[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]
~
[dropcap]1[/dropcap]908 సంవత్సరం జనవరిలో అనుకుంటాను. కొత్త సంవత్సరం వచ్చింది. ఆశ్రమంలో కొత్త క్యాలెండర్ వేలాడదీశాము. మొదటి సారిగా భాయిని జైలులో పడేశారు. ఆయనతో పాటు మరి కొందరు సత్యాగ్రహులు కూడా వెళ్లారు. రెండు నెలలు జైలు. విడుదలై వచ్చి ఆరేడు నెలలు గడిచేటప్పటికి మళ్ళీ బంధించారు. భాయి జైలులో ఉన్న సమయాన్ని పుస్తకాలు చదవడానికి, ప్రార్థనలు చెయ్యడానికి, ఉత్తరాలు రాయడానికి ఉపయోగించుకునేవారు. “నిజమైన సంతోషం మన దేశానికోసం జైలుకు వెళ్ళినప్పుడు దొరుకుతుంది. ఆత్మశుద్ధి కాలం అది.” అనేశారు. ఇదివరకూ జైలు అంటే ఉన్న భయం, వెనుకంజ మాయమై అది న్యాయమార్గం అనే విశ్వాసం ఏర్పడింది. సత్యాగ్రహంలో జైలు ఒక భాగం అనేటట్టయింది. అంతవరకూ అందరికీ జైలు అంటే చాలా భయం. జైలుకు వెళ్ళొచ్చినవాళ్ళంటే ఒక రకమైన తిరస్కారం. కానీ జైలుకు వెళ్ళి రావడం ఒక గౌరవసూచకం అనేటట్టు చేసింది భాయి. నేను కూడా అందరి లాంటిదాన్నే. నా దృష్టిని కూడా భాయి మార్చారు. జైలు, భాయి ఇద్దరూ నాకు కొత్త కొత్త ప్రణాళికలను, జీవితాన్ని అందించారు.
భాయికి నటాల్ లోని డర్బాన్‌లో ఉండడానికి అనుమతి ఉండింది. మా ఫినిక్స్ ఆశ్రమం కూడా నటాల్ లోనే ఉండింది. కానీ ఆయన లాయరుగిరి చేస్తుంది, టాల్‌స్టాయ్ ఆశ్రమంలో ఉన్నది జొహాన్స్‌బర్గ్‌లో. అక్కడనుండి ఇక్కడికి, ఇక్కడినుండి అక్కడికి మళ్ళీమళ్ళీ వచ్చి వెళ్ళేవారు. ప్రతిసారి అనుమతి తీసుకునేవారు కారు. కాబట్టి ఆయనను బంధించడం సులభమయింది. ఇలా ప్రయాణం చేయడమే కాకుండా, సమ్మెలకు, సత్యాగ్రహాలకు మద్దతునిస్తారనే కారణంగా మూడో సారి మళ్ళీ బంధించారు. 1909 ఫిబ్రవరిలో భాయి, హరి ఇద్దరూ జైలుకు వెళ్ళారు. తనకు అతి కఠిన శ్రమతో కూడిన శిక్షనే ఇవ్వండి అని భాయి న్యాయాధీశులను ప్రార్థించారట! శ్రమకు భాయి భయపడేవారే కాదు. బహుశా ఇలాంటి ఖైదీని ఆ న్యాయాధీశులు తమ జీవితావధిలో చూసుంటారో లేదో కదా అమ్మాయ్! ఎవరైనా ఖైదీ ఇలా అడగుతారా?
చంచల్ భారతం నుండి వచ్చింది. హరికి ఒక వైపు ఆమెతో ఉండాలనే ఆశ. మరో వైపు సత్యాగ్రహంలో తండ్రికి తోడుగా ఉంటూ ఆయన నుండి శభాష్ గిరి పొందాలనే ఆశ. రెండింటినీ హరి నిభాయించేవాడు. ఈ సారి జైలు శిక్ష మాత్రం అతి కఠిన శిక్షగా వచ్చింది. నేల తోమి పాలిష్ చెయ్యాలి. నెలకు ఒకటే ఉత్తరం రాయాలి. చూడడానికి వచ్చేవారికి కూడా అనేక నిబంధనలు. మనవాళ్ళతో అక్కడి కారాగారాలు నిండిపోయాయి. బందీలకు చోటు లేక బయట నేలపై పడుకోబెట్టేవారట. భాయికి మాత్రం బ్యారిస్టర్ అని ఒక ప్రత్యేక గది ఇచ్చారట. కానీ తనవాళ్ళంతా బయట ఉన్నప్పుడు తనకు గది వద్దని భాయి ఇతరులతో పాటు మట్టి నేలపైనే పడుకున్నారట.
అప్పుడు నేను సత్యాగ్రహినయ్యాను. జైలుకు వెళ్ళాను. నలభై సంవత్సరాలయ్యేటప్పటికి జైలు చూసి వచ్చాను. నన్ను మారిట్జ్ బర్గ్ జైలుకు పంపారు. కఠిన శ్రమతో కూడిన శిక్ష. అప్పుడు నా ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడింది. ఎనిమిది వారాలు జైలులో గడిపాను. గుజరాతి మాట్లాడే కొద్ది మంది ఆడవాళ్ళు తప్ప మిగతావారంతా అపరిచితులే. అక్కడి ఇచ్చే శాకాహార భోజనం అసలు సహించేదే కాదు. చాలా మటుకు ఉపవాసమే. ముద్దగా ఉడికించిన దేనినో తెచ్చిచ్చేవారు. రుచే ఉండేది కాదు. ఎలా ఉన్నా తిను, ఆరోగ్యమే మనకు ముఖ్యం అని ఉత్తరం రాశారు భాయి. రుచే లేకుంటే ఎలా తినేది? తిన్నది తిరిగి వచ్చేది. భోజనం మానేసి శిక్ష ముగించి బయటికి వచ్చేసరికి చాలా సన్నబడ్డాను. ఎముకలు కనిపించేవి.
సత్యాగ్రహం నిరంతరంగా సాగుతోంది. దాన్ని చల్లబరచాలని బ్రిటిష్ అధికారి, స్కూట్స్ అనుకుంటాను ఆయన పేరు, ఒక రాజీ ఒప్పందానికి మమ్మల్ని పిలిచారు. భారతీయులు తమకు తామే తమ పేర్లను నమోదు చేసుకుంటే అనివార్య నమోదు చట్టాన్ని రద్దుచేస్తామని అన్నాడు. భాయి ఎలాంటి వారో తెలుసా అమ్మాయ్? ఎదుటి మనిషిని నమ్మేవారు. ఆ రాజీ ఒప్పందానికి సరే అన్నారు. సత్యాగ్రహాన్ని తాత్కాలికంగా ఆపేశారు. అప్పుడు జైళ్ళలో ఉన్నవాళ్ళందరినీ వదిలేశారు. కానీ ఇది చాల మందికి నచ్చలేదు. నాకు కూడా. “బ్రిటిష్ తెల్లవాళ్లను ఇంత వ్యతిరేకించి, సత్యాగ్రహం చేసి, ఇప్పుడు రాజీ అవుతాను అంటారేమిటి” అని కూడా నస పెట్టాను. భాయి వేసిన ఈ అడుగు చాలా మందికి అసమాధానం కలిగించింది. భాయి డబ్బులు తీసుకుని బ్రిటిష్ వాళ్ళతో లోపాయకారీగా వ్యవహరించారు, ఇది ద్రోహం అంటూ ఒక పఠాణ్ చాలా విరుచుకుపడ్డాడు. గాంధీ భాయి తన పేరేమైనా నమోదు చేసుకుంటే చంపేస్తానని అన్నాడు. అయినా కానీ, భాయి తమ పేరును నమోదు చేసుకున్నారు! బయటే కాచుకున్న పఠానుల గుంపు ఆయన స్పృహ తప్పేలా కొట్టి విసిరేశారు. చాలా సేపటికి ఆయనకు తెలివి వచ్చింది. కానీ తన పైన దాడి చేసిన వారిని విడుదల చేయాలని భాయి పట్టుబట్టి కూర్చున్నారు!
ఈ సంఘటనలో ద్రోహం జరిగింది మాత్రం నిజం. స్కూట్స్ అనే టక్కరి ఇచ్చిన మాట ప్రకారం చట్టం రద్దు కాలేదు. మళ్ళీ సత్యాగ్రహం ప్రారంభమయ్యింది. మనవాళ్ళు నమోదు పత్రాలను రాసులుగా పోసి తగలబెట్టారు. హమీదియా మసీదు ఒక చోటే రెండు వేల నమోదు పత్రాలను కాల్చారు. భాయి లండన్‌కు వెళ్ళొచ్చారు. అక్కడి భారతీయ సముదాయ సభ్యులతో మాట్లాడి వచ్చారు. భారతదేశ రాజకీయ నాయకులతో ఉత్తరాల వ్యవహారం జరిపారు. ప్రాణజీవన్ మెహ్తా ఉన్నారు కదా, ఆయనతో డర్బాన్‌లో, రంగూన్‌లో, లండన్‌లో చాలా చర్చ జరిగింది. బ్రిటిషర్లను అణగదొక్కాలంటే ముందు వాళ్ళలా బతకడాన్ని మనం ఆపెయ్యాలి. మన బతుకును, బతికే తీరును మనం మార్చుకోవాలి అన్నారు భాయి. ఆ చర్చనంతా పడవలో తిరిగి వచ్చేటప్పుడు రాశారు. అదే ‘హింద్ స్వరాజ్’ పుస్తకం. అప్పటికి నేను చదివి, ఆలోచించగలిగే దాన్ని అయ్యాను. అది చిన్న పుస్తకమే. నేను కూడా చదివి అర్థం చేసుకున్నాను. ఆ పుస్తకాన్ని చాల మంది మెచ్చుకున్నారు. కొందరు తిట్టారు. మరి కొందరు చదవకూడని పుస్తకం అని నిషేధించారు.
ఆ సందర్భంలో ఒక విచిత్రం జరిగింది. విచిత్రమనికాదు, అది జరిగేదే. భాయి మాదిరిగా సూటిగా ఉండేవాళ్ళకి జరిగేదే. నటాల్ ఇండియన్ కాంగ్రెస్‌లో భాయి విరోధులు పుట్టుకొచ్చారు. ఒక గుంపు ఆయనకు వ్యతిరేకంగా తిరగబడింది. దుష్ప్రచారం చేసింది. వారందరికీ తన పైన ఎందుకు అలాంటి అభిప్రాయం కలిగింది అని భాయి చాలా కలవర పడ్డారు. కానీ నాకు మాత్రం తెలుసు, వారు కడుపుమంటతో ఇలా చేశారని. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఎవరిని అడిగినా భాయి పేరే అందరూ చెప్పేవారు. కడుపు మంటకు కొందరు ఉన్నవీ లేనివీ చెప్పి ఏవేవో పుకార్లు లేవదీశారు. “కొన్ని రోజులు ఊరుకోండి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపొండి, అదేం చేస్తారో చూసేద్దాం, పోరాటం, సత్యాగ్రహం ఒకసారి ఆగిపోనీ, అదేమవుతుందో చూద్దాం” అని నేను కూడా చెప్తూనే ఉన్నాను. నిరంతర నిరసన, సత్యాగ్రహం, కోర్టు కచేరిల చుట్టూ తిరగడం, ఉత్తరాలు రాయడం, నిందలు – ఇవన్నిటితో భాయి చాలా అలసిపోయారు. దానికి తోడు పులి పైన పుట్రలాగా ఈ వ్యతిరేకత ఒకటి.
ఆయనకేమనిపించిందో ఏమో, ఒక రెండు సంవత్సరాలు ఇవన్నిటి నుండి దూరంగా ఉన్నారు. 1912లో అనుకుంటాను. ఫీనిక్స్ ఫార్మ్‌ను ఐదుగురు ట్రస్టీలకు బదిలీ చేశారు. ఐదుగురూ ఐదు మతాలవాళ్ళు. ఐదు దేశాలవాళ్ళు. ఒమర్ హజి, పార్సి రుస్తుమ్ జి, హర్మన్ కాలిన్ బాక్, రిచ్, ప్రాణజీవన్ మెహ్తా. దాన్ని కొనేటప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టి ఉన్నా సరే, ఏ ఆస్తిని కూడా మన పేరిట పెట్టుకోకూడదు అనేది గాంధీ భాయి నిర్ణయం. మీకు నిజమే చెప్పాలి. మాకూ నలుగురు పిల్లలున్నారు కదా అని నా అంతరాళంలో అనిపించింది. పిల్లల పేరిట ఆస్తులు రాయకపోయినా కనీసం ట్రస్టీలనయినా చేసుంటే బాగుండేది అనిపించింది. కానీ నా ఆలోచన భాయి అభిప్రాయానికి ఏ మాత్రం అతకదు అని అర్థం చేసుకుని ఊరకున్నాను.
అక్కడనుండి బయలుదేరేటప్పుడు ఫీనిక్స్ డైరీలో 1913లో ఇలా రాసుకున్నారు. “నువ్వు దుర్బలుడవని నమ్మడానికి నిరాకరించు. అప్పుడు బలశాలివవుతావు”. ఈ ఆలోచనే భాయి బలం. అందుకే సత్యాగ్రహం విజయవంతమయింది.
భుజానికి భుజంగా నిలిచినవారు
ఆ సుదూర దేశంలో ఎంతమంది మా పనుల్లో బాసటగా నిలిచారు తెలుసా? అందులోనూ తెల్లవాళ్ళైనా తెల్లవాళ్ళ ప్రభుత్వంతో చేరకుండా, బ్రిటిష్ వాళ్ళ జత కట్టకుండా మనవాళ్ళుగా నిలిచి మమ్మల్ని కాపాడిన, మార్చిన వ్యక్తులు ఎందరో ఉన్నారు.
హెన్రి పొలాక్ గాంధీ భాయికి ఆప్త మిత్రుడిగా సహాయ పడేవాడు. ఆయన లాయరు. ఆంగ్లేయుడు. అందగాడు, చురుకైనవాడు. మా హరికంటే ఐదారు సంవత్సరాలు పెద్దవాడు. రెండోసారి నేను వెళ్ళడానికి ఒక సంవత్సరం ముందు, 1903లో, పనికోసం వెతుకుతూ జొహాన్స్‌బర్గ్‌కు వచ్చినవాడు. తను స్వతః తెల్లవాడైనా, తెల్లవాళ్ళు నల్లవాళ్ళకు, భారతీయులకు కలిగించే అన్యాయాన్నిసహించేవాడు కాడు. టాల్‌స్టాయి, రస్కిన్ ఆయన ఇష్టులు. శాకాహారి. ఒకసారి శాకాహార హోటల్‌లో గాంధీ భాయిని చూసి, మాటలు విని, మెచ్చుకున్నాడట. దక్షిణ ఆఫ్రికాలో ప్లేగ్ వచ్చినప్పుడు సంపర్కంలోకి వచ్చాడు. వెంటనే స్నేహితుడై పోయాడు. చివరి దాకా భాయి చెప్పినదాన్ని మనసు పెట్టి చేశాడు. ఆయన మాటలు నాకేం అర్థమయ్యేవి కావు. అయినా గాంధీ భాయితో ఆయన చేసే వాదనను బట్టి అదేమిటో ఊహించేదాన్ని. మధ్య మధ్యలో గాంధీభాయి గుజరాతీలో తెలియజెప్పేవారు.
1905లో అతడు పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి చేసుకొమ్మని గాంధీ ఒత్తిడి చేసేవారు. తమ చుట్టూ ఉన్న బ్రహ్మచారులందరూ పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడితే, ఆశ్రమ పనుల పట్ల శ్రద్ధ వహిస్తారు అని ఆయన లెక్క. హెన్రికి ఒక స్నేహితురాలుండేది, మిలి డౌన్స్ అని. ఇతడేమో యూదుడు, ఆమె క్రైస్తవురాలు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, కానీ పెళ్ళి చేసుకోలేదు. హెన్రి నాన్న “ఆ అమ్మాయి సన్నగా ఉంది, పెద్దదవాలి, గట్టిగా తయారవాలి, కండపట్టాలి” అనేవాడు. చివరికి గాంధీ భాయి హెన్రి నాన్నతో మాట్లాడి, ఉత్తరాలు రాసి, పెళ్ళికి తయారు చేశారు. మిలిని జొహాన్స్‌బర్గ్‌కు రమ్మని పిలిపించుకున్నారు. పెళ్ళి నమోదు కావాలి, నమోదు కచేరికి వెళితే తెల్ల వధూవరుల పెళ్ళికి గోధుమ రంగు భాయి సాక్షి సంతకం పెట్టవచ్చునా అని మ్యాజిస్ట్రేట్ గారికి సందేహం కలిగింది. కనుక్కుని పెట్టుకుంటాను, మరుసటి రోజు రమ్మన్నారు. ఆ మరుసటి రోజు ఆదివారం అయింది. అందుకే సోమవారం రమ్మన్నారు. సోమవారం కొత్త సంవత్సరం సెలవు రోజు. మంగళవారం రమ్మన్నారు. కానీ వీటి గురించి అడిగేవారు ఎవరు? ఉన్నారుగా మన లాయరుగారు. వాదించి వాదించి అదే రోజు పెళ్ళి జరిగి తీరాలని వాదించారు. చివరికి సాక్షి సంతకం పెట్టి, ఆ రోజే హెన్రి-మిలిలను దంపతులను చేసి, వాళ్ళను ఇంటికి తీసుకొచ్చారు.
దంపతులను ఆహ్వానించడానికి ఒక హారతి లేదు, అక్షింతలు లేవు. మా ఇంటికే వచ్చారు. అప్పటి దాకా ఇంట్లో మేమిద్దరం, మా పిల్లలు, ఛగన్, గోకుల్ ఉన్నాం. ఇప్పుడు మా కుటుంబం పెద్దదయింది. మిలి తెల్లవాళ్ళ అమ్మాయి. క్రైస్తవ మతం. నాకు ముందు కొద్దిగా మొహమాటమనిపించింది. నాకు ఆమె భాష రాదు. నా మాటలు కూడా తక్కువే. వాళ్ల ఆహార వ్యవహారాలు ఎలాగో అని అనిపించింది. కానీ మిలి చాలా మంచి పిల్ల. నాతో, పిల్లలతో చాలా తొందరగా కలసిపోయింది. పిల్లలకూ తనంటే చనువు పెరిగింది. ఇంగ్లీష్ నేర్పించసాగింది. ఆహారం కూడా అంతే. మనవాళ్ళలా అదే కావాలి, ఇదే కావాలి అనరు తెల్లవాళ్ళు. ఏది దొరికితే అది తినేసి కడుపు నింపుకుంటారు. ఆమె మా వంటింటికి కూడా చాలా తొందరగా సర్దుకుపోయింది.
అంతా మగ మూక మధ్య మిలి రాక నాకెంతో సంతోషాన్నిచ్చింది. నాతో మాట్లాడేటప్పుడు గాంధీ భాయి కొద్దిగా ధ్వని పెంచితే చాలు, నా పరంగా వాదన ప్రారంభించేది. “మీ తూర్పు వైపు భర్తలు, మీ మీ భార్యలను పరిచారికలుగా చేసుకున్నారు” అనేది. భాయి ఒకసారి సత్యవంతుడు, సావిత్రి కథ చెప్పి “చూడు. ఇండియాలోని భార్యలు ఇలాగే, చావులోనూ తోడుంటారు. అది మా సంస్కృతి” అన్నారు. దానికామె “ఇదే నేను చెప్పింది. మొత్తానికి ఆడది ఒక రకంగా కాకపోతే ఇంకో రకంగా మగవాడి సేవలు చేసేలా పెట్టుకున్నారు. చచ్చిపోయినా భర్తను బ్రతికించి తీసుకు వచ్చి ఆయనకు సేవలు చేస్తేనే ఆమెకు మోక్షం అని చెప్పడానికి ఈ కథను అల్లారు” అన్నారు. గాంధీభాయికి ఆడవాళ్ళ ఈ రకం వాదన కొత్తది. నాకూ అంతే. కానీ, భాయి ఆ వాదనను ఒప్పుకున్నారు. ఆలోచించసాగారు.
నన్ను గాంధీ భాయి ‘హరి అమ్మా’ అనే పిల్చేవారు. లేదా ‘నా పిల్లల తల్లి’ అనే పరిచయం చేసేవారు. మాకు అదేమంత ప్రత్యేకత అనిపించేది కాదు. దంపతులను వారి మొదటి సంతానం పేరిట వాళ్ళ అమ్మ, నాన్న అని పిలిచేది మాలో వాడుక. నేను కూడా ఆయనను ‘హరి నాన్న’ అనే పిలిచేదాన్ని. లేదా గాంధీ పేరుకు భాయి చేర్చి పిల్చేదాన్ని. ఒక రోజు మిలి ఈయనను “ఈమె మీకు మీ పిల్లల తల్లిగా కాకుండా ఇంకేమీ కాదా?” అని అడిగింది. మిలి, హెన్రి వారి వారి పేర్లతో పిలవడం గమనించి తనకేమనిపించిందో ఏమో, తరువాత నన్ను కస్తూర్ అని పిలవసాగారు. పెళ్ళయిన కొత్తదనపు వేడిలో మేమిద్దరమే ఉన్నప్పుడు కస్తూర్ అనే పిలిచేవారు. ఇప్పుడు అది అందరి ఎదుట పిలిచే పిలుపయింది.
మిలి, హెన్రి కూర్చుని నవ్వుతూ, ఒకరినొకరు తాకుతూ, మాట్లాడుతూ భోజనం చేసేవారు. చివరికి అప్పుడప్పుడు బిగియార కౌగలించుకుని ముద్దు పెట్టుకోవడం కూడా కద్దు. మాకూ మొదట బిడియం కలిగేది. నేనైతే చూడలేక చీరకొంగును పూర్తిగా మొహం పైకి లాక్కునేదాన్ని. మన దేశం నుండి ఇక్కడికి వచ్చినవాళ్లకి అదంతా ఆశ్చర్యకరమైన సంగతి. ఒకసారి మా బావగారి కొడుకు ఛగన్ లాల్ “ఇదేమిటి? ఆడవాళ్ళు, మగవాళ్ళు ఒకే టేబల్ పైన కూర్చుని భోంచేస్తారా? పార్సిలు, క్రైస్తవులు, హిందువులు, ముస్లిములు అంతా ఒకేచోట కూర్చుని భోజనం చెయ్యొచ్చా పిన్నీ?” అని ఆశ్చర్యంతో అడిగాడు. వారందరికీ అది ఎందుకు తప్పు కాదు అని విడమరచి చెప్పేటప్పుడు నాకు భాయి అంతకు ముందు చెప్పింది అర్థమయ్యేది. లోపలికి దిగుతూ పోయేది. భాయి చెప్పినప్పుడు ఒప్పుకోని నా మనసు వీరికి చెప్పేటప్పుడు అర్థం చేసుకునేది.
నేను మారింది ఇలాగే. వింటూ, నిరాకరిస్తూ, విన్నది చెప్పేటప్పుడు లోపలికి దించుకుంటూ..
జొహాన్స్‌బర్గ్ నుండి నేను, నా పిల్లలు ఫీనిక్స్‌కి వచ్చాము. తరువాత ఇంకో ఇంటికి పొలాక్ దంపతులు వెళ్ళారు. వారితో పాటు ఉండడానికి గాంధీ భాయి కూడా వెళ్ళారు. మిలికి తన ఇంటిని పరదాలు, గోడచిత్రాలతో అలంకరించాలని ఆశ. కానీ గాంధీ భాయికి అవన్నీ వ్యర్థమైన ఖర్చులని భావన. గోడకున్న లొసుగులను కప్పిపుచ్చడానికి వేద్దామని ఆమె అంటే, గోడను చూడకు కిటికీ నుండి బయటికి చూడు, మనిషి తన చేత్తో చేసే కళలకంటే ప్రకృతి ఎంత అందంగా ఉందో అనేవారు గాంధీ భాయి. “చక్కెర వద్దు, అది కూలీల జీతంతో తయారవుతుంది. పాలు, ఉల్లిపాయలు వద్దు, అవి కామోద్రేకం కలిగిస్తాయి” అన్నారు. మిలి చక్కెర, ఉల్లిపాయలు వదిలేసింది. కానీ పాలు వదలడం కష్టమయింది. “అయితే పాలను ఎందుకు సంపూర్ణ ఆహారం అంటారు?” అని అడిగింది. “పాలు పిల్లలకు మాత్రమే ఉత్తమం, పెద్దలకు కాదు” అన్నారు భాయి. “మొత్తం జొహాన్స్‌బర్గ్‌లో బహుశా ఏమి తినాలి ఏమి తినకూడదు అని ఎవరి ఇంట్లోనూ ఇంత చర్చ జరిగుండదు” అనేది మిలి. “నోటినుండి ఏ మాట బయటికి వస్తుందన్నది ముఖ్యం. నోట్లోకి ఏమి పంపుతామన్నది కాదు” అనేవారు భాయి.
ఇలా భాయి చెప్పినదాన్నంతా ప్రశ్నించేది, వాదించేది. ప్రతిదాన్ని చర్చించే ఒప్పుకునేది. శాకాహారం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, సర్వోదయం, ఆంగ్ల శిక్షణ, యంత్ర విరోధం.. ఇలా దేన్ని కూడా, బహుశా నేను దేన్ని భాయికి చెప్పలేక ఊరుకునేదాన్నో వాటన్నిటినీ తను చెప్పినట్టు ఆమె మాటల తీరు అనిపించేది. తను స్త్రీవాదిననేది. ఆ పదాన్ని ఆమె ద్వారానే విన్నాను నేను. చివరికి స్త్రీవాదం అంటే ఆమెలా ఆడపిల్లలు బుద్ధిమంతులై, ధైర్యస్థులై, స్వతంత్రంగా ఉండడం అని అర్థం చేసుకున్నాను. అదెంత వాదించినా, భాయి పైని గౌరవం మాత్రం ఆమెకు తగ్గలేదు. ఆయన దైహిక శ్రమ, జాలి, దృఢ నిర్ణయాలు ఆమెకు చాలా నచ్చేవి. భాయి అని నోరారా పిలిచేది. అన్నలా చూసేది. తరువాత ఎప్పుడో తమ కొడుకు అకాలిక మరణం చెందినప్పుడు తమ దుఃఖాన్ని గాంధీ భాయి ఉత్తరాలే అన్నింటికంటే శాంతపరిచాయి అని రాసుకుంది.
హెన్రితో ఒకసారి ఎంత వాదించారంటే, అబ్బబ్బ.. గంటలకొలది ముగియలేదు. నాకు కొన్ని సార్లు భాయి పైన ఎందుకు కోపం వచ్చేదో, హెన్రికి కూడా అలాంటిదేదో జరిగుండాలి అని ఆయన చర్యల వల్ల అనిపించింది. చివరికి మిలినే అడిగాను. తనకు నేను గుజరాతిలో అడిగినా అర్థమయేది. తను చెప్పిన ప్రకారం పిల్లలకు గుజరాతి చెప్పించడానికి అంత సమయం ఎందుకు వ్యర్థం చేస్తావు, మంచి ఆంగ్ల భాష నేర్పించు అని అతడు, మాతృభాష గుజరాతి ముందు నేర్చుకోవాలి అని భాయి. ప్రజలతో ఉత్త ధార్మిక విషయాలే కాదు, ఆర్థిక విషయాలు కూడా మాట్లాడాలి అని అతడు, ధార్మికంగా బ్రతకడం నేర్చుకోకుండా ఉత్త ఆర్థికంగా ప్రబలులైతే అపాయకారి అని భాయి. నాకూ ఒక్కోసారి ఉత్త సత్యం, ధర్మం అంటారు కదా, ఒక్కసారైనా ఈ మనిషి డబ్బుల గురించి ఆలోచించరు కదా అనిపించేది. అదీ మన దేశం నుండి వచ్చేవాళ్లతో బావగారు డబ్బులు పంపమని గుర్తు చేయమని చెప్పడం విని అలా అనిపించేది. కానీ భాయి ఆలోచనలే వేరుగా ఉండేవి. వాటిని మాకు కూడా అర్థమయ్యేలా చెప్పి ఒప్పించేవారు.
భాయికొక సెక్రెటరీ ఉండేది. సోన్యా శ్లేసిన్ ఆమె పేరు. ఆమె కూడా మిలి మాదిరే. వాళ్ళిద్దరినీ చూస్తే నాకు బలే ఇష్టం. వాళ్ళిద్దరినీ తలచుకుంటే ఎందుకో గంగా యమునా నదుల చిత్రం మనసులో వచ్చేస్తుంది అమ్మాయ్! సోన్యా హరిలాల్ కంటే కొంచెం చిన్నది. మణికంటే పెద్దది. భాయిని ‘బాబా’ అనే పిలిచేది. గాంధీ భాయి అంటే మిక్కిలి గౌరవం. ఆయనకోసం తను-తనది అనే అన్నిటినీ వదిలి చాలా పనులు చేసింది. తెల్లది, యూదు, యురోపియన్, జర్మన్, స్త్రీవాది అని తనను తను చెప్పుకునేది. తన అభిప్రాయం, దృష్టికోణాన్ని చెప్పడానికి ఎప్పుడూ వెనుకాడేది కాదు. కార్యదర్శిగా గాంధీభాయికున్న నూటెనిమిది కక్షిదారులు, వాళ్ళ అనేక విధాల పనులు, విచిత్రమైన ఆహారపు అలవాట్లు, శ్రుతి మించిన క్రమశిక్షణ, సమయం మీరే పనులు అన్నిటినీ తట్టుకుని చూసుకునేది. తనూ సత్యాగ్రహిగా మారింది. పోరాట సమయంలో మహిళలను పోగు చేసేది. నాయకులు, మగవాళ్ళు జైళ్ళలో ఉన్నప్పుడు జైలు నుండి జైలుకు సైకల్ తొక్కుతూ సమాచారాన్ని చేరవేసేది. డబ్బు సేకరించింది. భోజనాలు తీసుకెళ్ళింది. హెన్రి, మిలి, కలెన్ బాక్ వీరంతా దేశ విదేశాల వారికి ఉత్తరాలు రాసి భారతీయుల పోరాటానికి తను, మన ధన సహాయం అడిగితే ఈమె భాయి వెనుక ముందు ఉంటూ ఆయన పనులు చేస్తూ ఉండేది. ఉత్తరాలు రాయడానికి గానీ, డైరీ రాయడానికి గానీ ఆయనకు తీరిక ఉండేది కాదు.
ఆడవాళ్ళ పట్ల హిందూస్తాన్ మగవాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుంది అని మీకందరికీ తెలుసు. భాయి మనసు కూడా అందుకు భిన్నంగా ఉండేది కాదు. అది మారింది దక్షిణ ఆఫ్రికాలోనే. భారతీయ మగవాళ్ళు తండ్రిగా, సోదరుడిగా, భర్తగా, కొడుకుగా కూడా ఆడ దేహాన్ని అనుభవించే దృష్టితోనే చూసేవారే తప్ప స్నేహితురాలిగా చూడరు. అలాగని ఈ ఇద్దరూ గాంధీ భాయికి తెలియజెప్పారు. మిలి, సోన్యా అడుగడుక్కీ మీ భారతీయ మగవాళ్ళు మీ భార్యను, ఆడపిల్లలను ఎలా చూసుకుంటారని అడిగేవారు. వాళ్ళిద్దరే భాయిని, బాపును చాలా మార్చారు. వాళ్లతో పాటు భాయి సత్యాగ్రహంలో నిజాయితీగా పాల్గొని, వచ్చిందంతా రానీ అంటూ దూసుకెళ్ళిన తమిళ ఆడవాళ్ళను కూడా తలచుకోవాలి. మహిళలను పోరాటానికి తీసుకు రావడం ఎంత ముఖ్యం అని భాయికి తెలియచెప్పిందే వీరు.
నన్ను వెనుకా ముందు చూసుకునే మోక: ఎవరితో మాట్లాడాను, ఎక్కడ కూర్చున్నాను అనేదాన్ని కూడా వివరించాల్సిన మోక: ఇంటి నుండి బయటికి అత్తగారితో దేవాలయానికి వెళ్ళడానికి కూడా తన అనుమతి తీసుకునే వెళ్ళాలి అనే మోక: చివరికి రెండు సార్లు బాలింతరాలిగా సేవలు చేశారు. నా గుడ్డలు ఉతికారు. పిల్లల గుడ్డలు ఉతికారు. వంట చేసేవారు. ఇల్లు, ముంగిలిని చిమ్మి, చెట్లకు నీళ్ళు పట్టి, స్నానాల గదిని శుభ్రంగా తోమి కడిగేవారు. తన చుట్టూతా ఉన్న మగవాళ్ళకు కూడా ఆడదాన్ని ఉత్త కామ దృష్టితో కాకుండా స్నేహం, గౌరవంతో చూడాలని తెలియ చెప్పారు. దాన్నే మా ఇంటి మగపిల్లలకు కూడా నేర్పారు. సత్యాగ్రహ సమయంలో కారాగార వాసానికి భయపడకుండా ముందుకొచ్చిన తమిళ ఆడవాళ్ళను చూసిన భాయి, గురి చేరేదాకా పట్టు వదలకుండా పోరాటం చెయ్యడానికి ఆడవాళ్ళే సరి అని తెలుసుకున్నారు. మళ్ళీ మళ్ళీ ఆ విషయాన్ని ఎత్తి చూపారు. మొత్తానికి ఆడవాళ్ళ గురించి భాయి ఆలోచనల్లో వచ్చిన మార్పుకు ఆయన చుట్టూ ఉన్నఆడవాళ్ళ ప్రభావం చాలా ఉంది.
(సశేషం)