Site icon Sanchika

నేను.. కస్తూర్‌ని-7

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

[dropcap]ముం[/dropcap]బైలో లాయర్‌గిరి ప్రారంభమయ్యింది. దుబారా ఖర్చుతో కచేరి అద్దెకు తీసుకున్నారు. కానీ ప్రతివాది లాయర్‌గా ఎదుటి వారిని ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలడిగి తిమ్మిని బొమ్మిని చెయ్యడం హరి నాన్నకు చేతకాలేదట. అలా ఎక్కువ కేసుకు రాలేదు. వచ్చిన ఆదాయం అక్కడి ఖర్చులకే సరిపోయి మా ఖర్చులకు మళ్ళీ లక్ష్మీదాస్ బావనే అడిగే పరిస్థితి కొనసాగింది. మాది అటుంచి, తన ఖర్చువెచ్చాలకు కూడా లక్ష్మీదాస్ బావను అవలంబించే పరిస్థితి ఎదురయ్యింది. మొదటే ఈయనది సూక్ష్మమైన మనసు. డబ్బులిచ్చేవారి మాటలు, ముఖభావాలు, ఇచ్చే రీతి వీటిలో కొంచెం తేడా కనిపించినా హరి నాన్న చాలా బాధపడేవారు. మేమిద్దరమే ఉన్నప్పుడు మా మధ్య ఇలాంటి బాధలను పంచుకోవడం గురించే అయ్యుండేవి. చివరికి ముంబై కచేరి మూసేసి సంవత్సరం తిరక్క ముందే రాజకోట్‌కు వచ్చేశారు. కానీ రాజకోట్ లోనూ అన్నికేసులు దొరకలేదు. అన్నీచిన్నా చితక కేసులు. ఏదో సందర్భంలో ఒక ఆంగ్ల అధికారి కోపానికి గురైన మోకకు రోజులు గడవడమే కష్టమయ్యాయి.

ఇలా ఉండగా ఒక రోజు, “దక్షిణ ఆఫ్రికా అని ఒక దేశం ఉంది. అక్కడికి వెళ్ళే అవకాశం దొరికింది. వెళ్ళనా?” అని అడిగారు.

అప్పుడు నేను మళ్ళీ గర్భవతిని. మొదటి కాన్పుల్లా వాంతులు, తిప్పడాలు, నీరసం లేకున్నా నిశ్శక్తత ఉండింది. మూడు సంవత్సరాలు నన్ను వదిలి వెళ్ళిన మనిషి వచ్చి ఒక సంవత్సరమైనా కాలేదు. మళ్ళీ వెళ్తాను అన్నప్పుడు విసుగొచ్చింది. ఎన్ని రోజులని నేను భర్త లేని ఇంట్లో ఉండను? ఇతర ఆడవాళ్ళు కడవా చౌత్ అని అదని ఇదని వ్రతాలు చేస్తూ, భర్త పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు నాకు ఇవేమీ దొరికేవి కావు. దూరంగా ఉన్న భర్తకు మేలు కలగాలని వారానికి రెండు సార్లు ఉపవాసం చేసేదాన్ని. నేను ఇలా అనగానే హరి నాన్నమొహం చిన్నబోయింది. చివరికి ఒక సంవత్సరం మట్టుకు వెళ్ళాలనీ, ఆలస్యమయితే నన్నూ అక్కడికి పిలిపించుకోవాలని షరతు పెట్టి ఒప్పుకున్నాను.

రాజకోట్‌కు చెందిన దాదా అబ్దుల్లా సేఠ్ మెమన్ అనేవారు పెద్ద పడవ వ్యాపారులు. ఆయన వ్యవహారం దక్షిణ ఆఫ్రికా అంతా ఉండింది. అక్కడ ఉన్న ఆయన సోదరుడికి కోర్టు వ్యవహారాలు చూసుకునే లాయరు, అదీ కాథేవాడ వైపు గుజరాతి, ఇంగ్లీష్ రెండూ తెలిసిన లాయర్ అవసరం ఉంది. 105 పౌండ్ల డబ్బు, ప్రయాణానికి అయ్యే ఖర్చు ఇస్తాము, లాయర్‌గిరి సహాయకులుగా లేదా మోకభాయి చెప్పినట్టుగా ‘కూలి బ్యారిస్టర్’గా వస్తావా అని అడిగారు. రాజకోటలో ఉద్యోగం కష్టమయినప్పుడు బయటి దేశం అనుభవం కూడా అవుతుంది. అలాగే ఒక సంవత్సరం పాటు ఉద్యోగ అనుభవం కూడా అవుతుంది అని భావించి, తన అన్నయ్యతో చర్చించి మోకభాయ్ బయలుదేరారు.

అబ్దుల్లా సేఠ్ గారు తమ వ్యాపార ప్రత్యర్థి తయ్యబ్ సేఠ్ పైన వేసిన దావాకు సహాయకుడిగా పని చెయ్యడానికి మోక భాయ్ వెళ్ళింది. సేఠ్ లిద్దరూ బంధువులే. ఇద్దరి మధ్య వ్యాజ్యం వలన ఇద్దరికీ నష్టమే. ఈ దావా కొనసాగడం వలన లాయర్లకు, కోర్టుకు మాత్రమే లాభం అని మోక భాయ్‌కి స్పష్టంగా తెలిసిపోయింది. కోర్టు బయటే రాజీ చేయించి ఈ దావాను పరిష్కరించాలి అనుకుని వారిద్దరితోనూ తామే మాట్లాడి, చర్చించి ఐదారు నెలలలో దాన్ని ముగించేశారట. భాయి ప్రకారం ఉత్తమ లాయరుగిరి అంటే వెంట్రుక చీలిపోయేలా వాదన చేస్తూ దావాను కొనసాగించడం కాదు: విరిగిన మనసులను జోడించి, చర్చలకు ఏర్పాటు చేసి దావాను ఇత్యర్థం చెయ్యడం. అలాగే సేఠ్ లిద్దరి దావాను ముగించారు.

లాయర్ల గురించి ఎలాంటెలాంటి అవహేళన, హాస్య పలుకులున్నాయి కదూ అమ్మాయ్! ఒక వ్యాజ్యం దొరికితే చాలు, ఏళ్ళ తరబడి లాగీ, లాగీ ఆ ఘర్షణకు ప్రాణం పోస్తుంటారని లాయర్ల పైన అపవాదుంది. కానీ, ఈ కొబ్బరి నీళ్ళలాంటి మనసున్న లాయరు గాంధీ ఇంత తొందరగా రాజీ చేయించి కేసు ముగించింది అబ్దుల్లా సేఠ్‌కు చాలా గౌరవం, ఆత్మీయత కలిగాయి. భాయి పైన స్నేహ వర్షాన్నే కురిపించి, సత్కరించి వాపస్ పంపడానికి తయారీ మొదలుపెట్టారు. ఇంకేం తొందరగా వచ్చేస్తాను అని భాయి ఉత్తరం కూడా వచ్చింది.

కానీ, ఇంకేం భారతానికి బయలుదేరాలి అనేటప్పుడు ఒక ఇక్కట్టు వచ్చిపడిందట. కాబట్టి రావడం కొంత ఆలస్యం అవుతుందని ఇంకో ఉత్తరం వచ్చింది. వచ్చేస్తారు అనే సంతోషంలో ఉన్న నాకు చాల నిరాశ కలిగి అలా నా ఉత్తరంలో రాయించాను. వస్తానన్న మనిషి ఎందుకు మానుకున్నారు అని ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలాయి. తరువాత భాయి ఒక దీర్ఘ లేఖ రాశారు. ఉత్తరంలో వివరంగా ఆ దేశ చరిత్రను రాశారు. మన వద్ద కాథేవాడ్, ముంబై మాదిరిగా దక్షిణ ఆఫ్రికాలో నటాల్, ట్రాన్స్‌వాల్ అనే ప్రాంతాలు ఆంగ్లేయుల పరిపాలనా ప్రాంతాలు. వాటిలో భాయి ఉన్న డర్బాన్ పట్టణం నటాల్ ప్రాంతలో ఉంది. అది పోరుబందరులాంటి కోస్తా ఊరు. చెరుకు తోటలు, గనుల్లో పనిచేస్తున్న అనేక భారతీయులు నటాల్‌లో ఉన్నారు. నటాల్‌కు ప్రక్కగా వెనుకవైపు ట్రాన్స్‌వాల్ అని ఇంకొక ప్రాంతం ఉంది. ప్రిటోరియా, జోహాన్స్‌బర్గ్ ఆ ప్రాంతపు ముఖ్య నగరాలు. అక్కడ కూడా మనవాళ్ళు చాలానే ఉన్నారు.

మనవాళ్ళు భారతదేశం వదిలి అక్కడికెందుకు వెళ్ళారు అని నా ఒక ఉత్తరంలో అడిగున్నాను. దానికి బదులుగా ఒక కథనే రాసి పంపారు. ఆంగ్లేయులు మన దేశానికి వచ్చిన తరువాత పేదవాళ్ళ సంఖ్య, పేదరికం పెరుగుతూ పోయాయి. జీవన భృతి వెతుక్కుని దేశాన్ని వదిలి వెళ్ళేవాళ్ళు ఎక్కువయ్యారు. అదే సమయంలో ఆంగ్లేయులకు తమ గనులు, ఇంటి పనులు, పొలం పనులకు చవకగా పనిచేసే కూలీల అవసరం కలిగింది. బయటి దేశాల ప్రజలు, అందునా బానిసలుగా చేసుకున్న నల్లవాళ్ళను అలాంటి పనులు చెయ్యడానికి తయారు చెయ్యడం కష్టం అని ఆసియా పేద దేశాల కూలీలను పడవల్లో నింపి తీసుకుని వెళ్ళారు. అక్కడ తెల్లవాళ్ళే యజమానులు. వాళ్ళ తరువాతి స్థానం వలస వెళ్ళిన వాళ్ళది, వారికంటే దిగువ స్థాయిలో నల్లవాళ్ళు ఉండేవాళ్ళు. మనవాళ్ళు తలెత్తకుండా ఆంగ్లేయులు ఒక వైపు నుండి తల నొక్కుతూ ఉంటే, తమ రెండో యజమానులైన భారతీయుల పైన నల్లవాళ్లకు కోపం, కడుపు మంట. ఇలా రెండు వైపుల ఒత్తిడికి అక్కడున్న మనవాళ్ళు గురయ్యారు.

ఆ సమయానికి మనవాళ్ళు ప్రపంచలోని అన్ని దేశాలకు వెళ్ళసాగారు. కానీ, యంత్రాలు వచ్చాక ఆంగ్లేయులకు కూలీల అనవసరమయ్యారు. కాబట్టి వలసలను అరికట్టేందుకు కొత్త కొత్త చట్టాలను తీసుకు రాసాగారు. ఆంగ్లేయుల చేతి క్రింద గోధుమ రంగు ఆసియా వాసులు, భారతదేశంలోని అస్పృశ్యుల మాదిరిగా కష్టాలు, అవమానాలు అనుభవించారు. నిజానికి నాకైనా, భాయి కైనా మన దేశంలోని అస్పృశ్యతా ఆచరణ వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు అని తెలియనే లేదు. అది అక్కడ మొదటిగా అనుభవంలోకి వచ్చింది.

అవునట అమ్మాయ్! మనవాళ్ళను ‘గిరమిటియా’ కూలీలని పిలిచేవారట. వాళ్ళు దుకాణాలు పెట్టుకోకూడదట. అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్ళి రావడం చెయ్యకూడదు. తమకు నచ్చిన ఊళ్ళో ఉండడానికి లేదు. తిరగకూడదు. కూర్చోకూడదు. పెళ్ళి చేసుకుని భార్యను తీసుకు రాకూడదు. రోడ్డు పక్కన కూరగాయలు, పాలు అమ్ముకుని జీవితం గడుపుదామంటే అది కూడా వీలవదు. పర్మిట్, లైసన్స్, సుంకం అన్నీ అవసరం. రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఆరు దాకా గిరిమిటియా కూలీలు రోడ్లలో తిరగరాదు. తెల్లవాళ్ళ రోడ్లలో అయితే అసలు వెళ్ళరాదు. హోటళ్ళలో బస చెయ్యడానికి రూములు దొరకేవి కావు. తెల్ల వాళ్ల పార్కులు వేరు, రైలు బోగీలు వేరు, ఆస్పత్రి వార్డులు వేరు. అక్కడ మిగతావాళ్ళు తిరగరాదు. భారతీయ కూలీలందరూ ఒకే చోట, ఒకే వీధిలో ఉండాలి. ఇలా కొత్త కొత్త నియమాలు అక్కడ. అన్యాయం అని తెలిసినా, కోపగించుకున్నా మనవాళ్ళు ఏమీ చెయ్యడానికి వీలయ్యేది కాదు. ఎందుకంటే తమది కాని దేశంలో ఉన్నారు. అందరూ నాలుగు రాళ్లు సంపాయించుకోవాలని వెళ్ళారు. ఇలా 50 వేల జనాభా ఉన్నా కానీ, మనవాళ్ళ తరుఫున పోరాడేవారు ఎవరూ లేకపోయారు.

భాయి దీనిని వ్యతిరేకించి మాట్లాడారు. ఎక్కడెక్కడో ఉన్నగిరిమిటియా కూలీల సంఘాన్ని ఏర్పరచారు. ఉత్తరాలు రాశారు. ప్రణాళికలు తయారు చేశారు. అదెందరినో కలిశారు. తమ పనులకు ఆసరాగా నటాల్ ఇండియన్ కాంగ్రెస్ ప్రారంభించారు. మాకూ అన్ని హక్కులివ్వండి అని కోర్టులోనూ పోరాటం ప్రారంభమయ్యింది. అక్కడి మనవాళ్లకు ఒక నాయకుడు జన్మించినట్టనిపించింది. ఇలా మోక గాంధీ అందరికీ ‘గాంధీ భాయ్’ అయ్యారు.

ఇలా ఉండగా, ఇక మన దేశానికి బయలుదేరాలి అని అనుకునేటప్పటికి, కొంత సమయంలోనే జరగనున్న నటాల్ ఎన్నికలలో భారతీయలకు ఓటు హక్కు ఇవ్వరాదన్న చట్టం వస్తున్నట్టు వార్త తెలిసింది. ఓటు హక్కు లేకపోతే ఇక ఏ హక్కూ లేనట్లే. గాంధీ భాయ్ కనీసం ఒక నెలైనా ఆగి పోరాటం కొనసాగించి తరువాత కావలిస్తే వెళ్ళనీ అని అక్కడి మన అబ్దుల్లా సేఠ్ వేడుకున్నారట. సత్కార సభ పోరాట సభగా మారింది. రాత్రికల్లా సంతకాలు సేకరించి మరుసటి రోజు వార్తా పత్రికకు పంపారు. ఆంగ్లేయులకు కూడా పదివేల సంతకాలు సేకరించి పంపారు. దక్షిణ ఆఫ్రికా భారతీయుల పరిస్థితి ఎలా ఉంది అన్నది ప్రపంచం నలు మూలలా వార్తగా మారింది.

భారతీయుల వైపు వాదించడానికి తను డబ్బులు తీసుకోను, కానీ తన స్వంత ఖర్చులకు మాత్రం లాయరుగిరి చేస్తానని గాంధీ భాయి నటాల్ హైకోర్టులో తన పేరు నమోదు చేసుకున్నారు. వ్యాపారస్థుల, కూలీల స్నేహితులై పోయారు. కూలీల కష్టాలను పట్టించుకునేవారు, వారి పరంగా మాట్లాడేవారు లేనప్పుడు ఆయన యోధుడిగా మారారు. సాధుసంతులు మన ఇంటికి వచ్చినప్పుడు మన కష్ట సుఖాలను వారికి చెప్పి ఎలా తేలికపడతామో, అలా అక్కడివారికి మా ఆయన సాధు సంతులయ్యారు. ఇంకేం ఇప్పుడు వస్తాను, ఇప్పుడు అయిపోతుంది అంటూ ఒక సంవత్సరం పని అని వెళ్ళింది, మూడు సంవత్సరాలయ్యింది. అయినా కానీ ముగిసే సూచనలు కనరాక చివరికి నన్ను, పిల్లల్నీ అక్కడికే వచ్చెయ్యండి అని పిలిచారు. తీసుకెళ్ళారు.

ఒక సంవత్సరానికని వెళ్ళిన మనిషి నటాల్, ట్రాన్స్‌వాల్ లలో ఒక్కోచోట పది సంవత్సరాలు, మొత్తం ఇరవై సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది, గుజరాతి బనియా మోక గాంధీని గాంధీ భాయిగా, బాపుగా మార్చింది. అదేం అల్లాటప్పా మార్పు కాదమ్మాయి! “మొదట నేను బ్రిటిష్ వాణ్ణి, తరువాతే భారతీయుణ్ణి” అంటున్న భాయి, ఆంగ్లేయులు భారతీయుల పట్ల చూపే నిరాదరణను చూసి “నేను ముందు భారతీయుణ్ణి, తరువాతే బ్రిటిష్” అనేంతగా మారారు. ఆ నేల ఆయననే కాదు, నన్నూ మార్చేసింది. అప్పటి దాకా నేను, నా దేశం, నా మతం – దేవుడు, ఇతర ప్రజల గురించి అసలు ఆలోచించిన దాన్నేకాదు. ఆ నేల ఎన్నో విషయాలకు నా కళ్ళు తెరిపించింది. ముందు నా ప్రపంచం ఏమున్నా గుజరాత్, బనియా ప్రపంచాలు. అందులోనూ ఆడవాళ్ళ పండుగ పబ్బాలు, వ్రతాలు, వంట, దుస్తులు, పిల్లలు, రోగాలు, చావుల ప్రపంచం ఇంతేగా ఉండింది. ఇప్పుడు వాటన్నిటికవతల వికసిస్తూ పోయాను. చుట్టూతా ఉన్న కవచాలను వదులు చేస్తూ ఒక్కొక్కటిగా విడిపించుకోవడానికి సిద్ధమయ్యాను.

అందుకే హిందూస్థాన్ నా జన్మభూమి అయితే, దక్షిణ ఆఫ్రికా కర్మభూమి, యోగభూమి అనవచ్చు.

మేము అరేబియా సముద్రాన్ని దాటాము

1896 అనుకుంటాను. హరి నాన్న దక్షిణ ఆఫ్రికా నుండి మూడు సంవత్సరాలలో రెండు సార్లు వచ్చి వెళ్ళారు. హరిలాల్, మణిలాల్ పెరుగుతున్నారు. రెండో సారి ఆయన వచ్చినప్పుడు నేను గర్భవతినయ్యాను. అది నాలుగవ గర్భం నాకు. మూడో బిడ్డ. ఆ దేశంలో ఇంకా నాలుగైదు సంవత్సరాలు ఉండాల్సొస్తుంది, వస్తారా అని అడిగారు. నాకూ అదే కావల్సింది. కానీ మేము తయారయ్యేంతలో అక్కడికి వచ్చెయ్యమని అత్యవసర సమాచారం వచ్చి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఆరు నెలల తరువాత వచ్చారు. మొత్తం కుటుంబం దక్షిణ ఆఫ్రికాకు బయలుదేరాము.

మొదటి సారిగా ఇల్లు, ఊరు వదిలి విదేశానికి బయలుదేరాను. నా బంధువులంతా పోరుబందర్ చుట్టుపట్లే ఉండడం వలన ఇలా ఇంత దూరం ప్రయాణం ఎప్పుడూ చెయ్యలేదు. పోరుబందరు, జునాగఢ్, రాజ్‌కోట్ ఈ మూడు ఊళ్ళు తప్ప ఇంకెక్కడికీ వెళ్ళలేదు. వెళ్ళాలని అనిపించనూ లేదు. ఇంకా బుద్ధి పక్వమవడానికి ముందు, అంటే హరి నాన్న మెట్రిక్ పరీక్షకు కూర్చుని అమదావాద్‌కు వెళ్ళొచ్చి, నెలల కొద్దీ అక్కడి విశేషాలు, వైభవం, అందాన్ని వర్ణించినప్పుడు నాకూ ఒకసారి వెళ్ళి చూడాలనిపించింది మాత్రం నిజం. కానీ ఇంటిని వదలి వెళ్ళడం అంత సులభమా? పిల్లలు అంటుకునే ఉంటారు. ఇంటి పనుల భారం రోజూ మీద పడుతూ ఉంటుంది. తిరిగి రావాలని అనిపించడమే కష్టం. అలాగేమైనా అనిపిస్తే అది విచ్చలవిడి తనం, పాపం అనే లెక్క. వెళ్ళి తీరాలంటే భర్త, అన్నయ్య, మామగారు లేదా మరెవరైనా ఇంటి ’యజమానే’ వెంట తీసుకెళ్లాలి.

మోక గాంధీ లండన్‌కు బయలుదేరినప్పుడు ఆయనకు వీడ్కోలివ్వడానికి ముంబైకి వెళ్ళాలని ఆశ అయితే ఉండింది. కానీ అప్పుడు హరి కడుపులో ఉన్నాడు. నెలలు నిండూతూ పోయినట్లల్లా గూడు వెచ్చగా ఉంచాలన్న బాధ్యత పెరిగింది. వెనకా ముందు చుడుతూ సతాయించే ముద్దు భర్త బయలుదేరే దుఃఖానికి చేతులు కాళ్ళు పడిపోయినట్లనిపించింది. తన తండ్రి ఇంకేం వెళ్లాలన్నప్పుడు హరి పుట్టాడు. వీడ్కోలు పలకాడానికి వెళ్ళడం అసాధ్యమైంది. మూడు సంవత్సరాల తరువాత మోకభాయి బ్యారిస్టర్ అయి వచ్చినప్పుడూ కూడా ఎదుర్కోవడానికి ముంబైకి వెళ్లడానికి కుదరలేదు. ఆ సమయానికి సరిగ్గా హరి ఆరోగ్యం చెడింది. తండ్రి వచ్చేటప్పటికి కొడుకుని కులాసాగా చెయ్యడం పట్ల నా లక్ష్యం వెళ్ళింది.

ఇలా ఇల్లే నా జగత్తుగా మారింది. ఇల్లే స్వర్గం, ఇల్లే నరకంగా అయ్యింది. నేనే అని కాదు, చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ పుట్టిల్లు, అత్తగారిల్లు తప్ప మూడో ఊరు చూడనే చూడలేదు. ఉత్త ఆడపిల్లలే కాదు, విదేశీ వ్యాపారాలు చేస్తున్నా మా నాన్న దేశం వదిలి వెళ్ళలేదు. పడవ ఎక్కలేదు. అరేబియా దేశాలు, ఆఫ్రికా దేశాల వ్యవహారాలు ఒక చిత్తు కాగితం పైన, నోటి మాట పైన జరిగే వ్యవహారం. సముద్రాన్నిదాటడం అంటే జాతిభ్రష్టుడవడమే అని చాలా మంది వ్యాపారస్తులు అనుకునేవారు.

అలా ఉన్నప్పుడు ఇల్లు, వాకిలి, తనవాళ్ళు, సముద్రం, చెట్లు చేమలు, దేవుడు ఇవన్నిటీనీ వదిలి బయలుదేరాను. పోరుబందరులో రోజూ చూస్తున్న సముద్రం వెన్నంటి బయలుదేరాను. మోక భాయి మాదిరిగా జాతిభ్రష్టురాలవడానికి బయలుదేరాను. 600 ప్రయాణికులున్న రెండు పడవలు ముంబై నుండి దక్షిణ ఆఫ్రికాకు. 1896లో దీపావళి గడచి ఒక నెల అయిందేమో! నవంబరు చివర్లో ఉండాలి, బయలుదేరాము. మాతో పాటు హరి, మణి ఉన్నారు. బిడ్డకు అప్పుడు ఐదు సంవత్సరాలు. నుంచున్న చోట నిలిచేవాడు కాడు. ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు. ఏ సందుల్లోనైనా కాలో చెయ్యో ఇరికిస్తాడేమో అని, ఎక్కడెక్కడికో వెళ్ళి దారి తప్పితే ఎలా అనే భయం ఎప్పుడూ ఉండేది. కానీ, పడవలో ఎక్కడికి వెళ్ళినా దారి తప్పే అవకాశం లేదు, భయపడొద్దు, మన దగ్గరికి రానే వస్తాడు, మూల మూలల్లోనూ చూసేవాళ్లు ఉన్నారు అని మోక సమాధాన పరిచారు.

సముద్రం అంటే నాకు చాలా ఇష్టం. రాజకోటకు పోయిన తరువాత సముద్రం, దాని సవ్వడి లేకుండా ఎక్కడో దూరంగా వచ్చినట్టనిపించింది. కానీ, సముద్రం ఒడ్డున కూర్చుని సముద్రాన్ని ఆనందించానే కానీ, ఆ అపార జలరాశిలో పయనించలేదు. పడవ ఒక ఊరి మాదిరిగా ఉంది. ఒకే స్థలంలో అన్ని రకాల ప్రజలు. అంతమందిని చూసి కొంచెం కంగారు పడింది నిజం. నిద్ర పట్టేది కాదు, భోజనం సహించేది కాదు, సముద్రంలో పడవ మునిగి పోయి నావికులు అతి కష్టంతో తిరిగి వచ్చిన కథలు ఇంట్లో అప్పుడప్పుడు చెప్పేవారు. పడవ కొంచెం అల్లాడినా భయమేసి ఎప్పుడు నేలను తాకుతామా అనిపించేది.

అయినా ఒకటే ధైర్యం. భర్త, పిల్లలు తోడున్నారు. ఏది జరిగినా అందరికీ కలిపే జరుగుతుంది. హరి నాన్న అదే అవకాశంగా నాకు, పిల్లలకు పాఠాలు చెప్పారు. దక్షిణ ఆఫ్రికా దేశం, అక్కడి ప్రజలు, చట్టాలు, తన ప్రయత్నాలు, అన్నిటి గురించి వివరంగా నాకు అర్థమయ్యే దాకా చెప్పారు.” అంతా తెలుసుకుని ఉండాలి నువ్వు. లేకపోతే నేను అక్కడ ఏం చేస్తున్నాను, నా చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు అని అర్థం కాదు. చివరికి మనమిద్దరం ఉద్దాలకుడు, చండికల మాదిరిగా పోట్లాడుకునే దంపతులమవుతాం అంతే” అంటూ మనసుకు హత్తుకునేలా చేసేవారు.

అది ఒక రకంగా చాలా సంతోషకరమైన సమయం. ఎందుకంటే ఒక నెల పాటు మేము రోజంతా కలిసి ఉండేవాళ్ళం. హరి నాన్న మాతోపాటు ఒక నెల ఉన్నారు! అక్కడ నాకు వంటపని లేదు. ఇంటి పనులు లేవు. రోజంతా భర్తతో పడవ, అది నడిచే రీతి, దిక్కులు తెలుసుకునే విధం, సముద్రం, భూమి, గుజరాత్, ఆఫ్రికా, అక్కడి పరిస్థితి, వ్యాకరణం, లెక్కలు, చరిత్ర – ఇలా ఆయన అనేక విషయాల గురించి తెలిపారు. ఇంట్లో ఇలా మేము ఒకరి ఎదురుగా ఒకరు కూర్చుని మాట్లాడిందే లేదు. మాకు మాదంటూ సమయం దొరికేది రాత్రి మాత్రమే. అప్పుడు రాసలీల. అందుకే ఇప్పటికీ నాకు పడవ అంటే మేమిద్దరం ఎదురుగా కూర్చుని మాట్లాడిందే గుర్తుకు వస్తుంది.

పడవలో నెలలు నిండుతున్నాయి

రమారమి ఒక నెల పడవలో గడిచింది. అందులో ఉన్నప్పుడే క్రిస్మస్ పండుగ వచ్చింది. నాకయితే ఆ పండుగ గురించి ఏమీ తెలియదు. గాంధీ భాయి క్రీస్తు మహాత్మ్యం, ఆయన బోధనలు, క్రైస్తవ ధర్మం గురించి చెప్పారు. అంతే కాదు, పడవలోని వాళ్ళు ఏర్పాటు చేసిన క్రిస్మస్ భోజన కూటమిలో చాలా సేపు మాట్లాడారు. ఆయనేం మాట్లాడారో నాకయితే అప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన ఇంగ్లీషులో మాట్లాడారు. ఆయన మాటలు ముగిసాక కొందరు రోషం కనబరిచారు. అంతే నాకు జ్ఞాపకం.

1897, కొత్త సంవత్సరం అడుగిడింది. చివరికి పడవ దక్షిణాఫ్రికా తీరం చేరింది. కానీ బొంబాయి రేవులో ఏదో అంటు రోగం ఉన్న కారణంగా పడవను సముద్రంలోనే నిలిపివేశారు. ఒకట్రెండు రోజులు కాదు, 20 రోజులు! దార్లో వండుకోవడానికి మేము తెచ్చుకున్న వంటసామాగ్రి అయిపోతూ వచ్చింది. ఇంకో కంగారేమిటంటే నాకు నెలలు నిండుతూ వస్తున్నాయి!

అవును. అప్పుడు రామదాస్ కడుపులో ఉన్నాడు. చివరి రెండు నెలలు శ్రమ పడకుండా హాయిగా గడిపాను. నా భర్త గర్భవతికని వంటింటినుంది గింజలు, పప్పులు, ఎండు పళ్ళు తీసుకుని వచ్చేవారు. అది తిను,ఇది తిను, ఇంత తిను అనేవారు. అలా తిన్నందుకో లేదా ఊరకే కూర్చున్నందుకో కొంచెం ఒళ్ళు చేశాను. రవికలన్నీ బిగువుగా తయారయ్యాయి. బిడ్డ పెరిగి కాన్పు కష్టమవుతుందేమో అనే కంగారు ఒకటి. మూడవది, నాలుగవది తొందరగా అవుతాయని ఆడవాళ్ళు చెప్పుకొనేది వినున్నాను. బాలింతరాలికి, బిడ్డకు కావలసిన గుడ్డలు, సామానంతా తీసుకొచ్చాను. కానీ ఊళ్ళో కాకుండా నీళ్ళలో కాన్పు అయితే? నీళ్ళ పైన పుట్టిన బిడ్డ భవిషత్తు ఎలా ఉంటుందో అని భయమేసేది. “పిచ్చిదానా! నేల పైనయిందే నీళ్ళపైన కూడా అవుతుంది. అందరికీ అయ్యేదే మనకూ అవుతుంది. ఇక్కడ వైద్యులున్నారు. నేనున్నాను. భయపడకు. ఊరుకో” అని హరి నాన్న ఓదార్చేవారు.

“అందరికీ జరిగేదే మనకూ జరుగుతుంది” అన్నదాన్ని చివరిదాకా గాఢంగా నమ్మారు భాయి. కాబట్టే తమకొరకు, తన వాళ్ళకొరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకుండా ఉండగలిగారు ఆయన.

కాని, గాంధీ భాయి దక్షిణ ఆఫ్రికాలో లేనప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పడవల కొలది కూలీలను భారతదేశం నుండి తెస్తున్నారని పుకారు పుట్టించారు. కాబట్టి ఆ పడవలను రేవు చేరడానికి వదలకుండా సముద్రంలోనే ముంచాలని ఆలోచిస్తున్నారనీ, అందుకే మా పడవను నిలిపారని వార్త వచ్చింది. కానీ దీన్ని ఆయన నమ్మలేదు. ఆంగ్లేయులు అలాంటి స్థాయివారు కాదని అన్నారు. అది నిజమో, అబద్ధమో కానీ అంతా పుకారు వ్యాపించింది. చివరికి బ్రిటిష్ ప్రభుత్వమే నటాల్ పరిపాలకులకు బుద్ధి చెప్పి నన్నూ, పిల్లలనూ దించి పంపింది. అన్ని రోజుల తరువాత నేల చూశాము.

(సశేషం)

Exit mobile version