Site icon Sanchika

నేను.. కస్తూర్‌ని-4

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

[dropcap]అ[/dropcap]ప్పుడు పోరుబందర్‌ను రాణా అనే ఆయన పాలించేవాడు. పేరుకు మాత్రం రాణా. అంతా ఆంగ్లేయులదే అధికారం. దివానుగా ఉన్న కాబా గాంధీ అంటే కరంచంద్ గాంధీగారికి మా నాన్న స్నేహితులుగా ఉండేవారు. తమ స్నేహాన్ని పటిష్టం చేసేందుకు బంధుత్వం కలుపుకోవాలని తమ పిల్లలకు పెళ్ళి చేసే ఆలోచన ఇద్దరికీ వచ్చింది. ఇప్పుడు మీరు అంత చిన్న వయసుకే పెళ్ళా అనొచ్చు. కాలధర్మం అని ఒకటుంది కదా. దాని ప్రకారం అప్పుడు అన్నివివాహాలు అంటే అందరి వివాహాలు బాల్యవివాహాలుగానే జరిగేవి.

ఎక్కడానికి ముందు గుర్రాన్ని చూడు, విత్తడానికి ముందు నేల చూడు అంటారు. అప్పుడు అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు చూసుకునేవారే కారు. వాళ్ళ తలిదండ్రులే చూసేవారు. ఏం చూసేవారు? వాళ్ళ జోడి కుదిరిందా అని కాదు. వాళ్ళ వాళ్ళ వంశాలను మాత్రమే చూసేవాళ్ళు.

నా అత్త మామల గురించి కొద్దిగా మీకు చెప్పాలి. మేము పుట్టడానికి మునుపే, అనగా 1869 అప్పటికే నా మావగారు కాబా గాంధీ దివానై 20 సంవత్సరాలు గడిచాయి. ఆయనకు అప్పటికే నాలుగు పెళ్ళిళ్ళయ్యాయి. మొదటి ఇద్దరు పెళ్ళాలు ఒక్కో ఆడపిల్లను కని చనిపోయారు. మూడో ఆమెకు పిల్లలు కలగలేదు. ఆమె అనుమతి తీసుకుని తన కన్న 22 సంవత్సరాలు చిన్నదైన పుతలీ బాయిని నాలుగో పెళ్ళి చేసుకున్నారు. మూడో ఆమె, పుతలీ బాయి కలిసే ఉండేవారు. నా మామగారు కాబా గాంధీగారు చాలా ముక్కోపి అని అంతా అనుకునేవారు. చాలా క్రమశిక్షణ గల, కఠినమైన మనిషిగా పేరు గాంచారు. నేను చూసినంత మట్టుకు ఒక మంచి భర్త. మా అత్తగారికి ఎంత సహాయ పడేవారంటే అంతటి పెద్ద హోదాలో ఉన్న మగవాడు తన భార్యకు సహాయపడడం చాలా విడ్డూరం. ఇంట్లో మాంసం, మద్యం, తంబాకు అన్నీ నిషిద్ధం. వాటిని ముట్టుకోవడమే మహా అపరాధం అనే వాతావరణం ఉండేది. మామగారు ధార్మిక మనసుగల వ్యక్తే అయినా ధార్మిక ఆచరణలను పాటించేవారు కారు. ఆయనకు వృత్తే జీవితం. ఆయన సంపర్కంలో ఒకరు కాకుంటే ఇంకొక జైన సన్యాసులు ఎప్పుడూ ఉండేవారు.

మా అత్తగారు పుతలీబాయి జునాగఢ్ వైపు పల్లెటూరి మనిషి. భూమిలోపల పండిన దేనినీ ఆవిడ తినేవారు కాదు. ఉల్లిపాయలు, వెల్లుల్లి నిషిద్ధం. వారికి 1857 లో పెళ్ళయిందట. మూడు సంవత్సరాలకు మొదటి కొడుకు లక్ష్మీదాస్ బావ పుట్టారు. రెండున్నర సంవత్సరాల తరువాత ఆడపడుచు రాలియత్ పుట్టింది. మళ్ళీ ఐదు సంవత్సరాలకు కర్షణ్ దాస్ బావ. తరువాత 1869లో మోహన్ దాస్ పుట్టారు. నేను పుట్టిందీ అదే సంవత్సరంలోనే. మధ్యలో రెండు, మూడు సార్లు కడుపు దిగిపోయిందట.

మా అత్తగారు పుతలీబాయి చాలా ధార్మిక వ్యక్తి. సత్యం, న్యాయం, నీతి ఇవన్నీ ఉత్త నోటి మాటలు కావు ఆమెకు. ప్రతి ఒక దానినీ ‘అయ్యో ఇలా చేశాను కదా, అది సరైనదా కాదా?’ అని ఆలోచించేవారు. ఒకసారి ఏదో వ్రతం చేస్తూ, పూజ నైవేద్యం కాలేదంటూ ఇంటికి వచ్చినవారికి భోజనమే పెట్టలేదు. పూజ ముగిసేటప్పటికి వచ్చినవారంతా వెళ్ళిపోయారు. ఇక చూస్కోండి. మా అత్తగారికి అదే చింత పట్టుకుంది. ఆకలిగొని వచ్చినవాళ్లకి పూజ అని భోజనం పెట్టలేదు. ఇది సరైనదా కాదా అని. చివరికి పెద్దల దగ్గర అడిగి అనుమానం నివృత్తి చేసుకున్నారు. ఎప్పుడు చూసినా భజన, ఉపవాసం, దైవ చింతన. వీటిని దాటి ఆమె మనసు వెళ్ళేదే కాదు. ఆమె మనసులో రాజ మహారాజులకు స్థానమే ఉండేది కాదు. సంతులు, యోగులనే మహారాజ్, మహారాజ్ అని పిలిచేవారు. మా అత్తగారు సాధువులను ఎంత గౌరవించేవారంటే మా ఇంటికి వైష్ణవ సాధువులూ, జైన సాధువులూ వచ్చేవారు. బేజార్ జి అనే ఒక జైన సాధువు తరచుగా వచ్చేవారు. తన చిన్న కుమారుడు మోక లండన్‌కు బయలుదేరినప్పుడు, జాతి పెద్దలు సముద్రోల్లంఘనం చేస్తే జాతి భ్రష్టుడవుతాడు అని గలభా సృష్టించినప్పుడు, అత్తగారు బేజార్ జీ గారిని అడిగారు. ఆయన అంతా మంచే జరుగుతుంది, పంపు అని చెప్పినాకనే ఆమె సరే అనింది.

చేయడానికి ఏ వ్రతం కష్టతరమో అలాంటి వ్రతాన్నే ఏరి ఏరి మా అత్తగారు ఎన్నుకునేవారు. ఉపవాసం అదెన్ని సార్లు చేసేవారో లెక్కలేదు. పూజ జరగనిదే భోజనం లేదు. అత్త – మామ గార్ల పూజలు, నమ్మకాలు వేర్వేరు. మామగారు మా అత్తగారిలా ప్రణామి కారు. వైశ్యులు అంతే. మా అత్తగారు ప్రణామి పంథాను అనుసరించేవారు. ప్రాణనాథ్ జీ రాసిన ‘కుల్జామ్ స్వరూప్’ యొక్క పద్నాలుగు గ్రంథాలను పవిత్రం అని నమ్మేవారు. శుద్ధ శాకాహారం, అహింస. వారికి జాతి భేదాలు లేవు. రాధా కృష్ణ భక్తులంతా ఒకటే అని నమ్మేవారు. ఆ పంథాలోని ప్రాణనాథ్ అనే ఒక సంతుడి గురించి మా అత్తగారు ఎప్పుడూ చెప్పేవారు. ప్రాణనాథ మహారాజ్ గారు క్షత్రియులట. మక్కాకు కూడా వెళ్ళి వచ్చారట. అందుకే ప్రణామి అనుయాయులు పూజలో ముసల్మాన్ అంశాలను కూడా చేర్చుకున్నారు.

మా అమ్మగారి ఇంటివారు కూడా ప్రణామీలే. మా ఇంటి వెనుకే ప్రణామి దేవాలయం ఉండింది. మా అత్తగారు అక్కడికి వచ్చినప్పుడు మా పెళ్ళికి మునుపే చూశాను. ప్రణామీ దేవాలయాలలో విగ్రహాలు ఉండవు. గోడల పైన రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం అలాగే కురాన్ నుండి ఎంపిక చేసిన సూక్తులను రాసి ఉంచుతారు. ఒక ఉయ్యాల పైన రెండు ‘కుల్జామ్ స్వరూప్’ పుస్తకాన్ని ఉంచి, పైన ఛత్ర చామరాలను వ్రేలాడ దీసుంటారు. ఉయ్యాల బల్లకు కట్టిన ఇనుప గొలుసులను పట్టుకుని ఊపడమే పూజ.

కాబా గాంధీగారిది ముందు పాత ఇల్లుండేది. తరువాతనే ఆయన మేడ ఇల్లు కట్టింది. మా ఇంటినుండి గట్టిగా పిలిస్తే వాళ్లింటికి వినిపించేంత దగ్గిర అది. సముద్రం నుండి వచ్చే గాలికి మొహాన్ని ఉంచి నుంచోవచ్చు. అలాంటి మేడ ఉన్న ఇల్లు వాళ్ళది. ఆకాశం, సముద్రం రెండూ విరివిగా కనిపించే మేడ వారిది.  మా రెండూ ఇళ్ళలాగా ఎత్తుగా, అన్ని గదులున్న ఇళ్ళు ఎక్కువగా ఉండేవికావు అప్పుడు. మిగతావంతా ఒక గది లేదా ఒక మేడ ఉన్న ఇళ్ళయితే మావి మాత్రం మూడు మేడలు. మేడ పైన నిల్చుంటే నేలపైని ఇళ్ళూ, జనులు, పశువులు, దారులు, సముద్రం, హుజూర్ ప్యాలెస్, దీపస్తంభం అన్నీ కనబడేవి.

అమ్మాయ్! పోరుబందర్ లోని మా ఇల్లు ఎలా ఉందో చూశావా? ఇప్పటి మీకంతా ఇదేమిటి, ఇంత చిన్న ఇంట్లో ఉండి ఇంత అభిమానం ఈమెకు అనిపించవచ్చు. కానీ ఆ సమయానికి అలాంటి ఇల్లు అధికారానికి, కలిమికి, పెద్దరికానికి లక్షణంగా ఉండేది. గడ్డిపరకలతోనూ, తాటాకులతోనూ కట్టిన ఇళ్ళ మధ్య మా ఇళ్ళు రాజప్రాసాదాల లాగానే ఉండేవి.

పెళ్ళి ఆట

కాబా గాంధీగారి నాలుగో కొడుకు మోహన్ దాస్. మోన్యా అని పిలిచేవారు. కొందరు మోక అని కూడా పిలిచేవారు. నాకు మోకాయే నచ్చింది. అందులో ఇతడి పేరు, మామగారి పేర్ల మొదటి అక్షరం ఉండినందువల్ల పిలిస్తే గౌరవ పూర్వకం అనే అనిపించేది. అందరి ఎదుట పిలవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది కాదు. అతడికి ఒకటి తర్వాత ఒకటి, ఇద్దరు పిల్లలను చూశారట. కానీ అవి రెండూ తాంబూలాలు పుచ్చుకునే లోగా రద్దయిపోయాయి. అప్పుడంతా మా ఊళ్ళో ఇది చాలా సామాన్యం. చివరికి ఈ కస్తూర్‌ను చూశారు. చూశారు అంటే ఏమిటి. అతడి నాన్న, మా నాన్న మాట్లాడుకున్నారు. లెక్క చూస్తే నేనే అతడి కంటే ఆరు నెలలు పెద్దదాన్ని. భర్త కంటే భార్య కొద్దిగా పెద్దదిగా ఉండడం మా ఊళ్ళో అప్పుడు విచిత్రమేమీ కాదు. అయినా భర్తను నువ్వు అని పిలవకూడదు. ‘ఆయన, వారు’ అనే పిలవాలి. రోజూ ఉదయం ఆయన పాదాలకు నుదురు తాకించే లేవాలి. సాయంత్రం బయటకు వెళ్ళి రాగానే ఆయన పాదాలు కడగాలి. పేరు పెట్టి అయితే ఎప్పుడూ పిలవకూడదు. అందరూ పిలిచినట్టే నేను నా భర్తను పిలిచేదాన్ని. ఆయన పేరు మారుతూ పోయినట్టల్లా నేను మోకా బాబు, హరి నాన్న, నా పిల్లల నాన్న, మోక భాయి, గాంధీ భాయి, బాపు అని మార్చుకుంటూ వెళ్ళాను.

మొదటిసారి మేమిద్దరం కలిసినప్పుడు మా ఇద్దరి వయస్సు ఏడు సంవత్సరాలు. చిన్నగా నిశ్చితార్థం చేశారు. ఆ రోజు మా ఇంటికి నా స్నేహితురాళ్ళంతా వచ్చారు. మేమంతా తొందరగా శాస్త్రం ముగించి సముద్ర స్నానానికి వెళ్ళాలనుకున్నాం. కానీ కాళ్ళకు దణ్ణం పెట్టు, పాదాలు పట్టుకో అంటూ శాస్త్రం అసలు ముగియలేదు. అతడు నాలానే ఉన్నాడు, చిన్నవాడు, నేనెందుకు అతడి పాదాలు పట్టుకోవాలి అని కోపం నాకు. మా ఇంటివాళ్ళంతా నా మొహం చూసి గద్దిస్తూ ఉన్నారు. అంతే గుర్తు. తరువాత తీపిని పంచి, వాళ్ళంతా వెళ్ళిపోయిన తరువతా మమ్మల్ని బయటికి వదిలారు. తరువాత ఒక ఐదారు సంవత్సరాలు అతడెవరో, నేనెవరో. దానికి తోడు మామగారి ఇంటివాళ్ళంతా రాజ్‌కోట్ వెళ్ళిపోయారు. మోక కూడా అక్కడే చదువుకుంటున్నాడు.  అయితేనేం? నా మొగుడయ్యే వాడి ఇంటి ముందు దొంగతనంగా వెళ్ళొచ్చేదాన్ని. కాబా మామగారి స్వంత ఇంటి ముందు వెళ్ళొద్దు అనే అమ్మ చెప్పేది. “చిన్న పిల్లలా ఆడకు. నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళేవాళ్ళు ఏమనుకుంటారు” అనేది. నుంచుంటే, కూచుంటే, ఏడిస్తే, గట్టిగా నవ్వితే అన్నిటికీ కాబా గాంధీగారి పేరు చెప్పి బెదిరించడం. “కాబా బాబు అంటే ఏమనుకున్నావు నువ్వు? అక్కడికి వెళ్ళినాక ఇలా చేసి మా పరువు తీయకు” అనేవారు. అరె ఎవరు వీళ్ళు, వాళ్ళెక్కడో ఉన్నా నేను వాళ్ళకి భయపడి ఉండాలి అంటున్నారు కదా అని కాబా ఇంటివారందరి పైనా కోపం వచ్చేది. అలా అడిగితే, పుణ్యానికి మా ఇంట్లో దెబ్బలు ఉండేవికావు. కొన్ని ఇళ్ళల్లో వీపు విమానం మోత మోగేది. పిల్లలనే కాదు, భార్యలను, నౌకర్లను కూడా కొట్టింది చూశాను.  కానీ మా ఇంట్లో మనుషులను కొట్టేవారు కారు. మా అమ్మ పళ్ళు కొరుకుతూ చెప్పేదే కానీ ఎప్పుడూ ముట్టుకునేది కాదు. నాన్న సంగతి వదిలెయ్యి, ఆయన వీటి జోలికే వచ్చేవారు కారు. ఉల్టా మాట్లాడతానని తిట్టేది ఎప్పుడూ అమ్మ, అక్కయ్య మాత్రమే.

నా మాటలన్నీచిన్నతనానికే పరిమితమేమో అనేలా నేను పెద్దదాన్నవుతూ పోయినట్లెల్లా మాటలు తక్కువై, మౌనినై పోయాను.

పదమూడేళ్ళప్పుడు  పెళ్ళయ్యింది. పెళ్ళి అంటే సంబరం. ఎందుకంటే ఇంటికి చుట్టాలు, వాళ్ళ పిల్లలు వస్తారు. వాళ్ళతో ఆడుకోవచ్చు. కొత్త కొత్త బట్టలు, నగలు కొనిపెడ్తారు. రాశులు పోసి మిఠాయిలు చేస్తారు. పెళ్ళయినాక కూడా ఇక్కడే ఉండవచ్చు. అందరూ మనల్నే మాట్లాడిస్తారు. జై జై అంటారు. మొత్తం మీద దీనికి అని కాదు, పెళ్ళి అంటే సంబరం. అప్పుడు నాకు కాని, మోకకు కానీ ఇంత చిన్న వయసుకే పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నామన్న ఆలోచనే రాలేదు. మాది బాల్య వివాహం, అది తప్పు అని నువ్వు గింజంత కూడా తెలీదు. నిజం చెప్పాలంటే పెళ్ళి అంటే మాకు కుతూహలంగా ఉండింది.

వాళ్ళ ఇంట్లోవాళ్ళు మూడు పెళ్ళిళ్ళూ కలిపి చేద్దామన్నారు. మాది, కర్షన్ దాస్ బావ, మరొక చుట్టాలబ్బాయి పెళ్ళి కలిపే. అలా చూస్తే బావగార్ల పేరు అనకూడదు నేను. పెద్ద బావ, నడిపి బావ, చిన్న బావ, పొడుగు బావ, పొట్టి బావ ఇలా పిలవాలి. కాని, నేను మొగుడి పేరే చెప్పగలిగినప్పుడు బావగార్ల పేరొక లెక్కా? అది సరే. ఉమ్మడి కుటుంబాలలో అలాగే ఉండేది. ఖర్చు కలిసి వస్తుందని ఒక పెళ్ళికి ఇంకో పెళ్ళిని జతచేసి చేసేసేవారు. 1883 సంవత్సరం. మే నెల. మండే ఎండల రోజులు. పోరుబందర్‌లో మా పెళ్ళి జరిగింది. ఈ పెళ్ళికి అని మోక స్కూలు, పరీక్షలు అన్నీ తప్పిపోయు ఒక సంవత్సరం వ్యర్థమవుతుందని అనుకుంటున్నారు. కానీ పెద్దవాళ్ళకు సౌకర్యంగా ఉంటుందని, పరీక్షలు తప్పించి ముగ్గురి పెళ్ళిళ్ళు జతగా చేసేశారు. పెళ్ళికి క్రితం రోజు కాబా మామగారు బండ్లో పోరుబందరుకు వచ్చారు. వచ్చేటప్పుడు బండి బోల్తా పడ గాయాలు తగిలి పట్టీలు వేసుకుని వచ్చారు. అది బాగా గుర్తు నాకు.

మా వైపు మిగతావాటికి పైసా పైసా లెక్కవేసి ఖర్చు చేసినా పెళ్ళిళ్ళకు మాత్రం ఎంతైనా ఖర్చు చేస్తారు. పెళ్ళి అంటే సరిగ్గా ఒక వారం. అవేవో శాస్త్రాలు ఉంటాయి. వినాయకుడి పూజ, మండవ్ ఆచరణ, గంధపునీళ్ళు చల్లుతూ ఆడుతూ పాడుతూ ఊరేగింపుగా వెళ్ళి కుంభం తీసుకురావడం, రెండూ ఇళ్ళవాళ్ళు పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం, ఇలా. తరువాత గౌరీ పూజ. అది అయిపోగానే పుట్టింటివాళ్ళు తాము పెట్టవలసిన బంగారం నగలతో అమ్మాయిని అలంకరిస్తారు. తరువాత అమ్మాయి తల్లి అల్లుడి పాదాలు కడిగి తీసుకుని వస్తుంది. ఇదంతా ముగిసిన తరువాత పెళ్ళి, మాలలు, సప్తపది, కన్యాదానం అన్నీ.

పెళ్ళిరోజున నన్ను చూడగానే ముందుగా అతడు చేసిందేమిటో తెలుసా? తన రెండూ చేతులను విప్పి చూపించాడు! అతడి చేతులకు కూడా గోరింటాకు పెట్టారు. మా వైపు అబ్బాయికి కూడా గోరింటాకు పెడ్తారు. అతడయితే తన చేతులకున్న గోరింటాకు చూసుకుని మురిసిపోయాడు. పెళ్ళి పీటల మీద కూర్చున్నప్పుడు కళ్ళతో సైగ చేసి నా చెయ్యి చూపమన్నాడు. నా చేతుల్లో పట్టుకోవడానికి ఏవేవో ఇచ్చారు. అయినా ఒక సారి చెయ్యి విప్పి చూపాను. విప్పారిన అతడి కళ్ళు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి.

అతడికి దయ్యాలు, పాములంటే చాలా భయం. నాకు అలాంటి భయాలే ఉండేవి కావు. నేను చాలా గట్టి గుండెదాన్ని. నాకిష్టం వచ్చినట్టు చేసేదాన్ని. అది అతడికి మొండితనం, మకురుతనంగా కనిపించేవి. పెళ్ళి అయ్యేటప్పటికి నేనైనా కాస్త ఆడదాన్లా కనిపించేదాన్ని. అతడు ఇంకా చదువుకుంటున్నాడు. బక్కప్రాణి. మీసాలు కూడా రాలేదింకా. చూడ్డానికి పిల్లాడిలా కనిపించేవాడు. అన్నిటికీ తొందర. తకపక ఎగుర్తూ ఉండేవాడు. నిదానం తక్కువ.

కానీ చూడ్డానికి పిల్లాడిలా కనిపించినా పిల్లాడు మాత్రం కాదు అని తొందరగా అర్థమయ్యింది. పెళ్లయినాక నేను మా నాన్నగారి ఇంట్లో కొన్ని రోజులు, రోజులేమిటి, ఒక సంవత్సరమే ఉన్నాను. అప్పుడంతా అలాగే ఉండేది. చిన్న వయసులో పెళ్ళి చేసేవారు. అమ్మాయి పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాలు నిండేదాకా పుట్టింట్లోనే ఉండేది. అక్కడున్నట్టుగానే ఒకట్రెండు కానుపులు కూడా అయ్యేవి. అప్పుడప్పుడు పోరుబందరుకు అతనే వచ్చేవాడు. కొన్ని సార్లు రాత్రులు ఉండేవాడు. అబ్బా అదేం జోరు అప్పుడు! ఇలా కూర్చోరాదు, ఇలా మాట్లాడాలి, ఇలా కొంగు తల పైన కప్పుకుని ముఖాన్ని మూసుకోవాలి అని నాకు తాకీదు చేసేవాడు. నేనైతే అతడి ఎదుట తలాండిచి, తరువాత నా ఇష్టం వచ్చినట్టు ఉండేదాన్ని. ఇవన్నీ అయితే ఫర్వాలేదు. తొందరగా ఇంటికి వచ్చెయ్యి, తొందరగా ఇంటికి వచ్చెయ్యి అని ఒకటే తొందర పెట్టేవాడు. నాకేం తొందర ఉండేది కాదు. కానీ వాళ్ళింటికి పంపే శాస్త్రం జరిగింది. వెళ్ళి తీరాలి కదా. వెళ్ళాను. పోరుబందరు నుండి రాజకోట్‌కు వెళ్ళాను. అక్కడ మా మామగారు కట్టించిన ఇల్లు. అందమైన కాథేవాడి ఇల్లు. దాని వద్దనే ఒక హైస్కూలు ఉండేది. మోక రోజూ వెళ్తున్నది అదే స్కూలుకే. ఆ స్కూలుకు నువ్వు కూడా వెళ్ళేలా అవ్వాలి, నేర్చుకో నేర్చుకో అని బలవంతం చేసేవాడు. నేను స్కూలుకే వెళ్లలేదు. అక్షరాలు రావు. అలాంటి నాకు పాఠం చెప్పే పిచ్చి అతడికి. అప్పట్నుండి ప్రారంభమయ్యంది. చివరిదాకా నాకు గుజరాతీ వ్యాకరణం, కవితలు, చరిత్ర అన్నీ తనే ఉపాధ్యాయుడై పాఠం చెప్తూనే ఉన్నాడు.

అతడి ఇంటికి వెళ్ళీన తరువాత నన్ను ఎలాగైనా తన హద్దుల్లో ఉంచాలని చాలా ప్రయత్నం చేశాడు. పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకూ నన్ను తన గుప్పిట్లో ఉంచుకోవాలన్నదే అతని ఆలోచనగా ఉండింది. భారతీయ భర్తగా తన మొదటి కర్తవ్యం పెళ్ళానికి నియమాలు పెట్టి ఆమె వాటిని అనుసరిస్తుందా లేదా అని చూడడమే అని ఎక్కడో పుస్తకాల్లో చదివాడట. ఇక చూడు, నన్ను పతివ్రతను చెయ్యడానికి ఏవేవో నియమాలు వేశాడు. మొదటిది: తనను అడక్కుండా ఎక్కడికీ వెళ్ళరాదు. అతడిని అడక్కుండా నేను ఇంటినుండి బయటికి వెళ్ళనే కూడదు. ఒకవేళ వెళ్ళాల్సివస్తే మా అత్తగారైనా లేదా వేరెవరైనా తోడుగా ఉండాలి. పుట్టింటికి వెళ్తాననరాదు. అక్కడ అందరు పురుషులతో మాట్లాడరాదు. వెళ్ళే ముందు తన అనుమతి తీసుకోవడమే కాకుండా, ఇంట్లో మిగతా పెద్దలను అడగాలి. వెళ్ళొచ్చిన తరువాత అక్కడ అన్ని రోజులు ఎందుకున్నది, అక్కడ ఎవరెవరితో మాట్లాడింది అంతా పూర్తిగా సమాచారం ఇవ్వాలి. ఎప్పుడూ “చెప్పింది విను, ఊరుకో, నీకు తెలీదులే, ఎదురు జవాబు చెప్పకు, నీకేం అర్థమవుతుంది” లాంటి మాటలే చెవిన పడేవి. అయ్యో, చాలా కిరికిరి.

కానీ నేనెందులో తక్కువ, అతడంతే వయసుదాన్ని, ఇంకా చెప్పాలంటే అతడికంటే పెద్దదాన్ని? నాకు నచ్చినట్టు ఉండేదాన్ని. మనసులో ఉన్నది చెప్పేసేదాన్ని. ఒక్కోసారి తగవులయ్యేవి. రోజుల కొలది, వారాల కొలది, కొన్ని సార్లు నెలల కొలది మాటలుండేవి కావు. మౌనయుద్ధం. మాటలు లేకున్నా మిగతావన్నీ అలాగే నడిచేవి. ఒకసారి అత్తగారితో కలిసి దేవాలయానికి తనను అడక్కుండా వెళ్ళానని తిట్టాడు. “నువ్వు పెద్దవాడివా? మీ అమ్మ పెద్దవారా? ఆమెతో వెళ్ళడానికి ఆమె కొడుకు అనుమతి తీసుకోవాలా?” అని మొగం తిప్పుకుని అన్నాను. ఆ రోజు నుండి కొద్దిగా మెత్తబడ్డాడు.

ఇలా ఇద్దరు లేత పిల్లలు అమ్మా నాన్న ఆట ఆడుకున్నట్టు మా సంసారం ప్రారంభం అయ్యింది.

రాత్రి కావడమే కాచుకునేవాడు. అమ్మో! అదేం ఆశ అనుకున్నావు!! ఎలా చెప్పేది? అప్పటిదాకా పిల్లల్లా చాలా ఆటలే ఆడాము. ఆడపిల్లలే కలిసి అమ్మా నాన్న ఆట ఆడాము. మా అమ్మా నాన్న ఆట అంటే ఏమిటి? భర్త అయినవాడు తిట్టడం, భార్య సేవ చెయ్యడం. ఆడపిల్లలే భర్తలు కదా. లేని మీసాలు తిప్పడం, ఛాతీ పొంగించి, వీపు నిటారుగా చేసి, కాళ్ళు వెడల్పు చేసి కూర్చోవడం, బిగ్గరగా అరుస్తూ గద్దించడం, తల-కాళ్ళు-వీపు పట్టించుకోవడం, వీపు గోకించుకోవడం ఇలా. భార్య అయినవాళ్ళు వంట చెయ్యడం, కొంగు తల పైకి లాక్కుంటూ ఉండడం, పాలు పట్టేలా కూర్చోవడం, పిల్లల్ని గదమాయంచడం, డబ్బాల్లో పైసలు దాచిపెట్టుకోవడం, నగలు చేయించండి అని పీడించడం, లేదా అటు తిరిగి పడుకోవడం, గర్భిణిలా నడుస్తూ ఉస్సనడం, పోట్లాడడం. ఇలా.  చివరికి ఆట అడుతూ అడుతూ భార్య భోజనం వడ్డించి, పాత్రలన్నీ సర్ది, మొగుడి పాదాలకు నుదురు తాకించి ఇద్దరూ ఒకే దుప్పటిలో పడుకున్నాక ఆట ముగిసేది.

ఇప్పుడూ అదే ఆట. కానీ అప్పుడు దుప్పటి కప్పుకున్నాక ఆట అయిపోయేది. ఇప్పుడు ప్రారంభమయ్యేదే దుప్పటి కప్పుకున్న తరువాత.

నేను బ్రహ్మచర్యాన్ని స్వీకరించినదానను. ఇప్పుడు వీటిని గుర్తు చేసుకునేది సమంజసమో కాదో తెలీదు. కానీ ఇంత మాత్రం చెప్పొచ్చు. మొదట మొదట గింజుకున్నాను. కానీ క్రమంగా నాకూ రోమాంచనం కలిగిందంటే అబద్ధం కాదు. నేను దూరంగా జరిగి అలక చెందాలి. అతడు గబగబా దగ్గరికి రావాలి అనే మనసు కోరేది. అతడున్నప్పుడు వదిలించుకుని దూరం జరిగేది ఎలా అని ఆలోచిస్తుంటే, అతడు దూరంగా ఉన్నప్పుడు ఇప్పుడొస్తాడా, ఇంకో క్షణంలో వస్తాడా అని వేచేదాన్ని. అతడి పళ్ళ గాయాలు నా వీపు, చెంపలు, భుజాల పైన కనిపించినప్పుడల్లా ఇక నీ వద్దకు రాను అనేదాన్ని. కానీ నా ఒంటిమీది ఎరుపు గుర్తులను చూసి ఇంటి ఆడవాళ్ళు ఏడిపించినప్పుడు పులకించిపోయేదాన్ని. అలా ఒకటి మాయమయ్యేలోగా ఇంకోటి కనిపిస్తుంటే లోలోపలే మురిసి పోయేదాన్ని.

మా ఇంట్లో ఉన్న అనేక పిల్లల మాదిరిగానే నేనూ ఉన్నాను అనిపించేది. గండుపిల్లి దగ్గరికి వస్తే ఆడ పిల్లి గద్దించి దూరంగా తరిమేది. చివరికి దాని ఎదురుగ్గానే వెళ్ళి కూర్చుని గురుగురుమని సురత శబ్దం. ముట్టుకోవడాని వెళ్తే చిర్రు, ముట్టుకోకుండా ఉంటే ముట్టుకోవడానికి వచ్చేవారి పైనే దృష్టి.

భూమి తిరుగుతూ ఉన్నదే దీనికి అమ్మాయ్!

నెల తిరక్కుండా సరిగ్గా బయట చేరేదాన్ని. ఐదు రోజులు బయట. ఇలా నెలకు ఐదు రోజులు హయిగా గడపడానికి ఒక రకంగా సంతోషంగా ఉండేది. కానీ నా భర్తకు ఐదు రాత్రిళ్ళు నేను జతలోపడుకోను అని చిరాకు. ఆరో రోజు నా వెనకా ముందు తిరగడమే చేసేవాడు. ఒకసారి స్నానం చేసి లోపలికి వచ్చాను.  “బయట చేరినప్పుడు నువ్వు బయట ఎందుకుండాలి? నాతో పాటే ఉండు” అన్నాడు. మీకంతా నవ్వులాటగా అనిపించవచ్చు. అతడికి బయటికి చేరడం అంటే ఏమని తెలియనే తెలియదు. కాబా గాంధీగారి ఇంట్లో ఆడవాళ్ళు చాలా తక్కువ. ఉత్త మగపిల్లలే. నాకూ అంతేగా మరి. ఆడపిల్ల పుట్టనే లేదు. నా గర్బంలో ఆడపిలక మొలవనేలేదు. ఎన్ని రోజులు ఈ వెలితి ఉండిందో తెలుసా? మా బావలకూ అంతే. ఆడపిల్లలు తక్కువ. ఆడ మగల మధ్య పరదానే ఎక్కువగా ఉండేది కాబట్టి ఆడపిల్లలకు సహజంగా ఏమేమి జరుగుతుందో మగవాళ్ళకు అర్థమయ్యేది కాదు. ఆడవాళ్ళపైన జాలి చూపితే ఆడంగి అన్న బిరుదు వస్తుందనే భయం కూడ మగవాళ్ళకు ఉండేదేమో మరి!

(సశేషం)

Exit mobile version