నేను.. కస్తూర్‌ని-16

0
1

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

[dropcap]ర[/dropcap]వీంద్రనాథ టాగోర్ గారికి డెబ్భై సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు తమ బ్యాలె గుంపుతో శాంతినికేతనానికి నిధి సంగ్రహణకు బయలుదేరారు. బాపుకు కూడా ధనసహాయం కోరి ఒక ఉత్తరం రాశారు. వెంటనే బాపు, ఆయనలాంటి మహాకవి, వ్యక్తి ఇలా జోలె పట్టుకుని ఊరూరూ తిరగరాదు, అలా తిరిగితే శాంతినికేతన్ నడపడం భవిష్యత్తులో కూడా కష్టం కావచ్చు, దానికంటే మూసేయడమే మంచిది అని ఉత్తరం రాశారు. ధనసహాయం అని వాళ్ళని వీళ్ళని అడిగి 60,000 రుపాయలు సంగ్రహించి పంపారు. అంత సొమ్మూ ఒక జి.డి. బిర్లాగారే ఇచ్చారు. కానీ తమ పేరుతో పంపవద్దని చెప్పారు.

సేగాంవ్ ఒక కుగ్రామయితేనేమి, ఆశ్రమానికి ఎవరెవరు వచ్చి వెళ్ళారు అని లేదు. అక్కడికి వెళ్ళగానే వచ్చినవాళ్ళలో డాక్టర్ ఒకరు. అంబేడ్కర్ గారిని మేమంతా డాక్టర్ గారనే పిలిచేది. ఆయనను బాపు ఇంతకు ముందు ఒకటి రెండు సార్లు కలిశారు. ఆయన అస్పృశ్యుల కొరకు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు అని వార్తలు వచ్చేవి. అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశం, చెరువు నీళ్ళు త్రాగే పోరాటం ఇలా నడుపుతున్నారు అని తెలిసేది. ఆయన కూడా మాలాగే చదువుకుని, ఆలోచించి, సేవలకు దిగిన మనిషి అని తెలుసుకున్నాము. కానీ అదెందుకో కొన్ని రోజుల తరువాత బాపు పైన ఆయన కోపగించుకున్నారట. అలాగని బాపునే ఒకట్రెండు సార్లు మాటల మధ్యలో చెప్పడం విన్నాను. ఆయన ఒకమారు బాపును కలవడానికనే వచ్చారు. ఆయన వెళ్ళిపోయిన తరువాత ఎవరు ఈ డాక్టరుగారు, అస్పృశ్యుల గురించి ఇంత శ్రద్ధ వహిస్తున్నారు అని బాపు మహదేవను అడిగారు. చివరికి తేలింది ఆయన కూడా అస్పృశ్యులే అట. బాపుకు అది తెలిసుండలేదు. ఆ తెగకు చెందిన మనిషి ఇంత ఉన్నత శిక్షణ గడించి, ఇంత సూక్ష్మంగా ఆలోచించి మాట్లాడగలరని బాపు అనుకోలేదు. లేదా అలాంటివారు మా సంపర్కానికి ఇంతవరకూ రాలేదు. స్వతః అస్పృశ్యులుగా ఉంటూ, సమాజం యొక్క నిర్లక్ష్యాన్ని అనుభవించడం వల్లనే, ఇంత నిర్మొహమాటంగా, సూటిగా మాట్లాడుతున్నారు అని అనుకున్నాము.

ఎందుకో ఇద్దరికీ ఒకసారి విరోధమయ్యింది. డాక్టర్ గారు అడుగుతున్నదానికి బాపు వద్దు అన్నారట. అలా అడిగినదాన్ని వెనిక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తూ బాపు పుణె జైలులో ఉపవాసం ప్రారంభించారు. ఇక చచ్చిపోతారేమో అనేంత వరకూ వెళ్ళింది. గాభరాపడి నేను, దేవదాసు డాక్టర్ గారింటికి వెళ్ళాము. చాల దుఃఖంలో ఉన్న, బాధపడిన వ్యక్తిలా కనిపించారు. నాకన్నా, బాపుకన్నా చాలా పొడగరి. గంభీరమైన ముఖం. ఆయనను చూడగానే జ్ఞాని అనిపించేటట్టున్నారు. చాలా బాగా, స్పష్టంగా మాట్లాడేవారు. మరాఠి, హిందీ, గుజరాతి, ఇంగ్లీష్ అన్నీ వచ్చేవి. బాపు ఉపవాసంతో చచ్చిపోతారు, అలా కాకుండా దయచేసి సహాయం చెయ్యండి అని ఆయనను అడగడానికి వెళ్ళాము. నేనే చేతులు జోడించి అడిగాను. నాకు గొంతు పెగలకుండా కన్నీరు బయటకు వచ్చింది. మరి నేనే ఆయనను బ్రతికించుకోవాలి కదా! ఈ మారు చాలా నిశ్శక్తులయ్యారు. చచ్చే పోతారు అనిపించింది. నా పిల్లల వయస్సున్న డాక్టర్ గారి ఎదుట బాపును దయచేసి బ్రతికించండి అని కొంగు చాపి ప్రార్థించాను. నేను ఇక్కడ ఇలా మాట్లాడుతుండగా, అక్కడ బాపు తమ చివరు శ్వాస వదిలేస్తారేమో అనే భయం వెన్నాడుతోంది. అదెందుకో నాకు తెలియకుండానే దుఃఖం తెరలు తెరలుగా పొంగి వచ్చింది. డాక్టర్ గారు అంతవరకూ మాట్లాడుతున్నవారు, ఒక్కసారిగా నా కళ్ళల్లో కళ్ళుపెట్టి చూసి గమ్మునయిపోయారు. నిజంగా పెద్ద మనిషి ఆయన. తరువాత ఒకే మాట “మీరు అడిగినందుకు ఒకే మాట చెప్పెయ్యడం సులభం అమ్మా. కానీ కోట్లకొలది ప్రజలు నన్ను అడుగుతారు. ఇంత పోరాటం జరిపి, లండన్ దాకా వెళ్ళి ఏం న్యాయం తీసుకొచ్చారు అని. వాళ్ళకు నేనేం చెప్పాలి చెప్పండి?” అని అడిగారు. నాకు ఆయన చెప్పింది అంతగా అర్థం కాలేదు. దేవదాసు, మహదేవ తరువాత చెప్పారు.

కానీ, బాపుకు ఆయనకు ఎందుకో అంతగా స్నేహం బలపడలేదు.

అంబేడ్కర్ గారు వచ్చినప్పుడు బాపు కుటీరం ఇంకా పూర్తవలేదు. ఏవో పనులు జరుగుతున్నాయి. అయినా అర్జెంటుగా మాట్లాడాలని నాగపూర్ నుండి వచ్చారు. చెట్టుకింద ఒక రాతి చప్టా పైన కూర్చుని మాట్లాడారు. ఆయనను వదిలి రావడానికి మహదేవ వెళ్ళినప్పుడు అతడి వద్ద చాలా భావుకులై, డాక్టర్ గారు అస్పృశ్యత యొక్క అవమానాల అనుభవాలను చెప్పుకున్నారట. దాన్నివిని తనకు చాలా బాధేసింది అన్నాడు మహదేవ. “ఇప్పుడు అస్పృశ్యులకు తోడుగా వారి బాధలను పంచుకోవడానికి చాలా మంది తయారుగా ఉన్నారు కదా. పరిస్థితి చక్కబడుతుందిలెండి” అన్నాడట మహదేవ్. “అంటే అస్పృశ్యత అలాగే ఉండనీ, మీరు బాధపడుతూనే ఉండండి. మేము మీతో ఉంటాము అంటున్నారా మీరు?” అని ఆయన అడిగారట ఎలాంటి మాట అది! అస్పృశ్యులం కాని మాలాంటివాళ్ళకు ఇలా అనిపించడం సాధ్యమా? అది మహదేవ్‌ను ఎంత వణికించింది అంటే తిరిగి వచ్చినాక చాల రోజుల పాటు దాని గురించే చర్చ జరిగింది. అస్పృశ్యత విషయం వచ్చినప్పుడల్లా డాక్టర్ గారి అభిప్రాయాన్ని గురించే పదే పదే చర్చ జరిగేది. ఆయన, ఆయనలాంటి వారితో ఉండి తీరాలని నిర్ణయించుకున్నారు. నిజం చెప్పాలంటే డాక్టర్ గారి అభిప్రాయం గురించిన చర్చ జరిగినప్పుడే నాతో కలిపి మావాళ్ళు అస్పృశ్యులకు ఎలా అన్యాయం చేశాము అని అర్థమయ్యింది!

వర్ధాకు వచ్చి రెండు సంవత్సరాలయ్యిందేమో! మండుటెండల్లో నేను పదే పదే మూర్చపోయేదాన్ని. దేహశ్రమ అయితే చాల కష్టంగా ఉండింది. ఇంట్లోని పని మాత్రం చేసుకునేదాన్ని. దుమ్ముకో ఏమో దమ్ము ఎక్కువవుతో ఇబ్బంది పెట్టసాగింది. ఒక వైపు హరి వేసే వేషాలు నా మనసుకు గుచ్చుకుంటుంటే ఇంకో వైపు నా అనారోగ్యం. ఎందుకో చాలా ఒంటరిదాన్నయినట్టనిపించేది. ఇక ఈ జీవితం చాలు అనిపించిన రోజులవి. ఇంతకు ముందు ఆశ్రమాలలో మగన్ ఉన్నాడు. ఇప్పుడు అతడు లేనందువల్ల మహదేవ పైన చాలా బాధ్యత. ఎవరికీ తీరిక ఉండేది కాదు. నేను మాట్లడడానికి గాని, నాతో మాట్లాడడానికి గానీ ఎవరూ లేరు. అందరికీ బాధ్యతల బరువు. మొత్తం దేశపు బాధ్యత మరి. నా ఒంటరితనపు బావిలో నేనే మునిగి లేచేదాన్ని. ఇది బాపుకూ తెలిసుండాలి. చివరికి నన్ను శిమ్లాకు పంపారు.

అమృతా ఉంది కదా. రాజకుమారి కౌర్. అక్కడ ఆమె ఇల్లుండేది. పెద్ద ఇల్లు. మన్రో విల్లా దాని పేరు. ఆపిల్ తోటకూడా ఉంది. అప్పడు ఆమె మా ఆశ్రమవాసి కారు. సత్యాగ్రహికూడా కాదు. కానీ బాపును గమనించిందామె. అప్పుడప్పుడు వచ్చేది. ఉత్తరాలు రాసేది. ఆ సంవత్సరం వేసవి గడిచేదాకా ఆమె ఇంట్లోనే ఉన్నాను. ఆశ్రమ జీవితం, అక్కడ ఉన్నవారు, వచ్చి వెళ్ళేవాళ్ళు, అక్కడ నివాసమున్న వాళ్లకున్న స్వాతంత్ర్యం అన్నిటి గురించి అడిగి తెలుసుకున్నారు. తనకు తీరిక, డబ్బు చాలా ఉంది. ఈ ఏకాంతం మొహం మొత్తింది. జనాల నడుమ ఉండాలనిపిస్తుంది. ఆశ్రమానికి వచ్చేసి, బాపు, ఇతరులతో కలిసి సేవలోకి దూకాలనిపిస్తుంది అనింది. ఆమె తండ్రి సిక్కుల రాజు, తల్లి క్రైస్తవ మతస్తురాలు. ఇంగ్లీష్ నేర్చుకుంది. బుద్ధిమంతురాలు, ఆలోచించేది. కానీ, చర్చ్ కానీ, గురుద్వార కాని తన అంతఃశోధనకు తృప్తినివ్వడం లేదు. అందుకే సత్యాగ్రహం, అహింస, ఉపవాసం, ప్రార్థనల ఆశ్రమ జీవనం వైపు మనసు లాగుతోంది అన్నది. ఆమెకు ఆశ్రమ జీవనం గురించి వివరంగా మాట్లాడాను. ఆశ్రమమంటే అక్కడ ఏకాంతమూ ఉంది, సమాజమూ ఉంది. అందరూ ఉన్నా నువ్వు ఒంటరిగా ఉండవలసి రావచ్చు. ఏకాంతమూ, సహవాసమూ కావలసినప్పుడు దొరకక పోవచ్చు. సంతలో ఉన్నా కబీరులాంటి సంతుల్లా ఏకాంతాన్ని ఆవాహించుకుని పాడాల్సివస్తుంది. బాపుతో పని చెయ్యడానికి, ఆశ్రమంలో ఉండడానికి ఇంత తయారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆలోచించు అన్నాను. నేను వర్దాకు వచ్చేసిన తరువాత వరసగా ఉత్తరాలు రాసింది. చివరికి ఒక రోజు నగలు, దుస్తులు, సంపద అంతా వదిలేసి ఆశ్రమవాసిగా ఉండడానికి వచ్చేసింది. ఆమె బాపు కార్యదర్శిగా చాలా పని చేసింది. మహదేవకు చాలా బరువు తగ్గింది.

ఆశ్రమంలో ఎల్లప్పుడూ ఒకరు కాకపోతే ఒకరు రాజకీయ నాయకులు, పోరాట యోధులు ఉండేవారు. బాపుతో చర్చలు జరిపేవారు. వల్లభ భాయి పటేల్ గారు, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా అజాద్, సి.ఎఫ్. ఆండ్ర్యూస్, చక్రవర్తి రాజగోపాలాచారి లేదా రాజాజి ఇలాంటివారంతా చాలా సార్లు వచ్చారు. జవహర్ అంటే బాపుకు చాలా ప్రేమ. భారతం యొక్క భవిష్యత్తు అతడివద్ద ఉంది అనేవారు. చాల బుద్ధిమంతుడు, చురుకు. సరోజిని కూడా వచ్చేది. ఆమెతో పాటు ఆమె పిల్లలు కూడా వచ్చేవారు. బ్రిటిష్ అధికారులు ఆశ్రమానికి వచ్చేవారు. వీళ్ళే కాకుండా దేశపు ఇతర భాగాల సత్యాగ్రహులు, విద్యార్థులు, విలేకరులు, విదేశీ స్నేహితులు, సాహితీవేత్తలు, ధార్మిక వ్యక్తులు వచ్చేవారు.

ధార్మిక వ్యక్తులు ఎందుకు వచ్చేవారు అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. బాపు అన్ని మతాల పండితులతో లోతుగా చర్చించేవారు. హిందు, ఇస్లాం, జైన్, సిఖ్, క్రైస్తవ అలాగే ఇతర మతాల ధార్మిక విషయాలను తెలుసుకునేవారు, చదివేవారు. తమ ప్రార్థనలలో ఒక్కొక్కటిగా ఇతర మతాల అంశాలను ప్రవేశపెడుతూ పోయారు. ప్రతి రోజూ కొంచెం ఆలస్యమైనా భగవద్గీత చదివేవారు. ఆయన ఉన్నచోటికి అన్ని మతాల వారు వచ్చేవారు. నరసి మెహ్తా పాట ఉండేది కదా. పరపీడ చేయనివాడే పరమ వైష్ణవుడు అని గాఢంగా నమ్మేవారు. ఆశ్రమంలో ఎక్కడా పూజాగృహం అని ఉండేది కాదు. నిర్గుణ భక్తి ఆయనది. బాపు ఒంటి పైన జుట్టుకానీ, జంధ్యంకానీ, ఊర్ధ్వపుండ్రంకానీ ఏదీ ఉండేది కాదు.

ఇలాంటి వారు కాక ఆశ్రమానికి కొంతమంది ఊరకే, ఆశ్రమ దర్శనానికని వచ్చేవారు. వారంతా బాపును సాధుసంతుల కొనసాగింపుగా, భారతదేశం నుండి ఆంగ్లేయులను పారద్రోలడానికి పుట్టిన అవతార పురుషుడిలా చూసేవారు. ప్రార్థనల్లో పాలు పంచుకునేవారు. ప్రార్థన తరువాత ఎవరికైనా, ఏమైనా అడగడానికి అరగంటపాటు అవకాశం ఉండేది. అప్పుడు బాపు మాట్లాడేవారు. దర్శనానికి వచ్చినవారు తమ వ్యక్తిగత కష్టాలను, తమ ఊరు కష్టాలను, సమాజ-జాతి-పిల్లల ఏవేవో కష్టాలను చెప్పుకునేవారు. బాపు ప్రశాంతంగా, కొన్ని సార్లు కళ్ళు మూసి వాటికి బదులిచ్చేవారు. అది వారికి దైవవాక్యమే అనిపించి బాపు కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసేవారు. నా కాళ్ళకూ చేసేవారు. బాపుకు ఇబ్బందిగా అనిపించి వద్దనేవారు. మహదేవకు అలాంటివి ఈ ఆశ్రమంలో ఉండవని ముందుగానే చెప్పమని ఆదేశించేవారు. కానీ వచ్చినవాళ్ళు వినాలి కదా! అవకాశం దొరికిందే చాలు అని కాళ్ళకు పడేవారు. బాపుకు చేతులెత్తి నమస్కరించేవారు, ఒళ్ళు నిమిరేవారు, ఏడ్చేవాళ్ళు, కళ్ళు మూసుకుని కూర్చునేవారు. ఇలాంటి వారి దృష్టిలో బాపు ఒక మహాత్ముడు. ఆయన చేసినదంతా లీల. చెప్పినదంతా వాక్కు. తమకు జరిగిందంతా మహిమ. చాలా మటుకు అందరూ ఏదో ఒకటి తెచ్చేవారు. తమ పొలంలోని ధాన్యం, పళ్ళు, కూరగాయలు, పప్పుదినుసులు ఇచ్చేవారు. ఆశ్రమానికి చందాగా డబ్బులిచ్చేవారు. ప్రార్థన తరువాత కాకుండా ఇతర సమయాల్లో వారికి ఇలా కలిసే అవకాశం తక్కువగా ఉండేది. పరిచితులు, ఉద్యమ నాయకులు, ఆప్తులు, అధికారులు మాత్రమే కలిసేవారు. అన్ని ఊళ్ళల్లో ఇలాంటి వారు బాపు మహాత్మ్యం గురించి చెప్పేవారు.

అప్పటికి కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం నడుపుతోంది. కానీ కాంగ్రెస్ వాళ్ళ లంచగొండితనం, సోమరితనం, పక్షపాతం మితి మీరుతోంది. ఇది బాపుకు చాలా బాధ కలిగించే సంగతి. “దేశం యొక్క 35 కోట్ల ప్రజల్లో ఒక కోటి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారేమో కదా? వీళ్ళ ప్రవర్తన నాకు చాలా అసహ్యం కలిగిస్తోంది. నేను ఆ కోటి మందిలో ఒక్కణ్ణి కాను. మిగిలిన 34 కోట్లల్లో ఒక్కణ్ణి. కాంగ్రెస్ యొక్క పావలా సభ్యుణ్ణి కూడా కాను” అనేశారు ఒకసారి. పార్టీలోని శ్రీమంతులు, పేద కార్యకర్తల మధ్య ఉన్న తేడా ఆయనకు చాలా బాధ కలిగించింది. 1920లోనే రాట్నం, పాననిరోధం, అస్పృశ్యతా నివారణ పనులు ప్రారంభించినా అవి కొనసాగలేదు. వాటి గురించి కాంగ్రెస్ వాళ్ళు గంభీరంగా ఆలోచించనేలేదు. దీనివల్ల కూడా బాపు విసుగుచెంది రాజకీయాల నుండి దూరమవుతాను అనేవారు.

ఆయనే కాదు, ఆయన భార్యనైన నేనే రాజకీయాల్లో ఇంతగా మునిగిపోయాను అంటే ఇక బాపు ఎలా దాన్నుండి దూరమవడానికి వీలవుతుంది? దానికి తోడుగా, దేశంలో ఏవేవో సంఘటనలు దేశంలో ఒక దాని పైన ఒకటి సంభవించాయి. ఎక్కడెక్కడో, ఎవరెవరో, ఏమేమో చేసేవారు. వాటినంతా ఒక తాటి పైన తేవడానికి వీలుకాక, మా నియంత్రణలో లేకుండా ప్రమాదాలు జరగడం కూడా కద్దు. అలాంటప్పుడు బాపు ఉపవాస దీక్ష చేపట్టేవారు. ప్రార్థన చేసేవారు. అలాగే తమ అభిప్రాయం తెలపడానికి ఉత్తరాలు రాసేవారు. ఏదైనా కానీ, మితి మీరి అపాయం కాకుండా ఉండేట్టు ఏమైన చెయ్యడానికి ప్రయత్నించేవారు.

వేరే వేరే పత్రికలకు వేరే వేరే భాషల్లో రాసేవారు. మా పత్రికకూ రాసేవారు. అవికాకుండా లెక్కకు మీరి ఉత్తరాలు వచ్చేవి. అన్ని ఉత్తరాలకూ బాపు బదులు రాసేవారు. వేలకు వేలు ఉత్తరాలు రాశారేమో ఆయన! సబర్మతి నదీ జలాలు ఆయన పెన్నులోకి ఇంకులా ప్రవహించి అవన్నీ ఖాళీ కావేమో అనేటట్టు రాసేవారు. ఆయనకు ఎప్పుడైనా సమయం దొరకక పోయినట్టైతే ఏం రాయాలని మహదేవ్ ఆయనను అడిగి తనే రాసేవాడు. మరికొన్నింటిని ప్యారేలాల్, అమృత్ కౌర్ రాసేవారు. ఎన్నో ఉత్తరాలను చూడడానికి గానీ, రాయడానికి గానీ సమయమే దొరకకుండా ఉండే అవకాశాలూ ఉండేవి. కానీ రాసే ఉత్తరాలు తగ్గలేదు. వేలకొలదీ ఉత్తరాల పోగు. ఉత్తరానికి బదులు, ప్రతిక్రియకు ఉత్తరం, కోపానికి ఉత్తరం, ప్రేమకు ఉత్తరం ఇలా అందరినీ తమ బాహువుల్లో తీసుకునే బాపు ఆత్మీయతకు సమయమే సరిపోయేది కాదు. ఆయన ప్రేమను పంచుకోవడానికి ఆశ్రమంలో ఒకరి కంటే ఒకరు, అంతెందుకు మొత్తం ప్రపంచమంతా ఆశ్రమంతో పోటీ పడినట్టు అనిపించేది. వాళ్ళందరి మధ్యలో ఆయన పంచ కొసను పట్టుకుని నిల్చున్నాను నేను.

బాపు ఇరవై ఒక రోజులు ఉపవాసం చేపట్టారు కదా. కాబట్టి ఆయన ఆరోగ్యం పాడయిందని శిక్ష అవధికి ముందుగానే విడుదలయ్యారు. నన్నూ విడుదల చేశారు. అయితే నాదింకా ఆరునెలల శిక్ష బాకీ ఉంది. చివరికి బాపు ’ హరిజన సేవా సంఘం’ యాత్రకు అని తొమ్మిది నెలలు వర్ధా నుండి బయలుదేరినప్పుడు నేను కూడా నా శిక్ష అవధి ఇంకా ఆరు నెలలు మిగిలుంది అని గుర్తు చేసి, వైస్రాయికి ఉత్తరం రాసి జైలువాసినయ్యాను. బాపు ఎక్కడికి చేరేవారో అక్కడినుండి నేనున్న జైలుకు ఉత్తరం రాసేవారు. ఉత్తరంలో ఏముండేది? “పళ్ళ సెట్ వేసుకుంటున్నావా? దాన్ని పొటాషియం పెర్మాంగనేట్‌తో కడుగుతున్నావా? నీతో పాటు ఉంటున్న ఖైదీలకు వారు ఎలాంటివారైనా సరే సేవ చెయ్యడం నీ ధర్మం. మరవకు. క్రిమినల్ అపరాధాలు చేసిన ఆడవాళ్ళను కూడా అక్కచెల్లెళ్ళలా ప్రేమించు” అని రాసేవారు.

నవ్వకమ్మాయ్! బాపు ప్రేమ, దాని రీతి ఇలాగే!!

ఇలాంటి బాపును అందరూ ప్రేమించేవారా అని అడగొచ్చు మీరు. లేదు. ఆయన పైన కోపగించుకునేవారు, ద్వేషించేవారు, వాదించేవారు, నిర్లక్షించేవారు, హేళన చేసేవారు ఉండేవారు. కానీ ఎవరైతే సత్యశోధనలో భాగంగా చర్చకు వచ్చేవారిని ఆయన గౌరవించేవారు. నొప్పించేవారికి తాను బాధపడడం తప్ప ఆయన వద్ద బదులుండేది కాదు. ఆయన కార్యకలాపాలు, సిద్ధాంతాలను విమర్శించి ఆయనకు చెప్పేవారు చాలా తక్కువ. ఆశ్రమంలో నేను, మహదేవ, కొన్ని సార్లు రాజాజి భాయి. ఆశ్రమం బయట దేశంలో “మీరు చేస్తోంది మాకోసం కాదు” అంటూ జిన్నా గారు, అంబేడ్కర్ గారు అనేవారు. అలాంటివారిని తమ వద్దనే ఉంచుకుని తన ప్రయత్నాలను, విచారధారను తెలుసుకోవడానికి, విమర్శించడానికి వీలు కల్పించేవారు బాపు. ఒకేసారి మౌనంగా వాళ్ళతో చర్చ జరిపేవారు. కానీ నేనేమైనా అడిగితే, నీకు తెలుసు కదా అనేసేవారు. నన్ను రోజూ ఇంత దగ్గరనుండి చూస్తావు కదా, అందులోనే అన్నీ జవాబులున్నాయి అనేవారు.

ఒకసారి ఆశ్రమానికి సంబంధించినట్టుగా ఏదో ఇబ్బంది కలిగింది. అనేక రకాల ఇబ్బందులు వచ్చేవి. ఆశ్రమవాసుల నడుమ గందరగోళం. తను, మన, ధనాల మధ్య తికమక మొదలైనవి. అప్పుడు బాపు మౌనం, ప్రార్థన, ఉపవాసాల ద్వారా బదులు కనుక్కునేవారు. ఒకసారి నేనే చెప్పాను. “ఊరుకోక గీరుకున్నారు అన్నట్టు, ఎందుకింత కష్టపెట్టుకుని ఆశ్రమం చేసుకుని, అంతే కష్టాలతో నడపాలి? మీరు బోధిసున్న ఆదర్శాలను పాటిస్తూ అందరూ వాళ్ళవాళ్ళ ఇళ్ళల్లో ఉంటే చాలు కదా? జవహర్ గారు లేరా? పటేల్ గారు లేరా? రాజాజి గారు లేరా?” అన్నాను.

అందుకు బాపు “నేనేం బోధిస్తున్నానో దాని సాకారం ఈ ఆశ్రమం. ఇది విఫలమవుతోంది అని మీకు అనిపిస్తే దానర్థం నేను, నా సిద్ధాంతాలు విఫలమయ్యాయనే అర్థం. కానీ అది సఫలమవడానికి ఏమేం చెయ్యాలో అవన్నిటినీ చెయ్యడానికి నేను సిద్ధం. ఈ ఆశ్రమం, ఈ గ్రామాల కంటే నాకు నా జీవితం గురించి చెప్పాల్సిందేమీ లేదు బా. మనం అనుకున్నట్టు జీవించడమే సత్యం. అలా సత్యంగా నడుచుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండడమే అహింస. పిల్లలకు జన్మనివ్వడానికి మాత్రమే లైంగికత. మిగిలిందంతా బ్రహ్మచర్యం. ఈ మూడు తత్త్వాలకు తోడుగా అందరూ కలసికట్టుగా, సామూహికంగా బ్రతకడం ఇక్కడ పొందుపరచబడింది. ఇది సత్యాగ్రహులను తయారు చెయ్యాలి. సేగాంవ్ లాంటి ఒక కుగ్రామం భారత దేశపు ఆదర్శ గ్రామం కావాలి. ప్రతి పల్లె కూడా ఇలాగవ్వాలి. ఇది నా కల. అది సాకారం కావడానికే ఆశ్రమం కావాలి” అన్నారు.

బాపు ప్రకారం ఆదర్శ గ్రామం అంటే గాలి-వెలుతురు ఉండే సరళమైన ఇళ్ళ ఊరు. చుట్టు ప్రక్కల ఐదు మైళ్ళ దూరంలో దొరికే వస్తువులతోనే ఇల్లు కట్టాలి. వీధుల్లో చెత్త, దుమ్ము ఉండకూడదు. అన్ని ఇళ్ళకూ పెరడు ఉండాలి. అందరూ తమకు కావలసిన కూరగాయలు పండించుకోవాలి. పశు సంపద, పెంపుడు జంతువులను పెట్టుకోవడానికి వీలవ్వాలి. అందరికీ కలిపి ఉళ్ళో ఒక బావి, ఒక పూజాస్థలం, ఒక సభాభవనం, ఒక పసరిక బయలు, స్థానిక వ్యాజ్యాలు తీర్చడానికి ఒక పంచాయితీ ఉండాలి. సహకార పాల కేంద్రం ఉండాలి. చేతి పనులు, శ్రమతో కూడిన పనులు, కనీస విద్య నేర్పించే ఒక పాఠశాల ఉండాలి. అలాంటి గ్రామం ఆదర్శ గ్రామం. వర్ధా ఒక ఆదర్శ గ్రామం కావాలి. అలాగే దేశమంతటా అలాంటి గ్రామాలను నిర్మించే కార్యకర్తలు తయారవాలి అనే ఆ ఆశ్రమ ధ్యేయం.

ఒక రకంగా బాపు చెప్పేది సబబే. మేము పోరుబందర్ లేదా రాజకోట్ ఇంట్లోనే ఉండుంటే శ్రమ గురించి తెలియడం కానీ, జాతి భేదాల్లేని సామూహిక జీవితం, సర్వమత ప్రార్థన, పిల్లలకు మాతృభాష శిక్షణ ఇవన్నీ వీలయ్యేదా? వడకడం, నేయడం, మన పొలంలోనే అదీ సామూహిక యాజమాన్య భూములో వ్యవసాయం చెయ్యడం వీలయ్యేదా? భారతదేశ వివిధ ప్రాంతాల, భాషలవారు ఒకచోట చేరి ఇలా బ్రతకడానికి మన ఇళ్ళల్లో ఉంటే వీలు పడేదా? పాడి, వ్యవసాయం, గానుగ, వడకడం, నేయడం, పరిశుభ్రత, అస్పృశ్యతా నివారణ ఇవన్నిటినీ మేము మా ఇళ్ళల్లో ఉంటూ పల్లెల్లో రావాలని అనడానికి వీలయ్యేదా?

మా బావిని శుభ్రంగా ఉంచుకోవాలి, దాంతో పాటే నది, సముద్రాలూ మలినం కాకుండా చూసుకోవాలి. అలాంటి ప్రయత్నాలను జారీలో పెట్టేవారే సత్యాగ్రహులు. వాళ్ళను తయారు చెయ్యడానికి ఆశ్రమం ఉండి తీరాలి అని చివరికి నాకు కూడా అర్థమయ్యింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here