Site icon Sanchika

నేనూ పాపాయినే. మగ పాపాయిని

(19 నవంబర్ 2023 International Men’s Day సందర్భంగా చెన్నూరు హరి నారాయణ రావ్🌿 గారు ఈ రచనని అందిస్తున్నారు.)

[dropcap]ఇ[/dropcap]దొక వింత జీవి. ఈ పాపాయి ఒకప్పుడు ఏడిస్తే ముద్దు చేసిన అమ్మనాన్నలు, సమాజం ఇప్పుడు ‘నువ్వు ఏడవకూడదు’ అంటాయి. ‘ఏడవడం ఒక బేలతనం, మగవాడు ఏడవకూడదు, చేతకానివాడు ఓడిపోయినవాడే ఏడుస్తాడు, అది పిరికితనం బాధ్యతారాహిత్యం, మగాడివి నువ్వే ఇలా కన్నీరైతే ఇంట్లోవాళ్ళు ఏమవ్వాలి’ అంటూంటాయి. నొప్పి, బాధ కలిగినప్పుడూ నవ్వమంటాయి. ఆ సమాజమైతే మరీనూ. ఒక్కోసారి ఏడిపించి నవ్వమంటుంది. నవ్వకపోతే వింతగా చూస్తుంది. మళ్ళీ అదే సమాజం ‘నువ్వు హీరోవి కాదు, మగాడు అనేవాడు హీరోలా ఉండాలి కానీ ఆడపిల్లలా ఏడవకూడదు’ అంటుంది. ఈ పరస్పర విరుద్ధ ఆశయాలు షరతుల మధ్య ఈ పెద్ద పాపాయి నలిగిపోతుంది. ‘ఔను ఆ విషయం నాకూ తెలుసు. నువ్వే నన్ను హీరోని కానివ్వలేదు. కనీసం మనిషిగానైనా గుర్తించు’ అని ఈ పెద్ద పాపాయికీ చెప్పాలనుంటుంది.

కొత్తగా నూనూగు మీసాలొస్తున్న ఈ బుజ్జి మగ పాపాయికి ఆ సమాజం అనబడే పనీపాట లేని జాడ్యం నుండి అన్నీ ఆటంకాలే. ఆ నోట ఈ నోట వినికిడి ‘మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, రాంక్ ఎంతొచ్చింది, కాంపస్ సెలక్షన్ వచ్చిందా, అయ్యో రాలేదా, వస్తే ఏ కంపెనీలో, జీతం ఎంతో!?..’ విచిత్రం ఏవిటంటే తను ఆశించని, తన వయసుకి మించిన ఈ కుశలప్రశ్నలు (?) అటు సమాజం నుండే కాదు. ఇంట్లోనూ, బంధువులనబడే రాబందులనుండీను. ఈ బుజ్జి మగ పాపాయి ‘చదువు ఎప్పుడౌతుందో! అయిన వెంఠనే ఉద్యోగం వస్తుందంటావా? జీతం ఎంతిస్తారో! ఆ మూర్తిగారి పిల్లలు బాగా సెటిలయ్యారు! ఆయనకింక పని చేయాల్సిన ఖర్మ లేదు..’

పెళ్ళిళ్ళు శుభకార్యాలలోను బంధుత్వం తెలియని, ఆట్టే పరిచయం లేని, ఇంతకు మున్నెన్నడూ ఈ పెద్ద మగ పాపాయి బాగోగులు పట్టించుకోని వారందరూ అదేదో తమ బాధ్యత అన్నట్టుగా వరుసక్రమంలో ఒకరి తరువాత ఒకరు గుచ్చిగుచ్చి చూపులు, గుసగుసలు, సందేహాలు ఆపై బ్రహ్మాస్త్రం ‘ఇప్పుడేం చేస్తున్నావ్?’ ‘పెద్దాడివయ్యావుగా, ఈ భూమి భారం నువ్వే మొయ్యాలి. ఇప్పటికిప్పుడు కోట్లు సంపాదించి మమ్మల్నందరినీ నువ్వే గట్టెక్కించాలి’ అన్నట్టు. ఒక్కోసారి అడగాలనిపిస్తుంది పేరు రూపు తెలియని ఎవరో అజ్ఞాతవ్యక్తిని ‘నన్ను పెద్ద చెయ్యమని నిన్నడిగానా, దాంటోబాటు మిగిలినవి ఇవ్వడం ఎలా మర్చిపోయావ్’ అని.

కష్టం వచ్చినప్పుడు ఓదార్పూ ఉండదు, రవ్వంత చోటూ ఇవ్వదు ఆ సమాజం. అందుకే ఈ పెద్ద పాపాయి కష్టపడి బలవంతంగా ‘ఏడవడం’ మర్చిపోతుంది. లేత వయసులోనే లేని గాంభీర్యం అరువుకి తెచ్చుకుంటుంది. దీనికై ముందుగా మౌనం ముభావం సహాయం తీసుకుంటుంది. నొప్పిని దాచుకోవడం నేర్చుకుంటుంది. ఆ తరువాత అదేదో సినిమాలో హీరో అన్నట్టు ‘నవ్వొస్తే నవ్వాలి ఏడుపొస్తే ఏడవాలి’ అనే వాస్తవాన్ని విస్మరిస్తుంది. పొరపాటున ఏ చిన్న గాయానికైనా కన్నీరొస్తే అది తనకే వింతగాను, ఎబ్బెట్టుగాను, నేరం సిగ్గుమాలినతనం గాను అనిపించి అటూ ఇటూ చూస్తుంది. అనునయం కోరుకోవడం ఒక అవమానంగాను, చిన్నతనంగాను బేలతనం భావించే ఈ పెద్ద పాపాయి కొత్తగా కృత్రిమంగా నవ్వడానికి ఓ న మ లు దిద్దుతుంది. చిన్నతనంలో అవసరం లేకపోయినా అర్థం లేకపోయినా ప్రతీదానికీ తోచుబాటుగా ఏడ్చినట్టు, పెద్దరికంలో ఇష్టం లేకపోయినా అవసరం లేకపోయినా, అర్థం లేకపోయినా ప్రతీదానికి బతకడానికి నవ్వుతుంది. ఆఖరికి తన పెళ్ళాంతో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆమె కొంగు పట్టుకుని పైపైకి బిగ్గరగా నవ్వుతుంది. ఈ సమాజంలో కన్నీళ్ళు కారుచౌక, నవ్వులపువ్వులు ఒక ఖరీదైన వస్తువు అని తెలుసుకుంటుంది.

నిజమే, మళ్ళీ అదేదో సినిమాలో కథానాయకుడు పాడినట్టు ‘నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది, నవ్వే అదృష్టం ఎందరికి ఉంటుంది?’

అందుకేనేమో, చిన్నప్పుడు ఆడ మగ తెలియక స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ చీటికీ మాటికీ తగుదునమ్మా అంటూ పరవళ్ళు తొక్కిన నీలాల కడలి కొన్నాళ్ళకి తను మగాడినని తెలిసి, మగాడికి కన్నీరు అవసరం లేదని తలచి కళ్ళకింద బిగదీసుకుని ఇల్లు కట్టుకుని తన కంటికే తాను భారమౌతుంది. వడగండ్ల కడగండ్ల వానొచ్చినా, కుంభవృష్టి కురిసినా, వరద పోటెత్తి నింగి నేల ఒకటైనా ఈ పెద్ద పాపాయి కడలి ఉప్పొంగదు, ఆనకట్టలు కూలవు. ఈ పెద్ద పాపాయి ఇంటికి కంటికి నిలువెత్తు గోడలేగానీ తలుపులు కిటికీలు ఉండవు. దేవుడే మర్చిపోయాడో లేక ఉన్న తలుపులు ఆ సమాజమే మూసి మేకులు కొట్టిందో తెలియదు. అమ్మ పొత్తిళ్ళనుంచి చంకనెక్కి ఆ తర్వాత ఆమె కొంగు పట్టుకుని నేల దిగిన ఈ పెద్ద పాపాయిని ఒక్కసారిగా నిలబెట్టి పరిగెత్తమన్నారు, ఈదమన్నారు. మొదట్లో ఎందుకో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమయ్యిందనీ కాదు. పెద్దాణ్ణయ్యానుగా, ఈ విషయం ఒప్పుకోడనికి వయసు మగతనం అడ్డొచ్చాయేమో! అక్కణ్ణుంచి పాపాయి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా బరబరా లాక్కెళ్ళిన కాలం అర్ధాంతరంగా ఈ కూడలిలో వదిలేసి తన పనైపోయినట్టు, ఎవరో పిలుస్తున్నట్టు ఎటో వెళ్ళెపోయింది. ఇంకో విచిత్రం చెప్పనా! ఈ పాపాయి పెద్దయితే, పరిగెడుతుంటే చూసి తమ బాధ్యత కలలు తీరాయని ముచ్చటపడి చేతులు దులుపుకున్న తనవాళ్ళు ఇంకోవాళ్ళు ఇప్పుడు ఈ పెద్ద పాపాయి అలిసిపోయి నిలబడి వెనక్కి చూస్తే ఎక్కడా కానరాలేదు. ఏవిటో, అంతా మాయలా అనిపిస్తోంది. వారు కోరుకున్నది కావాలనుకున్నది ఇష్టం లేకున్నా కష్టపడి నేర్చుకుని చేసి చూపిస్తూంటే తనని, బుజ్జి పాపాయిని, ఈ బుజ్జి మగ పాపాయిని మెచ్చుకోకుండా అంతా కూడబలుక్కుని కట్టకట్టుకుని ఎటు పోయినట్టో! ఏడుపు నవ్వు రాలేదు కానీ మొదటిసారిగా కోపం వచ్చింది. ఆ వచ్చింది బంధువై ఇప్పటికీ ‘నా’ నట్టింట తిష్ట వేసింది. నా నుదుటి గీతల్లో దాక్కుంది. కాలక్రమేణా అనాయాచితంగా వచ్చిన పెరిగిన నెరిసిన, గెడ్డం మీసంతో ఎదిగిన ఇతగాడు, ఈ మగవాడు, లోలోన ఒక బుజ్జి పెద్ద మగ పాపాయి, బయట సమాజంలో పాంటు షర్టు వేసుకున్న ఒక హీరో కాని మగవాడు. ఎప్పుడోనే కన్నీళ్ళకు నీళ్ళొదిలేసిన వీడు ఇప్పుడు నవ్వులకి నువ్వులు వదులుతున్నాడు. ఈ మిధ్యలో నవ్వకూడదట. ఎవరో చెప్పారు!

Exit mobile version