నెగిటివ్ థాట్స్ గుడ్‌బై!

23
2

[dropcap]ఉ[/dropcap]న్నది లేనట్లుగానూ, లేని దానిని ఉన్నట్లుగానూ భావించి కుటుంబ సభ్యులను, ఇతరులనూ బెంబేలెత్తించే వారిని ‘సైకోసిస్’ అనే మానసిక రుగ్మతతో వున్నవారిగా పరిగణిస్తారు. కుటుంబ సభ్యులకు వీరి ఆగడాలు భరించడం అలవాటయి పోవడం వల్ల వారికిది మానసిక రోగమంటే మింగుడు పడదు, కనీసం వారిని వైద్యుల వద్దకు తీసుకువెళ్ళాలని కూడా అనిపించదు. పైగా అది ఆ మనిషి యొక్క సహజ బుద్ధి అని అనుకోవడం దురదృష్ఠం, తీరా ఇటువంటి వారి వల్ల ఎవరికయినా తీవ్రాపాయం కలిగినా ఏమీ చెయ్యలేరు. ఇలా సైకోసిస్‌తో బాధపడుతున్నవాళ్ళకు ఆలోచన విచక్షణారహితంగా ఉంటుంది. అందువల్ల వారి పనులు కూడా విచక్షణారహితంగా వుంటాయి. ఇటువంటి వారి వల్ల అందరూ అపాయంలో వున్నట్లే.

ప్రపంచదేశాల్లో ఏ సమాజమయినా పేద, ధనిక అనే వర్గ భేదాలు లేకుండా ఈ సైకోసిస్ రుగ్మతకు గురయ్యే వాళ్ళు కోకొల్లలు. అది పుట్టుకతో లోపం కావచ్చు, లేదంటే వివిధ కారణాల వల్ల మారి కూడా వుండవచ్చు. ఏది ఏమయినా దీని మూలం జన్యులోపాలే, దానికి వివిధ కారణాలచేత అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వారిలో ఆ రుగ్మత ప్రబలమవుతుంది. అయితే ఇదేమీ ఎవరూ గుర్తు పట్టలేనంత, అంతుపట్టని వ్యాధేమీ కాదు. వివేకాన్ని కోల్పోయి, విచక్షణారహితంగా ప్రవర్తించేవారిని వాడుకలో సైకోలు అని సునాయాసంగా అనేస్తూ వుంటారు. కానీ వారినీ బాగుచేయించాలనీ ఎవరూ పూనుకోరు. పోనీ బాగుపడాలని తమకు తాము కూడా కోరుకోరు, అసలు గుర్తించరు. ఎందుకంటే తాము చేసేవన్నీ కరక్టే అనే ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులకు కూడా …ఆ …… ఎలాగోలా బతుకుతారు లెద్దూ, నలుగురితో నారాయణా… ఎవరికి పట్టిందిలే అంత డబ్బు ఖర్చు పెట్టి డాక్టర్ల చుట్టూ తిప్పడానికి అనేటటువంటి నిర్లక్ష్య భావన. నిజానికి ఇటువంటి నిర్లక్ష్యభావన మానసిక రుగ్మతలయందు ఉండడంవల్ల ఈ సమస్యలతో బాధపడేవారికి ఎటువంటి సహాయమూ పదుగురి నుండి అందదు.. కొన్నాళ్ళకు తాను మునిగిందే గంగ, తను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నటువంటి ధోరణి వాళ్ళలో బాగా బలంగా పాతుకొని పోయి చుట్టూ వున్న వారిపై రకరకాల భ్రమలతో, భ్రాంతులతో బాధిస్తుంటారు. విచక్షణారహితమైన వ్యామోహాలకు గురవుతుంటారు.

ఇది కేవలం సామాన్యులలోనే కాదు, బాగా చదువుకున్న వారిలో కూడా వుంటుంది. అయినా వారు చదవగలిగారు, పదుగురిలో తిరుగుతున్నారు అంటే గల కారణం? వారి చదువు, పదవి మాత్రమే వారిని సంఘంలో నిలబెడుతుంది కానీ వీరికి మంచి స్నేహితులుండరు. కుటుంబ సభ్యులు కూడా చూసీ చూడనట్లుగా వదిలేసి వ్యవహరిస్తుంటారు, దానితో మరింత వంటరితనంతో… వారి విచక్షణా రహితమైన ఆలోచనలకు అడ్డూ, అదుపూ లేకుండా ముందుకు సాగిపోతుంటారు. వీరిగురించి తెలిసినవాళ్ళు అంతంత మాత్రంలోనే వుంటూ తానొవ్వక నొప్పించక అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. సమాజ ధోరణి ఇలా వుండడంవల్ల ఈ సైకోసిస్ రుగ్మతలు గల వాళ్ళు ఏ విధంగానూ అందులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చెయ్యగలిగే పరిస్థితిలో కూడా వుండరు. కాబట్టి ఇది పూర్తిగా ఇంటివారి బాధ్యత లేదా తాము స్వయంగా తీసుకోవలసిన బాధ్యత.

సైకోసిస్ లక్షణాలున్న వ్యక్తులు ఉద్యోగాలు చేసే చోట ఎదురయినప్పుడు పరిస్థితి చాలా కష్టంగా వుంటుంది. ఉద్యోగాలు చేసే చోట అందరూ పోటీదారులే వుంటారు లేదా ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతూ టార్గెట్స్‌ని రీచ్ అయ్యే బిజీలో వుంటారే తప్ప … మానసికరుగ్మతలు  గల వాళ్ళకు వారి టార్గెట్స్ రీచ్ అవ్వడంలో వారికి సహాయసహకారాలు అందించే పరిస్థితిలో వుండరు. అప్పుడు ఈ రుగ్మత గల వాళ్ళకు మానసిక ఒత్తిడి మరింత పెరిగీ, ప్రక్కవారిని సామాన్య ధోరణిలో సహాయమడిగి పని పూర్తిచేసుకోవాలనే ఇంగితాన్ని పాటించరు.. అలా పాటించగలిగితే వాళ్ళు సహజంగావున్నట్లే లెక్క.  అలాకాకుండా వాళ్ళ రుగ్మతకు అనుగుణంగానే, విచక్షణ కోల్పోయి కష్టపడి పని పూర్తి చేసుకోగలిగే వాళ్ళమీద వారి భ్రమలను రుద్ది వారిపై అధికారులకు పితూరీలు ఇవ్వడమూ, వాటిని అధికారులు నమ్మేలాగ దొంగ సాక్ష్యాలను, రుజువులను ఏర్పాటు చెయ్యడము, ఎదుటి వారి పాడు చేసి వారు టార్గెట్స్ రీచ్ కాకుండా ఆపడము తద్వారా తాము ఏదో సాధించినట్లుగా ఆనందించడమూ చేస్తారు. వారిపై దొంగ సాక్ష్యాలను వీరే కల్పించినప్పటికీ వారి మానసిక రుగ్మత అవే నిజమని నమ్మేలా మళ్ళీ భ్రమింపజేస్తుంది. కొన్ని సార్లు ఇట్టి రుగ్మతలు వారిని ఆత్మహత్యలకు పాల్పడేలా చెయ్యడమో, లేక ఎదుటివారిని కొట్టీ, తిట్టీ చివరికి చంపేసేలా చెయ్యడమో వరకూ దారి తీస్తుంది.. ఇది అత్యంత  ప్రమాదకరమైన పరిస్థితి. సైకోసిస్ రోగులు నిలకడగా ఒక ఉద్యోగములో వుండలేరు, ఏదో ఒక పరిస్థితి కారణంగా ఎవరయినా సహృదయంతో ఆదరించి ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు ఆ వెసులుబాటుకు కాస్తంతయినా తలవంచగలిగి పనిచేసుకొని ఉద్యోగం నిలబెట్టుకోవాలని ఆలోచించరు. మళ్ళీ విచక్షణారహితమే, అదే ధోరణితో వారు సమస్యల్లో చిక్కుకొనీ, సహృదయంతో పనిచ్చిన వాళ్ళని కూడా సమస్యల్లోకి లాగుతారు. ఇటువంటి పక్ష్యంలో వారితో ఖచ్చితమైన ధోరణిలో వుండడమే సరయిన ట్రీట్మెంట్. ఆ ఖచ్చితము వారికి నచ్చకపోయినా… వారి విచక్షణారహిత ధోరణికి మాత్రము ఆనకట్ట పడుతుంది, ఆ సమయంలోనే కొలీగ్స్ సరియైన నిర్ణయాలు తీసుకొని అధికారులకు సహాయ పడగలిగినట్లయినా అనవసరమయిన కంపైంట్లు, కమిటీలు, దొంగ సాక్ష్యాలు మొదలైన వాటిలో కాలం వృథాకాకుండా ఆపగలరు. అప్పుడు ఈ రుగ్మత గల వాళ్ళలో ఏదో చిన్న మార్పు సంభవించే అవకాశము తప్పకుండా వుంటుంది. అంతే గానీ వారిని అలాగే వదిలేస్తే అందరికీ ప్రమాదమే.

అలాగే కుటుంబ వ్యవస్థ. ఈ మధ్యకాలంలో తీవ్రమైన దాడులకు, కక్ష్యా కార్పణ్యాలకు గురవుతోంది కుటుంబవ్యవస్థ. దీనికి కారణము కుటుంబ సభ్యులమధ్య గౌరవాభిమానాలు లేకపోవడము,, అహంకారమూ, మానసిక వైఫల్యము. ప్రతి ఒక్కరికీ ఆర్ధిక స్వేచ్ఛ పెరగడంతో తమ తమ తెలివితేటలను వుపయోగించి కష్ఠపడే తత్వాన్ని ప్రదర్శించి ఆర్థికంగా చాలా మంది చిన్న వయసుల్లోనే నిలదొక్కుకుంటున్నారు. ఇలా కష్ఠపడే మనస్థతత్వం లేని వాళ్ళు పెద్దరికమనో, చిన్నరికమనో బంధాలను అడ్డం పెట్టుకొని మానసిక వైఫల్యానికి గురయ్యి తాము ముందంజలో వుండాలనే రాజకీయ ఆలోచనా ధోరణిని కుటుంబంలో ప్రవేశింపజేస్తున్నారు. కుటుంబమనే కనీస అభిమానం కూడా లేకుండా వారిలోని ఏదో ఒక బలహీనతను కనిపెట్టి వాడుకొంటూ లబ్ధి పొందుతున్నారు. ఇది నేరం. ఇటువంటి నేరాలకు శిక్షలు వెయ్యడానికి ఈ భూమి మీద అసలు కోర్టులే లేవు! ఇలా సుఖపడాలనే విపరీత కాంక్షలతో మానసిక వైఫల్యాలకు గురయ్యి సైకోసిస్ లక్షణాలను పొందేవారు కోకొల్లలు.

చిన్న చిన్న మానసిక వైఫల్యాలు తగు మోతాదుల్లో వుంటే ఫర్వాలేదనిపిస్తుంది. ఉదాహరణకు కోడలు రాగానే అత్తగారి స్థానాన్ని పొందిన చాలా మంది స్త్రీలు కాస్త మానసిక వైఫల్యాలకు గురవుతారు. ఎప్పుడూ తన చుట్టూ తిరుగుతూ తాను వడ్డిస్తేనే తినే కొడుకు, కోడలు రాగానే ఆ బాధ్యతను ఆ క్రొత్త పిల్ల మీద వేస్తాడు, అది కాస్త తల్లికి నొప్పిదమే. అది సర్దుబాటయ్యే టైములో కాస్త మానసిక ఇబ్బందికి అందరూ గురయినా కొద్ది దినాల్లో సర్దుకుపోతే ఫర్వాలేదు, అంతే గానీ ఆవేశకావేశాలకు లోనయ్యి రోజూ యుద్ధాలు చేస్తూ కొడుకూ, కోడలి మధ్య అత్తగారు పడుకొని నిద్రపోయే సంగతులూ వింటున్నాము. చేతిలో కత్తిపీట విసిరి అత్తగారి రక్తం కళ్ళ జూసే కోడలిగారి విషయాలూ వింటున్నాము. కొన్ని కుటుంబాల్లో అత్తాకోడళ్ళు బాగా కలిసిపోయి అరాచకాలు, అవమానాలు, ఆ సదరు కొడుక్కీ లేదా భర్తకు తెచ్చి పెట్టి అతగాడి ఆత్మహత్యకు కారణమయ్యే ఉదంతాలూ వింటున్నాము. తనని పెళ్ళి చేసుకొని వూరుకుంటే సరిపోదూ, తాను సూచించిన తన తరపు వాళ్ళకు కూడా తన స్థానం ఇవ్వాలనీ, వారి బాగోగులు, వారి పిల్లల బాగోగులు ఈ ఒక్క అర్భక భర్త చూసి తీరాలనీ వేధించుకొని తినే అత్తవారి నుండి, పారిపోయి ఎక్కడో తలదాచుకొనే అల్లుళ్ళ గురించీ బయటపడుతున్నాయి. హోదాలో వుండే భార్యా, పిల్లలమీద సంకుచిత భావాలను పెంచుకొని, వారిని మాటలతో, చేతలతో బాధపెట్టే మగవారు కూడా ఉన్నారు, ఇది తప్పు అని ఎవరు ఎంత చెప్పినా వారు వినరు. ఈ చెడు ప్రవృత్తులన్నీ వారు వివిధ కారణాలవల్ల అలవరచుకొన్నవి. కొన్నాళ్ళకి ఒక న్యూనతా భావానికి లోనయ్యి సైకోలుగా ప్రవర్తిస్తారు. దీనికి గల కారణం సంకుచిత భావాలు మరియు సామాజిక స్పృహ లేకపోవడము. క్రొత్త వారితో జీవితాన్ని పంచుకోవాలసిన అవసరం ఏర్పడినప్పుడు ఆ క్రొత్తదనాన్ని వారు అంగీకరించకపోవడంతో అభిప్రాయ బేధాలతో సైకోసిస్ లక్షణాలకు ప్రేరేపితులవుతారు. వారు చెప్పినటుల వింటేనే తమ వారిగా గుర్తిస్తారు, లేదంటే ఇంట్లోనే శత్రువులయిపోతారు. క్షణ క్షణానికి కలిగే నెగిటివ్ సాధిస్తారు, అనుమానాలతో ఆరాలు తీస్తారు. ఒక రూపమని చెప్పడం కష్టం. సంకుచిత తత్వానికి అనంతరూపాలు. వీటన్నిటి నుండీ ఎలా వారిని తప్పించడం లేదా తప్పుకోవడం?

తప్పుకోవడానికి ముందు ప్రయత్నించాలి.. అదెలా సాధ్యం? వారి మానసిక పరిస్థితే వారికి తెలిసి వుండి వుంటే ఇలా చెయ్యనే చెయ్యముగా అని అంటారు లేదా ఎలా తెలుసుకోవడము అని ప్రశ్నిస్తారు. ఎందుకు తెలియదండీ? ఇదే విషయం మీద, ఎలా తెలుసుకోవాలి అని ప్రేక్షకులనుండి సద్గురు జగ్గి వాసుదేవ్ గారిని ప్రశ్నించినప్పుడు, ఆయన నవ్వుతూ ఇచ్చిన సమాధానమేమిటంటే, “చేతికో కాలికో సెన్స్ లేకపోవడమో లేదంటే మన ప్రమేయమే లేకుండా వాటికవే కొట్టేసుకోవడమో జరిగితే … అమ్మో కాలికి ఏదో జరిగిందనో, చేతికి ఏదో జరిగిందనో వెంటనే హాస్పిటల్‌కి పరిగెట్టమా? … అలాగే మెదడు కూడా ఒక అవయవమే.. దాని పని తీరు సరిగ్గా లేదంటే తప్పక తెలుస్తుంది. విపరీత కోపం కలిగి ఏదయినా అపాయంలో పడినా, లేక ఎవరికయినా అపాయంలో పడేసినా అదొక విచిత్ర ప్రవర్తన అని ఆ మెదడు తప్పక హెచ్చరిస్తుంది. మిగితా అవయవాలను గురించి హెచ్చరించినట్లే తన గురించి కూడా తాను హెచ్చరిస్తుంది, అలాగే విపరీతధోరణిని భరిస్తున్నవారు కూడా చెప్తారు, అది మనం పట్టించుకోవాలి, తగు జాగ్రత్తలు, వైద్యం తీసుకోవాలి”.

ఎదుటివారిని మానసికంగానో, శారీరకంగానో హింసించేటప్పుడు అది తప్పని వారికి తెలుస్తున్నా, తాము చేస్తున్న దానిని సమర్ధించే నెగిటివ్ రీజనింగుని ఆ మెదడే మరోప్రక్క తయారు చేస్తుంది. అదే నిజమని, ఆ మెదడే బలంగా వారిని నమ్మిస్తుంది. తన మెదడే తనకు శత్రువయిపోతుంది. డిఫెక్టివ్ కాగ్నెటివ్ రెస్పాన్సెస్ దీనికి కారణం. దీనివల్ల తాము చేస్తున్న పనుల మీదా, నిర్ణయాల మీదా పరిశీలనా శక్తిని కోల్పోతారు.

దురహంకారానికిపోయి, ఎవరి గురించి నన్ను భరించరు, అలా భరించకపోతే కుటుంబం అనడానికి అర్థమేముంటుందన్న మూర్ఖత్వాన్ని పాఠించకూడదు. ఇదే సంకుచిత భావం, దీనికి స్వస్తి చెప్పాలి, అప్పుడే పూర్ణారోగ్యవంతులు కాగలరు. జరుగుతున్న పరిస్థితుల మీద ఒక అవగాహన ఏర్పడడం, దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమని తాము మార్చుకోగలగడము అనేది ఒక అవసరం. లేకుంటే కుటుంబ పరిగణన నుండి బహిష్కరించబడతారు. దీనితో మరొక సమస్య వచ్చే అవకాశం వుంది, తమని బహిష్కరిస్తున్నారని కక్ష్య సాధింపులకు ఓంకారం చుడతారు. ఇది కూడా సైకోసిస్ రుగ్మతే. ఈ రుగ్మతతో బాధపడే వారిని నిరంతరం సంతోషపరచడం ఒక తప్పనిసరి విధి అయ్యి కూర్చుంటుంది. ఇలాంటి వారిని తీసికెళ్ళి కౌన్సిలింగు సెంటర్లలో కూర్చోబెడితే వచ్చే ఉపయోగమేమీ వుండదు. నిజానికి ఇది ఎవరికి వారు చేసుకోగలిగే చిన్న సమస్యే.  అదే తమ ఆలోచనలను పరిశీలించుకోవడము. అజ్ఞానమనే కిటికీని తెరిస్తే బుర్రలోని కంపు అంతా బయటికి వెళ్ళిపోతుంది.

సుఖబోదానందస్వామి సూఫీకధ ఒకటి ఇలా చెప్తారు. ఒకడు తన భార్య మీద కంప్లైంట్ చేస్తుంటాడు,ఆమె తన పెంపుడు జంతువులన్నీ ఇంట్లో పెట్టి, ఇల్లంతా వాసన కొట్టిస్తోందని. అయితే నువ్వు నీ గది కిటికీ తెరు అని సలహా ఇస్తారు అందరు. కాని అతడు “అమ్మో కిటికీ తెరిస్తే నా పావురాలు బయటికి ఎగిరిపోతాయి” అని అంటాడు. అలా అనవసరమైన వాటి మీద దృష్ఠిని సారించి అజ్ఞానమనే కిటికీ తెరవకుండా ఆ కంపును అలానే భరిస్తానంటే దానికి ఎవరు బాధ్యులు?  కాబట్టి ఆలోచనలని క్షుణ్ణంగా పరిశీలించడం నేర్చుకోవాలి. మొదట కన్న పిల్లల యొక్క వ్యక్తిత్వాలను తీర్చదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. దానికి పటిష్టమైన కుటుంబ వ్యవస్థ వుండాలి. అక్కడ లోపం వున్నప్పుడు వ్యక్తి కనీసం సమాజంలోకి వెళ్ళాకయినా, తనకు తానుగా లేదా తెలిసినవారి సూచనల ప్రకారమయినా కొంత సాధన చేసుకోవాలి. అలా కాకుండా నేనిలానే వుంటాను, నేనొక అండ పిండ బ్రహ్మాండాన్ని అంటే ఎవ్వరూ బాగు చెయ్యరు. మంచి ఆలోచనయినా, చెడు ఆలోచనయినా దానికి భాషను చేకూర్చేది మస్తిష్కమేగా. ఆ నెగిటివ్ ఆలోచనలకు తటస్థంగా వుంటూ ఒక మూడో వ్యక్తిలా మీ అంతరంగంలో ఆ అలోచనలు కూరుస్తున్న మాటలను వినండి, అదే ధ్యానము. ఆ అంతరంగంలోని మాటలను మీరు వింటునప్పుడు మీకు కలిగే అసహనం, అసంతృప్తి, చిరాకు, పరనింద, పరదూషణ మొదలైనవాటన్నిటినీ జాగ్రత్తగా సమకూర్చినప్పుడు వాటిపై ఆటోమేటిక్‌గా కంట్రోల్ ఏర్పడి వాటి నుండి విముక్తులవుతారు. ఇక ఇంతకు మునుపులా ఫ్రీగా అవి మీ పైకి సునామీలా దూకవు. అప్పటినుండీ మీలో మార్పు సంభవించడం జరుగుతుంది. ఇదంతా ఒక సాధన.. ఫ్రీగా ఆలోచనలను రానివ్వాలి, ఆపై వాటిని కంట్రోల్ చెయ్యాలి. ఈ విధంగా ఎవరికి వారు సైకోసిస్ లక్షణాలను మొదట్లో వుంటుండగానే త్రుంచుకోవచ్చు.. ఈ సాధనలో మరొక ముఖ్యమైన విషయం కంట్రోల్ చేసి ఆగిపోతే సరిపోదు ఆ కంట్లోల్డు ధ్యానాన్ని మరో మంచి మరియు క్రొత్త విషయం మీదకు మళ్ళించాలి. అదే నెగటివ్ నుండి విముక్తి.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here