Site icon Sanchika

నేను.. కస్తూర్‌ని-19

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

ఉపవాసం

[dropcap]మా[/dropcap] పుట్టింట్లో వ్రతాలు, ఉపవాసాలు తక్కువే. వాళ్ళు ఎక్కువగా లౌకికులు. కాబట్టి మాకు అతి కష్టంతో ఉపవాస వ్రతం చేపట్టి, ఆకలి వైపు లక్ష్యం వెళ్ళకుండా ఉండడం అలవాటు లేదు. కాని, మా అత్తగారింట్లో అలా కాదు. అక్కడ వ్రతాలు, ఉపవాసాలు, శ్రమ అంతే ముఖ్యం. ఏదైనా కష్టం వస్తే అది తొలగిపోయిన తరువాత వ్రతం చెయ్యడం కాదు, అంతా సరిగ్గా ఉన్నప్పుడు కూడా మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవడానికి ఉపవాసం చెయ్యాలని చెప్పేవారు మా అత్తగారు. ఎందుకంత ఉపవాసాలు, వ్రతాలు చెయ్యాలి అనే ప్రశ్నను అందరూ అడిగారు. అదే ప్రశ్నను తరువాత ఆమె కుమారుడు కూడా ఎదిరించారు. తల్లి-కొడుకుల బదులు దాదాపుగా ఒకటే: “నా ఉనికిలో ఒక భాగం ఉపవాసం. కళ్ళు లేకుండా బతకగలను. అలాగే ఉపవాసం చెయ్యకుండా కూడా. కానీ బయటి ప్రపంచం చూడడానికి కళ్ళెలాగ అవసరమో, అలాగ లోపలి ప్రపంచానికి ఉపవాసం అంతే అవసరం”. బాపు బ్రహ్మచర్యాన్ని చేపట్టారు కదా! ప్రత్యేక పథ్యాహారం, పదే పదే ఉపవాసం చెయ్యకుండా బ్రహ్మచర్యాన్ని సాధించడం కష్టం అని మళ్ళీ మళ్ళీ ఉపవాసం చేపట్టేవారు. దేహాన్ని నిరాకరించనూ వచ్చు, ముద్దు చెయ్యనూ వచ్చు అని బాపు అభిప్రాయం. అందుకే ఆరోగ్యం, ఆహారం గురించిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉపవాసం చేసేవారు. ఉపవాస సమయంలో ధ్యానమగ్నులయ్యేవారు. తీవ్రంగా ఆత్మశోధన చేసుకునేవారు. దేనికైనా కానీ, ఆయన తక్షణ నిర్ణయానికి వచ్చేవారు కారు. ఉపవాస సమయంలోనో, ప్రార్థన-బంధన-రాత-ధ్యానం-మౌనం సమయాల్లోనో ముందుగానే ఆలోచించి పెట్టుకుని, అవసరం అన్నప్పుడు వాటిని వెలికి తెచ్చుకుని ప్రయోగించేవారు. ఆయన లోపల అలాంటిదేమో జరుగుతోందని స్పష్టంగా తెలిసేది. ప్రతి ఉపవాసానికి ముందుగా, తరువాత ఆయన మనస్థితి యొక్క తేడా స్పష్టంగా తెలిసేది.

కానీ, తను ఉపవాసం చెయ్యని ఏ భార్యకైనా తన భర్త చచ్చేదాకా ఉపవాసం చేస్తాను అని పదే పదే అన్నమూ నీళ్ళూ మానేస్తే చాలా బాధ కదా? అందుకే నేను లేని చోట ఉపవాసం చేసేవారు బాపు. అయినా ఆయన అక్కడ ఉపవాసమని కూర్చుంటే నేనెలా తినేది? అలాగని నేను ఉపవాసం చేయలేకపోయేదాన్ని. ఎక్కువ తినడానికి కూడా చేతనయేది కాదు. “మీ ఉపవాసం చాలా అతి” అని అప్పుడప్పుడు ఏడిపించేదాన్ని. చివరికి ఆయన ఉపవాస సమయంలో నేను ఒక పూట మాత్రమే తినడమో, పళ్ళు తినడమో చేసేదాన్ని. ఆయన ఉన్నచోటికి వెళ్ళీ ఆయనకు నచ్చినట్టు కాళ్ళు, వీపు, నుదురు పట్టుతూ కూర్చునేదాన్ని. లేదా ఆయన పక్కన ఊరకే కూర్చునేదాన్ని. సత్యాగ్రహానికని సార్వత్రికంగా ఉపవాసానికి కూర్చోడవడం దక్షిణ ఆఫ్రికాలోనే ప్రారంభమయింది. అక్కడున్నప్పుడే ఒక వారం, రెండు వారాలు ఉపవాసం చేశారు. అన్నిఘన పదార్థాలను త్యజించి ఉత్త ద్రవ్యాహారాల పైనే ఉండి చూశారు. భారత దేశానికి వచ్చిన తరువాత అది కొనసాగింది. జలియన్ వాలా బాగ్ ఘటన తరువాత ఉండాలి, 1921 సంవత్సరం నుండి స్వాతంత్ర్యం వచ్చేదాకా ప్రతి సోమవారం 24 గంటల ఉపవాసం చేశారు.

మీకు తెలిసినట్టుగా పదిహేడు సార్లు ఉపవాస వ్రతం చేపట్టారు బాపుగారు. కొన్ని నా జ్ఞాపకాల్లో ఇంకా ఉన్నాయి. అమదావాద్ మర కార్మికుల సమ్మె ప్రారంభమయింది. ముందు బాపు వారిని సమర్థించలేదు. కానీ బాపుకు ఆకలి అంటే ఏమిటి అని తెలియదు అని కార్మికులే అన్నారు. దాంతో ఉపవాసానికి కూర్చున్నారు. ఉపవాసానికి కూర్చోగానే చూడు, మిల్ యజమానులు పరిగెత్తుకుంటూ వచ్చి దయచేసి ఉపవాసాన్ని ఆపేయండి అని ఒప్పందం చేసేసుకున్నారు. ఇది 1918 అనుకుంటాను.

తరువాత 1925 అనుకుంటాను. బ్రిటన్ రాజకుమారుడు మన దేశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. కానీ పార్సీలు, యూదులు, క్రైస్తవులు తమ అంగళ్ళను బంద్ చేయలేదు. అందుకని వాళ్ళ పైన హిందువుల, ముస్లిముల దాడి ప్రారంభమయ్యింది. మరుసటి రోజు వాళ్ళు వీళ్ళ పైన దాడి చేయడం ప్రారంభించారు. బాపు చాలా దుఃఖపడి ఉపవాసానికి కూర్చున్నారు. భిన్న మతాలవారు పోట్లాట నిలిపేదాకా తను అన్నం, నీళ్ళు ముట్టను అని రాశారు. అప్పుడు దేవదాస్ బార్డోలిలో ఉన్నాడు. వాడిని పిలిపించారు. గలభా ఆగకుంటే గలభా స్థలానికి దేవదాసును ‘ఆహుతి’గా పంపుతాను అనేశారు. నాకు దేవదాసును పంపడం ఎంతమాత్రం ఇష్టం లేదు. గలభా స్థలానికి దేవదాసు వెళ్ళి, వాడికేమైనా జరిగితే అనే ఆలోచనవలన ఎంత బాధ కలిగిందంటే దాన్ని ఎలా వర్ణించను? కానీ ముంబై శాంతించింది. అన్నిమతాల వారు గుంపుగా చేరిన వాళ్ళ నడుమ బాపు తన ఉపవాసాన్ని ఆపారు.

అది జరిగిన మూడు సంవత్సరాలకు మళ్ళీ ఒకసారి ఇలాగే మత అల్లర్లు జరిగినప్పుడు ఉపవాసానికి కూర్చున్నారు. ఒకట్రెండు రోజులు కాదు! 21 రోజులు!! అందరూ వద్దూ వద్దన్నా ఢిల్లీ మహమద్ ఆలీగారింట్లో ఉపవాసానికి కూర్చున్నారు. “ఈ ఉపవాసాలకు నేను బాధ్యుణ్ణి కాను, తమాషాకు చెయ్యడమూ లేదు. కీర్తి కోసమూ చెయ్యడం లేదు. ఆకలిని తట్టుకోవడం కష్టమే. కానీ అది నాకు ఒక ఉన్నత శక్తి ఇచ్చిన ఒక బాధ్యత అనుకున్నందుకు నిభాయించడం వీలయింది” అని పట్టు పట్టి ఉపవాసాన్ని చేపట్టారు. అలా 21 రోజులు గడిచాయి.

ఇలా సత్యాగ్రహాల నడుమ ఉపవాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. 1933లో ఇంకోసారి 21 రోజులు ఉపవాసానికి కూర్చున్నారు. అది తన మరియు తన అనుచరుల అంతరంగ శుద్ధికోసం. “ఉపవాసం శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ప్రార్థన మనసును శుభ్రపరుస్తుంది. ప్రార్థన, ఉపవాసం రెండూ కలిసినప్పుడు అద్భుత సాధన వీలవుతుంది. ప్రార్థన లేకుండా ఉపవాసం, ఉపవాసం లేకుండా ప్రార్థన లేవు” అనేవారు. ఉపవాసమున్నప్పుడు ప్రార్థన తప్పకుండా ఉండేది.

డాక్టర్ గారితో పుణెలో ఒప్పంద సమయమయ్యుండాలి. యరవాడా జైలులో ఉపవాసానికి కూర్చున్నారు. అప్పుడు ఆయన ఆరోగ్యం ఏమంత బాగులేదు. కలకత్తా నుండి గురుదేవ్ గారు బాపును చూడడానికి వచ్చారు. తమకు నచ్చిన ప్రార్థనను పాడారు. ఆ సారి మాత్రం నేను చాలా భయపడి బిక్కచచ్చిపోయాను. మీరాకు చెప్పి ఉత్తరం రాయించాను. “ఇప్పుడు ఉపవాసం చేసే మీ ఈ నిర్ణయం సరైనది కాదు. కానీ మా మాటను మీరెక్కడ వింటారు?” అని రాయించాను. అందుకే బాపు “మరో భార్య అయ్యుంటే తన తండ్రి మోపిన ఈ మనిషి బరువుకు చచ్చిపోయేది. కానీ నీ ప్రేమ, శక్తి గొప్పది కస్తూర్. అదే నన్ను కాపాడుతోంది” అని రాశారు. అది ఆయన “అంతరంగం గొంతు విని చేస్తున్న ఉపవాసం”. ఎవరెంత చెప్పినా ఆపలేరు అని అందరికీ తెలుసు. కానీ అందరూ గాబరాపడ్డాము. హరి కూడా ఒక ఉత్తరం రాశాడు. “ఈ శరీరం ఏం చెయ్యగలదో అదంతా బేషరతుగా చేస్తాను బాపూ. కానీ మీ ఉపవాసం మాత్రం వద్దు. దయచేసి ఈ నిర్ణయాన్ని మానుకోండి” అని. దానికి వాడి తండ్రి “నీ ఉత్తరం నా మనసును కలచివేసింది. నా ఉపవాసం నిన్ను పరిశుద్ధం చేస్తుంది అన్నట్లయితే దానికి రెండు రకాల ఫలం లభించినట్టే. బాధపడవద్దు” అని రాశారట.

ఈ సారి ఎలాగో గడిచింది. దీని తరువాత ఒకసారి 21 రోజుల ఉపవాసం చేశారు. అది కూడా మా ఇద్దరి గాబరా, భయాల మధ్య నడిచింది. ఆ సారి ఆయనను జైలునుండి విడుదల చేసి పుణె లోని ప్రేమలీలా థ్యాకర్సె గారి ఇల్లు ‘పర్ణకుటి’కి పంపారు. ఆమె మిల్లు యజమాని భార్య. మా శిష్యురాలు. మంచి మనసున్న మనిషి. మలబార్ హిల్స్ లోని ప్రేమలీలా ఇంటి అరుగు మీద బాపు కొంచెం సేపు కూర్చుని, తిరిగి, అంత దూరం వరకు కనపడుతున్న పల్లె దృశ్యాన్ని చూస్తూ పడుకున్నారు. ఉపవాసం చేసి బ్రతికే శక్తి సిద్ధించింది ఆయనకి. ఆ ఉపవాసపు చివరి రోజు అన్సారి గారు ఖురాన్‌ను, మహదేవ్ క్రైస్తవ సందేశాన్ని, చుట్టూ కూర్చున్నవారు నరసి మెహ్తాగారి వైష్ణవ జనతో పాడాము. ప్రేమలీలా ఇచ్చిన సగం లోటాడు నారింజ రసం త్రాగి ఉపవాసం ముగించినప్పుడు గురుదేవ్ గారు అక్కడే ఉన్నారు. చుట్టూ ఉన్నవారు ఆయననే చూస్తూ మౌనంగా కూర్చున్నాము.

ఈ గండాంతరం గడిచి ఒక రెండు నెలలయిందంతే. బాపు అప్పుడే కోలుకుంటున్నారు. మళ్ళీ జైలులో ఇంకోసారి ఉపవాసానికి కూర్చోవాలా? ఈ సారి ఉపవాసం ’హరిజన సేవక సంఘ్’ పనులు జైలునుండి చెయ్యడానికి అనుమతించలేదు అని. బ్రిటిష్ వారికి భయం కలిగుండాలి. ఆయనను వెంటనే జైలునుండి విడుదల చేసి మళ్ళీ ప్రేమలీలాగారి ఇంటికి పంపారు. యరవాడాలో ఉన్నప్పుడు బాపుకు ఆకాశం చూసే, నక్షత్రాలను చూసే అలవాటు ప్రారంభమయ్యింది. ప్రేమలీలాయే పెద్ద గొట్టంలాంటి, నక్షత్రాలు చూసే టెలిస్కోప్ అని ఏదో ఒక వస్తువును తెప్పించి ఇచ్చారు. ఆకాశం చూస్తూ ఉండేవారట. చివరికి నేను ‘ఆశ్రమానికి రండి’ అని ప్రార్థిస్తూ ఉత్తరం రాయించాను. ‘శిక్ష అవధి అయిపోలేదు. ఇంకా బందీగా ఉన్నాను. విడుదల తరువాత వస్తాను’ అని ఉత్తరం రాయించారు. నా సమక్షంలో ఉపవాసానికి కూర్చుంటే నేను దిగులు పడతాను అని ఆయనకు నచ్చేది కాదు. అందుకే రాలేదు. దేవదాస్, మహదేవ్, ఇతరులు ఆయనతోనే ఉన్నారు. చివరికి నేనూ వెళ్ళాను.

1942 అనుకుంటాను. భారత్ ఛోడో ఆందోళన కార్చిచ్చులా వ్యాపించింది. వేలాది జనాలను జైళ్ళకు వేశారు. మేము ఆగాఖాన్ జైలులో ఉన్నాము. నాకు అంతేం బావుండలేదు. మహదేవ్ అకస్మాత్తుగా చనిపోయి చెప్పలేనంత దెబ్బ తగిలింది. యాభై సంవత్సరాలకే అతడికి హృదయాఘాతం కలిగింది అంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. చేతులు కాళ్ళు ఆడక చచ్చిపోయినంత పనయ్యింది. అతడు లేకుండా మేమెలా ఉండాలి అనిపించి అంతా అయిపోయినట్లు, అంత్యకాలం వచ్చినట్లు అనిపించింది. ఎంత క్రమశిక్షణ, ఆరోగ్యమైన మనిషి మహదేవ్! మా కంటే చిన్నవాడు. మా కంటే ముందుగా వెళ్ళిపోయాడు. జైలుకు వచ్చి ఆరు రోజులయ్యింది అంతే. అతడి భార్య దుర్గా బెహన్, కొడుకు నారాయణ అంతా అంతిమ సంస్కారానికని వచ్చినప్పుడు వాళ్లను చూసి చాలా దుఃఖం కలిగి కళ్ళు చీకట్లు కమ్మినాయి. బాపుకూ అంతే. ఆయన కుమారుడు, స్నేహితుడు, విమర్శకుడు, కార్యదర్శి, లిపికారుడు అన్నీ అయినవాడు మహదేవ్. నిశ్చేష్టులై కూర్చుండిపోయారు బాపు. అత్యంత దుఃఖంతో తామే స్వయంగా మహదేవ్ శరీరానికి స్నానం చేయించి, తామే సంస్కారం గావించారు. ఆయన తన దుఃఖాన్ని దిగమ్రింగుకున్నది చూస్తున్నప్పుడు ఉపవాసం చేసి ఆకలిని తట్టుకోగలిగితే మిగతా దేన్నైనా తట్టుకోగల శక్తి వచ్చేస్తుందని అనిపించింది. నాకు ఆకలి తట్టుకోవడానికి చేతనయ్యేదికాదు. దుఃఖం తట్టుకునేది అంతకంటే చేతనయ్యేది కాదు.

మహదేవ్ పోయిన దుఃఖం తగ్గక ముందే ఇతర బాధలు బాపు గొంతుకు చుట్టుకున్నాయి. జిన్నాగారు ప్రత్యేక దేశం కావాలంటున్నారు. డాక్టర్ గారు ఇతర మతం గురించి మాట్లాడుతున్నారు. అవి రెంటిని ఎలా సర్ధాలి అనే ఇబ్బంది సతాయించసాగింది బాపుకు. ఆ రెండే ఆలోచనలు, వారిద్దరిదే ధ్యానం. మళ్ళీ 21 రోజులు ఉపవాసం చేశారు. అది ఇంటినుండి బయట సార్వత్రికంగా చేసిన 15వ ఉపవాసం. ఆమరణ దీక్ష కాదు. పళ్ళ రసం, నీళ్లు తాగుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉపవాసం చెయ్యకండి అన్నది. దానివల్ల జరిగే పరిణామాలకు తను బాధ్యత వహించదు అని చెప్పింది. దేనికైనా చర్చిద్దాం, మాట్లాడదాం అంతేకాని ఉపవాసం చెయ్యడం ఎందుకు అన్నది. “ఎవరో చెప్పారని ఉపవాసం చెయ్యడం కాదు, కోపంతోనూ కాదు. కోపమనేది తక్షణ పిచ్చితనం. నాలోని క్షీణధ్వని చెపితే మాత్రమే ఉపవాసం చెయ్యడానికి వీలవుతుంది” అంటూ ఉపవాసం చేసి తీరతానన్నారు బాపు. మాటి మాటికీ ఉపవాసానికి సిద్ధమవుతున్న ఈ మొండి మనిషి గురించి బ్రిటిష్ వారికి అదెలాంటి కోపం వచ్చేదో ఏమో, ఏడ్వాలో నవ్వాలో, పట్టుకుని జైలుకు పంపి చంపెయ్యాలో, నీ ఇష్టమని వదిలెయ్యాలో అని ఏదీ తోచకుండా పోయుండవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే నీటి పైని నూనె చుక్క బాపు. ఇటు పట్టుకోనూ కాక, అటు నియంత్రించడమూ కాక బ్రిటిష్ వారు చాలా కష్టపడుండవచ్చు.

73-74 సంవత్సరాల పెద్దాయన 21 రోజుల ఉపవాసం చేసి బ్రతికి బట్ట కట్టడమంటే సామాన్య విషయం కాదమ్మాయ్! ఆ ఉపవాసమంత సులభమేమీ కాదు. బాపు చాలా కష్టాలు అనుభవించారు. తొమ్మిది మంది వైద్యుల బృందం వచ్చి ఆయనను పరీక్షించేది. ఇంకేం మూత్రకోశం విఫలమయ్యి యురేమియా అనో ఏదో మూత్రకోశ ఇబ్బంది కలిగి, ఎం.కె. గాంధీ ఇక చనిపోతారు అని వైద్యబృందం నివేదిక ఇచ్చింది. రక్తం ఇచ్చినా, సెలైన్ పెట్టినా ఏమీ చెయ్యలేమేమో అని హెచ్చరించింది.

కానీ బాపు మాత్రం ఏ చికిత్స కూడా తీసుకోడానికి ఒప్పుకోలేదు. 21 రోజులు ఉపవాసం చేసి తీరుతాను అంటూ ఉపవాసం చేసేశారు. ఆయన ఉపవాసానికి కూర్చుంటారు అంటే చాలు ప్రజలకు భయం పట్టుకునేది. ఆయన దగ్గరివాళ్ళకు ఆందోళన కలిగేది. బ్రిటిష్ ప్రభుత్వానికి గాబరా కలిగేది. అందరికంటే ఆయన విరోధులకు, బాపుకేమైనా అయితే అది తమ పైకి వచ్చేస్తుందేమోనని భయం కలిగేది.

ఉపవాసం చేసేటప్పుడు బాపు ఊరకే కూర్చునేవారు కారు. ఆయనను కలవడానికి జనాలు వచ్చేవారు. శరీరంలోని బలాన్ని నిలుపుకోవడానికి పడుకునేవారే తప్ప ఆయన చురుకుదనం తగ్గేది కాదు. భోజనం లేకుండా వాంతికొచ్చేది. అప్పుడప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాగేవారు. ఒక రెండు చంచాల నిమ్మకాయల రసం, తేనె వేణ్ణీళ్ళలో కలిపి తాగేవారు. వైద్యులు పచ్చి కూరగాయల రసాన్ని తాగండి లేదా పళ్ళుతినండి అనేవారు. ఈయన వినాలిగా! ఊహూ.. అభోజనంగా ఉండడంతో మలబద్ధకం ఏర్పడేది. మూలవ్యాధి ముందునుండి ఉండనే ఉండింది. దానికి ఎనిమా తీసుకునేవారు. అన్నీ ఆయనవే ప్రయోగాలు. ఆయనదే చికిత్స. ఆయన ప్రకారం తన దేహానికి ఏమౌతోంది, ఏమవ్వాలి అనేది తనకు బాగా తెలుసు, దాన్నితను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకున్నాను అని నమ్మారు. ఎంత డోకొచ్చినా, ఏమొచ్చినా, నీళ్ళు, నిమ్మరసం, ఉప్పు తగుపాళ్లలో తీసుకునేవారు.

బాపు 21 రోజుల ఉపవాసం చేశారు అంటే కొందరు, ‘అదెలా సాధ్యం? ఎవరికీ తెలియకుండా ఏదైనా తినుంటారు’ అన్నారట. అయ్యో రామా అదెలాంటి జనాలో?! బాపు ఉపవాసం చేసింది అందరి ఎదురుగ్గా, ఎవరైనా తమ స్నేహితుల ఇళ్ళల్లో, వేరే వేరే ఊళ్ళల్లో, జైలులో. అక్కడంతా దొంగతనంగా తినడానికి వీలవుతుందా? దృఢ నిర్ధారమే ఆయన ఆహారం. దృఢ మనసు, నీళ్ళు ఈ రెండే ఆయనను కాపాడింది.

ఉపవాసం చెయ్యడం అంటే భోజనం వదిలేసి ఒక చోట కూర్చోడమంత సులభం కాదమ్మాయ్! నిరంతరం ఒక పూట ఉపవాసం చేసేవాళ్లకు కూడా రోజులకొలదీ ఉపవాసం చేతకాదు. నాకంటూ అసలు చేతకాదు. కొన్ని సార్లు ప్రయత్నించాను. కానీ నాకు చేతకాలేదు. అంత దేహబలమూ లేదు, మనోబలమంటూ అసలు లేదు. బాపుకు ఆయన తల్లి ఉపవాసం చేసింది చూసి చూసి అలవాటయింది. అతి సులభంగా భోజనం మానేసేవారు. ఆయన ఉపవాస శక్తి చూసే ఆయన మహాత్ముడే అయ్యుండాలని అందరూ భావించారు. ఇతరులే కాదు, నేను కూడా అలాగే అనుకున్నాను. ఆయన మహా దైవ భక్తులు. ఉపవాసం కూడా పూర్తిగా తమను తామే నిరాకరించుకుని చేసే ఒక మహత్తర కార్యం అని భావించారు. ఆయన ప్రకారం “దేవుడి కృప లేకుండా చేసిన ఉపవాసం ఉత్త ఆకలి మాత్రమే”. మొత్తానికి భగవంతుడి పైన ఆయనకున్న శ్రద్ధ, దృఢ నిర్దారం, మనోబలం వలన ఆయనకు ఉపవాసం చెయ్యడానికి వీలయింది అనిపిస్తుంది.

ఇకపైన నేను, నువ్వు దూరంగా ఉందాం. సరేనా?

అమ్మాయ్! కామం, ప్రేమలన్నీ నీ ముందు చెప్పడం ఎంతవరకూ సబబో అని ఒక క్షణం వెనుకంజ వేస్తున్నా. కానీ ఫర్వాలేదు. నువ్వు చిన్నదానివైనా ఇవన్నిటి ఫలితం నువ్వు. ఇప్పుడు నువ్వు చిన్నదానివైనా ఈ దశలన్నీదాటి పోవాలసిన పిల్లవే నువ్వు. కాబట్టి భోజనం, ఉపవాసం గురించి చెప్పినట్టే కామం గురించి కూడా చెప్పవలసిందే. ఎందుకంటే ఈ విషయంలో బాపును పూర్తిగా అర్థం చేసుకోకుండా ఉండడం గాల్లో కత్తి విసరడం లాంటిది. అందుకే చెప్తున్నా.

అధ్యాత్మం, ఆహారం, బ్రహ్మచర్యం ఈ మూడింటి గురించి నా భర్త ఎల్లప్పుడూ ప్రయోగాలు చేశారు. ఉపవాసం యొక్క రుచిని ఉత్త నాలుకకే కాకుండా, శరీరానికి కూడా చూపారు. కానీ అప్పటికీ, ఇప్పటికీ బ్రహ్మచర్యమనే విషయంలో ఆయనను అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టమవుతోంది. అదే విషయానికి కొందరు ఆయనను తిడతారు, కొందరు ఆరాధిస్తారు. కామం కూడా ఒక పురుషార్థమే. ఈ భూమిని తిరిగేలా చేసింది ఆ కామమే అని జగమంతా నమ్మినప్పుడు బ్రహ్మచర్యం గురించిన ఆయన ఆలోచనలు, అదీ ఒక రాజకీయ నాయకుడి నుండి వచ్చినప్పుడు, పూర్తి వ్యతిరేక ప్రతిక్రియలు రావడం సహజం కదా అమ్మాయ్!

ఏ ఎండకా గొడుగు పట్టే రకం కాదు మా ఆయన. ఆయనకెలా జరగాలో అలానే జరగాలి. అది కూడా ఆయన అనుకున్న నియమాల ప్రకారమే సరిగ్గా జరగాలి. అలా జరగాలనుకునే దారులు సుగమమా? ఆయన అతి కష్టమైన దారినే ఎన్నుకునేవారు. దారి పైనున్న బండలను స్ఫటిక శిలల మాదిరిగా పక్కకు జరిపేవారు. సత్యాగ్రహ దారిలో బాపు అలా ఎత్తి పక్కన పెట్టిన మహాన్ బండరాయి బ్రహ్మచర్యం.

దేవదాసుకు ఐదో ఏడో, ఆరో ఏడో నడుస్తోంది. 1906 ఉండాలి. అప్పుడు మేము జొహాన్స్‌బర్గ్‌లో ఉన్నాము. ఫీనిక్స్ ఆశ్రమం ప్రారంభమైనా మేమక్కడికి వెళ్ళలేదు. భాయి ఆశ్రమానికి, ఇంటికీ తిరుగుతున్నారు. సత్యాగ్రహం, పత్రిక, ఉత్తరాల వ్యవహారాలు, పోరాటాలు, కోర్టు కచేరీలు అని తీరికే ఉండేది కాదు ఆయనకు. నలుగురయ్యారు కదా, ఇక పిల్లలు చాలు అని నిర్ణయించేసుకున్నాము. నా బయట చేరే రోజులను లెక్కపెట్టి ఏ ఇబ్బంది రాని రోజుల్లో దైహిక సంబంధం జరిగేది. కానీ చాలా ఇబ్బంది కలిగేది. అలాంటి రోజుల్లో ఒకటి నాకు రక్తస్రావం, ఆయాసం, నిశ్శక్తి వీటివలన అనారోగ్యం కలిగేది. లేదా నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆయన ఊళ్ళో ఉండేవారు కాదు.

అదే సమయానికి దక్షిణ ఆఫ్రికాకు వచ్చిన మా పెద్దబ్బాయి హరి, తన తలిదండ్రులకూ చెప్పకుండా, వేచి చూడకుండా, భారత దేశానికి వెళ్ళి తన పెదనాన్న వద్ద పెళ్ళి చేయించేసుకున్నాడు. అది వాడి తండ్రికి ఎంత బాధ కలిగించిందంటే చెప్పనలవి కాదు. సత్యాగ్రహానికి సంబంధించిన ఇన్నిపనులున్న సమయంలో తమ పెద్ద కుమారుడు హిందూస్తాన్‌కు వెళ్ళి పెళ్ళి చేసుకున్నాడు కదా? తమ కొడుకుగా ఉండి కూడా వాడికి ఇంత దేహలాలస ఎలా కలిగింది? అనే తుదిమొదలు లేని జిజ్ఞాస ఆయనది. కోపమో, విసుగో, తిరస్కారమో, వైరాగ్యమో ఏదీ సరిగ్గా చెప్పలేని ఒక భావం ఆయనను ఆవరించేసుకుంది. ఆయనను కదిలించడానికి నాకు భయం, ఇబ్బంది. దాన్ని మరచిపోవాలని ఇంకా ఎక్కువ పనులలో నిమగ్నమయ్యారు. కలెన్బాక్, హెన్రి పొలాక్ లతో మధ్యరాత్రి దాకా చర్చ, సత్యాగ్రహ రూపరేఖలు తయారు చేసేవారు. ఏవో రాసేవారు. ఒక్కోసారి ఉన్నట్టుండి మౌనంలోకి జారిపోయేవారు.

ఇలా ఉండగా ఒక రోజు, కలెన్ ఫీనిక్స్ ఆఫీసుకు వెళ్ళాడు. మిలి, హెన్రి తమ ఇంటికి వెళ్ళారు. పిల్లలు పడుకున్నారు. రాత్రి సమయం. గాంధీ భాయి గదిలోకి వచ్చారు. తలుపు వద్ద నిల్చుని “కస్తూర్, ఒక మాట చెప్పనా?” అన్నారు. మళ్ళేం వచ్చి పడిందో, హరి గురించి ఏమైనా ఉండచ్చా లేదా నేనేమైనా తప్పు చేశానా అనుకుంటూ ఆయన వైపు చూశాను. “ఇకపైన నువ్వూ నేను వేరుగా పడుకుందాం. దైహిక సంబంధం మానేసి బ్రహ్మచర్యం స్వీకరిద్దాం అని అనిపిస్తోంది. సరేనా?” అన్నారు. నాకు ఒక్కసారి నేను విన్నది ఏమిటని తలకెక్కలేదు. కళ్ళు మిటకరించి ‘ఆఁ’ అన్నాను. మళ్ళీ చెప్పారు. “దీన్ని నీపైన రుద్దాలని నాకు లేదు కస్తూర్. నాకు అలా అనిపిస్తోంది. కాని నువ్వు వద్దు, వీలవదు అంటే ఇతర దారులు చూద్దాం. బలవంతంగా నీ పైన బ్రహ్మచర్యం మోపను. ఆలోచించి చెప్పు” అన్నారు. నాకు గుండె ఝల్లుమంటూ పగిలినట్టయింది. రాత్రి ఎప్పుడవుతుందా అని వేచి చూస్తున్న నా భర్త, “చాలు బాబూ చాలు. ఈయన విదేశాలకు వెళ్తే వెళ్ళనీ” అని నాకనిపించేలా చేసిన నా భర్త, ఇప్పుడు ఇలా అంటున్నాడు! అది కూడ ఐదారు కడుపులు చేసినాక. నలుగురు పిల్లలు ఉన్నప్పుడు. మేమిద్దరం దూరంగా పడుకునేంత ముసలివాళ్ళమయితే కాలేదు. మా ఇద్దరికీ ముప్ఫై ఎనిమిదో ముప్ఫై తొమ్మిదో అంతే.

‘ఏమయింది ఈయనకు ఉన్నట్టుండి? నేనేమైనా తప్పు చేశానా?’ అన్నదే ముందుగా నా తలకు తట్టింది. ఒక క్షణం నన్ను నేనే నా కళ్ళ ముందు తెచ్చుకుని పరీక్షించుకున్నాను. నా రోగాలు, రుజువులు, చిరాకుకు విసుగొచ్చి ఇంకెవరి పైనయిన మనసు పడ్డారేమో అనిపించింది. భాయి చుట్టుముట్టూ అంతా ఆడవాళ్ళే. కానీ ఇలా ఆలోచన వచ్చిన మరుక్షణమే నా పైన నాకే సిగ్గు కలిగింది. ఆ ఆడవాళ్ళు అలాంటివారు కాదు. చూస్తేనే తెలిసిపోయేది. మా మిలి అయితేనేమి, సోనీ అయితేనేమి అందరూ భార్యను ఇలా చూసుకుంటావా అని భాయిని దెప్పి పొడిచేవారు. భాయి కూర్చున్న చోటునుండి నాకేమైనా పని చెపితే లేదా చేసింది బెడిసికొట్టింది అంటే చాలు, మొదలుపెట్టేవారు. ఛ. వాళ్ళెవరూ భాయిని బుట్టలో వేసుకునే రకాలు కారు. అదీగాక నా భర్త కూడా అలాంటాయన కారు. లేదా నా పైన ఏదైనా సందేహం కలిగి ఇలా చెప్తున్నారా? అయినా సందేహం కలగడానికి ఉన్నదైనా ఏముంది ఈ భాష రాని ఊళ్ళో! ముందొక సమయం ఉండేది. ఇతర మగవాళ్ళను చూడకు, వారితో మాట్లాడకు, నవ్వవద్దు అని నా భర్త కంచె వేసేవాడు. కానీ ఇప్పుడు ఆయన చాలా మారిపోయిన మనిషి. అలా కూడా కాకపోవచ్చు. మరి ఎందుకు ఈ బ్రహ్మచర్యం విషయం?

ఏం చెప్పాలో తోచలేదు. గమ్మునుండిపోయాను. ఆయనకు ఏమనిపించిందో, అక్కడే మంచం క్రింద ఒక చాపను లాక్కుని పడుకున్నారు. నేను నిద్రపోలేదు. ఆయనకు కూడ నిద్ర పట్టినట్టు లేదు.

ఒక క్షణికమైన ఆలోచనలో ఇలా చెప్పుండవచ్చు అనుకున్నాను. కానీ కాదు. నా భర్త నోటినుండి ఏమైనా వచ్చిందంటే అయిపోయింది. అదే ఖరారు. ఒకటే గదిలో నేను మంచం పైన పడుకోవడం, ఆయన క్రింద నేల పైన చాప పైన పడుకోవడం కొనసాగింది. కొన్ని రోజులకు మమ్మల్నంతా ఫీనిక్స్ ఆశ్రమానికి పిలుచుకుపోతానని, ఇక ఆశ్రమంలోనే ఉండాలని తెలిపారు. ఫీనిక్స్‌కు బయలుదేరే ముందు రాత్రి, భాయి అరుగు పైన ఏదో రాస్తూ కూర్చున్నారు. ఆయన వద్దకు వెళ్ళాను. నా వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వి తమ పనిని కొనసాగించారు. కొన్ని నిమిషాలు గడిచాయి. రాత ముగించి, సరంజామా పక్కకు పెట్టి నేల పైన చాప పరిచి, పడుకోవడానికి తయారు కాసాగారు. ఏ భార్య అయినా ఇలాంటి పరిస్థితి ఎదుర్కుందో లేదో, ఇలాంటి విషయాన్ని భర్తతో మాట్లాడుతుందో లేదో తెలీదు. నేను సిగ్గు విడిచి అడిగేశాను.

“ఇక పైన బ్రహ్మచర్యం పాటిద్దామని చెప్పారు. కాని భార్యగా మీ శరీర వాంఛలు తీర్చడం నా కర్తవ్యం కాదా?”

“భర్తగా నీ శరీర వాంఛను తీర్చడం కూడా నా కర్తవ్యం కాదా కస్తూర్?”

“నిజమే. కానీ నాకు అంతగా శరీర వాంఛలు లేవు. అప్పుడైనా, ఇప్పుడైనా అంతకంతే. మీరే చూశారుగా నన్ను. కానీ మీరు ఎలా ఉండేవారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.”

“నిజం కస్తూర్. యౌవనపు రోజులవి. శరీర వాంఛలు తీర్చుకోవడమే జీవితం. దానికోసమే జీవితం అనే భావన ఉండడం, అందుకోసం నిన్ను వాడుకోవడం అంతా నిజమే. అందుకే ప్రాయశ్చిత్త రూపంగా ఇప్పుడు నీ సేవ ఎంత చేసినా అది తీరదు. అందుకే నా శరీర వాంఛను నిగ్రహించే నిర్ణయం తీసుకుంది. నీతో ప్రత్యేకంగా సమయం గడపడానికి ఎలా సమయం కేటాయించాలి అన్నదాంట్లోనే నా లక్ష్యం, శ్రమ, సమయం అన్నీ గడచిపోతాయి అంటే సత్యాగ్రహానికి అర్థమే ఉండదు. కాబట్టి ఇద్దరి పరస్పర సమ్మతితో బ్రహ్మచర్యం స్వీకరిద్దాం అనిపించింది”

“దేహం దూరమయితే మనసు దూరమయినట్లా? నా దేహం కన్నా, నా ఈ దేహం నుండి వెలికి వచ్చిన పిల్లల నుండి, కుటుంబం నుండి దూరమవుతారనే భయం నాకు”

“పిచ్చిదానా! దూరమయి ఎక్కడికి వెళ్ళను? నువ్వెక్కడో నేనక్కడే, నేనెక్కడో నువ్వక్కడే. పెళ్ళి, పతి పత్ని సంబంధం అంటే ఆటకాదు. ఉత్త దేహాల కలయిక, నిభాయించడం కూడ కాదు. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అనే మాటను నువ్వు వినలేదా?”

“స్వర్గం గిర్గం, జన్మ, పునర్జన్మ నాకవేం తెలియదు. కానీ ఉన్నట్టుండి ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చారు?”

“కోపం వస్తోందా? ఇది ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం కాదు కస్తూర్! ఒక శరీరంతో సమాగమం సాధించడానికి అదెంత సాధన చెయ్యాలో బ్రహ్మచర్య సాధనకు దానికి వందరెట్లు గట్టిగా ఉండాలి! నీతో గడిపే ఆ ఒక్క గడియ కోసం ఎంత కాచుకోవాలి? దానికని సమయం, నీ ఆరోగ్యం కలసి రావాలి. పిల్లలు నిద్రపోయుండాలి. ఏకాంతం అనుభవంలోకి రావాలి. మనసులో కోరిక ప్రబలాలి. ఎన్ని విషయాల వైపు లక్ష్యం పెట్టాలి చూశావా? అయినా ఇవన్నీ ఎందుకోసం? కేవలం మన శరీరాల ఉద్రేక శమనానికి. అదెంత సేపటిది? రెండుక్షణాలు. సుఖం మత్తుకు శరీరం మళ్ళీ మళ్ళీ నిద్రలేస్తుంది. పిల్లలు ఇక వద్దు అనుకున్నాక లైంగికత ఇక ఉత్త వినోదానికే కాకుండా ఇంకెందుకు? కానీ కస్తూర్. అలాంటి లైంగికత తప్పు”

“ఆడా మగా రెండు క్షణాలు పరస్పరం దగ్గరై సమయం గడిపి సంతోష పడితే తప్పేమిటి?”

“కామంలో మునిగిపోయిన లోకం ఇలానే నమ్మింది కస్తూర్. కానీ పిల్లలను పుట్టించే అవసరంలేని లైంగికత పాపం. నేనిప్పుడు అహింస గురించి మాట్లాడతాను కదా. అహింసలో బ్రహ్మచర్యమూ ఉంది. దాన్నిఒక్కసారిగా సాధించడం నాలాంటి సంసారికి కష్టం. నువ్వు గమనించి ఉండవచ్చు. దీనికోసం చాలా రోజుల నుండి సన్నాహం జరుగుతోంది. మొదట పగటి పూట కలయిక మానడం, తరువాత రాత్రిపూట కలయిక మానెయ్యడం. అలా చెయ్యడానికి సాదా సీదా దుస్తులు, ఆహారం కావాలి. నగలు, సుగంధాలు వదలాలి. దైహిక ఆకర్షణ తగ్గించాలి. అందంగా కనబడకూడదు. ఇవన్నీ మనల్ని నైతికంగా ఒక మెట్టు పైకి తీసుకెళ్తాయి కస్తూర్. నా పనులు నేనే చేసుకోవాలి. చప్పిడి కూడు, మితాహారం తినడం చాలా రోజుల నుండి జరుగుతోంది. నీకు తెలియదు.”

“నిజమే. కానీ మీరు ఈ నిర్ణయానికి రావడానికి అలా చేస్తున్నారని తెలియదు. నాకు చెప్పనే లేదు మీరు”

“నగలు, మంచి దుస్తులు వదిలెయ్యమని నీకు చెప్పాను. ఉప్పు మానెయ్యమని చెప్పాను. పప్పు మానేయమన్నాను. చక్కెర వద్దన్నాను. చెప్పానా లేదా?”

నిజమే. భాయి నాతో ఏమేమో నిదానంగా మానిపించారు. ఆయన వెళుతున్న దారిలోకి నాకు తెలియకుండానే నన్ను తీసుకెళ్ళారు. కానీ ఆయనకెందుకు ఈ అభిప్రాయం కలిగింది అని ఆశ్చర్యంగా అడిగాను. దానికి ఆయన ఒక సంఘటన చెప్పారు.

ప్రాణ జీవన మెహ్తా భాయి పాత స్నేహితుడు. ఆప్త మిత్రుడు. బ్యారిస్టర్ చదివి లండన్ నుండి ముంబైకి వచ్చి దిగిన భాయి మొదట మెహ్తా ఇంటికి వెళ్ళి, తరువాత రాజకోట్ కి వచ్చింది. ఆయన ఇంట్లో భాయి తమ ఈడే అయిన రాయచంద్ భాయి అనే జైన్ సంతుడిని పరిచయం చేశారు. భాయి పైన చివరిదాకా ఆయన ప్రభావం చాలావరకు ఉండింది. రాయచంద్ భాయి మేము దక్షిణ ఆఫ్రికానుండి వచ్చేటప్పటికి కాలం చేశారు. సుమారు 10 సంవత్సరాలు ఇద్దరూ పరమ ఆప్తులుగా ఉన్నారు. తప్పకుండా ఉత్తరాలు రాసుకునేవారు.

మెహ్తా గారింట్లోని ఒక వార్త భాయి లక్ష్యానికొచ్చింది. ఒక ఇంగ్లీష్ రాజకీయ నాయకుడు. గ్లాడ్ స్టోన్ అనో ఏమో అతడి పేరు. ఆయనకు ఆయన భార్య హౌస్ ఆఫ్ కామన్స్ లోనూ టీ తెచ్చిచ్చిందట. ఆమె ప్రేమ, త్యాగం దాంపత్యంలోని ప్రత్యేక లక్షణాలు అని గాంధీ భాయి పొగిడారట. అప్పుడు రాయచంద్ భాయి, ఏది ప్రత్యేకం? భర్తకు ఆమె చేసిన సేవా? ఎవరికైనా ఆమె చేసే సేవా? ఆమె ఒక వేళ భార్య కాకుండా చెల్లెలో, పరిచారికో అయ్యుండి అంతే సేవాభావంతో చేసుంటే నీకింత నచ్చేదా? అలా కాకుండా ఆమెకు ఒక పురుషుడు టీ ఇచ్చుంటే నచ్చేదా? లైంగిక- రక్త సంబంధం ఉన్నవాళ్ళు చేసిన సేవ మాత్రమే ప్రత్యేకమా? ఇలాంటి ప్రశ్నలు అడిగారట.

ఇక చూడు! దీన్ని నా భర్త పట్టేసుకున్నారు. అరెరె! అవును కదా అని ఆలోచించారు. తను దైహిక సంబంధమున్న సేవను మాత్రం పరిగణిస్తున్నాడు. దానికే ప్రాముఖ్యత నిస్తున్నాడు. భార్యాభర్తల సంబంధం ఉత్త దైహికమే కాదు. దాన్ని దాటి కూడా ఉండాలి. దైహికంగా కాకుండా కూడా ఉంటుందంటే మాత్రమే అది పరిశుద్ధమైన ప్రేమ అని అనిపించింది. రాయచంద్ భాయ్‌తో దీని గురించి కూలకంషంగా చర్చించారు. లైంగికతలో హింస ఉంది. అది సాధనతో కూడిన బ్రతుకుకు హానికరం అన్నది జైనులు నమ్మకం. దాన్ని భాయి తన మనసులో నిలుపుకున్నారు. నాలుగైదు సంవత్సరాలు దాని గురించి లోతుగా ఆలోచించి ఇప్పుడు ఈ నిర్ణయానికి వచ్చారు.

పెళ్ళైన తరువాత నా పందొమ్మిదో సంవత్సరం నుండే మేమిద్దరం దూరంగా ఉండసాగాము. తరువాత కూడా దూరంగా ఉన్నదే ఎక్కువ. నేను తోడు లేనప్పుడు తాము గడిపిన యౌవనపు రోజుల్లో స్వనిగ్రహం కోసం ఎంతో కష్టపడ్డారు, దానికోసం ఏవేవో పద్ధతులను అనుసరించారు అని భాయి వివరించారు. ఇవంతా చెప్పి, ధర్మపత్నియైన నేను సహకరించాలని చేతులెత్తి ప్రార్థించారు.

నాకు ఒప్పుకోకుండా ఉండడానికి వేరే మార్గమే లేకుండింది. ఆయనకు అక్కర్లేనిది నాకెందుకు అనిపించింది. అయినా ఒప్పుకోకుండా తలవంచేసి మౌనంగా కూర్చున్నాను. కన్నీళ్ళు నేలను తడుపుతున్నాయి. భాయి కళ్ళు మూసుకుని ధ్యానమగ్నులై అదిగో, అక్కడ దూరంగా చాప పైన కూర్చున్నారు.

అప్పటిదాకా ఒకే గదిలో వేరే వేరే పడుకునేవాళ్లము. ఇప్పుడు ఇద్దరూ వేరే వేరే పడుకోవడం మొదలుపెట్టాము.

భాయి ఎప్పుడూ అంతే. తనకు చాలా ఇష్టమైనదేదో దాన్నే నిగ్రహించాలని ప్రతిజ్ఞ చెసేవారు. దాన్ని వదిలేయడానికి మనసును గట్టి పరచుకునేవారు. ఉపవాస సమయంలోనూ అంతే. ఇప్పుడు బ్రహ్మచర్యం వదిలేయడమూ అంతే. ఒకానొక సమయంలో భార్యకంటే ఆమె దేహమే ఇష్టమన్న మోక, ఇప్పుడు దాన్నే వదిలెయ్యాలని నిర్ణయించుకున్నారు.

నేనేం చెయ్యాలి అని ఎవరినడగను? అడిగితే వారికి అర్థమవుతుందో లేదో? మా ఇద్దరి గురించి ఉన్నవీ లేనివీ కల్పించి అపార్థమైతే అనే భయం కూడా. అమ్మ, చిన్నత్త ఎవరూ లేరు. నా అక్కచెల్లెళ్లలో ఎవరినీ అడిగేలా లేదు. మా ఇంటికొక మాత వచ్చేవారు. దూరపు బంధువు. చివరికి ఆమెకు చాలా సూచనప్రాయంగా ఉత్తరం రాయించాను. “ఆయన కోరిక ప్రకారం ఉండడమే నీ కర్తవ్యం. అతడి పైన అనుమానించడానికి ఏదీ లేకుంటే ఒప్పుకో” అని ఉత్తరం రాయించారు. దాని తరువాత బ్రహ్మచర్య నియమాలను నేను కూడా మనస్ఫూర్తిగా పాటించసాగాను.

భాయికి సమ్మతేమో తెలిపాను. కానీ నెమ్మది దొరకలేదు. ఏదో ఒక కొరత, ఒక లోపం, ఒక శూన్యం నాలో పెరుగుతోంది. మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది అనిపించేది. శరీర సంబంధమంటే అదేదో ఆనందమని కాదు. భార్యగా నాకున్న విశేష అధికారం అది అని భావించాను. అదే లేదన్నాక మరింకేం మిగిలింది అని అనిపించింది అంతే. కానీ ఆశ్రమ జీవితం ప్రారంభమయినప్పుడే బ్రహ్మచర్యాన్ని చేపట్టడం వలన ఇద్దరూ ఒక రకంగా విడుదల పొందాము అనేది మాత్రం నిజం.

ఆయనకు కామం గురించి ఎందుకు ఈ భావన ఏర్పడింది అని ఆలోచిస్తే అదే ఆ సంఘటన, ఇంతకు ముందు చెప్పాను కదా, అది టక్కున గుర్తుకొస్తుంది. పెళ్ళైన కొత్తలో ఒక రోజు. మామగారికి ఆరోగ్యం ఏమంత బాగోలేదు. ఆయన సేవ మోకదే ఆ సమయంలో. ఆ రోజు రాత్రి తండ్రికి సేవలందిస్తున్నవారు అన్నయ్య వచ్చాడని ఒక క్షణం గదిలోకి వచ్చారు. ఐదే నిమిషాలు. మబ్బు కురిసింది అంతే. తలుపు చప్పుడయింది. నౌకరు వచ్చి చెప్పాడు, మామాగారు కాలం చేశారు అని. తరువాత అదెన్నో రోజుల దాకా ఆ విషయం మోకను పాపప్రజ్ఞలో పడవేసింది. కొన్నిరోజుల తరువాత నా కానుపై, బిడ్డ కొన్ని రోజుల్లో చనిపోయాక, అది తన కామపిపాసకు తగిన శిక్ష అని మోక భావించారు. అదే పాపప్రజ్ఞ కొనసాగుతూ వచ్చుండవచ్చు.

అదేమైనా, తను నాతో పడుకోకుండా ఇతర ఏర్పాటును చేసుకున్నాడని నేను అనుకుంటానని భాయి సదా జాగరూకులై ఉండేవారు. ఇతరులకు తెలియకుండా ముందు ఎలా ఉండేవారో అలానే ఉండేవారు. నాకు ఒంట్లో బాగోలేక పోతే వీపు నిమరడం, తల పట్టడం, జల చికిత్స, ఆవిరి చికిత్స అన్నీ చేసేవారు ఆయనే. ఎక్కడికి వెళ్ళినా నన్నుతీసుకెళ్ళేవారు. ముట్టుకునేవారు. భుజం పైన చేయివేసి నడిచేవారు. దేహసంబంధం మాత్రం ఉండేదికాదు.

దూరంగా ఉండడానికి మొదలు పెట్టి రెండు సంవత్సరాలయ్యాయి. 1908లో ఉండాలి. చాలా రక్తస్రావమై నేను చచ్చి బతికాను. భాయి, ఇతర సత్యాగ్రహులంతా దక్షిణ ఆఫ్రికా జైళ్ళను భర్తీ చేసేవారు. విడుదల చెంది బయటికి వచ్చేవారు, మళ్ళీ వెళ్ళేవారు. బయటికి వచ్చేవారు. మళ్ళీ బంధించడం జరిగేది. ఒకసారి ఆరోగ్యం బాగోలేక విహ్వలురాలై పడుకున్న నాకు భాయినుండి ఒక ఉత్తరం వచ్చింది. దాన్ని మణి చదివి వినిపించాడు. “ధైర్యంగా ఉంటూ పౌష్టిక ఆహారం తీసుకుంటే నువ్వు కోలుకుంటావు. లేదంటే అది నా దురదృష్టమే. నేను బ్రతికున్నా నన్ను వదిలేసి నువ్వే ముందుగా వెళ్ళిపోవాలనుకుంటే, నాదేం అభ్యంతరం లేదు. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను అంటే నువ్వు పోయినా నాలో మాత్రం బ్రతికే ఉంటావు. నేను నీకు పదే పదే ఇచ్చిన మాటను మళ్ళీ చెప్తున్నాను. రోగంతో నువ్వు చనిపోతే నేను మళ్ళీ పెళ్ళిచేసుకోను”

నీకేమైనా అయితే నేను మళ్ళీ పెళ్ళి చేసుకోను అనే మాటను భాయి మళ్ళీ మళ్ళీ చెప్తుండేవారు. ఈ ఉత్తరం వచ్చినాక నేను ఇంకా నెమ్మది పొందాను. పూసల పేరు, పాగా, కోటు, సూటు, భోజనం ఇలా భాయి ఒక్కొక్కదాన్నీ వదిలేస్తూ, విడిపించుకుంటు వచ్చారు. ఉల్లిపాయలా ఒక్కో పొరనూ వదిలేస్తూ చివరికి భార్యదాకా వచ్చారు.

‘కామమే శత్రువు’ అన్నది ఆయన గాడమైన నమ్మకం. సాదా జీవితం, సహజ జీవితం, బ్రహ్మచర్యం, సేవ, పేదరికపు జీవితం, శాకాహారం, ప్రకృతి చికిత్స వీటన్నిటినీ పాలించేవారు. పెళ్ళి ఒక ఉద్దేశం, సార్థక్యం కామమే అయినా కామం వద్దు, భార్యతో కూడా పొందు వద్దు అన్నారు. మొత్తానికి ఆయన ఆడ మగ ఒక ఆనంద లైంగిక జీవితాన్ని గడపవచ్చు అని భావించనే లేదు. ఆయనకు ప్రేమలో నమ్మకం ఉండింది. కానీ కామం గురించి సందేహం ఉండింది. ఆయన చుట్టూతా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ స్పర్శను ఆనందించేవారు. కానీ కామం నుండి ముక్తులవ్వాలని కోరుకున్నారు! ఆడవాళ్ళలో ఆడదాన్నవ్వాలి, ఆడవాళ్ళు తనను ఆడదాన్లా భావించాలి అని కోరుకున్నారు! “నేను సగం ఆడదాన్ని” అనేవారు. భోజనం గురించి ఎలా మాట్లాడేవారో కామం గురించి అలాగే మాట్లాడేవారు. ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేసేవారు కాబట్టి కొందరు ఆయనను అపార్థం చేసుకునేవారు. అలాంటి వారి నోటిదూలకు ఆహారమయ్యేవారు. ఇలాంటివాటిని అర్థం చేసుకోవడం ఇతర జనులకు కొద్దిగా కష్టమే కదా! నా బంధువులు, మిత్రులు దీన్నే అటు తిప్పి, ఇటు తిప్పి విని విసుగు తెప్పించేవారు. బాపు వద్ద దీని గురించి చెప్తే “వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు? వాళ్ళేమైనా అనుకోనీ. నిజమేమిటో దాన్ని చెప్పి నిశ్చింతగా ఉండు. నీకనిపించింది నీ సత్యం. వాళ్ళేమనుకుంటారో అది వాళ్ళ సత్యం” అని చాలా సాదాగా చెప్పేసేవారు.

నా భర్త, ఆయనకు ఇష్టమైన రాముడు ఇద్దరూ చాలా వరకు ఒకమాదిరే. వాళ్ళ కోసం ప్రాణమిచ్చే భార్యలు, తమ్ముళ్ళు, బంధువులు, భక్తులు వాళ్ళకున్నారు. కానీ తమ పైన ‘మంచితనాలను’ లాక్కుని కష్టపడ్డారు. ప్రేమ, కామం భిన్నం అనుకుని చాలా కష్టపడ్డారు బాపు. అవి రెండూ ఒకే నాణ్యం యొక్క రెండు ముఖాల మాదిరి. వేర్వేరు అక్షరాల్లో, ఆకారాల్లో రాసుంటుందన్నది నిజం. కానీ విలువలు ఒకటే. ఆయనకు దీన్ని అర్థం చేసి చెప్పడంలో ఓడిపోయాను. మరీ రెట్టిస్తే నాకే కావాలనుకుంటారేమో అనిపించి ఊరకుండిపోయాను.

నా భర్త నాకు ప్రేమను, కీర్తిని ఇచ్చారు. కష్టాలనూ ఇచ్చారు. ఏది ఎంత అని ఎలా కొలిచేది? ఆకాశాన్ని, సముద్రాన్ని కొలవగలమా?

(సశేషం)

Exit mobile version