నేను చూసిన మూడు తరాల ‘స్త్రీ’

0
2

[dropcap]మా[/dropcap]రుతున్న సమాజంలో తరానికి తరానికి అంతరాలు, మార్పులు కనబడుతున్నాయి. ఆ మార్పులు ఆయా సమాజపు దర్పణాలుగా గోచరిస్తాయి. నేను చూసిన మూడు తరాల అంతరాలను మీ ముందుంచే చిరు ప్రయత్నం. మా అమ్మమ్మ తరం, మా అమ్మ తరం, నా కూతురి తరం..

అమ్మమ్మ తరం..

నేను నా చిన్నతనాన్ని అమ్మమ్మ (అనసూయమ్మ) దగ్గరే గడిపాను. అప్పటి ఆర్థిక పరిస్థితులు, చుట్టూ ఉన్న విభిన్న ప్రజల ప్రవృత్తులు, మనుషుల కల్మిడి వ్యక్తిత్వాలు, ఆహారపు అలవాట్లు, తెలియనివి తెలుసుకుంటూ ఉండే బాల్యం నాది. కుటుంబాల మధ్య ప్రేమానురాగాలు, ఒకరికొకరు అనే మనస్తత్వాలు, పెద్దలపట్ల గౌరవభావం, మన సంస్కృతిని ఆచరించే విధానం, నేను గమనిస్తూ పెరిగాను. అడిగినవారికి లేదనకుండా సహాయ గుణం ఉండేది. స్త్రీలు శారీరక దారుఢ్యంతో ఎక్కువ సంతానాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి, తమ బిడ్డలకు ఐదు సంవత్సరాల వరకు తల్లిపాలతో పెంచేవారు. ఉమ్మడి కుటుంబాల మధ్య విశాల హృదయంతో, కష్టించే గుణాన్ని కలిగి, అత్తగారి నుండి మనవళ్ల దాకా భిన్న మనస్తత్వాల మధ్య, అతి ఆశలు లేక సంతృప్తికరమైన జీవనాన్ని గడిపేవారు. 12నుండి 15సంవత్సరాల మధ్య  వివాహాలు ఎక్కువ జరిగేవి. ఎంతటి పరిస్థితులలోనూ మనోధైర్యంతో జీవితాన్ని సాఫీగా గడిపేవారు. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే కుటుంబాలలో స్త్రీ పురుషులు ఇరువురు సమఉజ్జీలుగా పని చేసేవారు. ఇంట్లో పెత్తనం మగవారిదైనా, సలహాలు ఇవ్వడంలో మంత్రి పాత్రను పోషించేది. నిస్వార్థమైన వీరి ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉండి జీవన గమనానికి పూలబాటలు వేసేవి. ఆస్తిని సంరక్షించుకోవడానికో లేక తమ వారిని పోషించుకోవడానికి, తమ కుటుంబం మనోధైర్యం కోల్పోకుండా నేనున్నానని ఆపన్న హస్తం అందించడానికి పెంపకం పోవడం(దత్తత) అనేది సర్వసాధారణ విషయం. తెలంగాణ ప్రాంతంలో నైజాం పాలన మూలంగా స్త్రీలు అభద్రతగా ఉండి అన్యాయాలకు గురి అయిన వారు కొందరైతే,  ఇంకొందరు ఎదిరించి పోరాడిన వీర వనితలు ఉన్నారు. ఆహార విషయంలో వరి అన్నం కన్నా ఎక్కువ గంజి, గటక, నూకలను ఉపయోగించేవారు. అవి యంత్రాల ద్వారా ఆడించకుండా, దంపుడు బియ్యం ఎక్కువగా ఉపయోగించేవారు. అవి ఆరోగ్యానికి శరీరానికి పుష్టిని ఇచ్చేవి. సాత్విక ఆహారాన్ని భుజించేవారు. స్త్రీలు భర్త, పిల్లలు, కుటుంబంలోని వారు ఆరగించిన తర్వాతనే తాను భుజించేది. పాడి పంటలు సమృద్ధిగా ఎవరికి వారే చూసుకునేవారు. పెద్దల సలహాలను పాటిస్తూ, జీవితావసరాలను తీర్చుకునేవారు. అక్కడక్కడ వేశ్యవృత్తిని చేసే దేవదాసి కుటుంబాలు ఉండేవి. పండగలు అనగానే ఎన్ని సంబరాలు. మన సంస్కృతి కొట్టవచ్చినట్లు ఉండేది. ‘పంచుకుంటేనే ప్రేమ పెరుగుతుందని’ అందరూ సామూహికంగా సంబరాలు జరుపుకునేవారు. మగ పిల్లవాడు పుడితే వంశాంకురం పుట్టిందని ఎక్కువ సంతోషించేవారు. స్త్రీకి చదువు విషయంలో పట్టించుకునేవారు కాదు. ఉత్తరం చదివే చదువు చాలని 12, 13 సంవత్సరాలకే పెళ్లిళ్లు చేసేవారు. వ్యవహార జ్ఞానములో మగవారికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చేవారు. కులవృత్తులకు ప్రాధాన్యత ఇచ్చి, జీవనాధారాలుగా మలుచుకునేవారు. ‘ఆడవారి మాట పెదవి దాటకూడదు, కాలు గడప దాటకూడద’నే హద్దులు పెట్టి వేష, భాష, మనుగడలో స్వాతంత్ర్యాన్ని ఇచ్చేవారు కాదు. కొన్ని స్వతంత్ర భావాలు ఉన్న, ఉమ్మడి కుటుంబాలలో వ్యక్తం చేయలేక న్యూనత భావాలతో ఒదిగిపోయి ఉండేవారు. సంప్రదాయాలకు ప్రతీకలుగా కట్టుబొట్టు ఉండేవి. డబ్బు వ్యవహారంలో అంతగా లేక దాన్య రూపంలో వస్తు మార్పిడిలను నేను చూశాను. అమ్మమ్మ వడ్ల గింజలు పెడితే, పప్పులో, పళ్ళు, వాళ్లకు పండినవి ఇచ్చేవారు. సంవత్సరానికి కారు (పంటకి) ధాన్యాన్ని ఇస్తే, పండక్కి సాలెవాడు బట్టలు, కుమ్మరి వాళ్లు కుండలను, చాకలివాడు బట్టలు ఉతకడం, మంగలి క్షవరం ఇలా చేసి పోయేవారు. కులవృత్తులు కుంటుపడకుండా ఒకరినొకరు సంరక్షించుకునేవారు. వీరి జీవన ప్రమాణాలు కూడా ఎక్కువే. 90 సంవత్సరాలు పైబడిన ముసలివారు కూడా వారి పనులు వారే చేసుకుంటూ, వారు కాలక్షేపం కొరకు మన సంస్కృతిని చాటి చెప్పే భారత, భాగవత పఠనం చేసేవారు. జానపదకళారూపాలు ప్రదర్శించేవారు.

అమ్మ తరం..

మా అమ్మకి, నాకు 20 సంవత్సరాల వ్యత్యాసం. భావాలు ఒకే విధంగా ఉండేవి. చదువుకు ప్రాధాన్యం అప్పటినుండే ప్రారంభమైనది. ‘ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు’ అనే భావనతో ఉండేవారు. భర్త సంసార బాధ్యత వహించినప్పటికీ భార్య చేదోడు వాదోడుగా ఉండేది. ఒకరికొకరు గౌరవించుకునేవారు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంచుకొని జీవనాన్ని సాగించేవారు. ఉమ్మడి కుటుంబాలకే ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఈ తరం స్త్రీలు కూడా నిస్వార్థంగా ఉండేవారు. చదువుకున్న స్త్రీలు 30 శాతం ఉండేవారు. కుటుంబంలో ఒకరు వాళ్ళ పిల్లల చదువుల గురించి పట్టించుకుంటే, వేరొకరు వంట పని చేయడం, మరొకరు ఇంటి పని చేసేవారు. పని భారాన్ని పంచుకున్న అందరూ కలిసి ఒకేసారి భుజించేవారు. అత్తమామలని తల్లిదండ్రులుగా భావించేవారు. చిన్న వయసులో అత్తారింటికి రావడం వల్ల మమేకమై అత్తమామకు అలాంటి ఆప్యాయతలను గౌరవాన్ని ఇచ్చేవారు. వారు తమ పిల్లలకు అందించే ప్రేమను వాళ్లపై చూపించేవారు. వారి కుటుంబంతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తులపై గౌరవ మర్యాదలు కనబరిచేవారు. ఏది వండినా, ఏది పొందిన అందరికీ సమానంగా పంచే హృదయం వారికుండేది. అగ్రకులాల స్త్రీలు చదువుకున్నవారైనా సమన్యాయానికే మొగ్గు చూపేవారు. వారి ఆచారాలు సంస్కృతులను మరవక దాని ప్రచారానికై కూడా ముందుండేవారు. పాపభీతి, దైవప్రీతి, సంఘరీతి, ఎక్కువగా ఉండేది. వారి సంతానానికి అవి ఆచరించేటట్లు చేసేవారు. చదువుతోపాటు సంస్కారం సంఘంలో నిలదొక్కుకునే ఆత్మస్థైర్యం, నిస్వార్ధత, విలువలు తెలిసిన జీవితాన్ని అందించేవారు. తమ తరానికి వారసులుగా భావించి పెంచుకునేవారు. స్త్రీ, పురుష భేదాలు కొంత ఈ కాలానికే తక్కువగా కనిపించేవి. బాలబాలికల సమ ప్రాధాన్యతతో చదివించేవారు. పోటీ తత్వము కూడా పెరిగింది. నాగరికత పేరుతో అప్పుడప్పుడే పాశ్చాత్యపు పోకడను అనుసరించే పద్ధతులు వచ్చాయి. సినిమా చూడడం, నవలలు చదివేవారు. ఇంటిలో ఏదో ఒక పుస్తకం ప్రతివారు చదివే విధంగా పరిస్థితులను కల్పించేవారు. (చందమామ పుస్తకాలు) జానపద కళల ద్వారా మన సంస్కృతిని ప్రచారం చేసేవారు. వాటిలో కూడా స్త్రీలు పాల్గొనేవారు. వాటి ప్రభావం జీవనశైలి మీద ఉండేది. అలాంటి జీవితాలను ఆదర్శంగా జీవించేవారు, అనుసరించేవారు. వాస్తవాలకు దగ్గరగా ఉండేవి. ఆనాటి సినిమా కథలు వేషధారణలోను మార్పు వచ్చింది. ఒకరిని ఒకరు అనుసరించేవారు. కుటుంబంతో గడపడానికి ప్రాముఖ్యతను ఇచ్చేవారు. తర్వాతే సంఘ సేవకు ఉపక్రమించేవారు. గౌరవ మర్యాదలు ఎక్కువగానే ఉండేవి. అక్కడక్కడ బాల్య వివాహాలు జరిగినప్పటికీ అవి హానికారకంగా లేకుండెను. వ్యవసాయ కుటుంబాలలో స్త్రీలకు కొంత విశ్రాంతిని ఇవ్వడానికే ముగ్గు చూపేవారు. కష్ట పరిస్థితులలో స్త్రీ పురుషునితో పాటు పొలానికి వెళ్లి భర్తకు సహకరించేది. చాకచక్యంతో వ్యవహార బాధ్యతలతో చేదోడువాదోడుగా ఉండేది. వారికి కొత్త ఆశలు చిగురించిన, అవివారికి అందుబాటులో ఉండే కోరికలే కావున అవి తీర్చుకొని తృప్తిగా ఉండేవారు. నెరవేరని కోరికలు ఉండేవి కావు. అందుకే మూడు పువ్వులు ఆరుకాయల్లా వారి జీవిత రథం సాగేది. నివాసాలు ఏర్పరచుకొని కుల, మత భేదాలు లేకుండా సమ సమాజంలో మెలిగేవారు. అగ్రకులాలలో కొంత భావన ఉన్న, వారి ఆలోచనలను గౌరవిస్తూ మిగతావారు ప్రవర్తించేవారు. ఎవరి హద్దుల్లో వారు ఉంటూ సమైక్య భావనతో ఉండేవారు. కుల వృత్తులను పెద్దలు గౌరవించేవారు. చిన్నవాళ్లు ఉద్యోగ అన్వేషణలో ఉండేవారు. వాడవాడలలో గ్రామంలో సంబంధాలు పెంచుకొనుటకు అక్క, వదిన, అన్నా, అంటూ సంబోధించుకునేవారు. ఈనాటి స్త్రీలలో వాళ్ళింట్లో చేసుకున్న వంటలు అందరూ తినాలనే తపన ఉండేది. అలాగే పంచుకునేవారు కొంత స్వార్థం, కొంత విశాల హృదయంతో మసలుకునేవారు. అవసరాలను బట్టి దూర దూరంగా నివసించిన, పండగలకి పబ్బాలకి అందరూ ఒకే చోట జరుపుకునే వారు. అందరూ కలిస్తేనే పండగ అనే భావనలో ఉండేవారు. కుటుంబంలో ఏ ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించిన, ఉన్నత ఉద్యోగం సంపాదించిన, అందరూ సమభావనతో ఒకరికొకరు అన్ని విధాలా సహకరించుకునేవారు. మూఢాచారాలపై ఉద్యమించిన స్త్రీలు లేకపోలేదు. ఒక సంఘంగా ఏర్పడి ఒకరి భావాలనో సలహాలను గౌరవిస్తూ జీవితాలకు ఉపయోగించుకునేవారు. అటు గౌరవిస్తూ, సంస్కృతిని కొన్నింటిని నిరసిస్తూ ఉండేవారు. అలాంటి వాతావరణంలో పెరిగిన బాలికలు కూడా కొత్తదనాన్ని అవలంబించుకుంటూ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా మసలుకునేవారు. ఆధ్యాత్మిక భావనలు కూడా ఉండేవి, ఆయా పండగల ప్రాముఖ్యత వైశిష్ట్యాన్ని తెలిసి ఉన్నవారే ఎక్కువగా ఉండేవారు. ఉన్నత పదవులు స్త్రీలు అధిరోహించేవారు. మొత్తం మీద స్త్రీ పురుషులు సమానులే అన్న భావము ఆనాటి సమాజంలో కనిపించేది.

నా కూతురి తరం..

భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే పరిస్థితులలో ఉన్నది ప్రస్తుత సమాజం. పిల్లల క్రమశిక్షణతో తల్లిదండ్రుల మార్గంలో పెంచుతున్నప్పటికీ, కొంత వయసు రాగానే పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తున్న రోజులు ఇవి. నేటి సమాజంలో భర్తతో పాటు, భార్య నాలుగు రాళ్లు సంపాదిస్తేనే జీవనం సాఫీగా నడిచే పరిస్థితి. దానికి తగిన చదువుకై వివాహానంతరం కూడా స్త్రీలు చదువుకుంటున్నారు. చదువు లేకపోయినా జీవనాధారం కోసం వారి ఆశలు నెరవేర్చుకొనుటకు పనులను చేస్తూ పైసలు సంపాదించుకుంటున్నారు. ఇంటిపని, వంటపని, బయటి పని ఇలా మూడు రకాలైన ఒత్తిడితో అనేక రకాలైన మానసిక వైకల్యాలకు కారణం అవుతున్నారు. తృప్తి లేని జీవనాన్ని గడుపుతున్నారు. సుఖం లేని నిద్రలు గడుస్తున్నాయి. దీనికి కారణం శక్తికి మించిన ఆశలు కోరికలు కొంత అయితే, తృప్తి లేని భావన కొంత. వాటిని నెరవేర్చుకొనుటకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఒకటి పొందితే ఇంకొకటి కోల్పోతున్నారు. ఈ తరం స్త్రీలు చదువులో ప్రావీణ్యతను సంపాదించుకున్న, ఉన్నత శిఖరాలు అధిరోహించిన, వారి తృప్తి కొంతకాలమే ఉంటుంది. దానికి కారణం వారి శ్రమ నిరంతరం, కొత్త ఆలోచనలు, వాటిని నెరవేర్చుకోవాలన్న తపన, లక్ష్యం ఉంటేనే సాధించే తపన, సాధించామన్న తృప్తి, ఉంటాయనే మనస్తత్వం కలిగి ఉంటున్నారు. పని భారం వల్ల శారీరక దారుఢ్యం తగ్గడం, ఆహారం వేళకు తీసుకొనక, చేసుకొనుటకు సమయం దొరకకపోవడం, కర్రీ పాయింట్లపై ఆధారపడుతున్నారు. లేదా పెద్ద వాళ్ళ సహాయాన్ని కోరుకుంటున్నారు. కొందరు అన్ని చాకచక్యంతో సమయస్ఫూర్తితో నెరవేర్చుకున్నప్పటికీ, ఒత్తిడికి గురి అవుతున్నారు. ‘కొత్తొక వింత పాతొక రోత’.. పాత పద్ధతులు అనుసరించక, తమదైన పోకడలతో జీవనాన్ని గడుపుతున్నారు. సమిష్టి కుటుంబాల కన్నా, వ్యష్టి కుటుంబాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉన్నత కుటుంబాలలో పాశ్చ్యాత పోకడలతో, నాగరికత పేరుతో, స్వేచ్ఛ జీవనాన్ని గడుపుతున్నారు. కొంత మన దేశ సంస్కృతిని గౌరవించినప్పటికీ, వారిదైన పంథాలో నడుచుకుంటున్నారు. మధ్యతరగతి కుటుంబాలలో అటు అందలం ఎక్కలేక, ఇటు ఉన్న పరిస్థితులలో ఉండలేక వారి జీవనాన్ని గడుపుకుంటున్నారు. ఇందులో తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చుకొనుటకు, తమ లక్ష్యాలను చేరుటలో నిరంతరం శ్రమిస్తూ సాధిస్తున్నారు. కొంతమంది బాలికలు వారి మానసిక స్థితిగతులను కొంత బలహీనంగా ఉన్నప్పటికీ, మొక్కవోనీ ఆత్మస్థైర్యముతో అడుగులు ముందుకు వేస్తున్న వనితలు లేకపోలేదు. స్థితిగతులు సరిగా లేని స్త్రీలు ధైర్యంతో జీవితాలకు అనుగుణంగా పనులు చేస్తూ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటున్నారు ఆత్మ స్థైర్యం స్వాలంబన మనిషి ఎదగడానికి కారణం అవుతాయి. ఈనాటి స్త్రీలు ఎందెందు వెతికి చూసినా అందందే కలరు – అన్న రీతిలో అన్ని రంగాలలో ముందంజ వేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు కుటుంబాలు, బాసటగా నిలిచాయి. బాలికలు అన్ని రంగాలలో ప్రావీణ్యతను పొంది పేరు ప్రఖ్యాతులు దేశానికి, కుటుంబాలకు తెచ్చి పెడుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వాన్ని అవలంబించుటలో కొంత భిన్న ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని ఎదిగే వారు కొందరైతే, దుర్వినియోగపరచుకొని కష్టాలు పడుతున్న వారు కొందరు. వారి ఆలోచనలను తల్లిదండ్రులను గౌరవిస్తూ వారికి మార్గదర్శకాలను సూచించినప్పటికీ దానిని నిర్లక్ష్యంతో, వారి అనుభవము లేని ఆలోచనలతో ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఏది కానీ స్వయంగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఎదురైనా ఆటంకాలను కొన్ని వారే తీర్చుకోగలిగిన, పెద్దవారి చేయూత వారికి అనివార్యమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి పరచుకొని జీవితాన్ని సాఫల్యం పొందిన బాలికలు ఎందరో, నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి ధీటు ఎవరూ లేరు అన్నట్లుగా ఉంటాయి. ఆ ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు బయట తిరుగుతున్నారు. కావున ప్రత్యక్షంగా చూసి ఆలోచించగలిగిన సామర్థ్యం ఉంటుంది. వీరిలో తమ నిర్ణయం సరియైనదనే భావనతో ఆ మాటపై నిర్భయంగా నిలబడే దృఢ చిత్తం వీరిది. కొన్ని సందర్భాలలో వారికి ఎదురైన కష్టనష్టాలకు వారే బాధ్యులన్న ఆలోచన కొంత కొరబడింది. ఆహార విషయంలో శరీరాకృతిపై దృష్టి ఎక్కువ. సరియైన సమయానికి ఆహారం తీసుకొనక, శారీరకంగా విశ్రాంతి లేక, మానసికంగా బలహీనులవుతున్నారు. డైటింగ్ అని మితాహారం తీసుకుంటూ ఒకవైపు, పాశ్చాత్య పోకడలతో బయట తిండి పిజ్జా, బర్గర్ తిని ఇంకొందరు మరొకవైపు శరీరాన్ని తగ్గించుకుంటున్నారో, పెంచుకుంటున్నారు అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మాటలతో బూరెలు వండగలరు(అందరిలో కలిసిపోగలరు). మాటలతో గుండెలను బాధ గలరు (ఎదురేగి మాట్లాడగలరు) ఈ రెండింటిలో సమర్థులు నేటి బాలికలు. ఏ సమయానికి ఏ వేషధారణ చేయాలో తెలిసిన వీరు అటు పాశ్చాత్యము ఇటు మన సంస్కృతిని మేళవింపులుగా ధరిస్తారు. సమయానుకూలంగా వస్త్రధారణ ఉంటుంది.

సామాన్య స్త్రీ నుండి దేశ ప్రధాని వరకు స్త్రీ అందలము ఎక్కింది. అంచెలంచెలుగా శ్రీ స్థితిగతులలో మార్పు సంభవించింది. అయినప్పటికీ కొన్ని సమస్యలు పోయి కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. బాల్య వివాహాలు పోయి బలవంతపు వివాహాలు, కన్యాశుల్కం పోయి వరకట్నాలు, స్త్రీవిద్య సమస్య పోయి ఉద్యోగస్తులైన స్త్రీల సమస్యలు, స్త్రీకి స్వేచ్ఛ లేకపోయే సమస్య పోయి లైంగిక వేధింపులు, న్యూనతా భావాలు ఇలా ఎన్నో సమస్యలను ప్రతినిత్యం ఎదుర్కొంటూనే ఉంది. దీనిని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో ఉంది. ఒక తల్లిగా, ఒక కూతురుగా, ఒక భార్యగా పాత్రలను పోషిస్తూ ఒక స్త్రీ మార్పు తీసుకొని రాగలదు. ఎలా అనగా స్త్రీ వివక్షతకు గురికాకుండా కుటుంబాలలో పని విభజన చేసుకునే విధంగా చూడాలి. ఈ పని ఒత్తిడి వలన మానసిక రుగ్మతలకు గురి అవుతున్నారు. పురుషుల నిర్ణయాలను పాటించడం, నీడలా అనుసరించక స్వతంత్ర భావాలను వ్యక్తం చేస్తూ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ కుటుంబంలో సమ ప్రాధాన్యతను పొందే విధంగా అనుసరించాలి. మన వ్యక్తిత్వాన్ని గౌరవించుకుంటూ, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. వివక్షతకు గురవుతున్న మన సామర్ధ్యాలను మెరుగు పెట్టుకుంటూ మనల్ని మనం నిరూపించుకోవాలి. ఇది చేయలేం అనక,  ఏదైనా సాధించగలమనే పట్టుదలతో పని చేయాలి.

ఉపాధ్యాయునిలు బాలికల్లో న్యూనతా భావాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. చదువు, ఆటపాట ఇలా ప్రతి పనిలో ప్రోత్సహించాలి. విజయం సాధించిన మహిళల వీరగాథలను చెప్పి, జ్ఞానాన్ని నింపి వారిలో సృజనాత్మకతను మేల్కొల్పాలి. ఆడపిల్లల తల్లులతో సంబంధాలు కలిగి, చదువులో ప్రోత్సహించి చైతన్య పరచాలి. వారిని జాగృతం చేయాలి. పిల్లలను గౌరవిస్తూ, మనం గౌరవాన్ని పొందుతూ, వారిలో ప్రేమను పెంచుతూ, ద్వేషాలను తుంచుదాం. మన తల్లిదండ్రులకు ఆప్యాయతలను అందిస్తూ మన పిల్లల ద్వారా అవి పొందుదాం. మానవతా విలువలను పంచుతూ నేటి పిల్లలలో అవి పెంచుదాం. ప్రేమద్వేషాల అర్థాలను వివరించుదాం.

మనసుకు నచ్చేమాట..

సమసమాజము నచ్చే బాట..

దేశం మెచ్చే తోటలా విరబూయిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here