నేను కరోనా పాజిటివ్…. అయితే ఏంటిట?

2
2

[dropcap]మా[/dropcap] అమ్మ నా చిన్నప్పుడు ‘దూకుతా దూకుతా…’ అనే కథ చెప్పేది. అటక మీద నుండి ఎవరో ‘దూకుతా! దూకుతా!’ అని అరిచేదట, కానీ ఎప్పటికీ దూకేది కాదట! ‘అటక మీద నుండి తమ మీద ఏదో దూకుతుంది’ అని ఆ గదిలో వాళ్ళందరూ భయపడి బయటికు వెళ్లి పోయాక, ఓ పిల్లి కిందకి దూకి గాభరాగా కిటికీ లోంచి దూరి అవతలకి పారిపోయిందిట!!

మా అమ్మ ఆ కథ చెబుతూ ఉంటే ఏం దూకుతుందో అని విపరీతంగా టెన్షన్‌తో చెవులు రిక్కించి, కళ్ళు పెద్దవి చేసి, మొహం భయంగా పెట్టి వినేవాడిని! ‘బెదిరించే ప్రతి దానికీ బెదరకూడదు’ అనే విషయానికి ప్రతీకగా మా అమ్మ ఈ కథ చెప్పేదనుకుంటాను.

ఇప్పుడు ‘కరోనా ముంచుకొస్తోంది’ అనగానే అదే రకమైన ఆందోళన, చాలామందిలో పొడ చూపటం నేను గమనించాను. అయితే ఇది పిల్లిలా దూకలేదు, పులి లాగే దూకింది! దొరికిన వాళ్ళని పొట్ట పెట్టుకొని పోయింది,ఒక సారి కాదు! రెండుసార్లు!!(పొట్ట పెట్టుకు పోవటం కాదు, దూకటం!) ‘కాస్త విరామంలో…. మళ్ళీ మూడోసారి కూడా ఇంతకంటే ఉధృతంగా వస్తుంది’ అని టాస్క్‌ఫోర్స్ వారు వక్కాణిస్తున్నారు. అంతేకాదు, ‘ఇది నిరంతరం మనతో ఉండేదే, జనం దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలి’ అని కూడా కొంత మంది నాయకులు ప్రవచిస్తున్నారు.

2020 నాటికి మన దేశంలో కరోనా కేసులు బాగా పెరిగిపోయి మార్చి 22వ తేదీ నాటికి దేశమంతటా లాక్‌డౌన్ విధించిన సంగతి మనందరికీ తెలుసు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం, సాధ్యమైనంత వరకూ బయటకు రాకుండా ఇంటికే పరిమితం కావడం; ఈ నాలుగు క్రమశిక్షణా చర్యలు పాటించడం ద్వారా ‘కరోనా వ్యాధి నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు’ అనే నమ్మకంతో ప్రజలందరూ ముందడుగు వేశారు. దేశ నాయకులు బాల్కనీలోకి వచ్చి నిలబడి చప్పట్లు కొట్టమంటే కొట్టారు. గంట వాయించమంటే వాయించారు. ఆ పూటకి తిండి లేనివారు సైతం వీధిలో నిలబడి తమ ఖాళీ కంచాలు గాలిలో ఎత్తి పట్టుకుని గరిటెలతో ఆక్రందన చేయించారు. ఇందువలన కరోనా ఈ చప్పట్లకు, ఈ ఘంటారావాలకు, ఈ గరిటెల ఆక్రందనలకు భయపడి పారిపోతుందని కాదు గానీ; ఈ మహమ్మారిని పారద్రోలటానికి భారత ప్రజలందరూ ఒకే మాట మీద క్రమశిక్షణతో ముందుకు కదులుతున్నారనే ఒక సందేశం ప్రపంచానికి అందజేయడానికి ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అందరూ భావించారు.

సరే… ఇక నా కరోనా పాజిటివ్ కథ గురించి… అసలు విషయానికి వస్తాను. విశాఖపట్నంలో ఒకే కాంపౌండ్‌లో మాకు రెండు బెడ్‌రూములు కలిగిన రెండు ఇళ్ళు పక్కపక్కనే ఉన్నాయి. ఇందులో వంటిల్లు ఒకటే అయినా… ఒక ఇంట్లో నేను, మా ఆవిడ ; మరో ఇంట్లో మా రెండో అబ్బాయి రామకృష్ణ, అతడి భార్య శ్రీదేవి, టెన్త్ క్లాసు, డిగ్రీ చదివే ఇద్దరు మనవలు ఉంటున్నారు. నాకు వయసు డెబ్భై అయిదు. మా ఆవిడకి కూడా ఇంచుమించుగా అదే వయసు. 2020 సంవత్సరమంతా మా భార్యాభర్తలు ఇద్దరం ఎక్కడికీ వెళ్లకుండా, మా ఇంటికి ఎవరూ రాకుండా; జాగ్రత్త పడుతూ క్వారెంటైన్‌లో గడిపినట్లే గడిపాం. మా అబ్బాయి విశాఖపట్నంలోనే ఓ కంపెనీలో పనిచేస్తూ ఉండటం వలన మా ఆలనా పాలనా, అవసరాలు అన్నీ అతనే చూస్తూ ఉండటం వలన, మేమిద్దరం బయటికి వెళ్ళ వలసిన అవసరం లేకుండానే గడిచింది. మా కోడలు శ్రీదేవి చాలా సమర్థవంతమైన కార్యనిర్వాహకురాలు అవటం వలన మాకు చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా తానే శ్రద్ధ తీసుకుని మా అవసరాలు చూసేది. మొత్తానికి కాంపౌండ్‌లో ఉన్న మా ఆరుగురికి ఏ అనారోగ్యం లేకుండా 2020 గడిచిపోయింది. తగ్గిపోయింది అనుకున్న కరోనా మళ్ళీ రెండో విడతగా 2021 మార్చి ప్రాంతం నుండి తన ప్రతాపం చూపటం ప్రారంభించిందికదా. ఏప్రిల్/మే నాటికి, ముఖ్యంగా విశాఖపట్నంలో, అతి తీవ్రంగా వ్యాపించింది. 2020లో ఏదైనా ఒక రోడ్డులో ఒక కరోనా కేసు ఉంటే, రోడ్డు మొదట్లోనూ చివరలోనూ తాళ్ళు కట్టి మూసేసేవారు. అయితే 2021లో విశాఖపట్నంలో కేసులు చాలా ఎక్కువైపోయాయి. రోడ్లకి తాడు కట్టటం కాదు, ఊరి చుట్టూ తాడు కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది!!

ఈ కరోనా విజృంభణ పెరిగిపోతున్న కొద్దీ రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి, కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో ఫోన్‌లో వాట్సాప్ మెసేజీలు వందల మీద వచ్చి పడిపోవటం ఆరంభించాయి! ఫోన్‌లో జాగా సరిపోక వాటిని తుడిచి పెట్టటానికే రోజూ ఓ గంట పట్టేది నాకు.

ఒకడు ఉదయాన్నే లేచి పచ్చి వెల్లుల్లి పాయలు చితక్కొట్టి ఆ రసం తాగమంటాడు. ఇంకొకాయన రాత్రి రాగి చెంబులో తులసి ఆకులు వేసి నీళ్ళు నింపి ఉదయాన్నే అందులో రెండు లవంగాలు పడేసి తాగండి అంటాడు. ఇంకొకాయన ఉసిరికాయలు రసం తీసి దాన్ని సేవించమంటాడు. ధనియాలు జీలకర్ర కషాయం గోరువెచ్చగా రాత్రి సేవిస్తే ఫలితాలు అధ్భుతం అని ఇంకొకాయన సలహా చెబుతాడు. మరొకాయన పచ్చ కర్పూరం ఉండలు పల్చని గుడ్డలో చుట్టి ముక్కులో పెట్టేసుకొమ్మంటాడు.

జాగ్రత్త కోసం నేను కూడా ఏదోఒకటి చేయాలని అనుకున్నాను కానీ ఈ రకరకాల కషాయాలతో కన్‌ఫ్యూజన్ ఎక్కువైపోయింది. ఆయుర్వేదంలో ఇంతో అంతో ప్రవేశం ఉన్న నా బాల్య మిత్రుడు దీపక్ శర్మకి ఓ రాత్రి ఫోన్ చేశాను. ఈ కషాయాల గురించి వివరంగా చెప్పి, ‘ఏది తాగితే మంచిది?’ అంటూ అడిగాను. వాడు వెంటనే ఏమీ తడుముకోకుండా, “ఒక పెద్ద గ్లాసుడు ధనియాలు జీలకర్ర కషాయంలో రెండు పెగ్గుల విస్కీ కలుపుకుని ఆరారా తాగితే మంచిది” అని సలహా చెప్పాడు.

“ఏమిట్రా… నువ్వు ఏదో విలువైన సలహా చెప్తావని నీకు ఫోన్ చేశాను.. నువ్విచ్చే బోడి సలహా ఇదా..” అంటూ చిరాకు పడ్డాను. అప్పుడు వాడు “ఇప్పుడు టైమ్ ఎంతయింది?” అంటూ అడిగాడు.

“రాత్రి తొమ్మిదింపావు అయింది”అన్నాను.

“అవును కదా.. నేను ఇప్పుడు స్కాచ్… జానీవాకర్… బ్లూలేబిల్… మూడో రౌండ్‌లో ఉన్నాను. ఇంతకంటే మంచి సలహా ఎలా ఇవ్వగలను? అందుకని రేపు పొద్దుట తొమ్మిదింపావుకి ఫోన్ చెయ్!” అంటూ ఫోన్ పెట్టేసాడు. ఆ తర్వాత మరి వాడికి ఫోన్ చేయనూ లేదు, ఏ కషాయమూ తాగనూ లేదు!

ఏప్రిల్ నెల ఆరంభం నుంచి కరోనా కేసులు మరీ ఎక్కువ అయిపోయాయి కదా… రోజూ డాక్టర్ సుధాకర్ గారి సంతకంతో విశాఖపట్నంలో కొత్త రోగులు, రోగం కుదిరిన వాళ్ళు, కుదరని వాళ్ళు, మృతుల సంఖ్య; ఇలా అన్ని వివరాలుతో తెల్లవారే సరికి వాట్సాప్‌లో ‘ హెల్త్ బులెటిన్’ వచ్చేస్తోంది.

ఇక కషాయాలు తాగడం, కర్పూరం వాసన చూడటం గురించిన మెసేజీలు తగ్గిపోయాయి గానీ ఏ కార్పొరేట్ హాస్పిటల్‌లో కరోనా పేరు చెప్పి ఎంతెంత దోచుకుంటున్నారో వివరాలతో సహా వాట్సప్ మెసేజీలు తండోపతండాలుగా రావడం ఆరంభం అయింది!

‘మా బావమరిదికి ఫలనా హాస్పిటల్‌లో పది రోజులకి పన్నెండు లక్షల ఖర్చు పెట్టాం’ అని ఒకరంటే, ‘మీరు పన్నెండు లక్షలు ఖర్చుపెట్టినా మీ బావమరిది రోగం తగ్గి తిరిగి కొంపకొచ్చాడు. మా వియ్యంకుడు ఆరు రోజులకి పదహారు లక్షలు ఆ దిక్కుమాలిన ఆసుపత్రికే పోసి, అక్కడ నుండి కొంపకి రాకుండా అలాగే కాటికి వెళ్ళిపోయాడు!’ అని మరొకరు మెసేజ్ పెట్టేవారు.

‘ఎంపీ లెవెల్లో పరపతి ఉపయోగిస్తే కానీ ఫలానా హాస్పటల్లో బెడ్ కాదు కదా ఆఖరికి చాప కూడా దొరకటం లేదు’ అని ఒకరంటే; ‘నేనైతే మంత్రిగారి లెవెల్లో చెప్పించవలసి వచ్చింది. అయినా రోజూ యాభై వేల చొప్పున నిర్మొహమాటంగా వసూలు చేశారు’ అని ఇంకొకరు ట్వీట్ చేసేవారు.

‘బెడ్ కావాలంటే ముందుగా మూడు లక్షలు క్యాష్ కట్టండి. ఫోన్ పేమెంట్‌లు, చెక్కులు ఒప్పుకోం.. కరెన్సీ కట్టాలి. దానికి రసీదు కూడా ఇవ్వం. మీకు ఇష్టమైతే చేరండి లేకపోతే లేదు….అని కొన్ని హాస్పిటల్స్ నిర్ధాక్షిణ్యంగా చెప్పేస్తున్నాయి’ అంటూ ఒకరు రాగాలు పెడితే; ఇంకొకరు ‘మా సంగతి మరీ ఘోరం! మా బావకి ఐదు లక్షలకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఆ విషయం చెప్పటమే పొరపాటయింది. పది రోజులకి పది లక్షలు క్యాష్‌తో పాటు ఈ ఐదు లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కూడా పూర్తిగా ఊడ్చేశారు ఫలానా హాస్పిటల్ వారు’ అంటూ మరొకాయన వాపోయారు.

‘మాకు ఆరోగ్య శ్రీ కార్డు ఉంది. కానీ దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.’ అని ఒకాయన గోలపెడితే; ‘మహామహులు వరదలో కొట్టుకుపోతూవుంటే గుడ్డి నక్క వచ్చి తనకి బోటు కావాలందిట… అలా వుంది మీరు చెప్పేది…. మా తమ్ముడు దగ్గర మూడు లక్షలు ముందుగానే కట్టించుకుని రోజంతా రిసెప్షన్‌లో కూర్చోపెట్టి సాయంత్రానికి వరండాలో కవాచీ బల్ల మీద పరుపు పడేసి పడుక్కోబెట్టా‌రు. అక్కడికి అదే మహా ప్రసాదం అనుకుంటూ సర్దుకున్నాడు వాడు… మీరేమో ఆరోగ్య శ్రీ సంగతి చెబుతారేంటీ?’ అంటూ ఇంకొకరు ఎద్దేవా చేశారు.

 ‘ఫలానా ఆసుపత్రి వాళ్ళు మందులు లేవంటూ చేతులెత్తేశారు.. రెమిడిసివిర్ బయట కొని తెచ్చుకొమ్మన్నారు. మొత్తం ఆ‌రు వయల్స్‌కీ లక్షన్నర అయింది’ అని ఒకరు గోలపెడితే, ‘మీకు దొరికాయి, సంతోషించండి. మాకు అవి దొరకనేలేదు. దాంతో మా ఫ్రెండుకి నలభైకే నూరేళ్లు నిండిపోయాయి.’ అంటూ ఇంకొకాయన రోదించాడు.

వాట్సాప్‌లో గంట గంటకీ ఈ ఆరోపణలన్నీ జోరుగా చక్కర్లు కొట్టడం మామూలైపోయింది. తరవాత్తరవాత మార్చురీలో నుండి బాడీ ఇవ్వటానికి పదివేలు అడిగారని ఒకరంటే, శ్మశానంలో మున్సిపల్ వాళ్ళు దహనం చేయటానికి మూడు వేలు బదులు ఇరవై వేలు ఒడికేస్తున్నా‌ని ఇంకొకరు వాపోయారు!

ఇక పేపర్లు, టీవీలు సంగతి సరేసరి! ఈ వివరాలు అన్నీ బాక్సు కట్టి ప్రచురించటం మామూలైపోయింది.

దీంతో నాలాంటి సామాన్యులు అందరికీ కరోనా కంటే కార్పొరేట్ హాస్పిటల్ అంటేనే మరింత భయం పెరిగిపోయింది! కొంపా గోడు తాకట్టు పెడితే తప్పా కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం అందని మ్రానిపండనే ఆలోచన అందరి మనసుల్లోనూ స్థిరపడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలు ఏమూలకీ చాలవు. కార్పోరేట్ హాస్పిటల్‌కి వెళ్ళక తప్పదు.. ఏం చేయడం?..

కరోనాకి దివ్యౌషధంగా చెప్పుకునే ‘రెమిడిసివిర్’ లాంటి మందు ఆరు డోసులు లక్షన్నర నుండి రెండు లక్షల వరకు ఖర్చుపెట్టి బ్లాక్‌లో సంపాదించుకోవాలనే అభిప్రాయం కూడా చాలామందిలో నాటుకుపోయింది. దానికి తోడు రోజూ పేపర్లో ఏ ఊర్లో ఆ మందు ఎంతకి బ్లాక్‌లో అమ్ముతున్నారో కూడా వార్తలు సోదాహరణంగా కనిపించేవి. దీంతో మధ్య తరగతి కుటుంబీకులు ‘తమకి కరోనా వస్తే ఎలా బయట పడగలం? ‘అని బెంబేలెత్తిపోయారు!!

నేనైతే, మా అబ్బాయితో “ఫిక్సడ్ డిపాజిట్లు కేన్సిల్ చేసి కొంత సేవింగ్స్ బ్యాంకులో వేసుకుని రెడీగా ఉంచుకుంటే మంచిదిరా… ఏ టైంకి ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. కీడెంచి మేలెంచమన్నారు..” అంటే వాడు తేలిగ్గా నవ్వుతూ “నువ్వు కీడెంచకు… నేను మేలెంచుతాను… ఆ విషయం నువ్వు ఆలోచించి టెన్షన్ పడకు… నాకు వదిలేయ్” అన్నాడు.

నేను మార్చి 17వ తారీఖున కోవీషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాను. అప్పటి లెక్క ప్రకారం ఆరు వారాలు తరువాత రెండో డోస్ తీసుకోవచ్చని అన్నారు.

మే 14వ తారీఖున మిత్రుడు ఇందూ రమణ, జేపీ శర్మ గారల సాయంతో సింహాచలం వెళ్లి వ్యాక్సిన్ తీసుకున్నాను.

15 తారీకు ఉదయానికి జ్వరం వచ్చేసింది. మా ఫ్యామిలీ డాక్టర్ ప్రకాశ రావు గారుకి ఫోన్ చేస్తే, శ్రేయాస్ టాబ్లెట్లు, అజిత్రోమైసిన్ కేప్స్యూల్సు రోజుకి రెండుసార్లు చొప్పున వాడమన్నారు. రెండు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గలేదు సరికదా నూటరెండుకి పెరిగిపోయింది. డాక్టర్ గారికి చెబితే అవే మందులు 6 గంటలకు ఒకసారి వాడుతూ, కోవిడ్ టెస్టు చేయించమన్నారు. చేయిస్తే రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. 22వ తారీకు ఉదయానికి ఆక్సిజన్ శాతం కూడా 85 /86 కి తగ్గిపోయింది. అప్పటికే మా కోడలు, పెద్దమనవడు, మా అబ్బాయి కూడా కరోనా బారిన పడి, హోమ్ క్వారంటైన్ లోనే వుండి క్షేమంగా కోలుకున్నారు. నా వయసు రీత్యా నన్ను మాత్రం వెంటనే హాస్పిటల్‌లో చేర్పిస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చాడు మా అబ్బాయి.

మా కోడలు శ్రీదేవి, ఓ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌లో పనిచేసే తన మేనకోడలు అయిన ఓ డాక్టర్ గారి సిఫార్సుతో, ఫోన్ ద్వారా అరగంటలో నాకు బెడ్ సంపాదించగలిగింది.

పొద్దున్న తొమ్మిది గంటలకు నేను మా అబ్బాయి, కోడలు హాస్పిటల్‌కి చేరుకున్నాం. మా కోడలు రిసెప్షన్ దగ్గరికి వెళ్లి ‘ఫలానా డాక్టర్ గారు ఇక్కడకి వెళ్ళమన్నారు. ఈ సరికే మీకు ఫోన్ చేసి ఉంటారు.’ అని చెప్పింది. రిసెప్షనిస్టు “చెప్పారు! ఫైవ్ టెన్ ఇవ్వండి” అంది రసీదు పుస్తకం తెరుస్తూ. ఒక్కసారి కాస్త ఉలిక్కిపడినట్టు ముఖం పెట్టి మా కోడలు మా అబ్బాయి వంక చూసింది. కార్డులో ఉన్నది నాలుగు లక్షల చిల్లర! ఇప్పుడు ఐదు లక్షల పదివేలు కట్టాలంటే మళ్లీ ఇంకో లక్ష కేష్ వెంటనే ఎలా వస్తుంది? అనే ఆలోచనలో ఉండగా రిసెప్షనిస్టు “పది రూపాయలు చిల్లర ఇవ్వండి. నా దగ్గర చిల్లర లేదు,” అంటూ మరోసారి గట్టిగా అడిగింది. మేము కట్టవలసింది కేవలం అయిదు వందల పది రూపాయలు మాత్రమే అని అర్ధమైంది. వాట్సాప్‌లో లక్షల ఫీజు వార్తలు విని విని, చదివి చదివి; ఏం చెప్పినా మాకు ముగ్గురికీ లక్షల్లా వినిపించి, బెదిరిపోయే పరిస్థితిలో మేమున్నామని మాకు అర్థమై నవ్వుకున్నాము. ఐదు వందల పది రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అట! తర్వాత మరో యాభై వేలు కట్టించుకుని మాకు స్పెషల్ రూమ్ ఇచ్చారు! రూమ్ లో చేరి పోయాక కాస్త గుండె దిటవు పడింది.

‘జరుగుబాటు ఉంటే రోగం అంత సుఖం వేరే లేదు’ అన్నారు పెద్దలు.

నా విషయంలో భగవంతుడి దయవల్లా, మా అబ్బాయి, కోడలు నా ఎడల చూపించిన శ్రద్ధ వలనా, హాస్పటల్లో ఉన్న ఏడు రోజులూ ఓ పిక్నిక్ లాగే గడిచింది. కానీ కరోనాతో వచ్చిన చిక్కల్లా ఒక్కటే! అది మంచం మీద బోర్లా పడుకోవడం!! గంట కాదు, రెండు గంటలు కాదు, రోజంతా వీలైనంత వరకు అలాగే పడుకోవాలి. పడుకునే ఉండాలి!

అదే, అదే బాధ!!

చిన్నప్పుడు నేను నాలుగో నెలలో బోర్లా పడితే మా అమ్మ వంద బొబ్బట్లు తయారుచేసి అందరికీ పంచి పెట్టిందట. అప్పట్లో అంటే 1945 ప్రాంతంలో ఇలాంటి సరదాలు… అంటే… పాకడం ఆరంభిస్తే పాకుండలు పంచడం, గడప దాటితే గారెలు చేసి పంచడం, పళ్లు వస్తూంటే పాల కాయలు చేయటం ఇలాంటి సాంప్రదాయాలు అన్నీ ఉండేవట. ఇప్పుడు ఎడతెరిపి లేకుండా ఏడు రోజులపాటు బోర్లా పడుకుని గడిపినందుకు మా అమ్మ ఉంటే ఎన్ని బొబ్బట్లు చేసి పంచి ఉండేదో లెక్కలు కట్టే యత్నం చేశాను గానీ ఊహకు అందలేదు! నాకు మాత్రం, ఈ కరోనాకు సంబంధించి బోర్లా పడుకోవడం అనేది ఒకటే మహా ఇబ్బందికరమైన విషయంలా కనిపించింది!

ప్రఖ్యాత రచయిత సోమ‌ర్‌సెట్ మామ్ శానిటోరియం పేరుతో ఓ కథ రాసేడు. ఆరు నెలలుగా శానిటోరియంలో వుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒకరిని చూడటానికి అతని మిత్రుడు వస్తాడు. “నీకు సమయం ఎలా గడుస్తోంది? బోర్ కొట్టటం లేదా..” అని అడుగుతాడు. అప్పుడు ఆ రోగి “వాట్ డు యు మీన్… టి.బి ఈజ్ ఎ ఫుల్‌టైం జాబ్.” అని జవాబు చెబుతాడు. అలాగ బోర్లా పడుక్కోటానికి సంబంధించి కరోనా కూడా ‘ఫుల్‌టైం జాబ్’ అనే చెప్పుకోవాలి!!

నన్ను చూడటానికి వచ్చిన డాక్టర్ గారు, “మీరు అలా వెల్లకిలా పడుకో కూడదు బోర్లా పడుకోవాలి. సాధ్యమైనంతవరకు బోర్లా పడుకునే ఉండండి… అంటే, ప్రోనింగ్ పొజషన్‌లో…” అన్నారు. నేను ఆత్రుత ఆపుకోలేక “ఎందుకు సార్.. అలా పడుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమిటి? ప్రోనింగ్ అంటే ఏమిటి?” అంటూ అడిగాను. ఆయన చిన్నగా నవ్వుతూ “కరోనా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన రోగం. ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్ శాతం తగ్గిపోతే ప్రాణానికే ముప్పు రావచ్చు. అందువలన ఆక్సిజన్ స్థాయిలు పెంచుకోవటం అనేది ఈ రోగాన్ని అధిగమించటానికి చేయవలసిన ముఖ్యమైన పని. ఆక్సిజన్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి? బోర్లా పడుకొని బలంగా శ్వాస పీల్చడం వలన ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. దీనినే ‘ప్రోనింగ్’ అంటారు. ఛాతీ, పొట్టపై బరువు పడేలా బోర్లా పడుకుని శ్వాస తీసుకోవటం వలన ఊపిరితిత్తులకు కావలసినంత ఆక్సిజన్ అందుతుంది. కరోనా రోగులకు ఈ ప్రక్రియ ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎలా చేయాలంటే మంచం మీద బోర్లా పడుకోవాలి. తర్వాత మెడ కింది భాగంలో ఒక దిండు పెట్టుకోవాలి. ఛాతీ నుండి కింద వరకు రెండు దిండ్లను ఉంచుకోవాలి. మరో రెండు దిండ్లను మోకాళ్ళ కింద పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల లంగ్స్‌కి ఆక్సిజన్ బాగా అందుతుంది అందువలన మీరు బోర్లా పడుకొని ఉండండి.” అంటూ ఎంతో ఓపికగా నాకు వివరించి చెప్పారు. ఆయనకు రెండు చేతులూ ఎత్తి నమస్కరించాను.

నిజానికి హాస్పిటల్లో చేరేసరికి నాకు జ్వరం బాగా తగ్గిపోయింది. గొంతు నొప్పి, తలనొప్పి వాంతులు లాంటి బాధలు కూడా ఏమీ లేవు. నాకు షుగర్ కూడా లేదు.

చేరిన వెంటనే అవసరమైన టెస్ట్‌లు కొన్ని చేశారు. మధ్యాహ్నానికి రిజల్ట్స్ వచ్చేసాయి. ‘హిమోగ్లోబిన్’ కొంచెం తక్కువ ఉంది గాని మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఆ మధ్యాహ్నం ‘రెమిడిసివిర్’ వయల్స్ రెండు ఓకే డోస్ కింద డ్రిప్ సాయంతో ఎక్కించారు. ఆ తర్వాత నాలుగు రోజులూ నాలుగు డోసులు ఎక్కించారు. నా ఆధార్ నెంబర్ ద్వారా నాకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం డిపార్ట్మెంట్‌కు తెలియజేస్తే, ‘ఆ మేరకు అసలు ఖరీదైన సుమారు మూడు వేల ఐదు వందలకే అవన్నీ హాస్పిటల్ వారికి లభించాయి’ అని తరవాత తెలిసింది. ఐదు రోజుల్లో ఇంకేవో చిన్న చిన్న టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజక్షన్‌లు ఇచ్చారు తప్ప పెద్దగా ఇత‌ర మందులు ఏవీ వాడలేదు. మిగిలిన మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉంచి ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందని ‘డీ డైమర్ టెస్టు’ ద్వారా నిర్ధారించుకొని ఏడో రోజున డిశ్చార్జ్ చేశారు.. హాస్పిటల్లో ఉన్నంత సేపు రెగ్యులర్‌గా డాక్టర్ గారు వచ్చి చూడడం, నర్సులు నిరంతరం కనిపెట్టి అవసరాలు తీర్చడంతో పాటు మా అబ్బాయి కూడా ఆ గదిలోనే మరో బెడ్ వేయించుకుని ఏడు రోజులూ నా దగ్గరే ఉండి పోవడం వల్ల నాకు పెద్ద కష్టం లేకుండా భగవంతుని దయవల్ల రోగం నుండి బయట పడగలిగాను. ‘ఇంటికి వెళ్ళాక ఆక్సిజన్ సపోర్టుతో ఉంచుతాను’ అని మా అబ్బాయి నా గురించి హామీ ఇచ్చాక డాక్టర్ గారు నన్ను మరింత భరోసాతో డిశ్చార్జ్ చేయడం జరిగింది.

మా అబ్బాయి ఉదయం ఆరు గంటలకు హాస్పిటల్ నుండే ‘ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్’ కోసం ముంబైకి ఆర్డర్ పెడితే; వాళ్లు ఆ మధ్యాహ్నం పదకొండు గంటల ఫ్లైట్‌కి దాన్ని ఎక్కించి, సాయంకాలం ఆరు గంటలకల్లా మా ఇంటికి దాన్ని చేర్చే ఏర్పాటు చేశారు. అందువలన నేను ఇంటికి తిరిగివచ్చిన గంటల్లోనే నాకు ఆక్సిజన్ పెట్టుకునే వీలు కలిగింది. అప్పటినుండి ఆక్సిజన్ సపోర్టుతో కోలుకుంటున్నాను. ప్రస్తుతం మెల్లమెల్లగా మిషన్ సపోర్టు తగ్గించి ప్రకృతి లోని గాలి మీద ఆధారపడటం అలవాటు చేసుకుంటున్నాను. వాళ్ళిచ్చిన మందుల కోర్స్ అంతా కూడా పూర్తయింది.

కోవిడ్ టెస్టు కూడా నెగిటివ్ వచ్చింది.

ఈ మొత్తం కోవిడ్ ఎపిసోడ్లో నేను తెలుసుకున్న కొన్ని సత్యాలు మీకు చెప్పదలుచుకున్నాను.

గత రెండు సంవత్సరాలుగా మన దేశంలో డాక్టర్ల వృత్తి మీద, వాళ్ల నిజాయితీ మీద సామాన్య జనానికి కొంత గౌరవం తగ్గటం జరిగిందని నేను అనుకుంటున్నాను. కానీ అది చాలా అన్యాయంగా నేను భావిస్తున్నాను. డాక్టర్లు, నర్సులు, పేరా మెడికల్ స్టాఫ్; వీళ్ళందరూ వాళ్ల వాళ్ల సుఖాలు ఎంతో మేరకు త్యాగం చేసి, పగలు రాత్రి ఆసుపత్రుల్లోనే గడిపి, నిరంతరం రోగులకు సేవలు అందించడం వల్లనే కరోనా వలన మరణాల సంఖ్య బాగా తగ్గిందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రయత్నంలో భాగంగా దేశంలో పధ్నాలుగు వందల మంది యువ డాక్టర్లు వాళ్ల ప్రాణాలు కోల్పోయిన సంగతి మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళందరూ అమరులే. వారితో బాటు ఇంకా కొన్ని వేల మంది నర్సులు, ఆయాలు, తోటీలు మొదలైనవారు కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన సంగతి మనం మర్చిపోకూడదు.

కార్పొరేట్ హాస్పిటల్స్‌లో అధికంగా డబ్బులు వసూలు చేసిన విషయం చాలామేరకు వాస్తవమే అయినా, అందులో రూపాయి కూడా డాక్టర్ల జేబుల్లోకి వెళ్లిందని నేను అనుకోను. గడిచిన ఏడెనిమిది సంవత్సరాలలో పవిత్రమైన వైద్యవృత్తి ఒక వ్యాపారంగా మారిపోయిన సంగతి విదితమే. అందువలన ఈ హాస్పిటల్స్‌లో అన్యాయంగా అధికంగా ఆర్జించిన డబ్బు హాస్పిటల్ నడిపే వ్యాపారస్తుల జేబుల్లోకి వెళుతుంది తప్ప డాక్టర్లకి వచ్చేది మాత్రం వాళ్ల జీవితపు రాళ్లే. అయితే ఈ వ్యాపారస్తులు ఎవరూ మన కంటికి కనబడరు. మనకి ఎదురుగా కనబడేది, సేవలు అందించేది, తేడా వస్తే నిందలు పడేది డాక్టర్లే అయిపోవడం ఒకరకంగా దురదృష్టకరం. మనదేశంలో అతి పవిత్రంగా భావించే రెండు వృత్తులు విద్య, వైద్యం. ఇవి రెండూ కూడా వ్యాపార సరుకులు కింద మారిపోవటం మన దౌర్భాగ్యం.

కరోనా వచ్చి భగవంతుని దయవలన కోలుకున్న నేను రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ ‘అనే సంగతి మనకు తెలుసు. అందువలన ఈ కరోనా మన దగ్గరికి రాకుండా ఉండాలంటే భౌతికంగా మూడు ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

  1. నిత్యము మాస్కు ధరించటం
  2. భౌతికంగా కనీసం రెండు మీటర్ల దూరం పాటించటం

3.సాధ్యమైనంతవరకు జనసమ్మర్థం లోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం.

ఐనా కూడా కరోనా వస్తే, ఆ మహమ్మారి నుండి బయటపడటానికి మానసికంగా ముఖ్యమైన లక్షణాలు మూడు అలవాటు చేసుకోవాలి. అవి…

  1. మనోధైర్యం
  2. మనోధైర్యం
  3. మనోధైర్యం

*

(ఈ విషయంలో స్ఫూర్తి కలిగించిన శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here