నేను – మా ఊరు

0
2

[dropcap]మా[/dropcap]తృభూమి, మాతృభాష ఎప్పటికీ వందనీయాలే ఎవరికైనా. మా ఊరు ప్రకాశం జిల్లాలోని వేటపాలెం. దీనికే ఒకప్పుడు ‘మృగయాపురి’ అనే పేరుండేది. మా ఇల్లు బస్టాండుకు నాలుగిళ్ళ దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు కొత్త బస్టాండు కూడా కట్టారనుకోండి. మా ఇంటి ముందే బస్సులు ఆపేస్తుంటారు చాలాసార్లు బస్టాండులో స్థలం లేకపోవటం వల్ల. బస్టాండు అంటే ఏమీ లేదు. ఒక పెద్ద చెట్టు ఉంటుంది దాని ఎదురుగా బస్సులు అపుతుంటారు. దానికో పక్కన బెల్లం జిలేబీ, పాకం కజ్జికాయలు అమ్ముతుంటారు. మేము చిన్నపుడు ఆ బెల్లం జిలేబీ కొని పెట్టమని మా నాన్నను అడుగుతుండేవాళ్లం.

మా ఇల్లు నాలుగు పోర్షన్లు ఉన్న పెద్ద ఇల్లు. ఇంటి ముందు రెండు షాపులు ఉంటాయి. ఇది దంతులు వేసి కట్టిన డాబా ఇల్లు. ఇది మా నాన్నగారు కట్టిన ఇల్లు కాదు. మా తాతగారు శ్రీ అంగలకుదిటి మల్లికార్జునాచారి కట్టిన ఇల్లు. ఇది 1925-1930 మధ్య ప్రాంతంలో కట్టిన ఇల్లు. మా ముత్తాతగారు వల్ల సొంతూరు ఇదే జిల్లాలోని తాళ్ళూరు అట. మా బంధువులందరూ అక్కడే ఉన్నారు. మా తాతగారిక్కూడా అక్కడ ఇల్లుంది. అక్కడ ‘అంగలకుదిటి వారి వీధి’ అని మా ఇంటి పేరుతో ఒక వీధి ఉన్నది. ఆ వీధిలోనే మా తాతల ఇళ్ళన్నీ ఉన్నాయి. మా తాతగారు వల్ల అమ్మమ్మగారి ఊరైన వేటపాలెంకు వల్ల అమ్మతో వచ్చేశారు. ఇప్పుడు నేను చెప్పే ఇల్లు మా తాతగారి అమ్మమ్మదే. ఆవిడ పేరు చిలకమ్మ అట. ఈ నాలుగు పోర్షన్ల ఇల్లు కట్టినప్పుడు మూడు వేల రూపాయల ఖర్చు అయిందట. ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోవటం వల్ల మా తాతగారు తన కొడుకులిద్దర్ని చదువు మానిపించేసి తన వ్యాపారంలో తోడుగా ఉంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇల్లు పూర్తి శిధిలావస్థకు చేరటంతో ఈ మధ్యనే దీన్ని పూర్తిగా నేలమట్టం చేశాము. జేసీబీ వచ్చి ఆ ఇల్లును పడేస్తుంటే నాకు చాలా బాధేసింది. కానీ ఏం చేస్తాం.

వేటపాలెం అనగానే గుర్తొచ్చేది ‘సారస్వత నికేతనం’. ఈ సారస్వత నికేతనానికి 1929లో గాంధీజీ పునాది వేశారు. 1918 నుంచి ప్రైవేటు నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా నడిపిస్తున్నారు. కానీ ఇప్పుడున్న బిల్డింగును ప్రారంభం చేసింది సేట్ జమానాలాల్ బజాజ్ మరియు ప్రకాశం పంతులుగారు. భారతదేశంలోని ప్రాచీన గ్రంథాలయాల్లో ఇది ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని రెండవ పెద్ద గ్రంథాలయంగా పేరు గాంచినది. 1935లో భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ దీన్ని సందర్శించారు. ఇప్పటికీ గాంధీజీగారి విరిగిన కర్ర ఈ లైబ్రరీలో ఉన్నది. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఈ లైబ్రరీలో కస్తూరి బా మహిళా మండలి పెట్టి గ్రామంలోని స్త్రీలందరకూ విద్య, కుట్లు, హిందీ, సంస్కృతం వంటివి నేర్పించేవారు. మా అమ్మకు 10 సంవత్సరాల వయసులోనే పెళ్ళయి వేటపాలెంకు అత్తగారింటికి వచ్చింది. మానాన్న పెళ్లి తర్వాత మా అమ్మను చదువుకొమ్మని ప్రోత్సహించారు. అలా ఆమె థర్డ్ ఫార్మ్ వరకూ చదివింది. సంస్కృతం, హిందీ భాషలు నేర్చుకుంది.

నేను చీరాలలోని సాల్మన్ హాస్పిటల్‌లో పుట్టాను. పెరిగిందీ, చదువుకుంది చీరాలలోనే అయినప్పటికి మాకున్న సొంత ఇల్లు ఇదే. చీరాలలో స్కూలుకు దగ్గరగా అద్దెకుండేవాళ్ళం. మేము అద్దె ఇళ్ళలో తిరుగుతుండగా మా నాయనమ్మ మాత్రం మా సొంత ఇంట్లోనే ఉండేది. ఆమె కోసం వేటపాలెం వస్తూపోతూ ఉండేవాళ్లం. బస్సులు ఇంటి ముందే ఆగటం, ఎక్కటం చాలా బాగుండేది మాకు. మా తమ్ముడు అయితే ఆదివారం వచ్చిందంటే చాలు మా నాయనమ్మ దగ్గరకు వెళ్లిపోయేవాడు. వేటపాలెం అనగానే బెల్లం జిలేబీ, జీడిపప్పు పాకం కొనుక్కునే వాళ్ళం.

ఇంతకీ చెప్పనే లేదు కదూ! వేటపాలెం జీడిపప్పుకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ జీడిపప్పు వలవటం, కాల్చటం వంటివి కుటీర పరిశ్రమలుగా నడిచేవి. వేటపాలెం చుట్టుపక్కల 8000 ఎకరాల్లో జీడి మామిడి సాగు జరిగేది. కానీ ఇప్పుడు అన్నీ ఇళ్ల స్థలాలుగా మారి జీడిమామిడి పంట కేవలం 2700 ఎకరాలకు పడిపోయింది. వేటపాలెం జీడిపప్పు అంటే భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినది. 1925వ సంవత్సరం నుంచి ఇక్కడ జీడిపప్పు తయారీకి ఒక నెలకు 20 టన్నుల జీడిపప్పు కావాలి. అయితే ఇంకా వేటపాలెంలో టెక్నాలజీ అందుబాటులోకి రాక చేతితోనే చేయటం వల్ల తిరుపతి సరఫరా చేసే అవకాశం కోల్పోయారు. ఇంట్లో అమ్మ చిన్నప్పుడు కూరాలన్నింటిలోనూ, పకోడీల్లోనూ జీడిపప్పు వేసేది. ఏంటి అన్నింటిలో జీడిపప్పునా అని విసుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఇంత ఖరీదు పెట్టి జీడిపప్పు కొనుక్కుంటుంటే దాని విలువ తెలుస్తున్నది.

1965-66 ప్రాంతంలో వేటపాలెంలోని జయలక్ష్మి టాకీస్ పక్కన ఒక రైస్ మిల్లును కట్టారు మానాన్న. ఆ రైస్ మిల్లుకు చనిపోయిన తన అన్నగారి పేరు పెట్టారు నాన్న. ‘శ్రీరామేశ్వర రైస్ మిల్లు’ దాని పేరు. ఆ తర్వాత 1970లో ఇంకొల్లులో మరో రైస్ మిల్లు నిర్మాణం మొదలుపెట్టడంతో మా కుటుంబం ఇంకొల్లుకు మారింది. అయినా మా నాయనమ్మ సొంత ఇంట్లో నుంచి రాననడంతో మేము ఇంకొల్లు నుండి వేటపాలెంకు రాకపోకలు సాగించేవాళ్లం. మా నాయనమ్మ తొంభై ఏళ్ళ వయసులో కాలుజారిపడి తుంటి ఎముక ఫ్రాక్చర్ అయ్యేదాకా ఆ ఇంటిలోనే కాపురమున్నది. అక్కడ నుంచి చీరలకు తీసుకొచ్చిన కొద్ది కాలంలోనే చనిపోయింది.

మా ఇంటి గేటుకు ఒక ఆర్చి పెట్టింది. దాని మీద ‘సుందరాచారి బిల్డింగ్స్’ అని మా నాన్న పేరు రాయించాము. వేటపాలెంలోని మామిడి తోటల్లో కార్తీక వనభోజనాలు నిర్వహించేవారు మానాన్న. అక్కడ అన్నపూర్ణష్టకం, గాయత్రి మంత్ర జపం, మంత్ర పుష్పం చదవటాలు, పాటలు పాడి రైసు మిల్లు ప్రారంభోత్సవానికి సాహితీవేత్తలందర్నీ పిలిచి కవిసమ్మేళనం ఏర్పాటు చేశారట. మా నాన్న వేటపాలెం నుంచే స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడు. అప్పటి వరకూ పాంట్లు షర్టులు వేసుకున్న నాన్న స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న దగ్గర నుంచి ఖద్దరు పంచే, లాల్చీ వేసుకునేవారు. ఆ ఖద్దరు బట్టలను ఆయన 1993లో చనిపోయేదాకా విడిచిపెట్టలేదు. స్వాతంత్ర్య సమరం, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటం వంటి విషయాలన్నీ వేటపాలెంలో ఉండగా జరిగినవే. మా అమ్మా నాన్నల జీవితం పూర్తిగా వేటపాలెంతో ముడిపడి ఉన్నది. మా అమ్మానాన్నల ఊరే మా ఊరు.

పుట్టినూరిలో అడుగు పెట్టగానే

నేలతల్లి స్పృశిస్తూ పలకరించింది

వాన చినుకు ఒల్లంత తడిమింది

సముద్రం కాళ్ళకు నీళ్ళిచ్చింది

కొబ్బరాకులు ఊగుతూ ఆహ్వానించాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here