నేను.. కస్తూర్‌ని-20

1
2

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

ప్రేమ పరీక్ష

[dropcap]బా[/dropcap]పుకు బ్రహ్మచర్యమేమంత సులభమైనదిగా ఉండలేదమ్మాయ్! మోక బాపు కావడానికి నిప్పుకణికల పైన నడిచారు. బ్రహ్మచర్యం దాటి రావాల్సిన కొలిమి ప్రేమది. శరీరమోహం ప్రేమగా మారి అందరినీ ఒకసారి కాకపోయినా మరోసారి బాధించి తీరుతుంది. దాన్నే కదా మాయ అని పేరు పెట్టి ఆడవాళ్ళకు తలకు కట్టింది? ఎదలోతుల్లో భగ్గున అంటుకునే ఈ జ్వాల ఎలా కాలుస్తుందంటే, కాలినవాళ్ళ మొహాలు చూస్తే అర్థమవుతుంది. దాన్ని దాటి రావడం అంత సులభం కాదు. ఈ ప్రేమ బాపు పిల్లలకే కాదు, బాపుకు కూడా నిప్పు రాజేసింది. ఆయనే స్వయంగా ఎప్పుడో భవిష్యత్తులో బ్రహ్మచర్యం స్వీకరించిన తరువాత కూడా తనకెదురైన ప్రేమ గందరగోళాన్ని ఎలా దాటాను అని చెప్పుకున్నారు. అలా చూస్తే, ప్రేమనుండి కాలిపోకుండా, కామం చిగురకుండా గెలిచింది నేనే. ఎందుకో తెలుసా? నానుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించే భర్తకంటే ఎక్కువగా ఇంకెవరినీ, దేన్నీ మోహించాలని అనిపించనేలేదు నాకు. భాయి అయ్యాడు, బాపు అయ్యాడు, సగం ఆడదాన్ని అనుకున్న భర్తకంటే ఇంకే మగవాడూ నన్ను ఆకర్షించనే లేదు.

దక్షిణ ఆఫ్రికాలో ఉన్నప్పుడు 1906లో మా బ్రహ్మచర్య జీవితం ప్రారంభమయ్యింది. భాయి ప్రకారం “25వ సంవత్సరం వరకు ప్రతి విద్యార్థి తప్పనిసరి బ్రహ్మచర్యం అనుసరించాలి. విద్యార్జన చేసేటప్పుడు ప్రేమించడం అపరాధం. రాగద్వేషాలు, కామోద్రేకాలు సహజం. కానీ వాటిని నియంత్రించుకోవాలి”. కానీ బ్రహ్మచర్యం అందరికీ తగినది కాదు, శ్రేష్ఠమూ కాదు అని అప్పుడే  గాంధీ భాయి ఆప్తులు వాదించారు. అందరికీ అదే సబబు అని నాకు కూడా అనిపించలేదు. ఎవరికి నచ్చుతుందో వారు అనుసరించవచ్చు, వారికి అది ఇష్టం కావచ్చు అనిపించింది. మిలి-హెన్రి పొలాక్ దంపతులకు బ్రహ్మచర్యం నచ్చలేదు. హర్మన్ కలెన్ బాక్ ముందు తనకు నచ్చలేదన్నాడు, కానీ, తరువాత ఏమనిపించిందో తను కూడా భాయి శిష్యుడయ్యాడు. కానీ ఉడుకు రక్తపు మా పిల్లలు ప్రేమ పరీక్ష ఎదుర్కోవలసి వచ్చినప్పుడు బ్రహ్మచర్య తత్త్వం చాలా ఇబ్బంది పెట్టింది.

హరిలాల్ పూర్తిగా లౌకిక వ్యక్తి. ప్రేమ, కామం, ధనం, కీర్తి, కోపం, అసూయ మొదలైన అన్నీ గుణాలూ వాడిలో మెండు. ముందునుండీ అలాగే ఉండేవాడు. వాడికి తండ్రి బ్రహ్మచర్యం, సాదాతనం ఇవన్నీ అనుసరించవలసిన విలువలు అని ఎప్పుడూ అనిపించనే లేదు. ఆశ్రమంలో ఉన్నప్పుడు చూశాను కదా, ప్రార్థన చేసేటప్పుడూ, తరువాత కూడా అతి చంచలమైన మనసు వాడిది. ఆశ్రమంలోనే ఉన్నా ప్రార్థనకు రాకుండా ఉండడం జరిగేది. తండ్రి, కొడుకులు దగ్గర కానంత దూరం చేసిన మొదటి విషయం ఇదే అనిపిస్తుంది. చంచలను పెళ్ళి చేసుకోవడంలోనూ తొందర పడ్డాడు. మా అందరి పిల్లల్లోనూ తొందరగా పెళ్ళి చేసుకుంది వీడే. 20 సంవత్సరాల లోపే పెళ్ళి చేయించేసుకున్నాడు. తొందరగా పిల్లలు కూడా కలిగారు. పెళ్ళాన్ని దక్షిణ ఆఫ్రికాకు తీసుకుని వచ్చాడు. పైన పైన గర్భం దాల్చడం. పైనుండి పైన చూలు. ఇంకెక్కడి బ్రహ్మచర్యం?

మణికి కూడా బ్రహ్మచర్య పాలన ఇబ్బంది పెట్టింది. వాడు పెళ్ళి చేసుకున్నది ఆలస్యంగా. 35సంవత్సరాల నిండిన తరువాత. కానీ అంతకు ముందే ప్రేమ అనే చండమారుతానికి బలయ్యాడు.

భాయి మిత్రుడు ప్రాణ జీవన్ మెహ్తా ఉన్నారు కదా. ఆయనకు ఒక అమ్మాయి, జేంకువర్ (జేకి) అని. ఆ అమ్మాయి మణిలాల్ డాక్టర్ అనే ఆయనను పెళ్ళాడింది. ఆయన విలేఖరి. గాంధీగారి ఆలోచనలను తెలుసుకోవాలని, తమ అల్లుడు పత్రిక పర్యవేక్షణ చూసుకోవాలని వారిద్దరినీ మెహ్తాజి దక్షిణ ఆఫ్రికాకు పంపారు. కానీ మా అబ్బాయి మణి, మగన్ లాల్ అప్పటికే పత్రిక పనులను చూసుకుంటున్నందున జేకి భర్త తిరిగి వెళ్ళిపోయారు. కానీ జేకి మా దగ్గిరే ఉండిపోయింది. 1912 లో ఉండవచ్చు, మేము టాల్‌స్టాయ్ ఫారంలో ఉన్నాము.అప్పుడు మణికి 20 సంవత్సరాలు. ముద్రణాలయంలోనూ, పొలంలోనూ చాలా శ్రమ పడేవాడు. మిగిలిన వాళ్లలా ఆధునిక శిక్షణ పొందకుండా తన తండ్రి ప్రయోగాలను, పనులను భుజాలకెత్తుకున్నాడు. హరికంటే క్రమశిక్షణ వాడిది. ఒక్కసారిగా దేనికీ ఒప్పుకోకపోయినా, మొండిగా వాదించేవాడు కాదు. నా వద్ద ఎప్పుడైనా ఒక్కొక్కసారి గొణిగేవాడు అంతే. మాట చాలా తక్కువ. వ్యక్తిగా తొందరగా పక్వమయ్యాడు వాడు.

ఆశ్రమంలో తన అన్న హరిలాల్, వదిన సరసమాడడాన్ని చూసేవాడు. ప్రాయపు పిల్లవాడు కదా! జేంకువర్, వాడిమధ్య ప్రేమ, దైహిక ఆకర్షణ చిగురించాయి. నేను దీన్ని గమనించాను. గాబరాపడి వాడితో ప్రస్తావించాను. కానీ వాడి తండ్రితో చెప్పడం ఎలా అని తెలియకుండా గమ్మునున్నాను. కాని అదెలాగో భాయికి విషయం తెలిసింది. మగన్ చెప్పుండవచ్చు.

ఒకే ఆశ్రమంలో ఒకే కప్పుకింద ఉన్న ప్రాయపు ఆడ మగల మధ్య ప్రేమ, శారీరిక సంబంధం కలిగింది మీకు సహజం అనిపించవచ్చమ్మాయ్! కానీ మాకు అనిపించడం కష్టమనిపించింది. తన కుమారుడు బ్రహ్మచర్య వ్రతాన్ని భంగం చెయ్యడం వాడి తండ్రిని చాలా కలవర పెట్టింది. ఆయన నిస్సహాయులవడం నాకు ఇంకా గుర్తుంది. మేమిద్దరం దూరంగా ఉండబట్టి అప్పటికి ఆరేడు సంవత్సరాలయ్యింది. తమ ఉదాహరణ గమనించకుండా కొడుకే ఇలా చేసింది, అది కూడా తండ్రి మిత్రుడి వివాహిత కూతురుతో సంబంధం పెట్టుకుంది, ఆయనకు భరించరానంత పాపపు మూట అనిపించింది. ప్రార్థనా సభ తరువాత ఆశ్రమంలో వారిద్దరూ చేసిన తప్పుకు, వాళ్ళిద్దరినీ సరైన దారిలో పెట్టడానికి తను విఫలమైనందుకు ప్రాయశ్చిత్తంగా అయన ఏడు రోజులు ఉపవాసం చేస్తానని, తరువాత ఒక సంవత్సరం ఒక్క పూటే తింటానని ప్రకటించారు. అక్కడున్నవారికి ఎందుకు, ఏమిటి అని తెలియలేదు. మాకు అర్థమయింది. తరువాత జేకి కూడా ప్రాయశ్చిత్త రూపంగా అందంగా పొడుగ్గా ఉన్న వెంట్రుకలను కత్తిరించుకుంది. అన్నాహారాల్లో తీవ్రమైన నిర్బంధం విధించుకుంది.

మేము దక్షిణ ఆఫ్రికా వదలడానికి కొద్దిగా ముందు, జేకి బేన్ భర్త మారిషస్ నుండి ఫిజికి వెళ్ళున్నాడు. అతడికి ఈ విషయమంతా తెలిసుండాలి. భాయికి పెద్ద విరోధిగా మారాడు. తన భార్య మోహన్ దాస్  గాంధీ అనే ఆయన ఆశ్రమంలో ఉంది. ఆయన ప్రభావం నుండి విడిపించి తక్షణమే తన వద్దకు పంపే ఏర్పాటు చెయ్యండి అని దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వానికి మళ్ళీ మళ్ళీ ఉత్తరాలు రాశాడు. ఇది భాయి వ్యతిరేకులకు పండగ చేసుకున్నంత సంతోషాన్నిచ్చింది. జైలునుండి ఆల్బర్ట్ వెస్ట్ సోదరి దేవి వెస్ట్‌కు రాసిన ఉత్తరంలో భాయి జేకికి వెంట్రుకలు పెంచుకోవాలని, తగిన ఆహరం తీసుకుని శక్తిశాలి కావాలని సలహా ఇచ్చారు.

చివరికి మణిలాల్ పెళ్ళి సుశీలా మశ్రూవాలాతో ఆయ్యేటప్పటికి వాడికి 35 సంవత్సరాలు నిండాయి.

ఇక మా రామదాసుకు తండ్రి సాదాతనం, పేదరికాన్ని పైన వేసుకోవడం, బ్రహ్మచర్యం నచ్చలేదు. కానీ హరిలా తలా తోకా లేకుండా వ్యతిరేకించి వెళ్ళిపోనూ లేదు. వాడికి పెళ్ళయ్యేటప్పటికి వాడికి 31 సంవత్సరాలు నిండాయి.

మా చివరి అబ్బాయి దేవదాసుకు తండ్రిపైన అంతులేని గౌరవం, అనుబంధం, ప్రేమ మెండు. ఆయన నీడలా ఉంటూ ఆయనను అతుక్కునే పెరిగాడు. అనుయాయి అనేలా ఆయనను అనుసరించాడు. అతి ప్రేమ, మొహమాటం కలిగిన బుద్ధిమంతుడు వాడు. వాడికి ఇరవై ఎనిమిదయినా పెళ్ళి చేయలేదు మేము. వాడు కూడా వినోబాలా సత్యాగ్రహిగా, బ్రహ్మచారిగా ఉండనీ అని బాపు మనసులో ఉండిందా? తెలియదు. మొత్తానికి వాడి పెళ్ళి విషయం మేము చర్చించలేదు. వాడికి రాజాజిగారి అమ్మాయి లక్ష్మితో స్నేహం, ప్రేమ కలిగాయి. కానీ లక్ష్మికప్పుడు 15 సంవత్సరాల వయసు. చివరికి ప్రేమికులు ఐదు సంవత్సరాలు వేచిన తరువాత 1933లో పెళ్ళి చేశాము.

ఇలా పోకను సంచిలో వేయవచ్చు, పోక చెట్టును వేయలేము కదా! కామం, ప్రేమ అలాంటివే. ఊరకే తిని, బట్టకట్టుకుని భార్యతో పడుకుంటే పోయేది కదా? బాపు అన్నదమ్ములు, వందల వేల మంది బాపును ఇదే ప్రశ్న అడిగారు. కాదు. అందరికీ తిని, బట్టకట్టుకోవడంలోనే తృప్తి దొరకదు. వాటిని కాకుండా ఏదైనా చేసే శక్తి, ఉపాయం వారి వద్ద ఉంటుంది. దాన్ని సాధించడమే సాధన. సాధన చెయ్యడానికి ఒకింత బలం, స్ఫూర్తి కావాలి. తను మిగతావాళ్ళకంటే భిన్నమనే నమ్మకం కావాలి. మిగతావారికంటే భిన్నంగా బ్రతకడం అనివార్యమవుతుంది. అలా ఎందుకు అని మనల్ని మనమే నచ్చజెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి విశేష శక్తి కూడగట్టుకోవడానికి బాపు బ్రహ్మచర్యం, ఉపవాసంలాంటి పెనుకష్టాలను తన పైన వేసుకుని సాధ్యం చేసుకున్నారు అనిపించింది నాకు.

కాని, బాపుకు కూడా అత్యంత పరీక్షా సమయం ఎదురయింది. బాపుకు ఈ కస్తూర్ కాకుండా మరొక అమ్మాయి పైన ప్రేమ కలిగింది. ఇప్పుడు తలచుకుంటుంటే ఇలా నింపాదిగా నీతో చెప్తున్నాను. కానీ ఆ రోజు ఒంట్లోని రక్తమంతా మొహంలోకి తెచ్చుకుని బ్రతికాను.

అవునమ్మాయ్! సరళాదేవి చౌధురాని అని, రవీంద్రనాథ టాగోర్ గారి అన్న కూతురు. 1920 సుమారు ఉండాలి. సుడిగాలిలా మా జీవితాల్లోకి వచ్చి వెళ్ళింది. బాపుకు చాలా దగ్గరయింది. భారీగా నగలు వేసుకుని పట్టు చీరలు కట్టుకునేది. చాలా బాగా పాడేది. వందేమాతరం పాట ఉంది కదా, దాని మొదటి రెండు పాదాలకు మాత్రమే కవులు రాగ సంయోజనం చేసిందట. మిగతా పాటకు రాగ సంయోజన చేసింది ఈమే. కవితలు, నవలలు రాసేది. నాకంటే ఒకట్రెండు సంవత్సరాలు చిన్నదనుకుంటాను అంతే. పెళ్ళయింది. లాహోర్‌లో వాళ్ళిల్లు. భర్త కాంగ్రెస్‌లో ఉన్నారు. బాపు లాహోర్‌కు వెళ్ళినప్పుడు పరిచయమయ్యుండాలి. అదేం ఆకర్షణో ఏమిటో, ఆశ్రమానికి వచ్చి ఇక్కడే నివసించసాగింది. ఒక కొడుకు, దీపక్ అని. వాణ్ణి కూడా ఆశ్రమానికి తీసుకొచ్చింది.

నాకే కాదు. చాలా మందికి ఆమె ఉనికి ఇబ్బందికరమనిపించింది అబద్ధం కాదు. మా చీరలనన్నిటినీ గంగానదిలో తేల్చివేసి మేమే నేసిన చీరలనే కట్టాలని బాపు నియమం చేశారు. ఒక్కొక్క కాథేవాడి చీరను నేయడానికి నెలలే పడతాయి. వాటన్నిటినీ వదిలేశాను నేను. ఆశ్రమంలోని అందరు ఆడవాళ్ళూ అంతే. కానీ ఇప్పుడు ఈమె ఇంత అలంకారం చేసుకోవడానికి బాపు ఒప్పుకున్నది ఎలాగ అని అందరి కనుబొమలూ లేచాయి. కొన్నిరోజులు గడవనీ అని నేను కూడా ఊరకున్నాను. మగన్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించాను కూడా. వాడికి ముక్కు మీదే కోపం. కానీ మగన్, మహదేవ్ ఈ విషయాన్ని వాళ్ళ మధ్య మాట్లాడుకోవడమే తప్ప బాపు వద్ద ప్రస్తావన తేలేదు. నేను ఆశ్రమ నియమ పాలికగా ఉన్నాను కదా! ఒక రోజు బాపు వద్దకు వెళ్ళి “ఈమె ఎవరో వచ్చింది కదా, సరళ అని. ఆమెకు సత్యాగ్రహ ఆశ్రమం నియమాలు ఏవీ వర్తించవా?” అని అడిగేశాను. ఒకటే మాట. రాస్తున్న బాపు తలఎత్తి చూశారు. ఆయనది కూడ ఒకటే మాట “ఎందుకు వర్తించవు?”

నా మాటల్లో ఏదో వెతికారు బాపు. ఆ రోజు నుండి సరళా వడకడానికి మొదలు పెట్టింది. నగలు తీసేసింది. ఒక రోజు ఖద్దరు కట్టేసింది! ఆమె కట్టుతున్న అందాల చీరలకూ, ఈ ముతక ఖద్దరుకూ పోలిక లేనే లేదు. అయినా కాని, సుందరి, ఒంట్లో వేడి నిలుపుకునుంది. ఏది కట్టినా అందంగా అగుపించేది. తను కట్టడమే ఖద్దరు అదృష్టం అనేలా ఉండేది. బాపు కూడా అంతే. అందరికీ చెప్పడమే. చౌధరానిగారు ఖద్దరు కడ్తున్నారు, ఇక అందరు ఆడవాళ్ళూ తమ చీరలను తామే నేసుకుని కట్టుకోవాలి అని. వెళ్ళిన ప్రతి చోటుకూ ఆమెను తీసుకుని వెళ్ళేవారు. కొన్ని చోట్ల ఆమె ఉపన్యాసం కూడా ఉండేదట. ఆమె బాపు ఖద్దరు ప్రకటనకు కళాకారిణిగా అయిపోయింది. ఆశ్రమంలో ఆమె లేనప్పుడు బాపు ఎడతెగకుండా ఉత్తరాలు రాసేవారు. తొందరగా వచ్చెయ్యమని ఒత్తిడి పెట్టేవారట. ఆమెకు రాసిన, ఆమెనుండి వచ్చిన ఉత్తరాలను మహదేవే చూసేవాడు. వాడికి కాని, ఇతరులు ఎవరికైనా తను ఇలా రాసింది తెలిస్తే ఎలా అనే పట్టింపే లేకుండా ఆమెపైన బాపు అనుబంధం పెంచుకున్నారు.

ఆమెలో కుర్ర అమ్మాయిలకున్న అల్లరి చేష్టలు, సంబరం, ఉన్మాదం ఉండేవే కాని మిలి, సోన్యా, మీరా, అమృతాల మాదిరి గంభీరమైన ఆలోచనలే లేవు. బాపుకు చాలా మంది ఆప్త స్నేహితురాళ్ళున్నారు. మిలి పొలాక్, సోన్యా శ్లేసిన్, మాడ్ పొలాక్, బెట్టి మొల్పెనో, ఎమిలి హాబ్ హౌస్ వీరంతా బాపుతో బాహాటంగా మాట్లాడేవారు. చేతులు ముట్టుకుని మాట్లాడేవారు. గంభీరమైన విషయాల గురించి లోతుగా చర్చించేవారు. ఆడవాళ్ల కష్టాలు, వారి పోరాటాలు, వాళ్లు అమలు చేస్తున్న తంత్రాలు, ఆడవాళ్ళ శరీరాల పైన మగవారి ఆధిపత్యం ఇలాంటి వాటి పైన బాపుతో వాదించేవారు. వాళ్ళల్లో ఉన్న ఏ గంభీరమైన ఆలోచన కూడా ఈమెలో కనిపించలేదు. మా వైపు ఒక మాట చెప్తారు. “ఉత్తచేతుల వయ్యారాలు ఎక్కువ అని”. ఈమె కూడా చాలా చంచల. తన అందానికి, వయ్యారానికి ఎవరిని పడవెయ్యాలా అని చూసే పిచ్చి కొందరికి ఉంటుంది. ఆడా మగా ఇద్దరిలోనూ ఉంటుంది. ఈమెది తన ఆధిపత్యాన్ని పరీక్షించుకునే ఆడ శరీరపు పిచ్చిగా మాత్రమే కనిపించింది నాకు.

ఇక ఇందులో నా భర్త పాత్రేమీ లేదు అనేటట్టు లేదు. బాపుకు ఆప్తంగా ఆయన కష్టసుఖాలను అడిగి తెలుసుకుని, ఒళ్ళు తడుముతూ, ఆయనను ఓదార్చేవారు ఎవరూ లేరు. ఉన్నా వాళ్ళను దగ్గరికి రానిచ్చేవారు కారు. ఆయన దగ్గరికి వచ్చేవారంతా ఆయను నుండి మార్గదర్శనం, ఆశీర్వాదం అపేక్షించి వచ్చేవారే. మామూలుగా చివరికి కుటుంబ సభ్యులనుండైనా అలాంటి ఆప్తమైన, వ్యక్తిగత ఓదార్పు లభించవచ్చు. కానీ బాపుకు కుటుంబమే లేదు. వ్యక్తిగత క్షణాలే అక్కర్లేదు. తమకు తామే పొగ పెట్టుకుని ఊపిరాడలేని సందర్భంలో ఆమె స్నేహం ఇష్టమై ఉండవచ్చు. కొత్త ఊపిరి, కొత్త శక్తినిచ్చుండవచ్చు.

దీన్నంతా ఆడమగ మధ్యలో జరిగే సహజ ఆకర్షణ అనుకోవచ్చు. మధ్యవయస్సు వచ్చేటప్పటికి బహుశా అందరూ ఆడమగా జీవితాల్లో ఇలాంటి సన్నివేశం ఉండనే ఉంటుంది. చాలా చిన్న వయసులో పెళ్ళయి, పరస్పర ముఖాలే చూసుకుని, మాటలు విని విసుగొచ్చిన భర్తకు, భార్యకు ఇలా అవ్వచ్చు. ఇలాంటి గాలివార్తలను పోరుబందరులోనూ, రాజకోట్ లోనూ మా ఇంటి ఆడవాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను. కాని, మా ఆయన పైన ఎందుకు కోపం వచ్చిందంటే తామే కాకుండా తమ భార్య, పిల్లలు, శిష్యులు శిష్యురాండ్రు అందరి పైన బ్రహ్మచర్యం, మట్టిగడ్డా అని మోపి ఇప్పుడు తాము ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నారు అని చిరచిర కలిగింది. మతిమరుపు వయసూ కాలేదు. అప్పుడు బాపుకు యాభై మాత్రమే. “సత్యాన్వేషకులకు ఎలాంటి నికట సంబంధం, సమీప ప్రేమ ఉండకూడదు. నికట స్నేహితులు అపాయకారులు, వాళ్ళు పరస్పర ప్రేమను చూపిస్తూ ఉంటారు. స్నేహితుల పట్ల అతి నిష్ట మిమ్మల్ని చెడ్డపనులను చేయడానికి పురికొల్పవచ్చు” అనేవారు బాపు. మనుకులాన్నంతా ప్రేమించాలనే ఆయన, ఎవరో కొందరు వ్యక్తులకు తమ ప్రాధాన్యం, సమయం కేటాయించడం తప్పు. తమ భార్య, పిల్లలను కూడా పట్టించుకోకూడదు అంటూ నా మనసు గట్టిగా చేసేవారు. కానీ ఇప్పుడు దాన్నంతా మరచిపోయి తామే నికట సంబంధపు బురదలో ఇరుక్కున్నారు.

ఒక రోజు సాయంత్రం రాట్నం ముందు ఒక్కరే కూర్చున్నప్పుడు అడిగేశాను. “సరళ ఇక్కడే ఉంటుందా? అందరూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు?” అని. “ఆమె ఇక్కడే ఉంటుంది. ఆశ్రమ జీవితం నేర్చుకుంటుంది. ఎవరేమన్నా అనని కస్తూర్. నువ్వు పట్టించుకోకు. ఇది నిజం. ఆమెలో ఏదో శక్తి ఉంది. ఆమె నా శక్తి అనిపిస్తుంది. కలలో కూడా వస్తుంది” అని లేచి వెళ్ళిపోయారు. సరే. ఇదంతా ఎన్ని రోజులు చూద్దాం అనిపించి లేచి వచ్చేశాను.

కానీ ఆధ్యాత్మిక పత్నిగా ఆమెను స్వీకరిస్తానని బాపు తమ దగ్గరివారికి చెప్పిన వార్త వినిపించింది. అది ఎవరికీ సబబనిపించలేదు. నాకేమీ అనిపించలేదు అంటే మీ ముందు అబద్ధం చెప్పినదాన్నవుతాను. నేను ఊరుకోలేదు. బాపు పైన కోపమో, జాలో ఏమని తెలియని ఒక భావం తెరలా వచ్చి వెళ్ళింది. కళ్ళ నిండా ఇసుక పడి తెరవడానికి వీలుకాకుండా ఉంది. మూసుకోను వీలుకాకుండా ఉంది. ఏమీ కనబడడం లేదు. ఈ పుణ్యాత్ముడు ఊరకే లేనివన్నీ తనపైకి లాక్కుని, ఒళ్ళంతా పూసుకుని జీవితమంతా కష్టపడడమే జరిగింది. మాకు కూడా దాన్నే నీతిపాఠంగా చెప్పడమూ జరిగింది. ఇప్పుడు అలా అయ్యాడేమిటి? ఆయన ఈ తిక్కలో నా వంతు ఎంత? అతడు నడిచిన దారే సరైనది అని వదిలేసిందే తప్పయిపోయిందా? ఇప్పుడేం చెయ్యవచ్చు? అంటూ దుఃఖం, కోపం, బాధ ఏమేమో కలిగింది. బహువచనం మానేసి ఏకవచనంలోనే ఆయనతో నాలో మాట్లాడాను. తిట్టాను. ఇలా ఐదారు నెలలు గడచి పోయుండాలి. ఇనుమును వేడిగా ఉన్నప్పుడే బాదాలి. ఒక మంచి అవకాశం దొరికినప్పుడు బాపుకో, ఆమెకో ఈ సన్నివేశపు వేడిని తగిలేటట్టు చెయ్యాలి అని ఓపికతో కాచుకున్నాను.

చివరికి ఒక సందర్భం వచ్చింది. నేనేమీ చెయ్యనవసరం లేకుండా పోయింది. బాపు దగ్గరివారే మరమ్మత్తు చేశారు.

ఆమె భర్తకు తన మొదటి భార్యనుండి ఒక కొడుకున్నాడు. పెద్దవాడు. వాడి పెళ్ళికని ఈమె లాహోర్‌కు వెళ్ళాల్సివచ్చింది. పెళ్ళికి హాజరయి పదిహేను రోజుల్లో వచ్చెయ్యాలి అని బాపు చెప్పి పంపారట. కానీ, ఆమెకేమయ్యిందో తొందరగా రాలేదు. ఇక్కడ బాపుకు ఆందోళన, బాధ. ఉత్తరాలు రాసిందే రాసింది, రోజుకు రెండు. పోనీ వాటిని గుప్తంగ రాసేవారా? రాసినవాటిని మహదేవే టపాలుకు వేసేవాడు. అటువైపునుండి వచ్చిన ఆమె ఉత్తరాన్ని చూసి మహదేవే బాపుకు ఇచ్చేవాడు. ఇలా విషయమంతా మహదేవ్, మగన్, దేవదాస్ అందరికీ తెలిసిపోయింది. అందరూ బాపు దగ్గర ఎలా ప్రస్తావించడం అని తెలియకుండా ఉండుండొచ్చు. చివరికి ఒక రోజు రాజాజిగారు వచ్చారు. ఆయనకు విషయం తెలిసింది. ఆయన నేరుగా బాపుతో విషయాన్నిచర్చించి, నిర్మొహమాటంగా చెప్పేశారట. “ఈ వయసులో, ఈ దశలో ఇదేమిటి మీది? అది కూడా మీ భార్య ఎదుట ఏమిటి మీ పిచ్చి చేష్టలు? బా ఎక్కడ? సరళ ఎక్కడ? బాతో ఆమెను పోల్చేటట్టే లేదు. ఉదయపు సూర్యుడ్ని గుడ్డిదీపంతో పోల్చడానికి వీలవుతుందా? ముందు ఈ పిచ్చి వేషాలు ఆపండి” అన్నారట.

అదేమనిపించిందో మరి, బాపుయే “మన దగ్గరి బంధువులు మన నడత గురించి, ఈ సంబంధం పవిత్రత గురించి సందేహిస్తున్నారు కాబట్టి ఈ స్నేహాన్ని మనం ముగిద్దాం” అని సరళకు రాసేశారట. ఆమెకు చాలా అవమానమనిపించి మళ్ళీ మళ్ళీ ఉత్తరాలు రాసిందట. ఆశ్రమానికి కూడా వచ్చేసింది. కాని అప్పుడు బాపు సహాయ నిరాకరణ సత్యాగ్రహంలో ఎంత మునిగున్నారంటే ఇద్దరికీ ఒక్క క్షణం కూడా మాట్లాడడానికి తీరిక దొరకలేదు. ఆశ్రమం నిండా జనాలు. అందరికీ చెప్పలేనన్నిపనులు. మృదువుగా ఉండే బాపు అప్పటికి గట్టిగా తయారయ్యారు. ఆమె పాపం, స్నానాలగదిలో ఏడ్చి సమాధాన పరచుకుని వెళ్ళిపోయిందట.

అకస్మాత్ ఆమెను నేను పెళ్ళి చేసుకుంటున్నాను అని బాపు ఏమైనా పట్టు పట్టుంటే, అది దైవీ-పవిత్ర-ఆధ్యాత్మిక ఎలాంటి పేరుతో పిలిచేది అయినా, ఏమయ్యుండేది ఈ మహాత్ముడికి? నా గతి ఏమయ్యేది? ఇష్టదైవమైన శ్రీరాముడు రాజాజిగారి రూపంలో వచ్చి కాపాడాడు. “సత్యం, స్వశరణాగతికి సిద్ధమవడం- ఈ రెండూ ఈ రెండే నాకున్న అర్హతలు” అంటూ ఏదో రాసుకుని ఏదేదో ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఆమె ఏం చేసిందో, నేనయితే మళ్ళీ సరళను చూడలేదు.

తరువాత ఒక రెండు సంవత్సరాల తరువాత బాపు ఆత్మకథ రాశారు. అందులో ఏయే విషయాలు రాశారో నేనయితే పూర్తిగా చూడలేదు. బాపు ఎంత రాశులుగా రాసేవారంటే వాటిని చదవడానికి నాకు చేతనయ్యేది కాదు. ఆయన రాసిన దాంట్లో ఒక అణాలోని వందో శాతం కూడా నేను చదవలేదు. మహదేవ్ దగ్గర ఆత్మకథలో సరళ గురించి రాశారా అని అడిగాను. అతడు చిన్నగా నవ్వి “లేదు” అని మాత్రమే చెప్పాడు. పుణ్యానికి రాజాజి సలహాను పాటిస్తూ మా ఆయన రాయకుండా వదిలేశాడేమో. లేదా సత్యం వేడికి ఆమె ఒక్కతే కాదు, ఆమె భర్త, పిల్లలు కూడా కాలిపోతారు అనిపించి రాయకుండా వదిలేసుండాలి.

రాజాజిగారు ఇలా అనేక సార్లు మమ్మల్ని ఇక్కట్లనుండి దాటించారు. రాజాజి బాపుకు చాలా దగ్గరివారు. దగ్గరివారు అని ఎందుకు అంటున్నానంటే ఆయన సరైనదాన్ని తప్పును రెంటినీ సరిగ్గా కనిపెట్టి చెప్పగలిగేవారు. అలా చెప్పేవాళ్ళు ఎక్కువగా లేరు. బాపు కాళ్ళకు దణ్ణం పెట్టేవారు, పొగిడేవారు, తలకాయ ఊపేవారే ఎక్కువ. అలాంటివాళ్ళ మధ్య రాజాజిగారు మాత్రం నిక్కచ్చి మనిషి. లోపల చెడు ఉండేది కాదు ఆయనకు. సత్యం చెప్పేసేవారు. అందుకే బాపుకు ఆయన పైన చాలా గౌరవం ఉండేది. మొత్తానికి రాజాజి గారి పుణ్యమా అని సరళాదేవి పురాణం ముగిసింది. తరువాత నా భర్తకు ఏ ఇతర ఆడదానిపైనా మతి చంచల్యం కలగలేదు. చాలా నమ్మకంగా చెపుతున్నాను. ఎందుకంటే అలాంటిదేమైనా ఉంటే ఆయన నడవడికలోనే తెలిసిపొతుంది. అలాంటిదాన్నికనిపెట్టడంలో నేను ముందు నుండి చురుకు. మా వైపు ఒక సామెత ఉంది. ఇషక్, ముషక్ రెంటినీ దాయలేము అని. అంటే ప్రేమ, ఎలుక ఈ రెండింటినీ దాచిపెట్టలేము అని. ఎంత నిజమో కదా?

మరోసారి కూడా రాజాజిగారే బాపుకు బుద్ధి చెప్పారు. 1906లో బ్రహ్మచర్యం చేపట్టారు కదా ఈయన! దాంతరువాత 20-30 సంవత్సరాల తరువాత, అనగా 1934, 36, 38లలో అని గుర్తు. బాపుకు కలలో వీర్యస్ఖనలనం అయింది. స్వప్నస్ఖలనం అన్నమాట. అబ్బబ్బా! దానికి ఎంత రాద్ధాంతం చేశారని! అంటే యాభై లేదా అరవై సంవత్సరాలయినా తనలో ఇంకా తగ్గిపోని వీర్యం ఉంది అంటే బ్రహ్మచర్య సాధనలో ఏదో లోపం జరిగింది, తన ఆచరణ సరిగ్గా లేదు, మహాపాపమేమో జరిగిపోయింది అని భావించారు. ఆ పాపం వలననే హిందూ ముస్లిం అల్లర్లు, దేశవిభజన బాధ కలిగింది అని భావించారు. వర్ధాకు వెళ్ళిన తరువాత, ఎక్కువగా 1936 అనుకుంటాను, ఒక రాత్రి బాపుకు వీర్యస్ఖలనం జరిగింది. అప్పుడయితే ఎంత కంగారు పడ్డారంటే తనలోనే ఏదో తప్పుంది, నేను ఇలాంటివాడినయితే ఇక సత్య అహింసా వ్రతుణ్ణి ఎలా అవుతాను అని గాబరాపడ్డారు. ఈ దిగులును తమలోనే దాచుకున్నారా, తమ దగ్గర ఉన్న ఆడా, మగ అందరికీ చెప్పడమే చెప్పడం. మీరా, అమృతాలకు కూడా చెప్పుకుని, ఉత్తరాలు కూడా రాసుకున్నారు. సత్యార్థి అయినవాడు దేనినీ రహస్యంగా ఉంచకూడదు అన్నది ఆయన నీతి. కాబట్టి అయినదంతా చెప్పుకోవడమే కాక ఉత్తరాల్లో కూడా రాసుకున్నారు. చివరికి సార్వత్రిక తప్పొప్పు చేసుకుందామని, తమకు జరిగినదాన్ని వ్యాసంగా రాసి ప్రకటించేందుకు కూడా సిద్ధం చేసుకున్నారు. అప్పుడు వచ్చిన రాజాజి, “వైయక్తిక విషయాలను పత్రికలో ఎందుకు రాసుకుంటారు? మీకు కలిగిన ద్వంద్వాలను దేశ సమస్యలుగా చేయకండి. మీ వ్యక్తిగత క్రియలు, శుద్ధి, ఆచరణలతో వాటిని సరిదిద్దుకోండి” అని నిర్మొహమాటంగా చెప్పేశారు. అప్పుడు ఈయనకూ ఔననిపించింది. రాసింది ప్రకటనకివ్వలేదు. పుణ్యం. ఇలా ఉండేవారు బాపు.

పసిపిల్లవాడనాలా? కాదు. పిల్లలు కొన్ని దాచుకుంటారు. వయస్కుడనాలా? అది కూడా కాదు. వయస్కులు మర్యాద కోసమైనా కొన్నిటిని చెప్పరు. ముసలాయనా? కాదు. ముసలివాళ్ళు తాము చేసిందే సబబని చెప్తూ ఎవరి అనుమతిని అడగనక్కర్లేదు అనేలా ఉంటారు. బాపు అదే రకమూ కాదు. తనదాన్ని, తనకయినదాన్నిఅందరి వద్దా చెప్పి, అడిగి వాళ్ల అనుమతి తీసుకోదలచుకుంటారు. ఈ స్వభావానికి ఏం చెపుతాం?

అలా కాబట్టే ప్రజలకు బాపు పిల్లవాడో, యువకుడో, ముసలివాడో అర్థం కాకపోయింది. అందుకే ఈయన ఎవరో మనకర్థం కాని దాన్ని చాలా గంభీరంగా సాధన చేసే సాధువో, సంతుడో, అవతార పురుషుడో అయి ఉండాలి అనుకున్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here