Site icon Sanchika

నేనే ఓ పాఠం…

[box type=’note’ fontsize=’16’] ఇటీవలే అస్తమించిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త పై కథనాలకి ద్రవించిన హృదయం సాక్షిగా…. ఈ కథనల్లారు పద్మకళ. [/box]

[dropcap]ఈ[/dropcap] తెల్లవారు ఝాము ఓ నిండు జీవితానికి తెరదించి వందలాది జీవితాల్ని తెల్లారుస్తుందని ఎవరైనా ఊహించగలిగారా? ప్రతిక్షణాన్ని తాకట్టుపెట్టి, పెట్టిన పెట్టుబడి పరిధులు దాటి ఎన్నో రెట్లు కూడబెట్టిన మేధస్సు, కండల్ని కరిగించి, కాసులు పండించిన కఠోర పరిశ్రమ, ఎత్తుకు పై ఎత్తు వేసి ప్రత్యర్థుల్ని చిత్తు చేసి వ్యాపారాన్ని పరుగెత్తించిన లౌక్యం, తెలివితేటలు చెప్పుకుంటూ పోతే కంటికి కనిపించని ఎన్నో ఆస్తులు….. అన్నీ ఏమయిపోయినట్టు…? ఒక్కో దెబ్బ ఇచ్చిన ఒక్కో అనుభవం…, ఒక్కో ఓటమితో ఒక్కో పాఠం…. అన్నీ మేళవించి పూలబాటగా భవిష్యత్తును మార్చుకోవాలని నిరంతరాయంగా కన్న బంగారు కలలు ఒక్క పెట్టున మట్టిపాలైనట్టేనా…?

అనుభవాల సారాన్ని రంగరించి ఎన్నో ఆటుపోట్లకు ఎదురొడ్డి, ఆలోచనల ప్రయోగశాలగా పనిచేశాక అనన్యసామాన్యమైన ఆవిష్కరణలకు నాంది పలికాక, మేనేజిమెంటును నిర్వచించాల్సిన తరుణంలో చేష్టలుడిగి, మౌనమావహించి శరీరాన్ని శాశ్వతంగా నిద్రపుచ్చుతానంటే నిస్సహాయతకు మించిన సమాధానం కనబడుతుందా ? కాలప్రవాహం ఎవరికోసమైనా ఆగుతుందా? ఒక్కో చుక్కా ఒక్కో ప్రాణమయితే, చుక్కలన్నీ కలిసిన ప్రవాహం ఏదో ఓనాడు సంద్రంలో కలవకపోతుందా? ఇక అక్కడికి చేరుకున్నాక బిందువు సింధువన్నమాట తలచుకుని ఊరట చెందటం తప్ప చెయ్యగలిగేదేమన్నా ఉందా?

ధనం, దర్పం, బలం, బలగం, సుఖసంతోషాలలో మునిగి తేలేపుడు వేదాంత స్ఫూర్తి కలగనే కలగదు. ఒక్కోటీ మనకి దూరమవుతుంటే ఒక్కో తత్త్వం అంతరాంతరాళాల్లోంచి తన్నుకుంటూ వచ్చి వేదాంతం చెప్పే స్థాయికి తీసుకెళ్తుంది.

అలాంటిది లిప్తపాటులో ఊహించని రీతిలో అన్నిటినీ ఒకేసారి కోల్పోయిన నాకు వేదాంతం, వైరాగ్యం తప్ప ఏం మిగులుతాయి?

ఏ తత్త్వం నాకు ఊరటనిస్తుంది? ఏ కథనం నా అవస్థను వర్ణిస్తుంది?

దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అపురూపంగా చూసుకున్న నా దేహం కర్కోటకుడి కంటపడి అణువణువూ కమిలిపోయిందని చెప్పనా? అమ్మ పోసిన ఉగ్గుపాలు, ఇల్లాలి గోరుముద్దలు, బిడ్డలు పంచిన కాకెంగిళ్లు, స్నేహితులు పంచిన ఆప్యాయతలు ఎన్ని రుచులు….; అమృత కలశాల్లా…? అన్నిటినీ హాయిగా ఆస్వాదించిన దేహం నిర్జీవమై కాటవేసిన కాలకూటం చేసిన పాపమో, పుణ్యమో…? అంత చక్కని నా మూర్తి రోడ్డు పక్క కుప్పలకొద్దీ పడి ఉన్న చెత్తను తొక్కి తొక్కీ సంచిలో కుక్కినట్టుగా ఓ చిన్న గోనె సంచిలో నన్ను కుదిస్తుంటే నా నరనరం నిస్తేజంగా పరాయి ఆధీనంలో కుదేలవుతోంటే ఆ మూట చుట్టూ, నా కాలయముడి చుట్టూ… ఆక్రందించే నా వాణి వాడిని ఏమీ చేయలేక ఓ వైపు నేనిక చూసుకోలేని నా రూపం మళ్లీ మళ్లీ తనివి తీరా నన్ను చూసుకుని పొమ్మంటుంటే… మరో వైపు ఎంత త్వరగా పని ముగించి, తప్పించుకోవాలా అన్న తపనలో, తొందరలో ప్రపంచాన్ని మర్చిపోయి అవస్థలు పడుతున్న మరో దేహం, ఆ దేహమంతా వ్యాపించిన దురాశ… ఛీ.. ఛీ … ఇదేనా జీవితం? ఇందుకేనా మా ఇద్దరి తల్లులు నవమాసాలు మోసి మమ్మల్ని కంది? ఈ క్షణంలో వారిలో ఏ ఒక్కరైనా ఇక్కడుంటే నాకీ నరకయాతన తప్పేదేమో… నేనున్నానో లేదో తెలియని సందిగ్ధంలో … నేను ఏమవుతానో ఖచ్చితంగా చెప్పలేకున్నా ఈ ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచానికి మరింత చేరువగా నా ప్రయాణానికి ఏర్పాట్లు మొదలుకానున్నాయని మాత్రం తెలుస్తా ఉంది. ఎందుకో నాకు ఈ బంధాలనుండి పోబుద్దికావటం లేదు. ఇక్కడే కలకాలం ఉండిపోవాలనిపిస్తుంది. నావాళ్ల మధ్య , వారి అనురాగాల మధ్య బతికిపోవాలనిపిస్తుంది. అందుకే నేనిక్కడే ఉన్నాను. తేలియాడే భావనల రూపంగా. నేనిక్కడే కూలబడ్డాను చలనం లేని మాంసపు ముద్దలా.

నీకేం అపకారం చేసానని అడుగుదామనుకున్నా, నా సర్వస్వమూ ఇచ్చేద్దామనుకున్నా… నాగొంతు పలికే లోపే నులిమేశాడు. నా కన్నుల కలలన్నీ కాలరాసేశాడు. వాడితో నాకే శతృత్వమూ లేదు.. అయినా వాడు కొట్టే ప్రతి దెబ్బలోనూ చెప్పలేనంత కసి ఉంది. ఆ కసి వెనుక పరాయి కష్టాన్ని కొల్లగొట్టే అత్యాశ కనిపిస్తోంది. రేపటి వాడి భవిష్యత్తును కొల్లగొడ్తానన్న భయం కూడా ఉంది. ఎన్నో మధురానుభూతులు తనివితీరా ఆస్వాదించిన నేను హృదయవిదారక దృశ్యంగా అస్తమించాను. అటువైపు నా ఇల్లు గుల్లయ్యింది. ఇల్లాలు కుప్పకూలింది. తల్లిదండ్రుల గొంతులు మూగబోయాయి. బిడ్డలు దిక్కుతోచక , దారీ తెన్నూ కానలేక కదులుతున్న ప్రపంచంలోంచి శూన్యాన్ని చూస్తున్నారు. ‘నాన్నా ఇక లేవా…?’ అంటూ వాళ్ల గుండెఘోష నా చెవుల్ని బద్దలు చేస్తోంది. పాణిగ్రహణం చేసి, ఇన్నాళ్లూ సావాసం చేసి చెప్పాపెట్టకుండా దూరమైన నా రూపం కేసి నా అర్థాంగి విషణ్ణ వదనయై … చూస్తూ నాకన్యాయం చేసిపోయావేమని నిలదీస్తోంది. కన్నుల నిండిన కలలన్నీ ఎండిపోయి, రెప్పవాల్చలేక నేను లేని ప్రపంచాన్ని చూడలేక నా తల్లిదండ్రులు ఈ ఘోరాన్ని చూసేందుకే బతికున్నామా… అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ … ఓదార్చుకుంటున్నారు.

కాలంతో ఎంతగా పరుగులు తీసినా నాకు తెలియకుండా చాలా సహజంగానే నేను చేసిన మంచి తెలిసి తెలిసీ చేసిన తప్పుల్ని తుడిచిపెట్టిందేమో. నాలోని మంచితనం జన ప్రవాహంగా తరలివచ్చింది. నాకోసం ఇన్ని మనసులు ఆక్రందిస్తాయని ఊహించి ఉంటే వీళ్లకోసం నేనింకెంతో చేసి ఉండేవాడినేమోననిపిస్తోంది. కట్టలు కట్టలు కష్టాన్ని ధారపోసి కట్టుకున్న నా నివాసం నిత్యకళ్యాణ మవుతుందనుకున్నా కానీ నిట్టూర్పులు, ఓదార్పుల వేదికవుతుందని నాకెలా తెలుస్తుంది? అందుకేనేమో తలరాత మార్చటం ఆ బ్రహ్మవల్ల కూడా కాదనేది. దేశమంతా నా కథ పాకిపోయింది. వార్తా కథనాల్లో వాతావరణం వేడెక్కిపోయింది. నమ్మి చెడ్డ వ్యాపారవేత్త.. అంటూ.. అవును నేను నమ్మి చెడ్డ వాడినే. కోట్ల కొద్దీ ఖరీదు చేసే సొత్తును వెంట తీసుకెళ్తూ ఏ భద్రతా ఏర్పరచుకోలేకపోవడం నిజంగా ఓ చిత్రమే. నేరాలు మోసాల సంగతి నాకు తెలియకపోవడం కారణం కాదని మీకూ తెలుసు.

అయినా అంతరంగంలో ఏదో మూల చిన్న ధీమా. నా తెలివితేటలపై నాకున్న అపారమైన నమ్మకం. ఆ నమ్మకమే నన్ను నిలువునా దహించింది. ఆ నమ్మకమే ముక్కూ మొహం తెలియని వాడి ముందు నా వివరాలన్నీ సెల్ ఫోనులో చెప్పించింది. నా చరిత్ర పసిగట్టిన వాడిలో లేని ఆరాటాన్ని పుట్టించింది. నేల తల్లి ఒడిలో నా చిరునామాని చెరిపేసింది. ఈ దావాగ్ని ఎపుడో పుట్టింది. వేల జీవితాల్ని దహిస్తూనే ఉంది. అయినా నమ్మేవాళ్ల సంఖ్యా తగ్గదు, నమ్మక ద్రోహం చేసే వాళ్ల సంఖ్యా తగ్గదు. కాబట్టే పత్రికల నిండా నేరాలు, ఘోరాలు. మీ లాగే నేనూ చాలాసార్లు అనుకున్నా.. ప్చ్ … రోజు రోజుకీ దారుణాలు పెరిగిపోతున్నాయి అని. అంతేకదా… ఘోరాలు పెరుగుతూనే ఉంటాయి… కళ్లముందు ఘటనల్ని చూసి కూడా కనువిప్పు కలగనపుడు, పాఠాలు వల్లించే నోళ్లన్నీ అలక్ష్యంతో, అజాగ్రత్తతో తమని తాము కోల్పోతూ ఇతరులకు పాఠంగా మారుతూనే ఉంటాయి.. నాలాగే….

Exit mobile version