[మాయా ఏంజిలో రచించిన Still I Rise అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు.]
~
నన్నో చరిత్రహీనురాలిగా
తక్కువ చేసి మీరంతా రాస్తుండవచ్చు
మీ చేదు అబద్ధాల మెలికల మాటలతో
నన్ను పాతాళానికి తొక్కేస్తుండవచ్చు
అయినా..
సందె వేళ ధూళిలా పైకి ఎగసి పడతాన్నేను!
బతకడానికి నేను చేస్తున్న పడుపువృత్తి
మిమ్మల్ని కలత పెడుతుందా
చీకటి మిమ్ముల చుట్టు ముట్టిందెందుకని
నా ఇంటి నట్టనడుమ చమురుబావులు
కాసులు విరజిమ్ముతున్నాయనుకుంటున్నారు కదూ
ఎవరేమనుకున్నా
ఎవరి ఇష్టాలతోనూ నిమిత్తం లేకుండా
వెలిగే ఆ సూర్యుడెంత సత్యమో
చంద్రుడెంత నిత్యమో
నిలకడగా పోటెత్తే అలలెంత
చెదిరిపోని నమ్మకమో
అంతే నిబ్బరంగా పైకి లేస్తాన్నేను!
నన్నో విరిగిపడిన విధ్వంసంలాగా
మీకై వంగిన తలలాగా
నేల వాలిన చూపుల్లాగా
వంగిపోయిన భుజాల్లాగా
రాలుతున్న కన్నీటి చుక్కల్లాగా
బలహీనపడిన దేహాత్మల
ఆర్తనాదాల్లాగా
చూడాలనుకుంటారు మీరు
అయినా..
నా పెరటినిండా బంగారు గనులు
తవ్విపోసుకున్నంతగా నవ్వుతాన్నేను
అదొక భయానక వాస్తవంగా తోస్తుంది మీకు
నా స్థైర్యం, సాధికారత
మీకు మనస్తాపం కల్గించి ఉంటుంది
మీ మాటల తూటాలతో నన్ను కాల్చవచ్చు
కత్తుల చూపులతో నన్ను
ముక్కలు చేయొచ్చు
ద్వేషంతో నన్ను చంపుతారేమో కూడా
అయినా..
గాలిలా, ప్రాణవాయువులా
పరివ్యాప్తమవుతూనే ఉంటాన్నేను!
నేను నర్తించే వేళ
నా ఊరువుల కదలికల్లో
వజ్రాలు పొదిగినట్టుండే మెరుపు
మీ ఆశ్చర్యానికి కారణమై ఉంటుంది
నా ఆకర్షణీయ శృంగారత
మిము కలత పెట్టి ఉంటుంది
అయినా..
చరిత్ర సిగ్గుపడే
వెలి వేసిన
వెలయాలి గుడిసెల సాక్షిగా
నేను లేచి నిలబడతాను
గతం గాయాల విత్తనాల నుంచి
మొలకెత్తిన అంకురాన్నై విస్తరిస్తాను
నేను నల్ల సముద్రాన్ని
నా వేదనలు దుఃఖాలు
అగాథపు లోతుల్లోకి
ప్రవహించి పోతాయి
భయానక, దయారహిత రాత్రులని
ధిక్కరించి
నేను ఉప్పెన నై ఎగసిపడతాను
నా జాతి ప్రజల స్వప్నాన్నై
నా జాతి బానిసల
నమ్మకపు వేకువనై
నేను వికసిస్తాను
నేనెగసి వస్తాను!
నేనెగసి వస్తాను!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవిత్వం వెలువరించారు.
ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.
బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‍గా పని చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.
రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.