Site icon Sanchika

ఉత్కంఠ తక్కువ అసంతృప్తి యెక్కువ మిగిల్చిన “నీవెవరో”

[box type=’note’ fontsize=’16’] “ఓ సస్పెన్స్ చిత్రానికి కావాల్సిన బిగువు, క్లుప్తత, ప్రేక్షకుడిని కట్టిపడేసే తత్త్వం లేవు” అంటూ “నీవెవరో” సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]క[/dropcap]ళ్యాణ్ (ఆది పినిశెట్టి) వొక రెస్త్రాఁ నడుపుతుంటాడు. తనే షెఫ్. పైగా చిన్న వయసులో యేదో ప్రమాదంలో కళ్ళు పోగొట్టుకున్న మనిషి. మనిషికి వొక అవయవం పని చేయకపోతే మిగతావి మరింత చురుకుగా పని చేసి మనిషిని నిలబెడతాయి. ఆ పధ్ధతిలోనే కళ్యాణ్ వినికిడి, ఆఘ్రాణ శక్తులు అతని దృష్టి లేమిని చాలావరకూ తగ్గిస్తాయి. ఇక వంటలో యెంత నైపుణ్యం సాధిస్తాడంటే అతని చేతి వంటను మెచ్చుకోకుండా వుండరు యెవరూ. అతని చిన్నప్పటినుంచీ స్నేహితురాలుగా వున్న అను (రితికా సింఘ్) అతని అండగా వుంటుంది, అతన్ని ప్రేమిస్తుంది కూడా. ఇరువురి తల్లిదండ్రులూ వీరిద్దరినీ జంటగా చేద్దామని అనుకుంటూ వుంటారు కూడా. ఈ లోగా వొక రాత్రి అతని రెస్త్రాఁ కి, అతని జీవితంలోకి వస్తుంది వెన్నెల (తాపసీ పన్ను). మొదట స్నేహం ఆ తర్వాత ప్రేమలోకి ప్రయాణిస్తుంది ఆ పరిచయం. వెన్నెల తండ్రికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇరవై లక్షల అప్పు తీసుకోవాల్సి వస్తుంది. అది చెల్లించలేని పరిస్థితుల్లో ఆ తల్లీ కూతుళ్ళుంటే అప్పులోళ్ళు రకరకాలుగా బెదిరిస్తూ వుంటారు. మర్నాడే తను ఆ మొత్తం యేర్పాటు చేస్తాను, భయపడొద్దంటాడు కళ్యాణ్. కాని అదే రాత్రి వో దారి ప్రమాదంలో స్పృహ కోల్పోయి ఆసుపత్రి పాలవుతాడు. అక్కడ జరిగిన పరీక్షల్లో అతనికి కంటాపరేషను చేస్తే చూపు తిరిగి రావచ్చని తేలుతుంది. అలాగే కానిమ్మంటారు తల్లిదండ్రులు. ఇదంతా మూడు వారాలపాటు సాగుతుంది. అప్పటిదాకా స్పృహలో లేని కళ్యాణ్ స్పృహ రాగానే వెన్నెల గురించి హైరానా పడతాడు. ఆమెకు ఫోన్ చేస్తే నెంబరు వినియోగంలో లేదని వస్తుంది. వెన్నెల యేమైంది? అతను తిరిగి ఆమెను కలవగలుగుతాడా? ఇవన్నీ ఇక్కడ వివరించ లేని మిగతా కథ.

ఆది నటన బానే వుంది. వెన్నెల కిషోర్ యెప్పట్లానే మంచి హాస్యం అందించాడు (కొన్ని చోట్ల మాత్రం హాస్యం వెకిలిగా వుంది, తన వరకూ బాగా చేశాడు). కాకపోతే సస్పెన్సు సినెమాలో హాస్యం పొదుగుతుందా అన్నది వేరే విషయం. పాటల గురించి అంతగా చెప్పుకోవడానికి లేదు. తాపసి పన్ను నటన(మైనస్ సంభాషణలు) చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ తనే చెప్పుకుందో లేక మరొకరో గాని అంత బాగా లేదు. ఇది ముఖ్యంగా సస్పెన్స్ చిత్రం. దానికి కావాల్సిన బిగువు, క్లుప్తత, ప్రేక్షకుడిని కట్టిపడేసే తత్త్వం. అవి లేవు. కారణం రెండు గంటల కంటే యెక్కువ వున్న నిడివి, సొల్లు, అనవసరమైన పాటలు, అతకని హాస్యం (బాగున్నా సరే). ఇది తమిళ చిత్రం “అందె కంగళ్” కు తెలుగు చిత్రానువాదం. దాని కంటే మెరుగ్గా తీసే అవకాశం దర్శకుడికి వుండింది. కాని రెండూ చూశాక మాతృకే బాగుందనిపిస్తుంది. ఇక నేపథ్య సంగీతం సస్పెన్స్ చిత్రానికి తగ్గట్టుగా మాత్రం లేదు. కొన్ని చోట్ల చిరాకు కలిగిస్తుంది కూడా. కాస్త శ్రధ్ధ పెట్టి వుంటే చూసిన కాసేపూ బాగుందనిపిచేలా వచ్చుండేది చిత్రం.
తెలుగు లో సస్పెన్స్ చిత్రాలకు కొదవ లేదు. యెప్పట్నుంచో మంచి చిత్రాలు మనం చూస్తూనే వున్నాము. ఈ కాలంలో ఇంకా మెరుగ్గా తీయగలిగి వుండాలి. అలా ఆశించడం బహుశా అత్యాశేమో తెలీదు. సినెమా అంత పెద్దదా! దాని గురించి నాలుగు ముక్కలు వ్రాద్దామన్నా తడుముకునే పరిస్థితి. అదీ కథ!

Exit mobile version