Site icon Sanchika

నేనెప్పుడూ ఇంతే.. ఆలస్యం చేస్తూ ఉంటాను!

[మునీర్ నియాజి రచించిన ‘హమేషా దేర్ కర్ దేతా హూఁ మైఁ’ అనే హిందీ కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Munir Niazi’s Hindi poem by Mrs. Geetanjali.]

~

[dropcap]అ[/dropcap]వును.. నేనెప్పుడు చూడూ ఆలస్యం చేస్తూ ఉంటాను!
ఎవరికైనా అతి ముఖ్యమైన విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు..
చేతిలో చేయి వేసి చేసిన బాసలు ఏవైనా ఉంటే.. నెరవేర్చాలనుకున్నప్పుడు..
నా నుంచి వెళ్లిపోతున్న వాళ్ళను ఒక కేకేసి పిలుచుకోవాలనుకున్నప్పుడు..
వాళ్ళను నా దగ్గరే ఎప్పటికీ ఉండిపోవడానికి వెనక్కి తిరిగి వచ్చేయమని
చెప్పటానికి కూడా అయ్యో.. చాలా ఆలస్యం చేస్తుంటాను.
***
చూడండి నేనెలాంటి వాడినో..
వాళ్ళకి నా అవసరం బాగా ఉన్నప్పుడు.. ఆదుకోడానికి..,
అమితమైన దుఃఖంలో ఉన్న దోస్తులని ఓదార్చడానికి..
చాలా దూరాల్లో ఉన్న ఆప్తులను కలవడానికి
ఎప్పటిలాగే ఆలస్యమే చేస్తుంటాను.
***
ఎప్పటికప్పుడు మారుతున్న అందమైన
ఋతువులలో అలా హాయిగా నడిచి వెళ్ళడానికి..
ఆ ఋతువులని ఆస్వాదిస్తూ వాటికి నా హృదయాన్ని ఇచ్చేయడానికి..
ఇక ఇష్టమైన వాళ్ళని ఎవరినైనా జ్ఞాపకం చేసుకోడానికి..
ఎవరినైనా మరిచి పోవడానికి.. ఎప్పటిలాగే.. ఓహ్హ్!
ఎప్పటిలాగే.. ఆలస్యం చేసేస్తుంటాను.
***
నా గురించి మీకు ఇంకోటి కూడా చెప్పాలి.. వినండి!
నా చుట్టూ ఉన్న మనుషులు మరణించడానికి ముందే..
వాళ్ళను దుఃఖం లోంచో.. మృత్యు బాధ లోంచో రక్షించాల్సి వచ్చినప్పుడు…
ఇన్నాళ్లూ దాచబడ్డ.. వాళ్ళకి మాత్రమే
తెలిసి తీరాల్సిన కొన్ని నిజాలను..
వాళ్ళకి ఖచ్చితంగా చెప్ప వలసి ఉన్నప్పుడు..
అయ్యో.. అయ్యో.. ఎప్పటిలాగే ఆలస్యం చేస్తాను!
నేనంతే.. అన్నీ కోల్పోయేదాకా..
నా నుంచి అందరూ దూరమయ్యే దాకా
ఇలా ఆలస్యం చేస్తూనే ఉంటాను!
~

మూలం: మునీర్ నియాజి
అనుసృజన: గీతాంజలి


మునీర్ అహ్మద్ నియాజీ అవిభాజ్య భారతదేశంలో పంజాబ్ లోని హోషియార్‍పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో జన్మించారు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్‍కి వెళ్లారు. పంజాబీ, ఉర్దూ భాషలలో కవిత్వం రాశారు. అనేక వార్తాపత్రికలు, మ్యాగజైన్లకూ, రేడియోకు కూడా రచనలు చేశారు. 1960లో, అల్-మిసల్ అనే ప్రచురణ సంస్థను స్థాపించారు. తరువాత లాహోర్‍ లోని ‘పాకిస్తాన్ టెలివిజన్’తో పనిచేశారు, కొన్ని సినిమాలకు పాటలు రాశారు. చనిపోయేంత వరకు లాహోర్‌లో నివసించారు.

Exit mobile version