[మణి గారు రాసిన ‘నేను’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ని[/dropcap]ద్ర లోంచి మెలకువ వచ్చిన నేను చాలా సేపు అర్థం కాని అయోమయంలో పడిపోయాను. నేనెవరో ఎక్కడ వున్నానో అర్థం కాలేదు.
నేనెవరు? ఎక్కడ వున్నాను? అని ప్రశ్నించుకుంటూ. అన్ని వైపులా చూస్తున్నాను, అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ.
మళ్ళీ నిద్ర పోవడానికి ప్రయత్నించాను. ఒక నిద్ర తీసి లేస్తే, ఏదయినా గుర్తు వస్తుందేమో అని. ఈ అయోమయ అవస్థ నుంచి బయట పడతానేమో అని.
కానీ ఈ నేను ఎవరో గాని నన్ను కుదురుగా వుండనివ్వలేదు. అసహనంగా లేచి అటూ ఇటూ తిరిగాను.
అద్దం ముందు నిల్చుని “ఇతనేనా నేను?” అడిగాను అద్దాన్ని, అద్దంలో కనిపించే వ్యక్తిని చూసి. “నువ్వేనా నేను?” అద్దంలో కనిపించే అతనినీ అడిగాను.
“ఎవరు ఎవరో నాకు ఏమి తెలుస్తుంది? నువ్వు అడిగే నేను ఎవరో! నువ్వు ఎవరో!, నాకేమి తెలుస్తుంది.”
“నేను ఎవరో గుర్తుకు రావటం లేదు. నీలో కనిపించే ఇతనేనా నేను?” నేను బేలగా ప్రశ్నించాను.
జాలిగా నవ్వింది అద్దం.
“ఇలా కొంతమంది నన్ను అప్పుడప్పుడు అడుగుతూంటారు.”
“నువ్వేమి చెప్పావు?”
“చెప్పడానికి నాకు ఏమి తెలుసు అని!”
“కనిపించే ఈ రూపం నాదేనా?”
“ఎవరిది ఏ రూపమో నాకు మాత్రం ఏమి తెలుసు? నాలాంటి జడుల నుంచి ఏమి సమాధానాలు వస్తాయని అనుకుంటావు?” విసుగ్గా అంది.
“నేను జడునిని కానా?” అయోమయంగా అన్నా.
“నిన్ను చూస్తే నాకు జాలి వేస్తోంది. అందుకే, నాకు తెలిసిన ఒక విషయం చెప్తా విను. ఇలా, ‘నేను ఎవరు?’ అని ప్రశ్న వస్తే, అడవికి వెళ్ళి వెతుక్కుంటారని విన్నాను. నీకు నీ నేను గురించిన సమాచారం అక్కడ ఏమయినా దొరుకుతుందేమో!”
“అవునా!, అడవిలో నేను ఎవరో తెలుస్తుందా! అవుతే అందరి నేను ల గురించిన విషయాలు అక్కడ వుంటే, నా నేను గురించిన సమాచారం ఏదో నాకు తెలుస్తుందా? అది నా నేనే, ఇంకా ఎవరి నేనో? ఎలా గుర్తు పట్టడం?”
ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్న నన్ను విసుగ్గా చూసి, ఏమనుకుందో ఏమిటో పగిలి ముక్కలయింది.
‘అంత కోపం పనికిరాదు’ అని – ఆ పగిలిన ముక్కలలో కనిపిస్తున్న అన్ని రూపాలనీ చూస్తూ అనుకున్నా.
‘నేను’ గురించి, ఏమీ తెలియకుండా ఏమి చేయగలను. అడవి లోకి వెళ్ళి వెతికి, ‘నేను’ ని పట్టుకుంటే కానీ, నాకు సాంత్వన లభించదు. అప్పుడు మాత్రమే, ఏ పని చేయడమైనా నాకు తేలిక అవుతుందనుకుని, అలోచిస్తూ అడవి దారి పట్టా.
చాలా దూరం నడిచాను. పొదలు, మొక్కలు, చెట్లు, కొండలు, రాళ్ళు మధ్యలోంచి దారిని వెతుక్కుంటూ చాలా దూరం నడిచాను. అలసి, అక్కడే వున్న ఒక బండరాయి మీద చతిగిల పడ్డాను. ఆకలిగా వుంది. దాహం కూడా వేయసాగింది. ఇంతలో ఒక వ్యక్తి అటు వైపు వెళ్తూ కనపడ్డాడు. పెరిగిన గెడ్డం, జుట్టు. వేగంగా వెళ్తున్న అతని, వెనుక పరిగెట్టాను, “స్వామీ!” అంటూ.
నా పిలుపుకి వెనకి తిరిగి నా వైపుకి ఆశ్చర్యంగా ‘ఏమిటి’, అన్నట్లు చూసాడు.
“స్వామీ! ‘నేను’ కోసం వెతుకుతున్నా అడవిలో. అడవిలో, వుంటుందట. ఎక్కడ వుంటుందో మీకు తెలుసా? చెప్పగలరా?” ఆర్తిగా అడిగాను.
“చాలా ఏళ్ళ నుంచి నా ‘నేను’ కోసం నేనూ వెతుకుతున్నాను. నాకూ కనపడలేదు.” గట్టిగా నవ్వి ముందుకు వెళ్ళిపోయాడు.
“అందరి నేనులు అక్కడ వుంటే నా నేనుని నేను ఎలా గుర్తు పట్టాలి స్వామీ?” అతని వెనుకే పరిగెట్టి అడిగాను.
వెనుకకి తిరగకుండా, వినిపించనట్లే వెళ్ళిపోయాడు.
ఇంకా కాస్త దూరం వెళ్ళాక, ఒక సెలయేరు, కనపడింది. అలసిపోయిన నేను, కాస్త నీళ్ళు తాగి అక్కడే నేల మీద నడుం వాల్చాను.
ఆకాశాన్ని, రాత్రి చీకట్లు కమ్మడం మొదలు పెట్టింది, పగటి రంగులన్నీ వెళ్ళగొడుతోంది “చాల్లే ఆర్భాట” అంటూ.
నాకు ఇప్పుడు కొత్త దిగులు పట్టుకుంది. ఒక వేళ ‘నేను’లు వున్న చోటుకి నేను చేరుకున్నా, నా ‘నేను’ ని ఎలా గుర్తు పట్టగలను?
చాలా దిగులుగా అనిపించింది. ‘నేను’ తెలియకుండా నా జీవితాన్ని నేను సాగించగలనా, అనే ఆలోచన వచ్చేసరికి.
శరీరం అలసి పోయినా కాస్త కూడా కునుకు రాలేదు కళ్ళ మీదకి.
నల్లని ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు పక్కన ప్రవహిస్తున్న సెలయేరు, ఒడ్డున వున్న చెట్టు చేమ, పురుగు పుట్ర, రాళ్ళు రప్పలు, నలువైపులా చూస్తున్నాను.
అకస్మాత్తుగా, వీటికి కూడా, ‘నేను’ వుంటుందా? అనే ప్రశ్న తల ఎత్తింది.
గట్టిగా అరిచాను. “మీ ‘నేను’ ఎక్కడ? నా ‘నేను’ ఎక్కడో మీకు తెలుసా?” అంటూ.
నా గొంతు ఆ అడవి లో మారు మోగింది. గాలికి కోపం వచ్చింది కాబోలు. కాస్సేపు ఈళలు వేసి హడావిడి చేసింది. చెట్ల ఆకులు కొమ్మలు, గల గల శబ్దం చేసాయి.
“నా ‘నేను’ నీకు తెలుసా?” అడిగాను ఈసారి గోముగా, నెమ్మదిగా అడిగాను అకాశంలోకి చూస్తూ.
“నీకు తెలుసా?” పక్కనే వున్న సెలయేరుని అడిగాను.
“నీకు?” అంటూ నేను పడుక్కున్న నేలని, అడిగాను. నెమ్మదిగా నిమురుతూ.
ఒక్కసారి అంతా నిశ్శబ్దమయింది.
“‘నేను’ అనే మాట నేను ఎప్పుడూ వినలేదు” గంభీరంగా అంది ఆకాశం.
“అవును. అవును.” అంటూ తలలు ఊపేయి చందమామ, నక్షత్రాలు.
“నేనూ నూ!” అంది సెలయేరు, వంకలు పోతూ
“నేనూ వినలేదు!” గుసగుసలాడింది నేల.
“నేను అంటే ఏమిటి?” అక్కడ వున్న చెట్టు చేమ, రాయి రప్పా, అన్నీ కుతూహలంగా అడగసాగాయి.
“‘నేను’ వెతుక్కుంటూనే, ఇలా వచ్చాను” అన్నాను నేను నీరసంగా.
“నేను అంటే ఏమిటి?” చిన్న గొంతుని పెద్దది చేసుకొని కీచు గొంతుతో అడిగింది, పక్కనే వున్న గడ్డి మొక్క.
“తెలియదు..” నాలో నేనే గొణుక్కుంటూ, కళ్ళు మూసుకున్నా, బరువెక్కిన మనసుతో.
అడవంతా గుసగుసలు మొదలయ్యాయి.
“నీకు తెలుసా ‘నేను’ అంటే. నీకు తెలుసా?”
“నేను అంటే ఎవరు?” అడవి అంతా మారు మోగుతోంది ఆ ప్రశ్న.
ఓ బండరాయి గత్తిగా గొంతు విప్పి అడిగింది “ఇక్కడకి వచ్చి ఎందుకు అడుగుతున్నావు? మాకెవ్వరికీ, ఈ ‘నేను’ తెలియదు”.
“ఇతను మనని ఎందుకు అడుగుతున్నాడు? ఎక్కడనుంచి వచ్చాడు?” ఇంకో బండరాయి అందరితో అంది. దాంతో, “మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు?” అంతా ఒక్కుమ్మడిగా అడిగారు.
“‘నేను’ ని వెతుక్కుంటూ అందరూ అడవి లోకి వెళ్తారు అని చెప్పింది అద్దం” అన్నా.
“దానినే మరింత వివరాలు, ఎక్కడ? ఏమిటి? అని అడగక పోయావా” అరిందాలా అడిగింది, ఒక చిన్న మొక్క.
“అవును! అవును!” అంటూ అందరూ గొంతు కలిపారు.
“కాని, అది చిరాకు పడి ముక్కలయింది.” అన్నాను నేను, నిస్సహాయంగా.
ఇంతలో, మర్రి చెట్టు ఒకటి, అందరితో గుసగుస లాడింది – “అతనితో మాట్లాడకండి. అందరిని, కలుషితం చేస్తాడు” అంటూ.
చిన్న మొక్క ఒకటి “పాపం ఒక్కడే ఉన్నాడు, జాలి వేస్తోంది” అంది.
“చాల్లే సంబడం. నిమిషంలో నిన్ను నేల రాసినా రాస్తాడు” అంది ఒక బండరాయి.
“అవును. అద్దం పగిలిపోయిందని చెప్పాడు కదా. ఊరికే పగలదు, ఏదో చేసే వుంటాడు.”
అందరు కాస్త భయ పడ్డారు. ఇంక మాట్లాడకుండా వుండిపోయారు.
ఈ సంభాషణలో పాల్గొడానికి అన్నట్లు, అమ్మ ఒడిలోంచి కడుపునిండి కొంగు పక్కకి జరిపి, బయట ఒకసారి చూసి బయట జరిగే విషయలు ఆసక్తికరంగా వుంటే, ఒక్క ఉదుటన బయట పడే చిన్న పిల్లవాడిలా, భానుడు ఎర్ర తెరలు పక్కకి జరిపి, తొందరగా బయటకి వచ్చాడు. కానీ అంతా సద్దుమణగడంతో, తనదయిన సందడి తను మొదలుపెట్టాడు.
సూర్య కిరణాల సందడికి ప్రకృతి ఒళ్ళు విరుచుకొని లేచింది. ఇంక అడవంతా, పక్షుల రెక్కల శబ్దాలు, కుహు కుహు శబ్దాలు, జంతువుల పరుగులు,అరుపులు, దైనందిన కార్యక్రమాలకి సంబంధించిన హడావిడితో, నిండిపోయింది.
అంతా ఎవరి పనుల్లో. వాళ్ళు మునిగిపోయారు.
నేను పక్కన వున్న జలపాతంలో కాస్త నీళ్ళు తాగి, ‘నేను’ కోసం, అన్వేషణని మళ్ళీ మొదలు పెట్టాను. దారిలో కనపడ్డ పళ్ళని కోసి కడుపు నింపుకున్నాను. కడుపు నిండాక కాస్త శక్తి వచ్చినట్లు అనిపించింది..
“పళ్ళు కోసుకున్నాడా! కోసుకోడానికి అనుమతీ తీసుకోలేదు. కోసుకున్నాక కృతజ్ఞతలు చెప్పలేదు. పెద్ద మర్రి చెప్పినది నిజమే. కాస్త కూడా మర్యాద లేదు. మనుషులనీ నమ్మకూడదు” అంది అడవి జామ.
“అవును. అవును.” అంటూ తలలు ఊపేయి, అన్నీ.
“అతనికీ తినడానికి ఏదీ కనపడనీకండి.” ఆజ్ఞ జారీ చేసింది జమ్మి చెట్టు.
“అన్నిటికీ, తామే యజమానులం. తమదే పెత్తనం అనుకుంటారు.” ఇంకొ చిన్న కొండ చిరాకు పడింది
నేను నా ధ్యాసలో ఉండి అన్నీ గమనించలేదు.
అలా నడుచుకుంటూ వెళ్తున్న నాకు ఒక చెట్టుకింద ఇంకో వ్యక్తి, పెరిగిన గెడ్డం, జుట్టుతో కనిపించాడు. అతను కళ్ళు మూసుకొని వున్నాడు. తపస్సు చేసుకుంటున్నాడేమో. మునిలా వున్నాడు.
అతని దగ్గర కూర్చున్నాను. కళ్ళు తెరిస్తే అతను ఏదయినా దారి చూపిస్తాడేమో అని.
రోజులు గడిచిపోతున్నాయి కానీ అతను కళ్ళు తెరవలేదు.
నాకు అకలిదప్పులు ఎక్కువ అవుతున్నాయి. చుట్టూ ఎక్కడ చూసినా ఒక్క పండు కనపడలేదు. ఎక్కడా వాగూ కనపడలేదు.
రోజులు గడుస్తుంటే, తిరగడానికి కూడా ఓపిక లేక ఆ ముని దగ్గరే కూలబడిపోయాను.
చాలా రోజులు, తిండీ నీరు లేకపోవడంతో, శోష వచ్చి పడిపోయాను.
కళ్ళు తెరిచేసరికి, చిరునవ్వుతో, ముని ఎదురుగా వున్నాడు. నన్ను కూర్చోపెట్టి నీళ్ళు ఇచ్చాడు. పళ్ళు తినిపించాడు. కొంతసేపటికి శక్తి వచ్చింది నాకు.
“ఇప్పుడు ఎలా వుంది?” అన్నాడు ఆయన చిరునవ్వుతో.
“పర్వలేదు స్వామీ!” అన్నాను.
రెండు రోజులకి కోలుకున్నాను.
కొంచెం కోలుకున్నాక ఆయనని అడిగాను “నేను ఎంత తిరిగినా నీళ్ళు, పళ్ళు ఏవీ కనపడలేదు.”
ఆయన నవ్వాడు.
“ప్రేమతో అర్థిస్తే నీకు ఇక్కడ దొరకనిదే వుండదు” అన్నాడు ఆయన.
అర్థం కానట్లు చూసా.
“నువ్వూ. పళ్ళు కోసుకుని తిన్నావు, నీళ్ళు తాగావు, అనుమతీ కోరకుండానే. కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. అందుకే నీకు ఇంక కనపడలేదు.”
మళ్ళీ అన్నాడు, “ప్రకృతి గొప్ప తల్లి. ప్రేమగా అడగాలి కానీ అధికారంగా తీసుకోడం ఆమెకి నచ్చదు.”
నేను అవమానంతో సిగ్గుపడి, మౌనంగా వున్నాను, అవును అనుకుంటూ.
“ఇంతకి నువ్వు ఎవరు? ఇక్కడకి ఎందుకు వచ్చావు”
“నేను ఎవరో మర్చి పోయాను. అందుకే వెతుక్కుంటూ వచ్చాను.”
ఆయన బిగ్గరగా నవ్వాడు.
“మర్చిపోతే నష్టం ఏముంది? నేనంటే, నీ అర్థం?నీ పేరా? నీ రూపమా? నీ ఆలోచనలా? నీ అనుభూతులా? మర్చిపోతే కొత్తగా మొదలుపెడ్తావు. అంతేగా. నీ పాత నేను ని మర్చిపోయినా, కొత్త నేను ని మొదలు పెట్టినా ఏమి తేడా వుంటుందని?
నా నేను కి, నీ నేను కీ మాత్రం తేడా ఏముంది? నీ నేను, నేను అయివుండవచ్చు. నా నేను నువ్వూ అయి వుండవచ్చు.
నేను అనేదానికి ఎందుకంత ప్రాముఖ్యత? నేను వుండడం అంత అవసరమా??
ఒక్కసారి నేను లేని ప్రపంచాన్ని ఊహించుకో. కష్టమా??
నేను ని, నీకే, పరిమితి చేసుకోకుండా అంతా నేనే అనుకుంటే, మనిషిలో హింస మాయమవదా!
చెట్టునీ నేనే అనుకుంటే గట్టిగా ముట్టుకోడానికి కూడా బాధపడ్తావు. నీరు నేనే అనుకుంటే ఎంత ప్రేమగా సృజిస్తావు!
నేల నేనే అనుకుంటే గట్టిగా నేలమీద అడుగు కూడా వెయ్యలేవు.”
నెమ్మదిగా ఆగి ఆగి మటాడుతున్నాడు ఆయన. మాటలు పాటల్లా వున్నాయి. చెవులకి ఇంపుగా వుంది, ఆయన మాట్లాడుతుంటే.
ఆయన మాటలు వింటున్నాను. కానీ నాకు అర్థం అవుతోందో లేదో కూడా తెలియటంలేదు. ఇక పాట వింటున్నట్లే, వుంది.
నా నేను కోసం నేను వెతుకుతూ వుంటే, విశ్వమంతా నేనే అంటున్నాడా ఈయన. అందుకేనా అద్దం విరిగి ముక్కలు అయింది! అది చెప్పడానికా?
“ఇంత పెద్ద విశ్వాన్ని, నేను లో బంధించే బదులు, నీ నేను ని విశ్వమంతా వ్యాపించలేవా?” నవ్వాడు ఆయన.
“దేవుడు, నేను ఒక్కడినే, అనేకం ఎందుకు కాకూడదు? అనుకొని తపస్సు చేసాడు. తపస్సు చేసి, సృష్టి మొదలు పెట్టాడు. ఎన్నెన్నో సృష్టించి అన్నిటిలోకి ప్రవేశించాడు. వ్యక్తా అవ్యక్తంగా, వుండీ లేనట్లు, నిర్వచించ గలిగేటట్లు నిర్వచించ లేనట్లు, జ్ఞానం అజ్ఞానముగా, సత్య అసత్యాలుగా అన్నిటిలోనూ అంతటా వ్యాపించాడు. ఇది ఉపనిషద్ వాక్యం..”
కాస్సేపు ఆగి మళ్ళీ అన్నాడు.
“అందరిలోనూ దేవుడిని చూడగలిగితే చాలు, అన్ని సమస్యలూ పరిష్కారము అవుతాయి. నీ నేను సమస్య కూడా. అందరిలోనూ నేను గా వ్యాపించి వున్నది ఆ దేవుడే..”
***
“లేవండి.. లేవండి..” నన్ను గట్టిగా తట్టి లేపుతోంది నా భార్య సుజాత.
“పిల్లల స్కూల్ కి, మీ ఆఫీసుకీ, టైం అవుతోంది.”
ఉలిక్కిపడి లేచాను. కళ్ళు తెరిచి చూసాను. ఎదురుగా సుజాత.
ఇదంతా కలా!
ఏమిటో ఈ కల! చాలా డ్రమటిక్‌గా వుంది అనుకుంటూ లేచి కూర్చున్నాను.
నేను కళ్ళు తెరవడం చూసి, వెంటనే వంటింట్లోకి పరిగెట్టింది, “కాఫీ తీసుకు వస్తున్నా” అంటూ.
కాఫీ చేతిలో పెట్టి మళ్ళీ పరుగు పెట్టింది సుజాత.
పొద్దున్న సుజాతకి ఎన్ని పనులు వుంటాయో ఎంత బిజీగా వుంటుందో నాకు తెలుసు. అందుకే ఏమీ మాట్లాడకుండా కాఫీ తాగడం మొదలుపెట్టాను, కల గురించి ఆలోచిస్తూ.
అన్ని పనులూ సుజాత ఒక్కర్తే చేసుకుంటుంది. ఏ రోజూ ఆమెకి ఏసాయం చేసిన పాపాన పోలేదు.
నా నేను ని నేను, పక్కకి పెట్టి, తనలో నేను ని చూస్తే తనకి ఎంత సాయం చేయొచ్చు!
ఆ ఆలోచన వచ్చినదే తడవు వంటింట్లోకి వెళ్ళాను, సుజాతకి సాయం చేయడానికి.
ఆ రోజు నా ప్రవర్తన నాకే ఆశ్చర్యం కలిగించేలా వుంది. ఇంక అందరి సంగతి వేరే చెప్పాల్సిన పని లేదు.
రాత్రి అంత సద్దుమణిగాక, మంచం మీద, పక్కనే నడుము వాలుస్తూ సుజాత అంది “ఏమిటి సంగతి? ఎప్పుడూ లేనిది, నాకు సాయం చేసారు! పిల్లలని విసుక్కోకుండా హోం వర్క్ చేయించారు. మీ ప్రవర్తన కొత్తగా వుంది.”
“నాకూ అలానే వుంది.” నవ్వుతూ అన్నాను. కాస్త ఆగి,
“నాకు కలలో ఒక ముని జ్ఞానోపదేశం చేసాడు” అన్నాను.
నవ్వింది, “ఊ!” అంటూ.
“నమ్మటం లేదు గదా” అంటూ సుజాత చేతిని నా చేతిలోకి తీసుకుని నెమ్మదిగా నిమురుతూ కల చెప్పాను.
“వినడానికి బాగానే వుంది. ఇలాంటి మాటల్లు చెప్పుకోడానికే. ఆచరించడానికి సాధ్యం కానివి.”
“నేను ఈ రోజు ఆచరించడానికే ప్రయత్నించా. నా ప్రవర్తన బాగుందన్నావుగా” నవ్వుతూ అన్నాను.
“కల మీకు వచ్చింది. మీకు జ్ఞానోపదేశం చేసింది. మీరు చెయ్యండి. మీ ప్రవర్తనతో, మేమూ మారుతామేమో!”
నా చేతిలోంచి తన చేయ్యిని వెనక్కి తీసుకొని ఇంక మాట్లాడడానికి ఏమీ లేనట్లు, దుప్పటి కప్పుకుని నిద్రకు ఉపక్రమించింది ‘ఇదంతా నాలుగు రోజుల ఆర్భాటం!’ అనుకుంటూ.
‘జీవితం, ఎక్కువ పనులతో, బిజీ అయ్యేసరికి చాలా యాంత్రికం అయిపోయింది. మాట్లాడడానికి కూడా టైం వుండడం లేదు. ఓపికా వుండటం లేదు.’ అనుకుంటూ నెమ్మదిగా నిట్టూర్చాను.
సుజాత చెప్పిందీ నిజమే. మార్పు, నేను నాతోనే కదా మొదలు పెట్టల్సింది.
కల గురించీ, నేను గురించీ, ఆలోచిస్తూ నేనూ నిద్రలోకి జారుకున్నాను, ‘కొత్త జీవితానికి నాంది పలకబోతున్నానా? ఏమో!’, అనుకుంటూ.