Site icon Sanchika

నేను మాట్లాడేది చంద్రుడితో..!

[ప్రముఖ అమెరికన్ కవయిత్రి సిల్వియా ప్లాత్ రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of American poet Sylvia Plath’s poem by Mrs. Geetanjali.]

~

[dropcap]ఇ[/dropcap]క ఇప్పుడు ప్రతీ రాత్రీ నేను మాట్లాడతాను!
నాతో నేను.. చందమామతో కూడా మాట్లాడాల్సిందే!
ఈ రాత్రి వీధుల్లో నడుస్తూన్నట్లు.. రోజూ మాట్లాడుతూ ఉంటాను!
నా ఏకాకితనాన్ని చూస్తూ అసూయ చెందే నీలి రంగు వెండి అంచుతో
చల్లబడిపోయిన ఆ చంద్రుణ్ణి చూసారా?..
మంచు మీద తళతళలాడిపోతూ మెరిసే చంద్రుడ్ని చూస్తూ..
నడుస్తూ నేను మాట్లాడతాను!
నాతో నేను ఇలా మాట్లాడుతూ తటస్థంగా కదలాడే దట్టమైన చెట్లను చూస్తాను.
మనుషుల వైపు కాకుండా అలా చెట్లను
చూడ్డమే సరి అయింది.
సంతోషంగా.. దీనంగా, అతి తెలివిడితో కనిపించే
మనుషులను చూసే బదులు ప్రకృతి వైపు చూడడమే మంచిదేమో?
మొఖాలకి తొడుక్కున్న ముసుగులు కిందకి..
పక్కలకి తొలగిస్తూ.. నడిచే మనుషుల వైపు.. ఓహ్హ్.. వద్దు!
కేవలం చంద్రుడితో మాట్లాడుతూ నేను నడక సాగిస్తాను..
వ్యక్తిగతం కాని తటస్థ శక్తి అయిన చంద్రుడు..
కేవలం నన్ను.. నన్నుగా అంగీకరించే చంద్రుడు..
నన్ను దూరాలకి విసిరివేయని చల్లని చంద్రుడితో..
ఒక్క చంద్రుడితో మాత్రమే సంభాషిస్తూ..
అవును నేను ఈ రాత్రి నడక సాగిస్తాను.

~

మూలం: సిల్వియా ప్లాత్

అనువాదం: గీతాంజలి


సిల్వియా ప్లాత్ (27 అక్టోబర్ 1932 – 11 ఫిబ్రవరి 1963) ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి, కథా, నవలా రచయిత్రి. ఆంగ్ల కవిత్వంలో ‘confessional poetry’ అనే విభాగంలో ఆమె అధికంగా కవితలు రాశారు. The Colossus and Other Poems (1960), Ariel (1965) అనేవి ఆమె ప్రసిద్ధ రచనలు, The Bell Jar అనే నవల ఆమె తన ఆత్మకథ ఆధారంగా రచించారని తెలుస్తుంది.

1956లో తోటి కవి Ted Hughes ని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు జన్మించారు. వైవాహిక జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కున్న సిల్వియా 1962లో భర్త నుండి విడిపోయారు. తీవ్రమైన క్రుంగుబాటుకి లోనైన సిల్వియా 1963లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈమె రచించగా, 1981లో (మరణాంతరం) ప్రచురితమైన ‘The Collected Poems’ అనే కవితా సంపుటికి 1982 సంవత్సరానికి గాను కవిత్వ విభాగంలో పులిట్జర్ ప్రైజ్ లభించింది. మరణాంతరం ఓ రచయితకి ఈ పురస్కారం లభించటం అప్పటికి నాల్గవసారి.

Exit mobile version