా,
అందుకేనేమో స్నేహానికి లేవు ఎల్లలు, కులాలు, మతాలు,
హృదయమనే ఆలయంలో స్నేహము దేవుని ప్రతిరూపమని
ఓకవి ఎప్పుడో అన్నారు కదూ. నీకు గుర్తుందా,
నా హృదయ దేవాలయంలో నిత్యం కొలిచే స్నేహదైవానివి నీవైతే,
నా తప్పొప్పులు, మంచి చెడ్డలు, కష్టసుఖాలు నీక్కాకపోతే ఇంకెవరికి చెప్పుకోనోయి.