నేను.. కస్తూర్‌ని-13

0
2

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

[dropcap]అం[/dropcap]త సేపటికి ఒక కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళి వచ్చాము. అక్కడ భాయికి మాట్లాడే అవకాశం ఉండింది. భారత సమావేశంలో పెద్దవారైన రాజకీయ నాయకులు క్రమశిక్షణన్నది లేకుండా వచ్చి పోవడం చూసి బాపుకు చాలా అసహ్యం పుట్టింది. ఆయన సమయ పాలనలో దక్షుడు. సరైన సమయానికి రావడం, సరైన సమయానికి పోవడం. అందులో కొంచెం కూడా తేడా వచ్చినా సహించేవారు కాదు. కాని అక్కడ జిన్నా, తిలక్ లాంటి పెద్ద నాయకులే సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. తిలక్ గారు ముప్పావు గంట ఆలస్యంగా వచ్చారు. “సమయపాలన పాటించకుండా సభకు ఆలస్యంగా వస్తే స్వరాజ్యం కూడా ఆలస్యంగానే వస్తుంది” అని బాపు చురక ముట్టించారు. జిన్నా ఇంగ్లీషులో మాట్లాడారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా నాయకులు మాట్లాడాలి. జిన్నాగారు గుజరాతి-హిందూస్థాని నేర్చుకోవాలి అన్నారు భాయి. స్వరాజ్య ఉద్యమం బలహీన పడడానికి రెండు ముఖ్య కారణాలు. ఒకటి అందులో మహిళలు లేకపోవడం. రెండు రైతులతో పాటు అక్షరాస్యులు చేరకపోవడం అని తమ ప్రసంగంలో చెప్పేశారు. నన్ను ఆయన ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళి, అన్నిటినీ వివరించి తెలియజెప్పేవారు కనుకనే నాకివన్నీ తెలుసు. కానీ చాలా మంది వాళ్ల భార్యలకు ఇలా చెప్పేవారు కారు. పిల్చుకు రావడమంటూ అడగనవసరం లేదు.

ఒకసారి బాపుకు ఆయన మిత్రుడు అమృతలాల్ థక్కర్ ఒక ఉత్తరం రాస్తూ తన పరిచయంలో ఉన్న ఒక హరిజన కుటుంబం ఆశ్రమానికి వచ్చి ఉండాలని ఆశపడుతోంది, వీలవుతుందా అని అడిగారు. ఆశ్రమం నియమాలను అనుసరిస్తూ ఉండేటట్టయితే రావచ్చు అని బాపు తెలిపారు. ముంబైలో శిక్షకులుగా ఉన్న దుదాభాయి, ఆయన భార్య దాని బెహన్, వాళ్ళమ్మాయి లక్ష్మి వచ్చారు.

కాని దుదాభాయి-దాని బెహన్ వచ్చింది కొందరికి ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే వారు అస్పృశ్యులు. ఇప్పుడు చెప్పాలంటే సిగ్గుగా ఉంది, కానీ వాళ్ళ రాక నాకు కూడా ఇబ్బందే అనిపించింది. మగన్ లాల్‌కు కూడా కష్టమనిపించింది.

నాకు అస్పృశ్య సముదాయపు జనుల పైన ప్రేమ, జాలి అన్నీ ఉండేవి. వారిని అలా చూడరాదు, అది ధర్మం కాదు అని కూడా తెలుసు. అదే కాక దక్షిణ ఆఫ్రికాలో విన్సెంట్ మా ఇంటికి వచ్చినప్పుడు జరిగినది కూడా గుర్తుంది. కానీ అస్పృశ్యులతో ఎలా బతికేది అని మనసులో ఇంకా రూపుదాల్చలేదు. దుదా-దాని ఇద్దరూ తమ అమ్మాయి లక్ష్మితో ఆశ్రమానికి వచ్చినప్పుడు బాపు వారిని అందరికీ పరిచయం చేశారు. మిగిలినావరికి ఎలాగైతే శ్రమదానం పంచారో అలాగే వారికీ పంచారు. కానీ వారి జాతి తెలిసినప్పుడు, నాకూ, మగన్ కూ చాలా కష్టం కలిగింది. అస్పృశ్యులు అనగానే మా తండ్రిగారింట్లో ఇంటి అరుగు బయట లెట్రిన్ రూమునుండి అశుద్ధాన్ని ఎత్తుకుని వెళ్తున్న భంగి గుర్తొచ్చాడు. నాకయితే వాడి పేరు కూడా తెలియదు. ఇంటి ఎదురుగ్గానే మొదట లెట్రిన్ గది ఉండేది. బయటనుండి బయటే అశుద్ధాన్ని ఎత్తుకుని వెళ్ళాలి కదా. అందుకే మా లెట్రిన్ గుంతనుండి గోకి తీసి అశుధ్ధాన్ని ఒక కుండలో నింపి ఊరి బయటకు తీసుకెళ్ళి ఒకచోట పారేసేవాడు. అతడి ఒళ్ళంతా దుర్గంధం, మురికి. ఒక రోజు అతడు రాకపోతే, రావడం ఆలస్యమయితే మా గతి ఇక అంతే. ఇల్లంతా వాసన కొట్టేది. మాకంతా అశుద్ధం పైన, అది నిండిన మా ఒంటి పైన అసహ్యం వేసేది. నాకు మొదటే అలాంటి అసహ్యం ఎక్కువ. ఇప్పుడు తెలిసొచ్చిందేమంటే అలాంటి మన ఒంటి పైని అసహ్యాన్ని అశుద్ధం రూపంలో, దాన్ని మోస్తున్న భంగిపై మోపేవాళ్ళం అని. ఒక మనిషి దగ్గరికి, అది కూడా అతడి తల పైన మనకే అసహ్యమనిపించే మన అశుద్ధాన్ని మోపేవాళ్లం కదా, మేమెంత కఠినాత్ములు అని ఇప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ ఆరోజు దుదా-దాని వచ్చినప్పుడు అశుద్ధం పైనున్న అసహ్యం పామువలె పడగెత్తి మనుషుల పైన ఎలా తిరిగిందో అని భయం వేస్తుంది. కానీ బాపుకు అలా కాదు. ఆయనకు అశుద్ధమన్నా అసహ్యం లేదు, దేహమన్నా లేదు. భంగిల పైనా లేదు. ఆయనకు అన్నీ సహజం, అన్నీ సత్యం.

దుదా-దాని ఉండడం వల కలిగిన అసహనం బాపుకు కూడా చేరుండాలి. ఒక రోజు సాయంత్రం ప్రార్థన తరువాత, ఎవరికి ఆశ్రమంలో ఉండడం కష్టమనిపిస్తుందో వారు ఆశ్రమం వదిలి వెళ్ళవచ్చు అని బాపు నిర్మొహమాటంగా చెప్పేశారు. మగన్ వెళ్ళిపోయాడు. ఆరు నెలల తరువాత మళ్ళీ వచ్చాడు, అది వేరే సంగతి. కానీ నేనెక్కడికి వెళ్ళను? భర్త అడుగుజాడలలో నడవడం భార్య కర్తవ్యం, ఆయన మాదిరి వెళ్తే పాపం అంటదు అనుకుని నేను ఒప్పుకున్నాను. కానీ అందరితో పాటు ఉండడం ప్రారంభించాక తెలిసింది నేనెంత అధర్మపరురాలనో, అజ్ఞానినో అని. ఎంత పాప పంకిలమైన విషయాన్ని నేను తలలో ఉంచుకున్నాను అని తెలిసి సిగ్గుపడ్డాను. నాకు చాల సార్లు ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేది అనిపించేది. ఇప్పుడొక ఆడపిల్ల లక్ష్మి వచ్చింది. ఆ పిల్ల చాలా చురుకు. చురుకుగా ఉండేది. లొడలొడ మాట్లాడేది. ఒకటి తరువాత ఒకటి  ప్రశ్నలు అడిగేది. ఆమె ఆశ్రమానికి వచ్చి తిరగడం ప్రారంభించాక అందరి సంబరమే వేరుగా మారింది.

ఆశ్రమానికి మా భవనపు యజమానిగారి బావినుండే నీళ్ళు దొరికేవి. హరిజనులు నివసించడం చూసిన నీళ్ళు చేది వేసే పనివాడు కోపగించుకున్నాడు. అందరు ఆశ్రమవాసులనూ అస్పృశ్యులుగా చూడడం మొదలుపెట్టాడు. ఆశ్రమవాసుల చెంబునుండి ఒక రెండు నీళ్ళ బిందువులు తన పైన పడినా చాలు, ఎగిరెగిరి పడేవాడు. దుదాభాయి-దాని బెహన్ల పైన ఒకట్రెండు సార్లు నోరు చేసుకున్నాడు. అందర్నీ తనకొచ్చిన తిట్లన్నిటితో తిట్టాడు. అయినా మేమెవ్వరమూ ఒక మాటైనా తిరిగి చెప్పలేదు. మా ఓపిక చూసి అతడు డంగైపోయాడు. ఇదీ ఒక రకమైన సత్యాగ్రహమే అయ్యింది.

ఈ విషయం ఊరంతా వ్యాపించింది. ఆశ్రమానికి వచ్చే డబ్బు ఆగిపోయింది. ఆశ్రమవాసులను సామాజిక బహిష్కారం చెయ్యాలని వినిపించసాగింది. ఏం చెయ్యాలి అని మేమంతా చింతాక్రాంతులై ఉన్నప్పుడు ఎక్కడికో బయటికి వెళ్ళిన బాపు వచ్చారు. అస్పృశ్యులు ఉన్నారన్న కారణానికి బహిష్కరించదలచిన సమాజాన్ని మనమే బహిష్కరిద్దాం, అస్పృశ్యుల వాడకే ఆశ్రమాన్ని తరలించి వారితో పాటు కూలినాలి చేసి బ్రతుకుదాం అన్నారు. ఇదంతా జరిగి ఒక వారం అయ్యేంతలో అమదావాదుకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త అంబాలాల్ సారాభాయి వచ్చారు. ఆశ్రమ నిర్వహణకోసం పదమూడు వేల రుపాయలు ఇచ్చి వెళ్ళారు.

ఇలాగే ఏవేవో సవాళ్లు, సమస్యలు వచ్చాయి. కొన్ని పరిష్కారమయ్యాయి. కానీ ఈ సంఘటన ఆశ్రమవాసులు అస్పృశ్యత గురించి మనసు పెట్టి ఆలోచించడానికి, అస్పృశ్యత నివారణకొరకు పని చెయ్యడానికి పురికొల్పింది అన్నది మాత్రం నిజం.

ఆశ్రమవాసం అంత సులభంగా ఉండేది కాదు. బాపు కొన్ని కొన్ని రోజులకు ఒక్కో కొత్త నియమాన్ని చేర్చేవారు. “ఇక పైన ఎవరూ చక్కెర తినరాదు, బెల్లం తినాలి”, “ఇకపైన ఎవరూ, ఏ కారణానికి కానీ, అస్పృశ్యతను ఆచరించరాదు”, “ఇకపైన ఎవరూ, ఏ కారణానికి కానీ దగ్గిర డబ్బు ఉంచుకోరాదు. అకస్మాత్తుగా ఆశ్రమవాసులకు డబ్బు దొరికినా దాన్నిఆశ్రమం లెక్కలోకిచ్చి, పట్టీలో రాయాలి”, “ఇక పైన ఎవరూ, ఏ కారణానికి కానీ ఆశ్రమ కచేరికి తెలియకుండా ఏ వ్యవహారమూ చెయ్యరాదు” – ఇలా. కొన్ని సార్లు నియమాలను మరచిపోయి ఏవేవో తప్పులు చేసేసేవాళ్ళము. అప్పుడు, దాన్ని ప్రార్థన తరువాత అందరి ఎదుట, చేసినవారి ఎదుటనే చెప్పి, మేము చేసిన తప్పుకు తను ఉపవాసం కూర్చునేవారు బాపు. ఇలాంటి చిన్నా చితకా ఉపవాసాలను గణనలోకి తీసుకుంటే తమ జీవితంలో ఎన్ని రోజులు తిన్నారో అన్నిరోజులు ఉపవాసం చేశారు.

ఒకసారైతే, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. మా అమ్మ వ్రజాదేవి కూడా నాన్నకు తెలియకుండా ఎక్కడో ఒక చోట నాలుగు డబ్బులు దాచుకునేది. నువ్వైనా పెట్టుకునేదానివా లేదా చెప్పు? మగవాళ్ళు, పెద్దవాళ్ళు లేనప్పుడు ఏదో కష్టానికి సుఖానికి అని ఏదైనా ఖర్చు వస్తే మన వద్ద ఉండనీ అని మా అమ్మైనా, అత్తగారైనా, అంతెందుకు నేను చూసిన అందరు ఆడవాళ్ళు పెట్టుకునేవారు. డబ్బు సంపాదించేవాళ్ళు కాదు కదా ఆడవాళ్ళు. అందుకే తమది అని కొంత డబ్బు పెట్టుకునే ఆశ కలిగేదేమో! మా ఆశ్రమానికి వచ్చినవాళ్ళలో కొందరు “ఉంచుకోండి. మహాత్మగారు లేనప్పుడు దేనికైనా ఉంటుంది” అని రెండో మూడో రుపాయలు ఇచ్చి వెళ్ళేవారు. చాలా మట్టుకు వాటన్నిటినీ చేర్చి ఆశ్రమం లెక్కకే ఇచ్చేసేదాన్ని. ఒకసారి ఇలాగే నాలుగు రుపాయలయ్యాయి నా వద్ద. ఇవ్వాలా, నా వద్దనే ఉంచుకునేదా అన్న ద్వంద్వం కలిగింది మాత్రం నిజం. ఆ సమయానికి ఆశ్రమానికి ఒక దొంగోడొచ్చి అన్నిటినీ బయటకు లాగి నా గుడ్డలను చెల్లా చెదరు చేసి వెళ్ళాడు. అప్పుడు ఆ నాలుగు రుపాయలు బయటపడ్డాయి. అయిపోయింది. మరుసటి రోజు ప్రార్థన సమయంలో, అంతా ముగిసిన తరువాత మొదలు పెట్టేశారు బాపు. చెప్తూ చెప్తూ చివరికి “ఇది నా భార్య చేసిన దొంగతనం. అందుకే నేను దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను” అనేశారు.

అవునమ్మాయ్! నాలుగు రుపాయలకు, నాలుగే నాలుగు రుపాయలకు నేను నా భర్త దృష్టిలో దొంగనయ్యాను. నాకయితే గుండె పగిలి చచ్చిపోయినట్టనిపించింది. ఆ సీతామ తల్లిని భూమి మింగేసినట్టు నన్నూ అలా చేసుండరాదా అనిపించింది. సీతామాతకూ అలాగే కదా! తన భర్తనుండే అవమానం, సందేహం రెండూ ఎదిరించింది. తప్పయిపోయింది అని అందరినీ క్షమాపణ అడిగి లోపలికి వెళ్ళిపోయాను. నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు అప్పుడప్పుడు అది కావాలి, ఇది కావాలి అని పట్టు పట్టేవారు. అవేం అంత పెద్దవి కావు. అలాగని చాలా చిన్నవీ కావు. ఇప్పుడు నీకు చెప్తే ఇంత చిన్న విషయమా అని నవ్వుకుంటావేమో! అలాంటి వాటికి పనికొస్తుందని లేదా ఏదైనా రోగమో, రొష్టో వస్తే ఉండనీ అని పెట్టుకున్న డబ్బు అది. అదీ ఎంత? నాలుగు రూపాయలంటే నాలుగు రూపాయలు. దానికి వెలనే కట్టలేనంత పరువు తీశారు బాపు. చేసిన తప్పును సార్వత్రికం చేస్తే అది పాపం అవదు అన్నది ఆయన అభిప్రాయం.

దక్షిణ ఆఫ్రికాలోని ఫీనిక్స్ ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇలాగే జరిగింది. దేవదాస్‌కు టైఫాయిడ్ జ్వరం వచ్చి నోరంతా రుచి లేకుండా నిశ్శక్తిగా ఉన్నాడు. ఏడెనిమిది సంవత్సరాల అబ్బాయి అప్పుడు. “నాకు పంచదార వేసిన కషాయమే ఇవ్వు. బెల్లానిది అక్కర్లేదు” అంటూ మొండిపట్టు పట్టాడు. ఒక వైపు వీడి మొండితనం, ఇంకోవైపు వాడి తండ్రి నియమం. నేను అమ్మనవ్వాలా, పెళ్ళానిగా కర్తవ్యం నిభాయించాలా అని గందరగోళం. చివరికి బాపుకు తెలియకుండా ఎవరి వద్దో పంచదార తెప్పించి కషాయం చేశాను. అది బాపుకు తెలిసింది. నన్ను ఒక్క మాట కూడా అవునా అని అడగలేదు. ఎందుకని నిలదియ్యలేదు. మరుసటిరోజు ప్రార్థన తరువాత “నా భార్యే నేను పెట్టిన నియమాన్ని పాలించకుండా ఉల్లంఘించుతోంది. ఆమె ఆత్మశుద్ధి కొరకు నేను మూడు రోజులు ఉపవాసం చేస్తాను” అన్నారమ్మా! అప్పుడు నా పరిస్థితి ఎలా అయ్యిందో ఊహించు!! ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఎన్నో రోజులు ఎవరికీ మొహం చూపకుండా అయింది. ఈ ఆశ్రమం, ఈ మహాత్ముడు అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవాలి. సబర్మతినదిలో పడి సమాధి కావాలి అని అనిపించింది. కానీ ఎక్కడికని వెళ్ళేది ? దేనికీ ధైర్యం లేదు. బాపు కాకుండా నాకు ఇంకో ప్రపంచమే తెలియదు.

చివరికి నాకు బాధ కలిగింది అని బాపుకు తెలిసింది. ఒక సాయంత్రం. నా గదిలో నేనొక్కదాన్నే కిటికీ నుండి బయటికి చూస్తూ ఊరికే కూర్చున్నాను. ఎందుకో నాకు నావాళ్లు ఎవ్వరూ లేరు అనిపించింది. బా వైపునుండి బాపుకు చెప్పడానికి ఎవరూ లేరు. మహదేవ్, మగన్, మీరా, దేవదాస్ అందరూ మౌనంగానే ఉన్నారు. పాణిగ్రహణం చేసిన భర్తే నన్ను ముట్టుకోరు, మెచ్చుకోరు అన్నాక ఇంకెవరు నా వైపుంటారు? అందరికీ ఆయనకున్నంత నిర్లక్షమే నా పైన ఉందనుకుని ఊహిస్తూ క్రుంగిపోయాను.

అంతలో గదిలోకి బాపు వచ్చారు. అనుకోకుండా వచ్చారు. ఆయనను చూడగానే కోపమో, బాధో, ఒంటరితనమో కొంగులో మొహం దాచుకుని విలవిలా ఏడ్చాను. ఇన్నాళ్ళూ దాచుకున్న దుఃఖమంతా వెల్లువై వచ్చి వెక్కి వెక్కి ఏడ్చాను. బాపు నా చెయ్యి పట్టుకుని వేళ్ళు నిమురుతూ, అరచెయ్యి నొక్కుతూ ఊరికే కూర్చున్నారు. “కస్తూర్. ఇదొక అగ్నిపరీక్ష. దేశానికి దిక్కుగా మారాలంటే మనల్ని మనం కాల్చుకోవాలి. రెండు కాల్చిన కుండలను ఒకదాని పక్కన మరోటి పెడ్తే ఏమవుతుంది? పగిలిపోవా?  అలా కాకూడదని, మొద్దుబారాలంటే మనల్ని మనం కాల్చుకోవాలి. ఇది అలా కాల్చుకునే ప్రక్రియ. నేను కూడా నిరంతరం కాల్చుకుంటూ ఉన్నాను నా ప్రాణమా! మనం అందరిలా కాదు. సత్యాగ్రహులంగా బ్రతకాలి. బాధపడేదాని కంటే ప్రాయశ్చిత్తం లేదు. ఇంత చాలు. ఇంకా బాధపడుతూ కూర్చోకు. మనకు ముందింకా చాలా చెయ్యవలసి ఉంది. అధిగమించవలసిన మార్గం చాలా ఉంది. దుఃఖిస్తూ కాలయాపన చెయ్యవద్దు. లే” అంటూ నా రెండు చేతులనూ పట్టుకుని కళ్ళకద్దుకుని, తల నిమిరి బయటకు వెళ్ళిపోయారు.

క్షణార్ధంలో నా దుఃఖం, అవమానం, సందేహాలు అన్నీ జర్రున దిగిపోయాయి. రాట్నం ఎదురుగ్గా కూర్చున్నాను. బాపు చెప్పింది నిజం. కాల్చుకుంటేనే పచ్చిగా ఉన్న కుండ గట్టిపడుతుంది. ఇంతకు ముందు ఇలాంటి సంఘటన జరిగింది. బాపు ఎత్తి చూపించారు. అయినా జారిన చోటే నేను మళ్ళీ మళ్ళీ జారుతున్నానెందుకు? అస్పృశ్యత గురించి కూడా అలాగే అయ్యింది. డబ్బు విషయంలోనూ అంతే. చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను. అలా కాకుండా ఉండాలంటే నేను లోతుగా ఆలోచించాలి అనుకున్నాను. నా చేతిలోని రాట్నం తిరుగుతూ పోయనట్టల్లా నేను లోతుల్లోకి దిగుతూ పోయాను.

అవును. ఆ సమయానికి ఆశ్రమంలో ఒక కొత్త పాఠం నేర్చుకోవడం మొదలయింది. అదే రాట్నం. పేదవాళ్ళు, ఇళ్ళు లేనివాళ్ళు, భూములు లేనివారు, అన్ని జాతులవారు, పల్లె ప్రజలు స్వతంత్రంగా బ్రతకాలంటే స్వంత ఉద్యోగమొకటే దారి అని బాపు భావించారు. మన దేశంలో వ్యవసాయం నమ్ముకున్న ప్రజలు ఎక్కువ. వారికి సంవత్సరం పొడూతా, రోజంతా పనులుండవు. అలాంటి వారికి చేతినిండా పని దొరకాలి, కొంత ఆదాయమూ లభించాలి, ఉపయోగమూ కావాలి అలాంటి పని ఏది అని ఆలోచించి, ఆలోచించి చివరికి రాట్నం నుండి నూలు వడికే పనిని ఎన్నుకున్నారు. తినడానికి తిండి, కట్టుకోను బట్ట, చేతినిండా పని కోసం రాట్నం, అందరూ నేర్చుకుందాం అన్నారు.

ముందు అందరి ఇళ్ళల్లోనూ రాట్నాలుండేవి. తీరిక ఉన్నప్పుడల్లా ప్రజలు నూలు వడికేవారు. తాము వడికిన నూలును నేతగాళ్లకిచ్చి బట్టలు తయారు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు రాట్నాలు, వడికేవాళ్ళు నేపథ్యానికి జారుకున్నారు. వడోదరా దగ్గరి ఒక ఊరు, విజాపుర్ అని. అక్కడికి వెళ్ళాము. అక్కడున్నవాళ్ళంతా అత్యుత్తమ నేతగాళ్ళు అని పేరుగాంచారు. ఇప్పుడు నేతగాళ్ల ఆదాయం తక్కువ, ఎవరూ అడగడం లేదు అని రాట్నాలను అటకకు ఎక్కించేశారు. వాటిని దించమని వేడుకున్నాము. వాళ్ల బట్టలకు కావలసిన నూలును వాళ్ళే వడకడం, తరువాత ఆశ్రమంలోని చేతిమగ్గాలలో బట్టలు నేయడం అని నిర్ణయించబడింది.

నూలు వడకడం, బట్టలు నేయడం అందరూ నేర్చుకోవాలని నిర్ణయించబడింది. ముందు మాకు ఆ పని చేతనవుతుందా అని సందేహించాం. తరతరాలుగా దాన్నే చేస్తూ వచ్చిన వాళ్ళకు దాని సూక్ష్మత తెలుస్తుంది కానీ, తక్కెడ పట్టుకుని సామాను అమ్మిన మాకు లేదా మాలాంటి ఇతరులకు కష్టమే అనిపించింది. కానీ బాపు ప్రకారం జాతికొక పని అని లేదు, నేర్చుకుంటే ఏదీ కష్టం కాదు. అది మనకు చేతకాదు అనుకుంటే రాదు అంతే. నేతకంటే ముందుగా వడికేది అందరూ నేర్చుకోవచ్చు. అందుకే దాన్ని నేర్చుకుందాం అన్నారు. ముందుగా తను నేర్చుకున్నారు. తరువాత అందరికీ నేర్పారు. ఆశ్రమానికి వచ్చిన వారందరికీ రాట్నం నేర్పారు. అందరూ కొంచెం సేపు కూర్చుని నూలు వడికి తీసి వెళ్ళేవారు. బాపు నూలు వడికే ఫోటో తియ్యలంటే, దాని గురించి మాట్లాడాలంటే రాట్నం వడికేది నేర్చుకుని తీరాలి. ఆయనకు అది ఎంతగా అలవాటయిపోయిందంటే తను చచ్చిపోయేటప్పుడు కూడా తన ఒక చెయ్యి రాట్నం పైన ఉండాలి అనేవారు! దక్షిణ ఆఫ్రికాలో ఉన్నప్పుడే సరళత లేకుండా అహింస వీలుకాదు అని, అన్ని విధాల రాట్నానికి వెనుతిరగడంలోనే భారతపు ఉనికికి దారి అనేవారు.

నాకు మొదట ఇది వీలవుతుందా అనిపించింది. కానీ రాను రాను తెలిసింది, ఇది నాకోసమే ఉంది అని. నూలు వడకడం నాకు అతి ఇష్టమైన పనిగా మారింది. నిజానికి రాట్నం తిప్పడం ఒక అద్భుతమైన పని. అదీ కూర్చున్న చోటనే కూర్చుని, మాట్లాడకుండా ఉండడాన్ని ఇష్టపడే నాలాంటివాళ్ళకు అతి ప్రియమైన పని అది. నేను వడకడం నేర్చుకున్నాను. బాపు వడకడం నేర్చుకున్నారు. ఆశ్రమానికి వచ్చేవాళ్ళందరికీ నూలు వడకడం నేర్పేవాళ్ళం. ఆశ్రమంలోని అందరూ నూలు వడికేవాళ్ళు. బాపు ఆశ్రమంలో ఉండడమే తక్కువ కాబట్టి, వడకడంలోనే నేను ఆయన సాహచర్యం గుర్తించుకున్నాను. రోజులు గడిచే కొద్దీ నాకంటే తొందరగా నూలు వడకడం నేర్చుకున్నావు అని నవ్వేవారు.

వడికేది అంటే ధ్యానం. ఒకే ధాటిగా ముళ్ళు పడని దారాలను వడకాలి. ఒక చేత్తో రాట్నం తిప్పుతూ, మరో చేత్తో నిదానంగా పత్తిని వదులుతూ, నూలును లాగుతూ ముడి పడకుండా కండేనికి చుట్టుకునేలా చెయ్యాలి. లాగే బలం ఎక్కువగా ఉండరాదు, అలాగని తక్కువ కూడా కాకూడదు. రాట్నం వేగం ఒకే రకంగా ఉండాలి. ఉన్నట్టుండి ఆపకూడదు. ఒక్కసారిగా తిప్పడమూ కూడదు. మెల్ల మెల్లగా వేగం పుంజుకుంటూ పత్తి దారంగా మారడం, అది కండేనికి చుట్టుకోవడం. మన బ్రతుకులు కూడా అలా ముళ్ళు లేకుండా నూలు వడకడానికి రాట్నాన్ని తిప్పినట్టే కదా? రాట్నాన్నితిప్పడానికీ, మనం పత్తిగా ఉండి, దారంగా మారి, కండేనికి చుట్టుకుని, బట్టగా మారి బ్రతుకు సాగడానికీ అదెంత సామ్యమో కదా?

రాట్నం వల్ల దేశానికి అయ్యే  ప్రయోజనం ఒక వైపైయితే, ప్రతి ఒక్కరికీ కలిగే అనుభవం దానికంటే పెద్దది. దాని ఎదురుగ్గా కూచుని నూలు వడుకుతూ వడుకుతూ సమయం గడిచిందే తెలిసేది కాదు. అందులోనూ మన తలకాయలో రాట్నంలా తిరుగుతున్న విషయమేదైనా ఉంటే ఇక అంతే. తిప్పి తిప్పి  అలసిపోయి రాట్నం నుండి లేచేంతలో నూలులా చుట్టుకుని మనసుకు సమాధానం కలిగేది.  జపమణి తిప్పుతూ చేసే జపానికంటే వడకడం అత్యంత ఉత్తమమైన పూజ. తిరిగే రాట్నం చప్పుడు లయకు ఒక రకమైన శాంతి ఆవరించేది.

అవునమ్మాయ్! రాట్నంతో వడకడమంటే మనల్ని మనం చూసుకోవడం. ప్రశ్నా మనమై, జవాబూ మనమై మనల్ని మనం వెదుకుకోవడం. వడుకుతూ, వడుకుతూ నా ఎన్నో సమస్యలకు రాట్నమే జవాబు ఇచ్చింది. జడంగా ఉన్నవాటిని, జడులుగా ఉన్నవారినీ తిరిగేలా చేసే శక్తి ఆ చిన్న రాట్నానికి, పత్తికి, నూలుకు ఉంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here