~
[dropcap]కు[/dropcap]రిసి కురిసి మరలి పోయిన వాన
ఎక్కడికి పోయిందని వెతకను
మసక మబ్బులు మాట్లాడవు
నీరెండా మాట్లాడదు
తడిపి పులకింపచేసిన పరిమళమూ
ఆవిరై మాట్లాడదు
మొదటి వాన వాసన
మనసును పిలిచెళ్ళినపుడల్లా
భూమి మిగుల్చుకుందామన్న తడి
కనులలో మెరిసినపుడల్లా
ఉరుము రహస్యమేదో చెప్పబోయి
మూగబోయినపుడల్లా
గుండెలో మిగిలిపోయిన
వాన అలికిడి అలజడి చేసినపుడల్లా
పొడి బారిన నేల
ఆకాశాన్ని ఆశగా చూసినపుడల్లా
కురిసి వెలిసిన ఆనందమై
వాన తరలిపోయిందని
గ్రీష్మ మయేందుకు
ఒంటరి శిశిరాన్నౌతూ
మిగిలిన జ్ఞాపకాలను
మొగ్గలుగా పూయించేందుకు
వసంతాన్నవుతూ…