[dropcap]ది[/dropcap]వి నుండి భువికి
జాలువారుతూ
దశదిశలా చుట్టేస్తూన్న
నాదామృతంలో
నిలువెల్లా తడిపేస్తూ
వివశను చేస్తూన్న
నీవెవరు?
నీ వెంటే పరుగులు తీస్తూన్న
గో, గోవత్స, గోపబాల
సమూహాలలో నేనూ ఒకరినా?
ఎవరు నేను?
ఉన్నత శిఖరాలను అలముకునే
దినకరుని బంగారు కిరణాలతో
హిమాలయాలను స్పృశిస్తూ
పర్వతశిఖరాలమీంచి
ఝరీవేగాన దుమికి
ప్రశాంతంగా జలాలమీదుగా
చిరు సవ్వడితో సాగిపోతూ
మలయమారుతం లాగా
సన్నసన్నగా సాగిపోతూ
ప్రకృతిని పులకింపజేసే
ఆ నాదం ఎవరిది?
నీవు నడిచే బాటలోని
చేతనా ప్రపంచాన్ని
అచేతనం చేస్తున్నావు
అసలు నీవెవరు?
నీ గానానికి
నా కనులు వర్షిస్తున్నాయి
నీ ముగ్ధమోహన రూపం
చూడాలని ఆశపడుతున్నా
కనులనీరు తుడిచి
అక్కునచేర్చుకోవా?
నీ పెదవిపై మధురగానాలు
పలికేదెవరో చూడనా?
చిరునవ్వుతో చూస్తావేం?
నా అస్తిత్వమే నీవు కదా!
నీవులేనిదే నేను లేనేలేను
అవును
నేను నీచేతిలోని పిల్లనగ్రోవిని
నీ అధరాలపై నిలిచి
నాదామృతాన్ని ఒలికించే
నీ ప్రియ మురళిని!!