Site icon Sanchika

నేనెందుకలా చేశాను?

[శ్రీ బివిడి ప్రసాదరావు రాసిన ‘నేనెందుకలా చేశాను?’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నా[/dropcap]కు ఉద్యోగం వచ్చింది.

ఎగిరి గంతులేసాను.. పిచ్చి పిచ్చిగా డాన్స్ చేసాను.. అద్దం ముందు చేరి కాలర్ ఎగర వేసాను..

ఇవన్నీ ఉద్యోగం వచ్చిందని కాదు.. నా ఆశయం నెరవేరబోతుందని.

గది లోంచి హాలు లోకి వచ్చాను. అమ్మా నాన్నలని పిలిచాను.

వాళ్లు వచ్చారు.

“ఆన్‌లైన్‌లో చూసాను. నేను జాబ్‌కి సెలెక్ట్ అయ్యాను. ఆర్డర్స్ రావడమే తరువాయి.” చెప్పాను.

వాళ్లు ‘కంగ్రాట్స్’ చెప్పారు.

నేను ‘థాంక్స్’ చెప్పలేదు.

“కూర్చుంటే మీతో మాట్లాడాలి” చెప్పాను.

వాళ్లు సోఫాలో కూర్చున్నారు. వాళ్లకి ఎదురు సోఫాలో నేను కూర్చున్నాను.

“పోస్టింగ్ ఎక్కడో తెలియదు. అందుకు నేనెక్కడికి పోయినా మిమ్మల్ని నాతో పాటు తీసుకుపోను.” చెప్పాను.

వాళ్లు నన్నే చూస్తున్నారు.

“చెప్పొచ్చేది.. మీకు ఇంత ఇల్లు అనవసరం..” చెప్పాను.

నాన్న అడ్డై.. “ఇది అలవాటైన ఇల్లు. పైగా పిత్రార్జితం” అన్నాడు.

అంతలోనే.. “ఈ ఇల్లు అలవాటు ఐపోయింది. ఇరుకిరుకు మాకు వద్దు” అమ్మ అంది.

“ఇక కుదరదు” చెప్పాను ఖరాఖండీగా.

అమ్మ.. నాన్న.. ఒకరి మొహం ఒకరు చూసున్నారు.

పిమ్మట.. “జాబ్ రాగానే కళ్లు నెత్తికెక్కినట్టు ఉంది. ఏంటా పెడసరం” ముందుగా అమ్మే తేరుకుంది.

“భాష బాగోలేదు. అంతంత పదాలు వద్దు” సర్రుమన్నాను.

నాన్న కలగచేసుకోబోయాడు.

“వద్దొద్దు. మీరు మాట్లాడకండి. మీ నోట కూడా ఏ భారమైన పదాలు వస్తాయో” అన్నాను.

“ఏంట్రా.. నీలుగుతున్నావ్. ఇన్నాళ్లూ లేంది ఇప్పుడేంటిది” అమ్మ అంది.

“ఇన్నాళ్లూ.. ఈత రానోడిలా కొట్టుమిట్టాడా. ఊతం దొరికిందిప్పుడు” తలాడించాను.

ఏమీ అర్థమైనట్టు లేదు అమ్మ.. నాన్నకి. గింజుకుంటున్నారు.

మళ్లీ తొలుత అమ్మే తెములుకుంది.

“నీ నీలుగుడు కట్టు” అంది.

“కట్టేది లేదు. ఇంకా చెప్పవలసింది ఉంది.” చెప్పాను.

వాళ్లు తిరిగి ముఖాలు చూసుకుంటున్నారు.

నా తోవన నేనున్నాను.

“నేను అమలు పర్చవలసినవి చాలా ఉన్నాయి. సో.. మీ బ్యాంక్ లోని సొత్తు నాకు అక్కర లేదు.. కానీ ఈ ఇల్లు.. నాన్నా.. ఇది మీ నాన్న సొత్తు.. అంటే నా తాత సొత్తు. మీరే చెప్పేవారు.. తాత నాకు ఈ ఇల్లు రాసాడని.. సో.. ఈ ఇంటిని అమ్మేస్తాను. ఆ డబ్బుంతా నాది.. నేను తీసుకుంటాను.”  చెప్పుతున్న నాకు అడ్డై..

“ఏమంటున్నావ్. నీకేమైంది” గమ్మున అంది అమ్మ.

“నేనింకా పూర్తిగా చెప్పలేదు” అన్నాను.

“ఇంకా చెప్పేది ఏముంది. అరె.. నీ వాటం అర్థం కాకుంటుంది” భళ్లున అంది అమ్మ.

“ఇది అమ్మేస్తే మేము ఎక్కడికి పోవాలి. పైగా.. మమ్మల్ని తీసుకుపోనని తేల్చేసావాయే” నాన్న అన్నాడు.

“ముందే చెప్పాగా. ఇకపై ఈ ఇల్లు నాది. మీరు ఏదైనా ఇల్లు అద్దెకు తీసుకొని ఉండండి” చెప్పేసాను.

అమ్మ గందికవుతోంది. నాన్న తికమకలో ఉన్నాడు. నేను స్థిరంగా ఉన్నాను.

“నీకేం పట్టింద్రా. ఏమిటీ చోద్యం” అమ్మ గోలగా అంది.

“కేకలు వద్దు. మనం ఒక్క దగ్గరే ఉన్నాంగా. మెల్లిగా మాట్లాడండి” కసురుకున్నాను.

అమ్మ ఏడ్చేస్తోంది. నాన్న తంటా పడుతున్నాడు. అమ్మని ఊరుకోబెట్టుతున్నాడు.

“సంపాదన చేతికి రాక మునుపే ఇంతలా రేగుతున్న వాడివి.. మున్ముందు మమ్మల్ని తరిమి కొడతావేమో” నాన్న చాలా సేపటికి అన్నాడు.

“మీ పిచ్చి. ఎప్పుడో ఏంటండీ.. ఇప్పుడే మనల్ని అదమాయిస్తున్నాడుగా.. విదిలించుకుంటున్నాడుగా.” అమ్మ చీర కొంగుతో ముక్కు రుద్దుకుంటుంది.

నేను నా గాడీలోనే ఉన్నాను.

“మీ ఆపసోపాలాపి ఇంకా చెప్పేది వినుకోండి” చెప్పాను.

వాళ్లు నన్ను చూస్తున్నారు.

“కన్నారు.. నన్ను ఇంత వరకు సాకేరు.. కనుక.. నా జీతంలోంచి మంత్లీ  టెన్ పెర్సంట్ చొప్పున అట్టి పెట్టి.. సంవత్సరానికి ఓ మారు మీకు చెల్లించగలను.” చెప్పాను. నా మాటలు నాకే ఎందుకో భారంగా తోచాయి. కానీ వెంటనే తల విదిలించుకోగలిగాను.

అమ్మ సర్రున లేచింది. నాన్న ఆమె భుజాలు పట్టి సోఫాలో కుదేయగలిగాడు. ఆ వెంబడే.. అమ్మని వారించబోతున్నాడు. అమ్మ విదిలించుకుంటూ.,

తన ధోరణిన తాను.. “ఓరె. ఇది తగదురా. నీకు మంచిది కాద్రా” అంటోంది.

“ఎందుకీ గగ్గోలు. నా ఆలోచన వేరు. మీ ఆలోచనే దారుణం” చెప్పాను.

అమ్మ తల బాదుకుంటోంది.

“నేను చెప్పాలనుకున్నది చెప్పేసాను. తప్పక అమలుపర్చుకుంటాను” గట్టిగానే చెప్పాను. లేచి గదిలోకి వెళ్లిపోయాను.

హాలులోనించి.. అమ్మ.. నాన్నల సొదలు.. చాలా సేపటి వరకు వినబడ్డాయి. ఆ తర్వాత మెల్లిగా ఆగిపోయాయి.

వారం రోజుల్లోనే పోస్టింగ్ ఆర్డర్స్ నా చేతికి అందాయి.

ఊరొచ్చి జాబ్‌లో చేరి పోయాను.

అప్పటికే.. అక్కడి ఇల్లు అమ్మకం పనిని మంచి బ్రోకర్‌కి అప్పగించాను. మంచి కమిషన్ ముట్ట చెప్పుతానన్నాను.

ఇక్కడ ఓ మంచి చోట ఓ ప్లాట్‌ని అద్దెకు మాట్లాడి పెట్టుకున్నాను. ప్రస్తుతం నేను ఓ హోటల్‌లో ఉంటున్నాను.

నేను జాబ్‌లో చేరిన వారం తిరక్క ముందే.. బ్రోకర్ మంచి బేరముందని ఫోన్ ద్వారా కబురు ఇచ్చాడు.

రెండు రోజులు సెలవులతో ఊరొచ్చాను. అమ్మ.. నాన్నలని మెడ్డేసి ఇల్లు అమ్మేసాను. ఆ సొత్తుని నా బ్యాంక్ అకౌంట్‌లో వేయించుకున్నాను. పండగలకు.. నా బర్త్‌డేస్‌కు అమ్మ.. నాన్నలు ఇచ్చిన కాస్తా.. కూస్తా డబ్బులను.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాచుకునేవాణ్ణి. అందుకే నా కంటూ ఓ బ్యాంక్ అకౌంట్ ఎప్పటి నుండో ఉంది.

అమ్మ.. నాన్నలకు ఓ సింగిల్ బెడ్రూం ఇల్లు నేనే అద్దెకు కుదిర్చి.. వాళ్లకి అప్పచెప్పి.. తిరిగి వచ్చేసాను.

మొదటి నెల జీతం అందేక.. అట్టిపెట్టుకున్న అద్దె ప్లాట్‌కి అడ్వాన్స్ చెల్లించి.. హోటల్ నుండి అందులోకి మారిపోయాను.

కాలం తన పనిలో తానుంది.

ఓ పండుగ వస్తోంది. స్వయంగా వెళ్లి.. అమ్మ.. నాన్నలు బెట్టు చేసినా.. పంతంతో.. వాళ్లని నేను ఉంటున్న ప్లాట్‌కి తోడ్చుకొని వచ్చాను.

ప్లాట్ లోకి అడుగు పెట్టిన అమ్మ.. నాన్నలు షాకయ్యారు. అక్కడి హాలులో సోఫాలో కూర్చొని ఉన్న తాతని చూస్తున్నారు.

నాన్న.. “నాన్నా..” అన్నాడు తాతని చూస్తూ.

నాన్నలో తడబాటు నాకు స్పష్టంగా కనిపించింది.

అమ్మ స్థితి సరే సరి..

అవును మరి.. వాళ్లు చేసింది సామాన్యమైందా.. ఘోరాతి ఘోరమైంది.

నేన పదవ తరగతిలో ఉండగా..

“నాకు ఇక్కడ కుదురు కాకుంటోందిరా.. నేను ఆశ్రమానికి పోతాను. అందుకు నాకు ముడుతున్న పెన్షన్ డబ్బులు సరిపుచ్చుకుంటానులే.” తాత చెప్పాడు.. నాన్నతో.

అక్కడే ఉన్న అమ్మ వెంటనే కలగ చేసుకుంటూ.. “మీ ఇష్టం మామయ్య గారూ” అనేసింది.

నాన్న ఏమీ అనలేదు.

“ఇది.. నా బట్టలు.. నా పేపర్స్ ఉన్న పెట్టె. నాతో తీసుకుపోతున్నాను.” చెప్పాడు తాత.

నాన్న ఆ పెట్టెను పట్టుకొని.. తాతని బయటికి తీసుకొని పోయాడు.

వెళ్తూ.. తాత నా భుజం తట్టి పోయాడు.

ఒడిలిపోయిన తాతని చూస్తూ ఉండిపోయాను.

ఆ తర్వాత.. ఇరుగు పొరుగు వాళ్ల గుసగుసల వలన నాకు తెలిసింది.. అమ్మ.. నాన్నల పోరు.. నిరాదరణ.. సూటి పోటు మాటలు.. ల్లాంటి  మూలంగానే తాత పక్కూరిలోని ఆశ్రమానికి కోరి పోయాడని. పైగా ఇందులో అమ్మ పాత్రే ప్రముఖమని కూడా తెలిసింది.

నేనప్పటికి ఏమీ చేయలేక పోయాను.

తాత గొంతుతో ఆలోచనల్లోంచి వచ్చాను.

“మనుమడి మాట కొట్టలేకపోయాను. వాడి వెంట వచ్చేసాను. మనుమడి తీరు నాకు నచ్చింది. తనకంటూ  సంపాదన పొందే వరకు గుక్కుమిక్కనక ఉండగలిగాడట. నా ఇల్లు పోయిందని మాటే కానీ.. దాని నుండి.. నా పెట్టుబడి కంటె పెద్ద మొత్తమే ముట్టింది. ఆ మొత్తంకి నా పేరున బాండ్లు తీసుకొని నా చేతిలో ఆ ఇల్లు అమ్మిన పేపర్స్‌తో పాటు పెట్టాడు మనుమడు. తిరిగి నాలో చేవ పోసాడు నా మనుమడు..” అమ్మ.. నాన్నలకి తాత చెప్పుతున్నాడు. నేనెందుకలా చేశానో అర్థమైనట్టుంది.

అమ్మ.. నాన్నల సంగతి ఏమో కానీ.. నేను మాత్రం తాత నిండుతనాన్ని మళ్లీ చూడగలుగుతున్నాను.

Exit mobile version