నేను.. కస్తూర్‌ని-2

0
2

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

రావి అరుగు-వేపచెట్టు

1

[dropcap]ఒ[/dropcap]క జీవితకాలంలో ఎన్నో బ్రతుకులు బ్రతికిన గాంధీ అనే వ్యక్తిత్వం ఆశ్చర్యాన్నీ, ప్రశ్నలనూ జంటగా మన ముందుంచుతుంది. అదే సమయంలో ఆయనే స్థాపించిన పార్టీ – దేశం ఎందుకిలా అయ్యాయి అనే అందోళనను కలిగించేలా ప్రస్తుత పరిస్థితులు తయారయ్యాయి. ఇవన్నిటి నడుమ గాంధీ-150 వచ్చి వెళ్ళింది. ఇది కస్తూర్ బా-150 కూడా కాబట్టి కస్తూర్ బా జీవిత చరిత్ర రాయాలి అని ఏ గడియలోనో నాలో మొలకెత్తింది. రాస్తూపోయిన కొద్దీ దీని గురించిన విస్తృత అధ్యయనం అవసరమయ్యింది.

కుగ్రామంలో పెరుగుతూ, చేతికందింది చదువుతూ ఉన్ననాకు మొట్టమొదట అందినవారు గాంధీ. అది కూడా అయన ఆత్మకథ ద్వారా. కాలక్రమేణ ఆయన ప్రభావం నా దుస్తులు, మాటతీరు, గుణాల పైన కలిగిందని నాకే అర్థమవసాగింది. క్రమేణ నాకు దారిదీపాలుగా నిలిచిన బాబాసాహేబ్ గారు, మహాత్ములు, గురువులు, స్నేహితులు గాంధీని నేపథ్యానికి జరిపేశారు. గాంధీ నీడ నుండి, ప్రభావం నుండి తప్పించుకోవడానికి నేను ప్రయత్నించాను. ఇవన్నీ జరిగే సమయంలోనే చరిత్రను, ఐతిహాసిక వ్యక్తులను వారి స్నేహితుల దృష్టితో చూడాలనే మహిళా దృష్టికోణపు అవసరాన్ని నేను, నా స్నేహితురాళ్ళు చర్చించేవాళ్ళము. అలా యశోధర, సావిత్రిబాయి, చెన్ని, రమాబాయి, కస్తూర్ బా మొదలైన ఆడవాళ్ళ జీవిత వివరాలు మమ్మల్ని ఎక్కువగా ఆకర్షించసాగాయి.

గాంధీ-కస్తూర్ బా గార్లు జన్మించిన 150 సంవత్సరం వచ్చింది. మహిళా సమాఖ్య ద్వారా అంబేడ్కర్-గాంధీ సమన్వయ అధ్యయనం చెయ్యడానికని వర్ధాకు వెళ్ళొచ్చాము. హింద్ స్వరాజ్, జాతి నిర్మూలన జత జతగా చదివి చర్చించాము. వర్ధాలో చూసిన బాపు, బా కుటీరాలు, చిన్నకొలతల కస్తూర్ బా గారి వస్త్రాలు, బ్రహ్మచర్యం స్వీకరించి, స్వయంగా నేసిన ఖద్దరు చీర కట్టుకునే వర్ధా ఆశ్రమ సత్యాగ్రహి శోభాతాయిగారితో జరిపిన చర్చలు ఈ సమయానికి గాంధీగారి సందర్భోచితం, బా దృష్టితో బా-బాపు మొదలైన విషయాల గురించి ఆలోచించడానికి ప్రేరేపించాయి. ఈ రోజు మనకు కావలసింది, గాంధీగారిని విమర్శిస్తూ తెలుసుకోవడమే తప్ప ఖండించడం కాదని మనసులో గట్టిగా అనిపించింది.

ఇంత నేపథ్యంతో కస్తూర్ బా గారి జీవనాధారిత కృతిని ప్రారంభించాను. ఇది నవల అనిపిస్తోందా, భారత దేశపు సామాజిక-రాజకీయ జీవితం యొక్క మార్పులతో ముడిపడిన వ్యక్తిగత జీవితాల మలుపులను చూసిన ఒక ఆడదాని జీవిత కథనమా, అనేది పాఠకులే నిర్ణయించాలి.

2.

ఎలా చూసినా కానీ, కస్తూర్ బా జీవన చరిత్ర రాయడానికి ఆమె జీవిత సహచరుణ్ణే ఎక్కువగా ఆశ్రయించాల్సి వస్తుంది. వాళ్ళిద్దరి బ్రతుకులు ఎంత జతజతగా ముడిపడి ఉన్నాయంటే బా గురించి రాసేటప్పుడు బాపును వదిలి రాయడానికి సాధ్యమే కానంత. అలాగే ఆయన గురించి రాసేవారు కొంత భాగాన్ని బా కోసం ప్రత్యేకించాల్సిందే. జ్యోతిబా-సావిత్రి ఫులేగార్లకు కూడా ఈ మాట అన్వయిస్తుంది. ఇలాంటి ఎన్నో జీవితాలు మన ముందున్నాయి. ఈ కారాణం వల్లనే ఇలా జతగా పెరిగిన, బ్రతికినవారి జీవిత చరిత్ర ఆ మరొక్కరి జీవితచరిత్ర కూడా అవుతుంది.

“ఒక రావిచెట్టు పుట్టింది. వృక్షంగా పెరిగి, బోధివృక్షంగా మారింది. దానికి ఒక అరుగు కట్టాము. నమ్మిన వారు పూజించారు. రావిచెట్టుతో పాటే ఒక వేపవిత్తనమూ మొలకెత్తింది. అది కూడా చిగురించి రావిచెట్టుతో పాటే పెరిగింది. రావి గుణాలు రావికి, వేప గుణాలు వేపకి. కానీ అవి రెండూ కూడా ఆ అరుగులోని గాలి, నీళ్లను పంచుకునే పెరిగాయి. వాటి చిగురు, పూలు, నీడ, వంకరలు అన్నీకూడా ఇంకో చెట్టు వలన ప్రభావితమయ్యాయి. మీరు దీన్నిపూజిస్తే, దారం చుట్టితే, అది మరోదానికి కూడా చెందుతుంది. ఎందుకంటే రెండూ ఒకదానికొకటి సాక్షిగా, పరిపూరకంగా పెరిగాయి. కాబట్టి వీటిలో దేని కథ చెప్పడానికి మొదలు పెట్టినా అందులో మరోదాని కథ వచ్చితీరాలి. ఇది దాంపత్యపు సొగసు అని ముగించెయ్యకు, ఇది సాంగత్యపు రుచి. పచ్చి కుండలను ఒకదాని పక్క ఒకటి పెడితే ఏమవుతుంది? పగిలిపోతాయి. అలా కాకూడదు అనుకుంటే ఏం చెయ్యాలి? వాటిని కాల్చాలి. అంటే జతగా ఉండాలంటే కాల్చుకోవాలి. ఇది అదే మాదిరిగా ఒకరికోసం ఇంకొకరు కాల్చుకుని, గట్టిపడిన కథ….

ఈపుస్తకాన్ని రాస్తున్నప్పుడు ఇలా కస్తూర్ బా చెప్పినట్టయింది. అయితే సరే. బాపు, బా ఇద్దరూ సమానంగా వస్తూ పోతూ ఉండడం అందుకేనేమో మరి. అలాగే కానీండి.

కస్తూర్ బా పుట్టింటివారు ఎవరున్నారు ఇప్పుడు? దాని వివరాలు ఎక్కడా దొరకడం లేదే అని నా మెదడులో పురుగు తొలుస్తూ ఉండేది. అందుకొరకే పోరుబందర్, సబర్మతి వెళ్ళొచ్చాను. బాపు-కబీర్ గార్లను తోడుగా పెట్టుకుని, కస్తూర్ బా కోసం నేను వెతికిన రోజులు నా జీవితంలోని అవిస్మరణీయ క్షణాలు అని చెప్పుకోవచ్చు.

పోరుబందరు లోని మాణిక్ చౌక్ అనే పురాతన, సందడిగా ఉన్న మార్కెట్ ప్రదేశంలో గాంధీ పూర్వీకుల ఇంటిని బరోడా సయ్యాజి రావ్ గాయక్వాడ్ గారు “కీర్తి మందిర్”గా మార్చారు. పాత ఇంటి చుట్టూ కొన్ని కట్టడాలను కట్టడం జరిగింది. బాపుకు సంబంధించిన వస్తువులు, రాతలు, జీవిత వివరాలు, భావచిత్రాలు, ప్రసార కేంద్రం ఉండేట్టు రూపొందించబడింది. బాపు ఇంటిని చూసొచ్చిన తరువాత కూడా నాకు కస్తూర్ బా గురించిన సూక్ష్మ వివరాలు దొరకలేదు. గ్రంథాలయంలోని పెద్దలను అడగగా “అక్కడే కొద్దిగా అటు వెళ్తే, కస్తూర్ బా ఇల్లుంది. అది కూడా స్మారకమే. అక్కడ ఉన్నవాళ్ళను అడగండి” అన్నారు. బాపు ఇంటి పెరడు దాటి, ప్రహరీ గోడ ఎక్కి దూకి, ఇరుకు వీధి మురికి కాలవ పక్కనుండి వెళ్తే అక్కడ కస్తూర్ బా ఇల్లుంది. దాన్ని భారతీయ పురావస్తు శాఖ తన పరిధిలోకి తీసుకుంది. అప్పుడెలా ఉండిందో అలాగే ఉంచబడింది. ఇటు కీర్తిమందిర్‌లో వచ్చిపోయేవారి సందడి కనిపిస్తే, అక్కడ వెనక కొంచెం దూరంలో ఉన్న కస్తూర్ బా ఇల్లు, వీధి నిర్జనంగా ఉన్నాయి. బా-బాపు జంటలో ఎవరెక్కువ గమనించబడ్డారు అని తెలుసుకోవడానికి వారి ఇళ్ళకు వచ్చి వెళ్ళే సందర్శకుల సంఖ్య చెప్పకనే చెపుతుంది.

ఆ సుందర భవనం వెలవెలబోతోంది. కీర్తి మందిర్‌కు వచ్చే వందల్లో ఒకరైనా ఇక్కడికి రారు. అక్టోబర్ 2, జనవరి 30 న గణ్యవ్యక్తులు కీర్తి మందిర్‌కు వస్తారే కానీ బా ఇంటికి రారు అని అక్కడి పర్యవేక్షకులే బాధగా చెప్పారు. ఇంటి వసారాలో పురావస్తు శాఖ తరుపున పనిచేస్తున్న సాదియా వినోద్ కుమార్ ఉన్నారు. ఫోటో తియ్యరాదు అని చెప్తూ మూడూ అంతస్తులు తిప్పి, చాలా వివరాలు సమకూర్చారు.

18 గదుల ఆ పాత ఇంటి వాసాలు, ద్వారాలు, గవాక్షాలు, కిటికీలు అన్నీ కూడా అప్పటిలాగే సురక్షితంగా పెట్టబడ్డాయి. కస్తూర్ బా గారి పూర్వీకులు చాలా క్రమబద్ధంగా పటిష్టమైన ఇల్లు కట్టించారు. పైకప్పు, నీటి సంగ్రహం, భిత్తి చిత్రాలు, వంట-భోజనం-పూజ-స్నానపు మూలలు ఆ కాలం నాటి జీవనవిధానానికి సాక్షిగా కనిపించాయి. ఆ అందమైన ఇంటిలో లేత బాలిక కస్తూర్ ఉన్న, కూర్చున్న, ఏడ్చిన, పెళ్ళిచేసుకున్న చిత్రాలు: శ్రీమంతుల ఇంటి జంటలు కుర్రతనంలోనే పెళ్ళాడి జతకలిసింది – వీటన్నిటినీ ఊహిస్తూ తిరిగాను.

గుజరాతీల వాన నీటి సంగ్రహం గురించిన జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం నిజంగానే పాటించదగ్గవి. ఆ ఇంటిని కట్టిన బలపం రాయిలాంటి రాయిటుకులలోనే రంధ్రం చేసి ఎలా జోడించారంటే పైన పడిన వాననీరు ఆ రాళ్ళ రంధ్రాల ద్వారా ప్రవహించి ఇంటి అడుగుమట్టం వద్ద కట్టిన పెద్ద తొట్టిని నింపుతుంది. పైనుండి క్రిందికి వచ్చేంతలో నీళ్ళు వడకట్టబడి శుభ్రమవుతుంది. రాయి కూడా చల్లబడుతుంది. నీటిని మధ్య మధ్యలో ఆపి ఉపయోగించుకోవడానికి మూడవ, నాలుగవ అంతస్తుల్లోని గోడల్లో చిన్న చిన్న నీటి తొట్టెలున్నాయి. వాటిని మన చపాతీలు ఒత్తే పీటలా కనిపించే రాతి తట్టతో మూశారు. ఇది ఎంత పకడ్బందీగా ఉందంటే ఎక్కడా కారకుండా, చుక్కలు పడకుండా ఇప్పటికీ కార్యనిరతమై ఉంది. ఇంటి మొదట్లోనే ఉన్న పాయిఖానా చూపేటప్పుడు భంగి సముదాయం, బాబాసాహెబ్ అంబేడ్కర్, బాపు ప్రారంభించిన హరిజన సేవా సంఘం, బాపు-బాబాల సంబంధాలు మా మాటల్లో దొర్లాయి.

కస్తూర్ బా కుటుంబం గురించి వినోద్ సమకూర్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు బా-బాపు పిల్లలు తప్ప మకన్జీ వంశం వారెవ్వరూ లేరు. మకన్జీ-వజ్రాదేవిగార్లకు ఐదు మంది పిల్లలు- నలుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. నలుగురిలో ఇద్దరు ముందే చనిపోయారు. కస్తూర్ బా చెల్లెలి పెళ్ళయ్యింది. పిల్లలు కలగలేదు. వారి తమ్ముడు మాధవదాస్‌కు కూడా పెళ్ళయ్యింది, పిల్లల్లేరు. కాబట్టి కస్తూర్ బా పుట్టింటి తరం వాళ్ళంటే బా-బాపుగార్ల పిల్లలు-మనమలు-మునిమనమలు మాత్రమే. బా చనిపోయిన తరువాత తమ రక్షణలోకి వచ్చిన ఇంటిని స్మారకంగా చెయ్యడానికి బాపుకు ఇచ్చారు. అది ఇప్పుడు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.

4

400 ఏళ్ళ క్రింద ప్రారంభమైన నిజానంద సంప్రదాయం లేదా ప్రణామి పంథా స్థాపకుడు దేవచంద్రజి మహరాజ్. ఇప్పటి పాకిస్తాన్ లోని సింధ్ ప్రాతం వారైన ఆయన గుజరాత్ లోని జామ్‌నగర్‌కు వచ్చి నెలకొన్నారు. వేదాలు, వేదాంతాలు, భాగవతం ఇవన్నిటినీ సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పేవారు. అందరిలోనూ ఆత్మజ్ఞానం నెలకొనాలి, అదే పవిత్ర జ్ఞానం ‘తారతమ్’ అనేవారు. ఆయనకు జామ్‌నగర్ దివాన్ గారి కుమారుడు మెహ్రాజ్ ఠాకూర్ పరమశిష్యుడయ్యాడు. ఆయనే ముందు ముందు ‘మహామతి ప్రాణనాథ్ మహరాజ్’గా పేరు గాంచాడు. ఆయన పంథా ‘ప్రణామి పంథా’ అని పిలవబడింది. అన్నిచోట్లకూ వ్యాపించింది. వృద్ధి చెందింది.

బాపు తల్లి పుతలీబాయి, కస్తూర్ బా ప్రణామి పంథాకు చెందిన వారు. ప్రణామి పంథా, దాని రీతినీతులు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అది మూర్తి పూజను విరోధించే పంథా. జ్ఞానమే శ్రేష్ఠమని ప్రచారం చేస్తూ పవిత్ర పుస్తకాలను పూజించడం వారి సంప్రదాయం. మోమిన్, హకీకత్, ఖయామత్, హుకుం లాంటి పదాలు వారి ప్రార్థన, పుస్తకాలలో విరివిగా ఉంది. పాడేటప్పుడు ప్రణామి గాయనీ గాయకులు ప్రవక్త మహమ్మద్ గారిని, కృష్ణుణ్ణి కలిపే తలుస్తారు. మోక గాంధీ మహాత్ముడుగా మారడానికి ప్రణామి పంథా, జైన నమ్మకాల ప్రభావం చాలా ఉంది. కాబట్టి పోరుబందర్ లోని ప్రణామి మందిరాన్ని నేను చూసి తీరాల్సిందే అనుకున్నాను. అదెక్కడ ఉంది అని వాళ్ళనివీళ్ళని అడిగి తెలుసుకోవడంలో మొత్తం పోరుబందర్ అర్ద వృత్తాకారపు సముద్ర తీరం, హుజూర్ ప్యాలెస్, ఉప్పు ఫ్యాక్టరి, దీపస్థంభం, జెట్టి అన్ని తిరిగాను. కొందరికి ఆ పేరే తెలియదు. కొందరికి ఎక్కడో ఉంది కాని ఎక్కడ అని తెలియదు. మరి కొందరు “స్వామి నారాయణ్ దేవాలయం, అక్షర్ ధామ్ లాంటి పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడే దగ్గర్లో ద్వారక, సోమనాథ్ ఉన్నాయి. ఇదెక్కడిదో ప్రణామిని ఎందుకు వెతుకుతున్నారు?” అని అడిగారు. మా డ్రైవర్ విజయ్‌ది కూడ అదే ప్రశ్న. పోరుబందర్ మరొక పేరు సుదామపురి. దేశంలో మరెక్కడా లేని సుధాముడి ఆలయం ఇక్కడుంది. విజయ్ అక్కడికి నన్ను తీసుకెళ్ళి, అటుకుల ప్రసాదం ఇప్పించి, ఊరుకోబెట్టాలని చూశాడు. నేను ప్రణామి నామ జపం వదల్లేదు. చివరికి గూగలించాము. అది మళ్ళీ ఊరంతా తిప్పి కస్తూర్ బా ఇంటి వద్దకే తెచ్చి నిలిపింది!

ఈ ఇరుకు సందులో అదెలాంటి దేవాలయం? ఏ గోపురమూ కనిపించలేదు.

బురదలో ఒంటికాలు పెట్టి నడుస్తున్న పెద్దాయన మేడపైన దేవాలయం ఉందని చెప్పారు. ఒక్క అడుగు మాత్రం మోపగలిగే ఇరుకు మెట్లు. పైకెళితే తలుపు మూసుంది. పిలిస్తే ఎవరూ పలకలేదు. ఎలాంటి సవ్వడీ లేదు. ఇదొక్కటి మిగిలిపోయింది కదా అని చింతిస్తూ వెనుదిరిగేటప్పుడు మళ్ళీ కస్తూర్ బా ఇల్లు కనబడింది. నన్ను చూసిన వినోద్ కుమార్ నన్ను ప్రణామి మందిరానికి తీసుకెళ్ళారు. బా-బాపు ఇంటివారు అక్కడికే వచ్చేవారు అని చెప్తూ ‘మహరాజ్’ అని పిలిచారు వినోద్. ’హలో’,’జీ’ లకు బదులివ్వని ప్రణామి ’మహారాజ్’ పిలుపుకు పలికి తలుపు తీశారు. ఎలా పిలిచినా పలుకుతాడని అనుకోలేము, పిలిచేలానే పిలిస్తే శివుడు ఓ అంటాడు!

మేడ ఎక్కాము. గోడ పైన సంతుల ఫోటోలు, మండుతున్న అగరొత్తి, సాంబ్రాణి పొగ అలుముకున్న వసారాలో ఒక వైపు అలంకరించిన మంటపం కనిపించింది. అందులో తళతళ మెరుస్తున్నఎరుపు జరీ గుడ్డ కప్పిన ఊయల. దాని పైన రెండు పుస్తకాల రాసులు. వాటి పైన కిరీటం. ఊగుతున్న గొడుగు. ఇదే అక్కడి ఆరాధనా స్థలం. ఊయలను అంటే పుస్తకాలను ఊపడమే పూజ! రచయితలమైన మాలాంటి వాళ్ళకు చాల ఆత్మీయమనిపించే పుస్తక సంస్కృతి! మడి లేదు, మైల లేదు. అందరూ, అన్నీ పవిత్రమే. అక్కడే కూర్చుని మహరాజ్ వద్ద ప్రణామి పంథా, దాని పుట్టుక, ప్రస్తుత పరిస్థితుల గురించి కొన్నివివరాల్నితీసుకున్నాను.

కస్తూర్ బా ఇంటివాళ్ళు, బాపు ఇంటివాళ్ళు ఈ దేవాలయానికే వచ్చేవారట. ప్రణామి పంథాను స్థాపించి వృద్ధిచేసిన ప్రాణనాథ్ జీ మహరాజ్ విస్తృతంగా భారత దేశం, అరేబియా దేశాలను తిరిగారు. మక్కా, మథుర రెండు స్థలాలకూ వెళ్ళొచ్చేవారు. ఇరాక్, ఇరాన్ లను కూడా చుట్టి వచ్చారు. హరిద్వార్‌లో నడిచే కుంభమేలాకు వెళ్ళిన ప్రాణనాథ్ మహరాజ్ అక్కడి వివిధ పంథాలు-గుంపుల ధార్మిక వ్యక్తులతో విచార వినిమయం చేసినప్పుడు ఆయన జ్ఞానాన్నిఅక్కడివారు అత్యున్నత జ్ఞానమని ఒప్పుకుని “నిష్కళంక బిజయాభినంద బుధ్ అవతారు” అని బిరుదునిచ్చారు. ముస్లిములు ప్రాణనాథ్‌ను ‘చివరి ఇమాం మెహ్నది’ అని పరిగణిస్తే, హిందువులు కల్కి అవతారమని భావించారు. ప్రాణనాథ్‌కు సిక్కు శిష్యులు కూడా ఉన్నారు.

మతాల నడుమ అవగాహన, అన్వయం పెంపొందించేలా తమ యాత్రలు, జ్ఞానం, చదువు ఇవన్నిటినీ కలిపి గుజరాతి, సింధి, ఉర్దు, అరబిక్, పర్షియన్, హింది భాషలలో ‘కుల్జామ్ స్వరూప్’ వెలికి తెచ్చారు. అది తారతమ్ సాగర్ అని పేరుకెక్కింది. తారతమ్ సాగర్ లేదా కుల్జామ్ స్వరూప్ అన్నది మొత్తం పధ్నాల్గు గ్రంథాల మాలిక. అందులో వేదం, కతేబ్‌ల సారముంది. కతేబ్ అంటే కురాన్, తోరా, డేవిడ్ కీర్తనలు, బైబల్ లాంటి ధర్మగ్రంథాలు. అవే కాకుండా తారతమ్ సాగర్‌లో పరంధామం అనే అత్యుచ్చ అంతిమ గమ్యం, దాన్ని చేరుకోవడానికి మార్గాల గురించిన వివరణ ఉంది. హిందువుల పరంధామాన్ని ముస్లిములు అర్షె అజీమ్ (లాహూత్) అని : క్రైస్తవులు సుప్రీం హెవెన్ అని పిలుస్తారు. ఇందులో 18,758 శ్లోకాలున్నాయి. మహామతి ప్రాణనాథ్ గారి బోధనలు, జ్ఞానం యొక్క సారమంతా ఇందులో ఉంది. ఆ పధ్నాల్గు పుస్తకాల పేర్లు రాస్, ప్రకాశ్, శత్రితు, కళశ్, సానంద్, కిరంతన్, ఖులాసా, ఖిల్వత్, పరిక్రమ, సాగర్, సింగార్, సింధిబాణి, మరఫత్ సాగర్, ఛోటా-బడా కయామత్ నామా.

ప్రణామీలు మద్యం, తంబాకు, మాంసాహారం సేవించరు. మూర్తి పూజ చెయ్యరు. తారతమ్ సాగర్ లోని శ్లోకాలు చెప్పడం, చదవడమే వ్రతం, ఆచరణ. తీర్థ-ప్రసాదాలకు ఎక్కువ ప్రాధ్యాన్యత లేదు. దేవుడిని మూర్తి రూపంలో కాకుండా పుస్తక రూపంలో ఊయల పైన ఉంచి ఊపే పంథా అది. పంథ్ అనుయాయులు ఈ పుస్తకం చదవడం తప్పనిసరి. వ్రతాచరణ అంటే చదవడం. నిర్దిష్ట అవధిలో ఇన్ని సార్లు ‘చదవి’ తీరాలి. ఉత్సవం జరిగే వేళలో ‘చదివి’ ముగించనివారికి ఇంతకు ముందే చదివి ముగించినవారు సహాయ పడతారు.

గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, హరియానా, ఉత్తర ప్రదేశ్, అస్సం, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రణామీలు ఉన్నారు. విదేశాలలోనూ ఉన్నారు. ముందు అన్నిమతాలవారు ప్రణామీలయినా కాని, కాలం మారిన కొద్దీ ఇది హిందూ మతం యొక్క ఒక పంథాగా పరిగణించబడుతోంది.

ఆ మందిరంలో ఉన్న మహారాజ్ కలకత్తా వారు. ప్రణామి పంథాల వారి సంఖ్య గుజరాత్‌లో తగ్గుముఖం పట్టడం వలన బంగాళం, అస్సాం నుండి వచ్చినవారే ఇక్కడ ఇప్పుడు పూజ చేసేవారు అన్నారు. మాకు జాతి-మతాల భేదం లేదు. ఎవరైనా రావచ్చు అన్నారు. ఒకసారి ఊయల ఊపండి అంటూ ఆ ఇనుప గొలుసుకు నా చేతికిచ్చారు. కొంచెం ఊపితే ఊయల ఊగింది. పసిపాపల్లా పడుకున్న పుస్తకాలను ఊపితే కింకిణి, గలగల శబ్దాలు వచ్చాయి. పుస్తకాలు మమ్మల్ని చూసి నవ్వినట్టయింది!

“ఎముకల గూటిలో ఒక దేవాలయముంది” అనే నాకిష్టమైన కవితతో కన్నడ కవి మూడ్నాకూడు చిన్నస్వామిగారిని, “నైహరవా హమకా న భావె” పాట ద్వారా కబీర్‌ను పుస్తక భగవంతుడికి ముఖాముఖి చేశాము. మన ఎముకల గూటిలో దేవాలయం, మసీదు, చర్చి, బస్తి, స్తూపం అన్నీఉన్నాయి: భక్తి అనే పంజరంలో బందీలుగా అందరు దేవుళ్ళూ ఉన్నారు అనే అర్థం వచ్చే మూడ్నాకూడు గారి కవిత అర్థం తెలుసుకుని మహారాజ్ గారికి ఎంత సంతోషం కలిగిందంటే తమ పంథా చెప్పడం కూడా ఇదే తత్త్వాన్ని అంటూ “తారతమ సాగర్” లోని ఒక శ్లోకం చెప్పారు.

“జో కచ్చు కహ్యా వేద్ నె /సో హి కహ్యా కతేబ్

దోనో బందె ఏక్ సాహేబ్ కె/పర్ లడత్ పాయె బినా భేద్ “

(“వేదం ఏమి చెప్పినదో/కతేబ్ అదే చెప్పింది

ఇద్దరూ ఒక దేవుడి బిడ్డలే/ పోట్లాడుకుంటున్నారు సత్యం తెలియక”)

వాహ్! కబీరా, ఇక్కడికి రాకుంటే నా భేటీ సగంగా మిగిలిపోయేది కదా..

5

ముందుగా కస్తూర్ బా జీవన చరిత్రకని టిప్పణి రాసుకున్నాను. కానీ రాస్తూ పోయినట్టల్లా అది పూర్తి బాపు, భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామం యొక్క చరిత్రగా మారిపోయినట్టు అనిపించింది. అనక్షరస్తురాలిగా నిలిచిన, రచయిత కూడా కాని కస్తూర్ బా గారి భావనా ప్రపంచానికి ప్రాతినిధ్యమే దొరకలేదనిపించింది. శ్రోతలే లేని బా గారి భావనలను వెతికే అవకాశం కూడా లేకపోతే, దీన్నిరాసిన ఉద్దేశమైనా ఏమిటి అనే ప్రశ్న సతాయించింది. చివరికి బా మాటల్లోనే ఆమె బ్రతుకును నిరూపించాలి అనిపించి అంతవరకూ రాసినదాన్ని పూర్తిగా చెరిపేశాను. వినే ఒక ఆప్త ప్రాణి ఎదుట తన జీవిత వివరాలను విప్పి చెప్తూ పోయిన పెద్దావిడ మాట్లాడే ధోరణిలో నా రచనను మార్చాను. ఆడదాని మనో తరంగాలలా, చెప్పే భాషకూడా మారుతూ పోవడం వలన ఆ మాటల భాషలో ఏకరూపత లేకపోయినా తప్పులేదు అని భావించాను.

ఈ కథనానికి ఆధారం కోసం అనేక పుస్తకాలను, వ్యాసాలను, బ్లాగులను పరిశీలించాను. బా-బాపు గురించి అసంఖ్యాక పుస్తకాలు, వ్యాసాలు, విమర్శలు వచ్చాయి. కొన్నిటిని ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంచాను. ఈ కృతికి “నా సత్యశోధన కథ” మూల ఆధారం. తోడుగ రామచంద్ర గుహాగారు సంవత్సరాల కొద్దీ పరిశోధన, యాత్రలు చేసి రాసిన “గాంధీ బిఫోర్ ఇండియా” అలాగే “గాంధీ: ద ఇయర్స్ దట్ చేంజ్డ్ ద వర్ల్డ్” కృతులు అత్యంత కచ్చితమైన సమాచారాన్ని అందించాయి. గుహాగారి శ్రమకు, శ్రద్ధకు ముందుగా ఒక నమస్కారం చెప్పాలి. ఆయన పుస్తకాలే కాకుండా రాజమోహన్ గాంధీ, లూయిస్ ఫిషర్ పుస్తకాలు: మహదేవ్ గారి దినచరి, ప్యారేలాల్ గారి పుస్తకం, అకీల్ బిల్గ్రామి సందర్శనం, కన్నడంలోని అనేక రచనలు-పుస్తకాలు-గాంధీవిశేష సంచికలు- ప్రత్యేకంగా లక్ష్మీశ తోళ్పాడి గారు వ్యాసం, మణిభవన్, గాంధీగారి గురించిన అనేక వెబ్ సైట్లలో ఉన్న సమాచారాన్నిఉపయోగించుకున్నాను. కొన్నిసార్లు ఒకే ఒక వాక్యపు అదనపు సమాచారం కోసం అనేక మూలాధారాలను వెతికాను. దాదాపుగా క్రితం సంవత్సరమంతా ఇదే జరిగింది అంటే కూడా తప్పుకాదు.

ఇంత పరిశోధించినా బా జీవితానికి సంబంధించిన కొన్ని కాలావధుల గురించిన సమాచారం ఎక్కడా దొరకలేదు. అలాంటి ఖాళీ స్థలాలని ప్రతి ఆడదాని జీవితంలోనూ చూడవచ్చు. 34,000 ఉత్తరాలను రాసిన, తన ఉత్తరాల్లో చాలా వరకూ తన భార్య-కుటుంబం గురించి ఒక వాక్యమైనా ప్రస్తావించిన గాంధీ అనబడే విపుల రచయిత భార్యకే ఇలా అయితే, ఇక ఆ కాలంలో జీవించిన అనేక ఆడవాళ్ళ ముఖమే కాదు, పేరు కూడా మన జ్ఞాపకంలో లేదు కదా అని దుఃఖం కలుగుతుంది. జ్యోతిబా, బాపు, బాబా, పెరియార్ మొదలైన సమాజానికోసం అర్పించుకున్న అనేకుల భుజానకి భుజంగా పనిచేసిన అసంఖ్యాక మహిళలు, పురుషుల పత్నులు పూర్తిగా తెరమరుగయ్యారు. చరిత్రలో ఆడవాళ్ళ అడుగు జాడలు కళ్ళకు కనబడనంత మసకయ్యాయి.

ఇన్ని ఆలోచనలతో రాత మొదలుపెట్టేసరికి కస్తూర్ బా తనను అంత సులభంగా అందనివ్వలేదు. కొన్ని సార్లు విప్లవ వనితగా కనిపిస్తే, కొన్నిసార్లు భర్త అభిప్రాయాలకు తలవంచిన, భర్త నడచిన దారిలోనే నడవాలని భావించిన సంప్రదాయ భార్యవలె కనిపించింది. కస్తూర్ బా మా అమ్మలాగ ఉండిందా అనిపించింది. పాతవాటి పైన లోతైన సందేహాలున్నా, కొత్తదనాన్ని ఒకే సారి అంగీకరించకుండా దాని గురించి కూడా కొంత అనుమానాలను కలిగిన ఒక రకమైన గడుసు అమ్మ. అడుగడుగునా భర్తను విమర్శిస్తూ, వ్యతిరేకిస్తున్నా ఆయనను తేలికపరచలేని, ఆయన లేకుంటే నాదేముంది అని కూడా భావించిన అమ్మ. ఊయలలా ముందుకు వెనిక్కీ ఊగే దాంపత్యమనే విచిత్రమైన సాంగత్యాన్ని నిభాయించిన అమ్మ. అదెలా ఉన్నా, కస్తూర్ బా గారిని చూపించేటప్పుడు నా అమ్మానాన్నలను ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి వీలవుతుందేమో అనిపించింది.

ఇంకో విషయం. నాకన్నా 150 సంవత్సరాల క్రింద బ్రతికిన బా గురించి రాసేటప్పుడు నన్ను, నాలో జాగృతమైన ఆడదాన్ని నేపథ్యానికి జరిపేశాను. నాలోని విచారవాదిని “ఊరుకో” అని ఒక దెబ్బేశాను. ఇది కూడా ఒక కష్టమైన పరకాయ ప్రవేశంగా అనుభవానికి వచ్చింది. ఇందులోని 90% రాత నిజ సంఘటనల, ఉత్తరాల సమాచారాల ఆధారంగా రాసింది. ఇక మిగలిన సంభాషణలు, ఆలోచనా తరంగాలు నా ఊహా జనితాలు. అయినా అక్కడక్కడ కస్తూర్ బా మాటల్లో అనుపమ తొంగిచూసిన సందర్భం ఉంది అని కొంత సంతోషంతోనూ, కొంత బిడియంతోనూ చెప్తున్నాను. మరో మాట. ఇక్కడ నేను ఒక క్షమాపణ చెప్పుకోవాలి. కస్తూర్ బా మాటలను రాస్తున్నాను కాబట్టి అస్పృశ్యులు, హరిజనులు, కడజాతి మొదలైన కొన్ని వాడరాని పదాలను, అప్పటి కాలంలోవాడేవారు కాబట్టి వాడాల్సివచ్చింది.

గాంధీ-150 పురస్కరించుకుని అన్నిచోట్ల గాంధీగారు గురించి చర్చలు- వ్యాసాలు- సంస్మరణ, స్తుతి జరుగుతోంది. కానీ ఎంత పూజించబడ్డారో అంతే విమర్శకూ గాంధీ లోనయ్యారు. ఏ జాతి, కులం, మతం, పంథా వారైనా సులభంగా తమ వాడని చెప్పుకోలేనంత. “అన్యుడి”గానే మిగిలిన వ్యక్తి గాంధీ. చాలా కాలంగా సామాజిక – రాజకీయ ఆందోళనల్లో పాల్గొన్న ఒక వ్యక్తికి ఇలా కావడం జాతి, మతగ్రస్త భారతదేశంలో సహజమే అనేటట్టయింది. మరో వైపు గాంధీని నిలువుగా, అడ్డంగానూ చీల్చే కార్యం కూడా నడుస్తోంది. నేనొక హిందువుని అని చివరివరకూ చెప్పుకున్న, ఒక ఉత్తమ హిందువు కూడా అయిన గాంధీని హిందూరాష్ట్రవాదులు భౌతికంగా ముగించిందే చాలక, ముందు తరాలకు ఆయన గురించి ఉన్నవీ లేనివీ నింపుతున్నారు. గాంధీని నేరుగా చదివిన వారి కంటే వంకర విమర్శకుల మాటలలో ఆయనను తెలుసుకున్నవారు ఎక్కువయ్యారు. అలాంటి వారికి గాంధీ నీడలా తన బ్రతుకును అరగదీసిన కస్తూర్ ఒక పదునైన పనిముట్టుగా మాత్రమే కనిపిస్తారు. బా మాటల్లో బాపును తమకు తోచినట్లుగా విమర్శించే సాకుగా సృష్టించుకోవడం జరుగుతోంది.

అంతే కాకుండా గాంధీ ప్రతిపాదించిన బ్రహ్మచర్యం, ఉపవాసం, యంత్ర నాగరికత వ్యతిరేకత, శ్రమించే జీవితం, సాదా జీవన విధానం, అస్పృశ్యతా నివారణ, ట్రస్టీషిప్, ఆహారపు అలవాట్లు, శిక్షణ-భాష గురించిన ఆయన జ్ఞానం తీవ్రమైన విమర్శకు గురయ్యాయి. అంతే కాకుండా మహిళా దృక్పథం, సబాల్ట్రన్ దృక్పథం, దళిత దృక్పథం, ధార్మిక దృక్పథం, ఆధునిక వైజ్ఞానిక దృక్పథం-ఇలా ఒక్కొక్క దృక్పథంలోనూ బాపును విమర్శిస్తూ ఆయన జీవిత సరళ పాఠాన్ని గ్రహించడంలో విఫలమవడమూ కనిపిస్తుంది.

గాంధీ ఒక చోట రాసినట్టు, మన బ్రతుకు ఒక హర్మోనియం లాంటిది. అన్ని మెట్లూ ఒకే స్వరాన్నిపలకలేవు. అలాగే జతగానూ అన్నిపలకలేవు. కానీ ప్రతి మెట్టునూ మొత్తం స్వరావళిలోని భాగంగా కాకుండా విడి భాగాలుగా వింటే శృతి, లయ, స్వరవిస్తారం అర్థమయ్యేదానికంటే అనర్థానికి దారి తీయడమే ఎక్కువ. కస్తూర్ జీవిత చరిత్ర కూడా అలా జరగరాదని జాగ్రత్త వహించాను.

బా గురించిన అనేక పుస్తకాలు వచ్చి ఉండవచ్చు. నాటకాలు, నవలలుగానూ ఆమె జీవిత చరిత్ర వచ్చింది. నాదే స్వంత కథన మార్గాన్ని వెతుక్కోవడం కోసం కొంచెం రిస్క్ తీసుకుని, ఉద్దేశపూర్వకంగా కొన్ని పుస్తకాలను చదవలేదు. గాంధీ గురించిన కొన్ని అమూల్య పుస్తకాల్లోనే నేను కస్తూర్ బాను వెతుక్కోవడానికి ప్రయత్నించాను. ఒక సాధారణ మహిళగా ఉన్న బా ఒక అసాధారణ పురుషుడి భార్యగా, అసాధారణ చారిత్రిక ఘటనలకు సాక్షిగా, భర్త తీసుకున్నపెద్ద మలుపును ఎలా గ్రహించారు? ఎలా తనదిగా చేసుకున్నారు? ఎంత వ్యతిరేకించారు? ఏది వీలయ్యింది? ఏది కష్టమనిపించింది? మహాత్ముడనిపించుకున్న, పదే పదే ఉపవాస దీక్ష చేపడుతున్న, తనను ముట్టుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిన, తన పిల్లల పైన విశేషమైన మమకారాన్ని చూపని, వ్యక్తిగత నిమిషాలకు, మాటలకు దొరకని భర్తను ఆమె ఎంతవరకు తెలుసుకుంది? ఎంత సహించింది? లేదా ఒక పెద్ద కుడ్యచిత్రంగా ఉన్న బాపు కార్యక్షేత్రాన్ని, దాని అటూఇటూ, పరిసరాలు, శ్రమవలన తెలుసుకోలేక పోయారా? ఇలాంటి విషయాలను వెతకడం వెనుక తన బ్రతుకు తోడును తెలుసుకోవడంలో ఎదురయ్యే ఆందోళన, తికమకల మూలాన్ని తెలుసుకునే ఉద్దేశమూ ఉంది.

6

గాంధీగారిని చంపినవారిని అటుంచుందాం. ఆశ్చర్యమేమిటంటే ప్రగతిపరవాదులైన ఎన్నో మనసులు కూడా గాంధీగారి గురించిన పూర్వాగ్రహం, అతివిమర్శలను పెట్టుకున్నాయి. గాంధీగారిని ప్రగతిపర ధారను తత్త్వానిగా తీసుకుని, అంతరిక కొలబద్దగా పరిగణించడం కంటే ఆయన విచారధారల ద్వంద్వాన్నే ముందుంచి గాంధీగారు గురించిన తమ అభిప్రాయాన్ని మరోసారి పరిశీలించడానికి కూడా నిరాకరించే మనుషులున్నారు. ఇది ప్రస్తుత కాల వైపరీత్యంగా నాకు అనిపించింది.

అలా నేను బాపు-బా ల గురించి ఇంక ఎక్కువ చదువుతూ పోయినట్లల్లా “చేయి దాటిపోయింది” అనే గాబరాకు లోనయ్యాను. కబీర్, షరీఫ్, లల్లా, కస్తూర్ అనుకుంటూ చెల్ల చెదరయ్యానని అనిపించింది. అలా అనిపించి నా రాతల పరిశ్రమను అతి సూక్ష్మంగా పరిశీలించే, ప్రతి ఆలోచన వెనుక తానున్న బసు, గాంధీ గురించిన నా అధ్యయనం – ఆలోచనలు ఈ సాకుతో మరోసారి పదును పెట్టాలి అనే సదుద్దేశంతో ఈ కృతిని బసుకు, లడాయి ప్రకాశకకులకు అప్పజెప్పాను. నా వ్రాతప్రతిలోని ప్రతి పంక్తిని లక్ష్యపెట్టి చదవడమే కాక సూక్ష్మ మార్పులను కూడా, అలాగే వాటి అవసరాన్ని బసు తెలిపాడు. ఈ పుస్తకాన్ని ప్రకటిస్తున్న లడాయి మిత్రులకు ప్రేమతో నా సలాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here