[dropcap]సం[/dropcap]దేశాల పావురాలు
సలహాలను మోసుకొస్తూనే ఉంటాయి
నవ్వమని, నవ్వుతూ ఉండమని
నీ నవ్వు సంతోషాన్నే కాదు
నీలోని దృఢత్వాన్ని తెలియజేస్తుందని
అందుకే
నిరంతరం నవ్వుతూ
నవ్వుల పువ్వులను పెదాలపై
నిత్యం నిండుగా విరబూయిస్తూ
దృఢంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాను
కానీ ఎందుకో
అసలే కుదరదు కొన్నిసార్లు
ఏ భుజంపైనో తలవాల్చి
ఎడతెగని కన్నీరుకార్చాలని అనిపిస్తుంటుంది
ఏ హృదయాన్నో గట్టిగా హత్తుకుని
దుఃఖాన్ని దూరం చేసుకోవాలని అనిపిస్తుంటుంది
ఏ సాన్నిహిత్యమో పలికే
మంచి మాటల్లోని ఓదార్పుల బలంతో
మౌనం నా చుట్టూ కట్టినకోటను
ఛేదించాలని గట్టిగా అనిపిస్తుంటుంది
ఓటమి…అవమానం…అనారోగ్యం
ఆపదలూ… అనుకోని దుర్ఘటనలు
నా దేహాన్ని వశం చేసుకుంటే
నా పరిసరాలను ప్రభావితం చేస్తుంటే
నిస్సహాయుణ్ణి చేసి నిరంతరం బాధిస్తుంటే
నేనిలా ఆశించటం తప్పా…?
చెప్పండి
నా ప్రవర్తనలో ఏమైనా తప్పుందా…??