నేను.. కస్తూర్‌ని-17

0
1

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

హరిని తలిస్తే..

[dropcap]చి[/dropcap]న్నతనంలో నేను తండ్రిని చూశాను, నా అన్నలు, బాబాయ్, పెదనాన్నలను చూశాను. వాళ్ళలానే బాపు కూడా అచ్చం భారతీయ నాన్నే. తను చెప్పిందే పిల్లలు వినాలి. తన పిల్లలకు తన అనుభవం నుండి, శ్రమనుండి ఒక దారి ఏర్పరచడం జరిగింది. వారు అలా నడుచుకుంటే చాలు అనే భావన. అలా చూస్తే మా మామగారు కొంచెం వేరేగా ఆలోచించారు. కానీ ఆయన బ్రతికుంటే కాలాపానీ (సముద్రం) దాటి లండన్‌కు తన కొడుకు వెళ్ళడానికి ఒప్పుకునేవారో కాదో, మా అత్తగారే ఉంటే స్వజాతి వారిని కాదని, దక్షిణ ఆఫ్రికాకు కొడుకు కుటుంబ సమేతంగా వెళ్ళడానికి ఒప్పుకునేవారో లేదో, కానీ బాపు మాత్రం కుటుంబ బంధనాలను వదిలించుకుని తమ దారి రూపొందించుకున్నారు. కానీ తమ పిల్లలు అలా తమ బ్రతుకును స్వతంత్రంగా రూపొందించుకోగలరు అనే భరోసా ఆయనకు కలుగలేదు.

పిల్లలు కూడా సత్యాన్వేషకులు కావాలి, శోధన దారిలో తను నడిచిన దారిలో ఇంకా ముందుకు వెళ్ళాలి అని బాపు అభిప్రాయం. మిగిలినవారు కళ్ళు మూసుకుని తన వెనుక వచ్చినట్టే తన పిల్లలు కూడా వెంట నడవాలి. వారూ సత్యాగ్రహులు కావాలి. ఆశ్రమంలో ఉన్నప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి. వ్యక్తిగత క్రమశిక్షణ అలవరచుకోవాలి. సరళత లాగే పేదరికాన్ని కూడా ఒక విలువ అని పరిగణించాలి అనే అనుకున్నారు. ఆధునిక శిక్షణ మంచిది కాదు, అది పిల్లలకు నేర్పద్దు. ప్రాథమిక శిక్షణ ఇంట్లో ఇవ్వాలి. పనులు నేర్చుకోవాలి. తను తెలుసుకున్నదాన్ని తన పిల్లలు అనుసరించాలి అని భావించేవారు. అలా అనుకుని మా పిల్లలను స్కూలుకు పంపలేదు.

కానీ పిల్లలంటే మనం చేత్తో చేసే బొమ్మలు కాదు కదా? మా రక్తమాంసాలతోనే తయారయ్యే ముద్దలేమో కానీ, అవి తమ రూపాన్ని తామే పొందుతాయి. కుమ్మరి చక్రం తిరుగుతూ తిరుగుతూ ఎలా కుండ తయారవుతుందో అలాగే మన్ను ఉన్నంత పెద్ద కుండ తయారవుతుంది. చక్రం వేగానికనుగుణంగా, దాని పై ఆడించే చెయ్యికనుగుణంగా కుండ తయారవుతుంది. అందులో మన హస్తలాఘవం తక్కువే. నేను, బాపు ఇలా చర్చించి, సమాధాన పరచుకునేంతలో పరిస్థితి చెయ్యి దాటిపోయింది.

నాకు అప్పుడు వయసెంత? హరి పుట్టినప్పుడు నాకు పంతొమ్మిది సంవత్సరాలే. నా మామగారు చనిపోయిన సంవత్సరమే నా మొదటి బిడ్డ పుట్టి చనిపోయింది. హరిని మోసేటప్పుడు ఎక్కడ లేని సంతోషం, గాబరా, సంబరం, అసౌకర్యం అన్నిటినీ అనుభవించాను. ఏమవుతుందో అనే గాబరా ఒక వైపు, బిడ్డ నా ఒడిని నింపుతుందనే సంబరం మరో వైపు. లండన్‌కు బయలుదేరిన భర్తను వదిలిపెట్టి ఉండాలన్న దిగులు ఒక వైపయితే, బ్యారిస్టర్ భార్యనవుతానన్న గర్వం మరో వైపు. ఇవన్నిటి నడుమ డబ్బుల కొరత, అప్పులు, జాతి భ్రష్టులమవుతున్నామన్న భయం అన్నీ ఉన్నాయి.

బిడ్డ పుట్టాడు. దాని వైపు నుండి ఒక్క నిమిషమైనా దృష్టి మరల్చలేనంత మోహం. మోకగాంధీ హరికి తండ్రయ్యారు. హరి పుట్టి ఒక వారానికి ఈయన లండన్‌కు బయలుదేరారు. తండ్రి లేని రెండున్నర, మూడు సంవత్సరాల హరి ఉమ్మడి కుటుంబంలో ఉన్నా ఎక్కువగా నన్నంటుకునే పెరిగాడు. అప్పటిదాకా కూడా నా పాలు తాగాడు. అలా చాలా రోజుల వరకు పాలు తాపితే అదీ అలవాటయిపోతుంది, విడిపించమని పెద్దవాళ్ళు చెపుతున్నా వీడు పాలు తాగడం వదల్లేదు. సరేలే అనుకుని నేను కూడా ఇస్తూ పోయాను.

చాలా ధైర్యస్తుడు, చురుకు వాడు. మనసు పెడితే ఏదైనా చేయగలిగేవాడు. దెబ్బలకు జడిసేవాడు కాడు. అంత గట్టి మనసు వాడిది. మొండివాడు. లండన్ నుండి వాడి తండ్రి వచ్చారు. ఆయన బ్యారిస్టర్ అని అందరూ గౌరవించేవారు. దాన్ని చూసి వీడికేమనిపించిందో ఏమో, చిన్నప్పటి నుండే నేను బ్యారిస్టర్ నవుతా అనేవాడు. మళ్ళీ గర్భం దాల్చాను. వాడి పైని లక్ష్యం కొంత తగ్గిందనే చెప్పచ్చు. వాడి తండ్రి కూడా భారతదేశంలో ఒకట్రెండు సంవత్సరాలు గడిపేసరికి దక్షిణ ఆఫ్రికాకు బయలుదేరారు. మూడు సంవత్సరాలు మళ్ళీ నేనొక్కదాన్నే పిల్లలతో ఉన్నాను. వాణ్ణి రాజకోట్ లోని గుజరాతీ మాధ్యమం పాఠశాలలో వేశాము. చివరికి వాడి తండ్రి వద్దకు దక్షిణ ఆఫ్రికాకు అందరూ బయలుదేరాము. అక్కడికి వెళ్ళాక ఇంగ్లీష్ స్కూలుకు చేరాలని వాడి ఆశ. కానీ వాడి తండ్రికి అది సుతారామూ ఇష్టం లేదు. అక్కడి ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, స్కూలుకు వెళ్ళడమే అక్కర్లేదు అని ఈయన అభిప్రాయం. ఇంట్లోనే నేర్పేవారు. అక్కడనుండే ప్రారంభం తండ్రీ కొడుకుల మధ్య పోట్లాట.

వాడు మెట్రిక్ పరీక్షకని భారతదేశం వచ్చాడు. హరిదాస్ వోరా కూతురు చంచల్ లేదా గులాబ్‌ను ప్రేమించాడు. పెళ్ళి చేసుకుంటాను అనడిగితే వాళ్ళ నాన్న “ఇంత తొందరగా వద్దు. నువ్వింకా చిన్నవాడివి. నీ కాళ్ళ పైన నువ్వు నిలబడేలా తయారవు. దక్షిణ ఆఫ్రికాకు రా” అన్నారు. అక్కడికేమో వచ్చాడు. కానీ తండ్రికి చెప్పకుండా తిరిగి బయలుదేరాడు. తండ్రినుండి తప్పించుకోవడానికి చెప్పకుండా బయలుదేరిన వాడు రేవులో దొరికిపోయాడు. చివరికి బాపునే వాడిని విడిపించి, వెళ్ళే ఏర్పాటు చేసి పంపాల్సొచ్చింది. వాడు బయలుదేరినప్పుడు “కుమారా! నీ తండ్రి నీకు అన్యాయం చేశారనిపిస్తే నన్ను క్షమించు” అని చెప్పారట. హరి భారతానికి వెళ్ళి ఫ్రెంచ్ నేర్చుకోవడం ప్రారింభించాడు. తండ్రినుండి వాడికి ఉత్తరాల పైన ఉత్తరాలు వెళ్ళేవి. రోజూ కనీసం అరగంట తులసీ రామాయణాన్ని చదువు, దాన్ని చదువు, దీన్ని చదువు, ఇలా చెయ్యి, ఈ అలవాటు చేసుకో అంటూ ఏకధాటిగా సలహాలిచ్చేవారు. చివరకి వాడు ఉత్తరాలు రాయడమే మానేశాడు. ఏమీ సాధించలేని ఓటమిని మరచిపోవాలనుకునో ఏమో, ప్రేమలో మునిగిపోయాడు.

ఒకసారి ఆలోచిస్తే హరికి చాలా ఇబ్బంది పెట్టింది బ్రహ్మచర్యమే. బాపు చాలా గట్టి మనసు మనిషి. కానీ, అందరి దేహాలు, మనసులు ఒకే రకంగా ఉండవు కదా? ఎందుకో ఈ ఒక్క విషయం బాపుకు అసలు అర్థం కాలేదు. వాడు ప్రేమలో చిక్కుకున్నాడు. దాన్నుండి బయటికి రావడానికి చేతకాక తన్నుకుంటున్నాడు. చెప్పే అవకాశం, సమయం దొరక్కుండా ఇద్దరూ బాధపడుతున్నాం. హరి తన తండ్రి కోసం వెతుక్కున్నట్టల్లా మహాత్ముడే దొరికేవాడు. అది వాడిని ఇంకా ఒంటరి జీవిగా చేస్తూ పోయింది. బాపుతో మాట్లాడి ఆయనను ఒప్పించలేక ఆ కోపాన్నంతా నాపైన చూపెట్టేవాడు. నా అసహాయ స్థితి వాడిని బాపు పైన ఇంకా కోపగించుకునేట్టు చేసింది. ఆ రోజులను ఇప్పుడు తలచుకున్నా కానీ, మనసంతా అశాంతి నిండిపోతుంది.

గోవర్ధన్ రామ్ త్రిపాఠి రాసిన గుజరాతి నవల ‘సరస్వతి చంద్ర’ చదివి హరిలాల్ ఇలా ఎదురుతిరిగాడు అని బాపు అనుకున్నారు. అందులోని నాయకుడు తన తండ్రి వలన భ్రమనిరసన పొంది ఇల్లు వదిలేసి వెళ్ళి తనకు నచ్చిన బ్రతుకును ఏర్పరచుకోవడంలో విజయవంతమవుతాడు. ‘నా సామర్థ్యాన్ని నేనే అంచనా వేసుకోవడానికి మీరు వదల్లేదు, మీరే వేశారు’ అని ఒక ఉత్తరంలో హరి రాశాడు. ‘భారతదేశానికి వెళ్ళినాక మళ్ళీ నీ భార్య దేహం నిన్ను లాక్కుని గురినుండి విముఖుణ్ణి చేసింది’ అని బాపు రాశారు. తన తలిదండ్రుల దారి కాకుండా తనదే దారిని రూపొందించుకోవడానికి అతడికి అవకాశమే లేకపోయింది. అవకాశం దొరికే సమయానికి ఆలస్యమయి పోయింది. వాడి చదువు అరకొర అయింది. బహుశ 1906 ఉండాలి. భారతానికి వెళ్ళి తండ్రి లేకపోయినా పెదనాన్నతో ధూంధాంగా తన పెళ్ళి జరిపించుకున్నాడు. “వాడు పెళ్ళి చేసుకున్నా సరే, చేసుకోకున్నా సరే మంచిది. వాడు నా కొడుకు కాడు” అని చాలా బాధపడి హరి నాన్న తన అన్నకు ఉత్తరం రాశారు. భాయి వాణ్ణి పూర్తిగా మరచిపోవాలని నిర్లక్ష్యం చేశారు. తమ దేహాన్ని దండించుకున్నారు. అప్పుడే ఆయన బ్రహ్మచర్య వ్రతం చేపట్టింది.

తండ్రి, పిల్లల సంబంధం అలా మరచిపోవడానికి, చెరిపేయడానికి వీలవుతుందా? ఎంత లేదన్నా చర్మంలా అంటుకునే ఉంటుంది. లాగితే నొప్పి ఇంకా ఎక్కువవుతుంది. ఏమీ చెయ్యలేం. ఉన్నదాన్ని అయినంత అందంగా ఉంచుకోవడం, ఒప్పుకోవడం – అదొక్కటే దారి.

తండ్రి పిల్లల నడుమ వైరం తల్లులకు చాలా బాధ, నొప్పి కలిగించే విషయం. ఈ విషమ సన్నివేశం ముల్లు ఎప్పుడూ నా ఎదలో గుచ్చుకుంటూనే ఉంది. ఎలాగైనా సరిదిద్దాలని చూస్తూనే ఉన్నాను. వాడికొక అవకాశం ఇవ్వండి. పెళ్ళి చేసుకుంటేనేమిటి? పెళ్ళి చేసుకున్న సత్యాగ్రహులు ఎంతమంది లేరు? హెన్రి-మిలి బ్రహ్మచర్యం పాటిస్తున్నారా? అయినా మనతో పాటు లేరా? అంటూ నిర్విరామంగా ఒప్పించాను.

చివరికి బాపు మాదిరి సత్యాగ్రహుడిగా మారడానికి దక్షిణ ఆఫ్రికాకు వచ్చాడు. బాగానే నిభాయించాడు. ఆరు మార్లు జైలుకు వెళ్ళి వచ్చాడు. వాణ్ణి అందరూ ఛోటె గాంధీ అని పిలిచేవారు. కానీ భార్య దేహ సుఖం వాణ్ణి వదలకుండా సతాయిస్తూనే ఉంది. చంచల్ కూడా దక్షిణ ఆఫ్రికాకు వచ్చి కొన్ని రోజులు ఉండింది. గర్భం దాల్చాక హిందూస్తాన్‌కు వెళ్ళి కనింది. వీడు వెళ్ళడం, రావడం చేస్తూనే ఉన్నాడు. దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహుడిగా ఉన్నా వాడి ఆకర్షణ అంతా మన దేశం వైపే ఉండేది.

కొడుకు సంసార బంధాన్ని, దేహ మోహాన్ని వీడాలని బాపు ఆకాంక్ష. ఈయన తమ యువ వయస్సులోని దూకుడును మరచిపోయారా? బ్రహ్మచర్య వ్రతం చేపట్టిన సమయంలో ఇలాంటి మాటలను ఆయన ముందు లేవదీయడం ఎలా?

ఫీనిక్స్ ఆశ్రమంలో అనారోగ్యం, పిల్లల బాధ్యత, హరి మొండితనం, నియమ పాలన అదీ ఇదీ అనే ఉత్కంఠల నడుమ జీవితం గడిచేటప్పటికి, ఆనందంగా గడిపిన రోజులు అసలు గుర్తుకు రావడం లేదు. కానీ ఎక్కడో ఒక చోట వేళ్ళూరి సంబంధం ఏర్పడేలా ఉండేది. అంతలో ఫీనిక్స్ వదిలేసి టాల్‌స్టాయి ఆశ్రమానికి బయలుదేరాము. అది నాకంత నచ్చలేదు. అలాగని భాయితో చెప్పలేక పోయాను. పిల్లలతో గొణుక్కున్నాను. అక్కడే ఉన్న హరి దీన్ని తొందరగా గ్రహించాడు. వాడి మాదిరిగా నన్ను అంటుకున్నవాళ్ళు కాని, అర్థం చేసుకున్నవాళ్ళు కాని ఎవరూ లేరు. ఏది చెపితే వాడి తండ్రికి నచ్చదు అని చెప్పలేక పోయేదాన్నో వాడు ఆయనకు నేరుగా చెప్పేవాడు. మేము టాల్‌స్టాయ్ ఆశ్రమానికి వెళ్ళడానికి, వాడు మా అందరితో సంబంధాలు తెంచుకుని భారతానికి తిరిగి వెళ్ళడానికి సరిపోయింది.

దక్షిణ ఆఫ్రికాలో ఉన్నప్పుడు భాయి కొందరు స్నేహితులు తండ్రీ కొడుకుల నడుమ ఉన్న ముసుగులో గుద్దులాటను గమనించారు. అప్పుడప్పుడు భాయికి మిలి చెప్పేది: ‘మీరు గహనమైన రాజకీయం మాట్లాడేటప్పుడు, నా బిడ్డను ఉయ్యాలలో ఊపుతారు. కానీ, యౌవనంలోని భావనాత్మక ప్రభంజనం  లాంటి మనఃస్థితి కలవారిని నిభాయించడం కష్టమవుతోంది.  తమకు కావలసిన స్వాతంత్ర్యం, తమను తాము నిరూపించుకోవాలనే తపన ఈ రెండూ ఆ వయసులో ఎక్కువగా ఉంటాయి. వారిపైన నమ్మకం పెట్టండి. అప్పుడు వాళ్లలో ఉన్న ఆ ప్రభంజనాన్ని మనం శక్తిగా మార్చవచ్చు’ అని. బాపు ఇందుకు అంగీకరించారు. కానీ ఆయనకు హరిలాల్‌ను నిభాయించడం మాత్రం చేతకాలేదు.

హరికి ఐదు పిల్లలు పుట్టారు. ఇద్దరు అబ్బాయిలు చిన్నప్పుడే చనిపోయారు. కాంతిలాల్, ఇద్దరు ఆడపిల్లలు మాత్రం మిగిలారు. కానీ మేము భారతదేశానికి వెళ్లడానికి నాలుగైదు సంవత్సరాల మునుపే హరి మాతోని సంబంధాలు తెంచుకున్నాడు. వాడికి తండ్రి నీడ నుండి వెలుపలికి వచ్చి విజయవంతమవ్వాలని, సంపద తానే  సంపాదించాలని ఆశ. వాడికి బాపు ఏ ఆదర్శాలూ అర్థం కాలేదు. కానీ వాడికి ఉద్యోగముండేది కాదు. ఇతర ఆదాయమూ ఉండేది కాదు. కాబట్టి మేము ఇక్కడికి వచ్చాక గులాబ్, పిల్లలు మాతోనే ఉండడానికి ఆశ్రమానికి వచ్చారు.

భారతదేశానికి వచ్చి నాలుగైదు సంవత్సరాలయ్యిందంతే. 1919లోని 20వ తేదీ ఉండాలి. గులాబ్‌కు ఇన్‌ఫ్లుయంజా వచ్చి చనిపోయింది. అప్పుడు దానికి చాల మంది బలయ్యారు. ఇప్పుడు మా ఇంట్లోనే ఒక చావు జరిగింది. నాకైతే దుఃఖం గుదిబండలా ఎదలో కూర్చుండిపోయింది. ఎంత మంచి పిల్ల గులాబ్. ఒకదాని తరువాత ఒక కాన్పు, బేజవాబ్దారి మగడి చంచల బుద్ధివలన ఒక స్థిరమైన వాసం లేక, చిన్న పిల్లలతో ఎప్పుడూ కష్టాల్లోనే బ్రతుకుతూ చనిపోయింది. తనేమో జీవన్ముక్తురాలయ్యింది. తన పిల్లలను చూసుకునే బాధ్యత నా పైన పడింది. వాడి పిల్లలంతా ఆశ్రమంలో ఉన్నారు. గులాబ్ చనిపోయిన తరువాత హరి తాగుడు ఎక్కువయింది. తన పిల్లలకు ఉత్తరాలు రాసేవాడు. ఎప్పుడోఒకప్పుడు బాపుకు తెలియకుండా తూలుతూ వచ్చేవాడు. వెళ్ళిపోయేవాడు. పిల్లలతోనూ సంబంధాలు నిలుపుకోలేదు.

ఏ ప్రార్థన కాని, ఏ పూజా ధ్యానాలు కాని సరిదిద్దలేనంతగా మన పిల్లలే దారి తప్పినప్పుడు ఇల్లు స్మశానమవుతుంది. బాపులా పనుల్లో పడి మునిగి పోయి మరచిపోలేనంతగా నా మనసు కల్లోలమైంది. బాపు సమాజ-దేశ సేవల్లో పడి రోజు రోజుకూ దూరమైనట్టుగా అనిపించసాగింది. తనను తాను నాశనం చేసుకుంటున్న హరి నా దృష్టిలో పడడానికి, నా ద్వారా తన తండ్రి దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తూ ఇంకా దూరమవుతున్నాడు. మా మధ్య వాడి పిల్లలను చూసుకునే గులాబ్ కూడా లేదు. బాపుతో హరి విషయం మాట్లాడడానికి సమయమే దొరికేది కాదు. మళ్ళీ మళ్ళీ అదే విషయాన్నిలేవనెత్తడానికి కూడా మనసొప్పేది కాదు. తన యాత్రా సమయంలో కన్యాకుమారి నుండి బాపు నాకొక ఉత్తరం రాశారు.  “ఏకాకిగా వచ్చాము. ఏకాకిగానే పోతాము. పుట్టుక చావుల అనిశ్చిత పరిస్థితిలో ఎందుకు జత కోరుకుంటాము? మిగతా సంబంధాలన్నీ నిజమే అయినా అసలు మిత్రుడు దేవుడు మాత్రమే. ఏకాంతం అలవాటయితే ఎక్కడైనా కానీ విసుగు కలగదు. అన్ని వైపులా విష్ణువే కనబడతాడు.” అని. నిజమే. మనుష్య సంబంధాలు కలిగిస్తున్నా బాధ తక్కువదా? కానీ బాపు మాదిరిగా పిల్లలతో బంధం తెంపుకోవడం నాకు చేతకాలేదు. పిల్లల నిట్టూర్పులు, కోపాలు, నిరాశలు, వికారాలు నా వేలికొసకు తగులుతుంటే ఎలా వదిలించుకోను ?

ఇలా ఉన్నప్పుడు హరి ఒకసారి, తను అన్ని చెడ్డ అలవాట్లను మానేస్తాను, తాగుడు మానేస్తాను, అక్కడ ఇక్కడ తిరగడం మానేస్తాను, పెళ్ళి చేసుకుంటాను, పోరుబందర్లో స్థిరపడతాను అని ఉత్తరం రాశాడు. దుకాణం పెట్టుకుంటాను అన్నాడు. “నీకు తోడు కావాలి, అది భార్యే అయ్యుండాలి అనుకుంటే ఒక తగిన విధవను ఎంచుకుని మళ్ళీ పెళ్ళి చేసుకో” అన్నారు బాపు. “వ్యాపారం చెయ్యి, కానీ దాని కోసం అప్పు చెయ్యకు. నావద్ద అయితే డబ్బు లేదు” అన్నారు. వాడు ఏకాకిగా ఉన్నాడు. మరదలినే మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నించాడు. ఐదుగురు పిల్లల తండ్రి, బాధ్యత ఎరుగని విధురుడైన కొడుకు మళ్ళీ ఒక అమ్మాయి బ్రతుకును పంద్యంగా పెట్టడానికి బాపు సుతరామూ ఒప్పుకోలేదు. వాడి ప్రయత్నాన్ని ఆయన బలపరచలేదు.

బహుశ 1935 అయ్యుండాలి. ఒకసారి వర్ధాకు హరి వచ్చాడు. కొన్ని రోజులున్నాడు. కొద్దిగా పనులు చేసి కాథేవాడకు వెళ్ళాడు. కొన్ని రోజులు వదలి మళ్ళీ వచ్చాడు. వాడి మనసులో ఏదో జరుగుతోంది అని ఊహించాను. అన్నీ చెడు అలవాట్లను మానేశాను అనేవాడు. కానీ తను ఏం చేస్తున్నాడు అని తనకే తెలియదు. తండ్రితో విరసం, కుటుంబం నుండి దూరంగా ఉండడం, అవసరపడి చేసిన ప్రేమ-పెళ్ళి, ఇవన్నీ వాణ్ణి బ్రతుకునుండి దూరం చేస్తూ పోయాయి. దేంట్లో వేలు పెట్టినా అపజయమే. ఏం చేసినా ఓటమి. ఓడిపోవడం ఖాయం అని మొదటే అనుకుని పని మొదలుపెడతాడేమో అన్నట్టు రెండడుగులు వేయడానికి లేదు, అలసిపోయేవాడు. దానికి తోడు అన్నివ్యవహారాల్లో అతడికి దగ్గిరవాళ్ళే మోసం చేశారు. వాడి తప్పులనన్నిటినీ వాడి పేరుకు చివరగా ఉన్న గాంధీకి తగిలిద్దామని చూశారు. అది బాపు తత్త్వాలకు, కార్యాచరణకు ఇబ్బంది కలిగేది.

సారా సగటుగా అబద్ధాలు చెప్పడం హరికి దౌర్బల్యంగా తయారయింది. తాగి తూలుతూ పడిపోయి, నేను తాగుడు మానేశాను అని బాపుకు ఉత్తరం రాసేవాడు. వాడి తాగుడు కంటే వాడి అబద్ధాలే ఆయనకు గాయం కలిగించేవి. దక్షిణ ఆఫ్రికాలో ఉన్న మణిలాల్‌కు ఉత్తరం రాస్తూ “హరి తన దేహాన్ని మద్యం అనే పవిత్ర గంగలో త్యాగం చేస్తున్నాడు” అంటూ చాలా బాధతో రాశారు బాపు. ఆయన ఎవరినైనా ఎలా ఉండరాదు అనేవారో అలాంటివారి సాకార రూపంగా ఉండేవాడు హరి. ఆడవాళ్ళ సాంగత్యానికి పడ్డాడు. తాగుడు మితి మీరింది. రోగాలు ఇల్లు చేసుకున్నాయి. అయినా కానీ తాగుడు మాన్పించాలి అని హితవు చెప్పి చూశారు. బుజ్జగించారు. ఉపవాసం చేశారు. ప్రార్థించారు. ఉత్తరాలు రాశారు. తనతోపాటు ఉండమని పిలిచారు. వీటన్నిటి నడుమ వాడి పెద్ద కూతురుకి సరళమైన వివాహం చేశారు.

చివరికి అలాంటి ఘడియ రానే వచ్చింది. తన కొడుకు చెసే పనులకూ తనకు ఎలాంటి సంబంధమూ లేదంటూ సార్వత్రికంగా బాపు చెప్పల్సివచ్చింది. అది హరిని మరింత క్రుంగదీసింది. ఇదంతా జరిగేటప్పుడు నేను నా భర్తను ‘హరినాన్న’ అని పిలవడం పూర్తిగా మానేశాను. ఆయన అందరికీ బాపు అయ్యారు. నాకూ బాపునే అయ్యారు.

అది 1935 అయ్యుండాలి. బాపు, పటేల్ భాయి అందరూ విశ్రాంతి కోసం బెంగళూరు వద్ద ఉన్న నందిబెట్టకు వెళ్ళారు. అక్కడ మైసూరు రాజ్యంలోని ఎవరెవరో పెద్ద వ్యక్తుల పరిచయం జరిగింది అని ఉత్తరం వచ్చింది. పెద్ద విజ్ఞాని రామన్ గారిని కలిశారట. నేను, దేవదాస్ ఢిల్లీలో ఉన్నాము. అంతలో ఒక వార్త అశనిపాతంలా వచ్చి తగిలింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here