[శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించిన ‘నేను.. కస్తూర్‌బా ని’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]సా[/dropcap]ధారణంగా, తమ తమ రంగాలలో విజయం సాధించిన పురుషుల విషయంలో – వారికి వెన్నుదన్నుగా నిలిచిన స్త్రీల గురించి బయటి ప్రపంచానికి తెలిసేది చాలా తక్కువ. ఒకవేళ తెలిసినా అది సంక్షిప్తంగానే ఉంటుంది తప్ప సమగ్రంగా ఉండదు. అసలు ఎవరైనా ఏదైనా సాధించాలంటే, వారి కృషితో పాటుగా, వెనుక ఉండి మద్దతిచ్చే వారి తోడ్పాటూ కీలకం. బహుశా తమవారి విజయంలోనే తమ విజయాన్ని చూసుకుంటారు అటువంటివారు.
మనకు చాలా కాలం వరకూ – కస్తూర్‍బా అంటే – మహాత్ముని భార్యగానే తెలుసు. గాంధీజీ అడుగుజాడలలో నడిచి, ఆయన పోరాటాలకు, ప్రయోగాలకు సహకరించిన సహధర్మచారిణి అనే తెలుసు. తనని తాను ఆవిష్కరించుకునే క్రమంలో గాంధీజీ ఏర్పర్చుకున్న నియమాలు, ఆయన పట్టుదల వల్ల బా కొన్నిసార్లు నొచ్చుకున్నా, తన అభిప్రాయాలని, ఉద్దేశాలని వెల్లడించినా – అవి పెద్దగా నమోదు కాలేదనే భావించాలి.
గాంధీజీ – మోహన్ దాస్ కరమ్‍చంద్ నుంచి – మహాత్ముడిగా ఎదిగిన క్రమాన్ని, ఆ క్రమంలో సమాజంలోనూ, కుటుంబంలోనూ సంభవించిన పరిణామాలను కస్తూర్‌బా దృక్కోణం నుంచి చెప్పే ప్రయత్నాలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఆంగ్లంలోనూ, ఇతర భారతీయ భాషలలోనూ కస్తూర్‍బా మీద పలు రచనలు వెలువడ్డాయి.
గాంధీజీ-కస్తూర్‍బాల 150వ జయంతి సందర్భంగా – కర్నాటకకి చెందిన వైద్యులు, రచయిత్రి డా. ఎచ్. ఎస్. అనుపమా ‘నాను.. కస్తూర్’ అనే కన్నడ పుస్తకం రచించి కస్తూర్‍బా జీవితాన్ని ఆమె దృక్కోణం నుంచి ఆవిష్కరించారు. ఈ పుస్తకం నేపథ్యం గురించి వివరిస్తూ – పాఠశాలలో చదివేటప్పుడు గాంధీజీ ప్రభావం తనపై పడిందనీ, మరింత అధ్యయనం సాగిస్తున్న సమయంలో ఐతిహాసిక వ్యక్తులను వారి స్నేహితుల దృష్టితో చూడాలనే మహిళా దృష్టికోణపు అవసరాన్ని తాను, తన స్నేహితురాళ్ళు చర్చించేవారిమని, అలా యశోధర, సావిత్రిబాయి, చెన్ని, రమాబాయి, కస్తూర్‌బా మొదలైన ఆడవాళ్ళ జీవిత వివరాలు తమని ఎక్కువగా ఆకర్షించసాగాయని తెలిపారు. ఈ క్రమంలో కస్తూర్‍బా జీవన గాథని రచించాలని తలచారు. పోరుబందర్, సబర్మతి లలో విస్తృతంగా పర్యటించారు. బా కుటుంబపు ఇల్లు చూశారు. వారి కుటుంబపు వారసులతో మాట్లాడారు, ఆచార వ్యవహారాలను తెలుసుకున్నారు. సమాచారం సేకరించారు.
కస్తూర్‌బా గురించి తెలుసుకోడానికి డా. అనుపమా ఎన్నో పుస్తకాలు చదివారు. కస్తూర్‍బా అంతరంగాన్ని ఒడిసిపట్టుకోవాలనుకున్నారు.
“ముందుగా కస్తూర్ బా జీవన చరిత్రకని టిప్పణి రాసుకున్నాను. కానీ రాస్తూ పోయినట్టల్లా అది పూర్తి బాపు, భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామం యొక్క చరిత్రగా మారిపోయినట్టు అనిపించింది. అనక్షరస్తురాలిగా నిలిచిన, రచయిత కూడా కాని కస్తూర్‌బా గారి భావనా ప్రపంచానికి ప్రాతినిధ్యమే దొరకలేదనిపించింది. శ్రోతలే లేని బా గారి భావనలను వెతికే అవకాశం కూడా లేకపోతే, దీన్నిరాసిన ఉద్దేశమైనా ఏమిటి అనే ప్రశ్న సతాయించింది. చివరికి బా మాటల్లోనే ఆమె బ్రతుకును నిరూపించాలి అనిపించి అంతవరకూ రాసినదాన్ని పూర్తిగా చెరిపేశాను. వినే ఒక ఆప్త ప్రాణి ఎదుట తన జీవిత వివరాలను విప్పి చెప్తూ పోయిన పెద్దావిడ మాట్లాడే ధోరణిలో నా రచనను మార్చాను.” అన్నారు డా. అనుపమా.
ఓ ఆప్తురాలైన శ్రోత ముందు తన జీవితాన్ని మనస్ఫూర్తిగా బహిర్గతం చేయడం అనే విధానంలో రాయడం వల్ల కస్తూర్‍బా జీవితగాథ కాస్తా – ఆమె మనకి స్వయంగా చెబుతున్నట్లయి – ఆత్మకథగా మారింది.
ఈ పుస్తకానికి రాసిన ముందుమాట ‘ఒక చరిత్ర స్వరం’లో “గాంధీ, కస్తూర్‌బాలు తమ జీవితాలను ఎంతో మార్చుకున్నారు. మార్పు గురించిన ఆలోచన గాంధీదైతే, ఆచరణ ఇద్దరిదీ. ఐతే గాంధీ చెప్పిన మాటనల్లా వెంటనే విని ఆచరణలో పెట్టగలిగినంత విధేయురాలు కాదు కస్తూర్ బా. ప్రశ్నించడం, బైటి ప్రపంచం గురించి చెప్పటం, గాంధీ చెప్పినదంతా తాను చేయగలదా లేదా అని విచారించుకుని చేయగలిగినవే చేయటం, ఇది కస్తూర్ బా స్వభావం. కొన్ని పనులు తనకు ఇష్టం లేకున్నా చేసింది. చేయక తప్పని పరిస్థితుల ఒత్తిడిని గ్రహించింది. కస్తూర్‌బా జీవితంలో వచ్చిన పెద్ద మార్పు న్యాయాన్యాయాల వివేచన చేయగలగటం. అన్యాయాన్ని వీలైనంత ఎదిరించాలని నిర్ణయించుకోవటం.” అని వ్యాఖ్యానించారు ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా.
~
‘సుదామపురి కస్తూర్’ అనే అధ్యాయంలో కస్తూర్‍బా తల్లితండ్రుల గురించి, వాళ్ళ ఊరి గురించి, సంబంధీకుల గురించి, ఆచార వ్యవహారాల, ఇల్లు, పరిసరాల గురించి చెప్తారు. కస్తూర్ బాల్యం, ఆటపాటలు, పెద్దల అదుపాజ్ఞలు చెప్తారు. ఏదైనా ఒక ప్రాంతంలో చాలాకాలంగా వర్షాలు పడకపోతే కప్పలకి పెళ్ళి చేయించడం మనం వింటూంటాం. కానీ, కస్తూర్‌బా వాళ్ళ ఊర్లో – వానదేవుడి బొమ్మని చేసి ఎండలో ఉంచి చెమట పట్టించేవాళ్ళట, ఆ ఉక్కకు తట్టుకోలేక వర్షం కురిపిస్తాడని భావించేవారట. ఇలాంటివి మరికొన్ని చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
‘పెళ్ళి ఆట’ అనే అధ్యాయంలో ఏడేళ్ళ వయసులో కస్తూర్‌కీ, మోహన్‍దాస్‍కీ నిశ్చితార్థమవడం గురించి, కస్తూర్ అత్తమామల గురించి, అత్తగారింటి పద్ధతుల గురించి, ఆడపిల్లల పెంపకం గురించి, పదమూడేళ్ళ వయసులో కస్తూర్‌కీ, మోహన్‍దాస్‍కీ పెళ్ళవడం గురించి వివరిస్తారు. తరతరాలు అలవడిపోయిన భావజాలం దృష్ట్యా కస్తూర్ పై మోహన్‌దాస్ ఆంక్షలు విధిస్తే, ఆమె ఎదుర్కునేది. ఒకసారి కస్తూర్ – భర్తకి చెప్పకుండా, అత్తగారితో గుడికి వెళ్ళారట. అప్పుడు మోక (గాంధీజీని కస్తూర్ మొదట్లో పిలిచిన పిలుపు) కోప్పడితే, “నువ్వు పెద్దవాడివా? మీ అమ్మ పెద్దవారా? ఆమెతో వెళ్ళడానికి ఆమె కొడుకు అనుమతి తీసుకోవాలా?” అని మొహం తిప్పుకుని అడిగేసరికి, ఆయన మెత్తబడ్డారట. తండ్రి ఆరోగ్యం క్షీణిస్తే మోక ఆయనకి చేసిన సేవలను ఈ అధ్యాయంలో చెప్పారు.
‘మోక గాంధి హరి తండ్రి అయింది’ అనే అధ్యాయంలో – పోరుబందర్ సంస్థానంలో సంభవించిన మార్పులు, రాణా అధికారాలను తగ్గించి సంస్థానాన్ని ‘class 3’ సంస్థానంగా ఆంగ్లేయులు మార్చడం; మోక తండ్రికి దివాన్ పదవి పోవడం, కుటుంబం రాజ్‍కోట్‍కు తరలి వెళ్ళడం గురించి చెప్తారు. అప్పటికే రెండుసార్లు గర్భం పోవడం; మూడోసారి తొలి బిడ్డ హరిలాల్ జన్మించడం, బారిస్టర్ కోర్సు చదవడానికి మోక లండన్ బయలదేరడం, మద్యం – మగువలకూ దూరంగా ఉంటానని తల్లికి మాట ఇవ్వడం తదితర అంశాలు చెప్తారు. సముద్రం దాటి విదేశాలకు వెళ్తున్న మోకని సాటివారంతా బహిష్కరించటం; మోక – మోక భాయ్‍గా మారడం, కస్తూర్‍కు రాసిన ఉత్తరాల గురించి చెప్తారు. బారిస్టర్‍గా తిరిగి వచ్చిన మోక భాయ్‍ని సాటివారు ‘శుద్ధి’ చేశాకా, భార్యాబిడ్డలని కలుస్తారు.
‘సముద్రాలకావలి కల’ అనే అధ్యాయంలో బొంబాయిలో లాయర్‍గా ప్రాక్టీసు పెట్టడం, పెద్దగా ఆదాయం లేకపోవడం, చేసిన అప్పులు తీర్చలేక మరిన్ని అప్పులలో కూరుకుపోవడం, బొంబాయిలో ప్రాక్టీసు వదిలేసి తిరిగి రాజ్‍కోట్ చేరుకోవటం గురించి చెప్తారు. ఒక సంవత్సరం పాటు దక్షిణాఫ్రికాలో లాయర్‍గా పనిచేసే అవకాశం దొరికినప్పుడు – మోక భాయ్ అక్కడికి వెళ్ళడం; కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించడం చెప్తారు. భారతదేశానికి తిరిగి వచ్చేద్దామని అనుకున్న సమయంలో నటాల్ ఎన్నికలలో భారతీయలకు ఓటు హక్కు ఇవ్వరాదన్న చట్టం వస్తున్నట్టు వార్త తెలియడం, స్థానిక భారతీయుల పక్షాన న్యాయపోరాటం చేయడానికి మరి కొన్నాళ్ళు దక్షిణాఫ్రికాలోనే ఉండాలని నిర్ణయించుకోవడం గురించి, పోరాటం గురించి ఈ అధ్యాయంలో చదవవచ్చు.
ఇక్కడి నుంచి మోక భాయ్‍లో వ్యక్తిగతంగా వచ్చిన మార్పులను, దక్షిణాఫ్రికాలో భారతీయుల పట్ల తెల్లవారి దృక్పథంలో వచ్చిన మార్పులను, దక్షిణాఫ్రికాలో సుదీర్ఘ పోరాటం తరువాత భారతదేశం తిరిగి వచ్చి స్వాతంత్రం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొనడం, క్రమంగా స్వాతంత్యోద్యమ నేతగా ఎదగడం వంటివి ఈ పుస్తకంలోని మిగతా అధ్యాయాలు చెప్తాయి. అయితే మార్పు మోక భాయ్ లోనే కాదు తనలోనూ కలిగిందని కస్తూర్ చెప్పిన తీరు పాఠకులని ఆకర్షిస్తుంది. “చుట్టూతా ఉన్న కవచాలను వదులు చేస్తూ ఒక్కొక్కటిగా విడిపించుకోవడానికి సిద్ధమయ్యాను. అందుకే హిందూస్థాన్ నా జన్మభూమి అయితే, దక్షిణ ఆఫ్రికా కర్మభూమి, యోగభూమి అనవచ్చు” అని కస్తూర్ అంటారు.
దక్షిణాఫ్రికాలో మోక భాయ్ చేసిన ప్రయోగాలు, ఆచరించి చూపిన నిరాడంబరత, ఆశ్రమ జీవితం, కుటుంబ జీవనం కన్నా సంఘ జీవనానికి ప్రాధాన్యం ఇవ్వడం తదితర అంశాల్లో కస్తూర్‍లో ఎన్నో ప్రశ్నలు తలెత్తేవి. “రోజులు గడిచేకొద్దీ, భాయి ఎందుకు గొప్పవాడో మనసుకు నాటుకోసాగింది. నాకు ఆయన అర్థమవుతున్నారే తప్ప ఆయనలా మారడం ఎంత కష్టమో అర్థమవసాగింది.” అంటారు. “సత్యాగ్రహం చేస్తూనే నేను కూడా చాల మారాను.” అంటూ, తనలో సంభవించిన మార్పులను చెప్పారు కస్తూర్.
“నేను మారింది ఇలాగే. వింటూ, నిరాకరిస్తూ, విన్నది చెప్పేటప్పుడు లోపలికి దించుకుంటూ..” అంటారు కస్తూర్ ‘భుజానికి భుజాన్నిచ్చినవారు’ అనే అధ్యాయంలో. 21 సంవత్సరాల తరువాత భాయి, 15 సంవత్సరాల తరువాత తాను హిందూస్తాన్ కు తిరిగివచ్చిన సందర్భం గురించి చెబుతూ “రొట్టెలు ఒత్తే కర్రను తప్ప ఇతర కర్రను చూడని నేను మనుషులను కొట్టే లాఠీల రుచి చూశాను. ఇంటి నాలుగు గోడల మధ్య బందీగా ఉన్న నేను సముద్రాన్ని దాటి వెళ్ళి ఇతర దేశం జైలు కూడా చూసొచ్చాను. ఉద్యమం, పోరాటం అనే పదాలే చెవి పైన పడని ఒక గృహిణి సత్యాగ్రహిగా మారాను. పాఠశాలకే వెళ్ళని నేను అక్షరాల్ని కూడబలుక్కుని వార్తా పత్రిక చదివేటంత, మా పత్రిక యొక్క గుజరాతీ అవతరణకు చెప్పి రాయించేటంత అక్షరస్తురాలనయ్యాను” అని చెప్తూ; “ఇది ఒక్కసారిగా అయిన మార్పు కాదు. పెరుగు కవ్వంతో చిలికగా వెన్నగా మారినట్లు. వెన్న వేడితో నెయ్యి అయినట్టు అయిన మార్పు” అంటారు. ఈ క్రమంలోనే భాయ్ కాస్తా బాపు అయ్యారని చెప్తారు.
సబర్మతీ ఆశ్రమం ప్రారంభించి, అక్కడ నివసించడం మొదలయ్యాకా, భార్యగా, తల్లిగా కస్తూర్‍లో తలెత్తిన సంఘర్షణలను హృద్యంగా వెల్లడించారు. నూలు వడకడం గురించి చెప్తూ “నూలు వడకడం నాకు అతి ఇష్టమైన పనిగా మారింది. నిజానికి రాట్నం తిప్పడం ఒక అద్భుతమైన పని. అదీ కూర్చున్న చోటనే కూర్చుని, మాట్లాడకుండా ఉండడాన్ని ఇష్టపడే నాలాంటివాళ్ళకు అతి ప్రియమైన పని అది.” అని కస్తూర్ అంటారు. “రాట్నంతో వడకడమంటే మనల్ని మనం చూసుకోవడం. ప్రశ్నా మనమై, జవాబూ మనమై మనల్ని మనం వెదుకుకోవడం. వడుకుతూ, వడుకుతూ నా ఎన్నో సమస్యలకు రాట్నమే జవాబు ఇచ్చింది. జడంగా ఉన్నవాటిని, జడులుగా ఉన్నవారినీ తిరిగేలా చేసే శక్తి ఆ చిన్న రాట్నానికి, పత్తికి, నూలుకు ఉంది.” అన్న వాక్యాలలోని లోతుని అర్థం చేసుకుంటే మనకి మనం అర్థమవుతాం.
పెద్ద కొడుకు హరిలాల్ పతనం గురించి చెప్తూ, తండ్రీ కొడుకుల మధ్య సాగిన ఉత్తరాల లోని అంశాలను ప్రస్తావిస్తారు కస్తూర్. ఒక ఉత్తరంలో ‘నా సామర్థ్యాన్ని నేనే అంచనా వేసుకోవడానికి మీరు వదల్లేదు, మీరే వేశారు’ అని హరి రాస్తే, తన తలిదండ్రుల దారి కాకుండా తనదే దారిని రూపొందించుకోవడానికి అతడికి అవకాశమే లేకపోయిందని కస్తూర్ బాధపడతారు. ‘ఏ ప్రార్థన కాని, ఏ పూజా ధ్యానాలు కాని సరిదిద్దలేనంతగా మన పిల్లలే దారి తప్పినప్పుడు ఇల్లు స్మశానమవుతుంది. బాపులా పనుల్లో పడి మునిగి పోయి మరచిపోలేనంతగా నా మనసు కల్లోలమైంద’ని అంటారు.
రాజాజీ గారు కస్తూర్‍ని, బాపుని – ఓ సున్నితమైన విషయంలో ఎలా ఆదుకున్నారో ఈ పుస్తకం చెబుతుంది. “ఇష్టదైవమైన శ్రీరాముడు రాజాజిగారి రూపంలో వచ్చి కాపాడాడు” అంటార్ కస్తూర్. అలాగే మరో సందర్భంలో రాజాజీ బాపుకిచ్చిన సలహా ఎంత మేలు చేసిందో చెప్తారు.
పిల్లల విషయంలో తండ్రిగా గాంధీజీ విజయవంతం కాలేదన్న భావనతో “అందరి బాపు అయ్యారేమో కాని, ఈయన తమ పిల్లలకు బాపు కాలేకపోయారు” అంటారు.
కస్తూర్‌బా మృత్యుముఖంలోకి జారిపోవడాన్ని డా. అనుపమా రాసిన శైలి పాఠకులకి ఉద్విగ్నత కలిగిస్తుంది. మన ఆత్మీయులెవరో మనల్ని వీడి శాశ్వతంగా దూరమైపోతున్న భావం కలుగుతుంది. కళ్ళు చెమరుస్తాయి.
~
తన జీవితాన్ని తన దృక్పథం నుంచి కస్తూర్‍బా చెప్పినట్టుగా పాఠకులకు చేరవేశారు డా అనుపమా. కన్నడంలో రాసిన ఈ జీవితగాథని తెలుగులోకి చక్కగా అనువదించి కస్తూర్‍బా అంతరంగాన్ని తెలుగు పాఠకుల కళ్ళ ముందు పరిచారు శ్రీ చందకచర్ల రమేశ బాబు.
తొలుత సంచిక వెబ్ పత్రికలో ‘నేను.. కస్తూర్‌ని’ పేరిట ధారావాహికంగా ప్రచురితమై పాఠకులను ఆకట్టుకున్న రచన ఇది.
***
కన్నడం: డా. ఎచ్. ఎస్. అనుపమ, తెలుగు: చందకచర్ల రమేశ బాబు
ప్రచురణ: ఛాయ రిసోర్సెస్ సెంటర్, హైదరాబాద్.
పేజీలు: 222
వెల: ₹ 250/-
ప్రతులకు:
ఛాయ రిసోర్సెస్ సెంటర్, హైదరాబాద్. 9848023384
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 9000413413
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/NENU-KASTURBAA-NI-Dr-ANUPAMA/dp/B0CR1MFJM8
~
‘నేను.. కస్తూర్‌బా ని’ పుస్తకం తెలుగు సేత శ్రీ చందకచర్ల రమేశ బాబు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-chandakacherla-ramesh-babu/