సానుకూల ప్రభావపు కథలు – ‘నేను మంచిదాన్నేనా..’

9
2

[dropcap]త[/dropcap]పాలా శాఖలో పాతికేళ్ళుగా పనిచేస్తున్న శ్రీమతి రామిగాని ఉమాదేవి సాహిత్యాభిలాషి. బాల్యం నుంచి అలవర్చుకున్న పుస్తక పఠనం అలవాటుతో ఎన్నో పుస్తకాలు చదివి సాహిత్యం ప్రయోజనాన్ని గ్రహించారు. 2018లో తొలి కథ వ్రాశారు. వీరి కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై, బహుమతులు అందుకున్నాయి. ఇప్పటి వరకు ప్రచురించిన కథల్లోంచి 12 కథలతో ‘నేను మంచిదాన్నేనా..’ పుస్తకం వెలువరించారు.

“ఇందులోని కథలు ఎంతో పరిణతిని స్ఫురింపజేస్తాయి. జీవిత సత్యాలను వెల్లడిస్తాయి. పాత్రల లోతులు తెలిపే సంభాషణలు, అంతఃచేతనలోని ఆలోచనలు, ఎక్కడా విసుగనిపించకుండా సాగిపోయే కథాగమనం పాఠకుణ్ణి ఆకట్టుకుంటాయి” అన్నారు ప్రముఖ రచయిత్రి డా. జోలపాలెం భాగ్యలక్ష్మి తమ ముందుమాట ‘సంకేత దీపాలు’లో.

“భాష మీద సాధికారత, సంఘం మీద సువిశాలమైన సునిశిత దృష్టి కలిగి, సామాజిక బాధ్యత తెలిసిన మంచి వ్యక్తిత్వమున్న రచయిత్రి శ్రీమతి రామిగాని ఉమాదేవి. ఆమె క్రోడీకరించుకున్న కథావస్తువలన్నీ జీవితానుభవాల సమాహారంగా భాసిస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు ప్రముఖ రచయిత శ్రీ టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి తమ ముందుమాట ‘జీవితానుభవాల సమాహారం శ్రీమతి రామిగాని ఉమాదేవి కథలు’లో.

***

భార్యకి ఎదురుచెప్పలేక, తల్లి ప్రమద్వరని తమ ఇంటి పనిమనిషిలా మార్చినా నిస్సహాయంగా భరించిన ఆ కొడుకు – తమ మామగారితో కలిసి ఓ గొప్ప నిర్ణయం తీసుకుంటాడు. తల్లికి మరో జీవితం కల్పిస్తాడు. జీవితపు మలిదశలో ఆమెని అభిమానించే మరో తోడుని ఆమెకి అందిస్తాడు. మామాఅల్లుళ్ళు సహృదయంతో ఆలోచించి ప్రమద్వరని అభిమానించే వ్యక్తిని ఆమె జీవితంలోకి తీసుకువస్తారు ‘అనుకోని వసంతం’ కథలో.

అంతరంగంలోని మాటలను ఎన్నడూ బయటకి వెల్లడించని కారణంగా ఓ మహిళని మంచి మనిషని పేరు పొందుతుంది. పేదరికం కారణంగా తండ్రి ఆమెకు మొదటి భార్య చనిపోయిన వ్యక్తితో పెళ్ళి కుదురుస్తాడు. తండ్రి నిస్సహాయతని గుర్తించిన ఆమె ‘నేను మంచిదాన్నేనా’ అని అనుకుంటుంది. కాలక్రమంలో భర్త ప్రేమని, సవతి కూతురు భువన అభిమానాన్ని పొందుతుంది. తన కడుపున పుట్టిన కొడుకుని, భువనని ఒకేలా పెంచుతుంది. తమ్ముడు తప్పు మార్గంలో వెళ్ళబోతుంటే భువన దండిస్తుంది. మొదట నొచ్చుకున్నా, అందులో తమ్ముడి పట్ల భువన బాధ్యత కనబడి ఆ తల్లి కుదుటపడుతుంది. వచ్చిన ఎన్నో సంబంధాలను తిరగ్గొట్టిన భువన, చివరికి ఓ సంబంధం ఒప్పుకోడంలోని రహస్యాన్ని తల్లి అడిగి తెలుసుకుంటుంది. అప్పుడామె అనుకుంటుంది ‘నేను మంచిదాన్నేనా..’ అని. ప్రధాన పాత్రకి పేరు లేకుండా ‘నేను’ అంటూ ఆమెతోనే కథ నడపడం విశేషం.

సుజాకి ఇష్టం లేకపోయినా – అందరూ చేరుస్తున్నారంటూ – భర్త బలవంతం మీద కొడుకుని హాస్టల్‍లో చేర్పిస్తే మౌనంగా భరిస్తుంది. మొదట పిల్లాడికి నచ్చచెప్తుంది. కానీ చదువు పేరిట బలి అవుతున్న బాల్యపు వ్యథని గుర్తించిన సుజా కొడుకుని ఇంటికి తీసుకువచ్చేద్దామని భర్తని ఒప్పిస్తుంది. హస్టల్‍కి వెళ్తే, కొడుకు ఇంటికి రానంటాడు. గలగలా మాట్లాడే పిల్లాడు ముభావంగా మారిపోతాడు. తల్లితో కూడా అపరిచితుడిలా వ్యవహరిస్తాడు. చదువు పూర్తయ్యేసరికి కొడుకుతో అనుబంధం మిగులుతుందా అని సుజా బాధపడుతుంది. ఫీజుగా కట్టిన లక్ష రూపాయలు వెనక్కి ఇవ్వరని తెలిసి పిల్లాడు ఇంటికి రానన్నాడని గ్రహించిన సుజా భర్తతో పోట్లాడి పిల్లాడిని ఇంటికి తెచ్చేయమంటుంది. హాస్టల్లో ఉంచి చదివిస్తే కొడుకు భవిష్యత్తు బావుంటుందని భ్రమపడిన భర్త కొడుకుని ఇంటికి తెచ్చేస్తాడు. తల్లిదండ్రుల ఆశలని వమ్ము చేయకుండా బాగా చదువుకుని వృద్ధి లోకి వస్తాడా పిల్లాడు. ‘మార్పు మనతోనే’ కథ చదువు పేరుతో పిల్లల్ని ప్రేమ, పాశం లేని మరబొమ్మలుగా మార్చకూడదని సూచిస్తుంది.

సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. కొందరు తమలోని సంకుచిత భావాలను బయటకి ప్రదర్శిస్తారు. మరికొందరు తమ మంచి అనుభూతులను కూడా బయటకి చెప్పరు. రెండూ సరైనవి కావంటారు రచయిత్రి ‘మనసుకు చేద్దాం మరమత్తు’ కథలో.  అందరూ తమ మనసుల్లోని ప్రతికూల భావనలను తొలగించుకుని, సానుకూల భావనలను పెంచుకుంటే – తమకీ, ఇతరులకి కూడా మేలు చేస్తుందని ఈ కథ చెబుతుంది.

మనసున మనసై’ భార్యాభర్తల అనుబంధానికి అద్దం పట్టిన కథ. ఒకరి మీద ఒకరి ప్రేమ, నమ్మకం ఉండి, విలువలతో జీవితం గడిపితే, జీవన ప్రయాణం ఎంత మధురంగా ఉంటుందో చెబుతుంది ఈ కథ.

ఆఫీసుల్లో ఆడవారిని లైంగికంగా వేధించే పై అధికారులకు తెలివిగా బుద్ధి చెప్పిన హాసిన కథ ‘అతివలు అంత సులభమా..’. మేనేజర్ వేధింపులని సుమన మౌనంగా భరిస్తూ, లోలోపల రగిలిపోతే – హాసిని అతడిని బహిరంగంగా పట్టిచ్చి, నిలదీసి, రాజీనామా చేసేలా చేస్తుంది.

ఆస్తుల పంపకాల కన్నా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలే ముఖ్యమని గ్రహించిన ఓ కుటుంబం కథ ‘అనుబంధాలు’. ఆస్తులు పంచుకుని విడిపోయాకా, అభిమానాలు ఎలా నశిస్తాయో ఈ కథలో కొన్ని పాత్రల ద్వారా తెలుస్తుంది. డబ్బే ప్రధానం అనుకున్న వారి మధ్య ఆప్యాయతలు లోపిస్తాయనే వాస్తవాన్ని ఈ కథ కళ్ళెదుటకి తెస్తుంది.

మొదటి వివాహాలు విఫలమయిన విజయ్, లత – ఇద్దరి ఇళ్ళలోని పెద్దల మాటని మన్నించి రెండో పెళ్ళి ద్వారా దంపతులవుతారు. కానీ వారి దాంపత్యంలో ఏదో లోటు! మొదటి పెళ్ళి మిగిల్చిన గాయాలు ఇద్దరినీ ఇంకా వదలకపోవడంతో – చొరవ తీసుకోలేక ఇద్దరూ మథనపడ్తూ జీవితాన్ని యాంత్రికం చేసుకుంటారు. విజయ్ మరదలు, స్నేహితురాలు అయిన గీత ఈ సమస్యని ఎలా పరిష్కరించిందో ‘ఒకరికి ఒకరు’ కథ చెబుతుంది.

స్త్రీపురుషులు సమానమే కానీ, పురుషుడు ఇంకాస్త ఎక్కువ సమానం అనుకునే మగవారికి కనువిప్పు కలిగించే కథ ‘రుక్మిణీభామ’. పెళ్ళి చేసుకోవాలనుకున్న వ్యక్తిని నమ్మకపోతే – చక్కని జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఈ కథ చెబుతుంది.

తల్లికి తన మీద ప్రేమ లేదని తప్పుగా భావించి, చివరికి తల్లి మనసు గ్రహించిన కూతురు కథ ‘వరమిచ్చే తీపి శాపం అమ్మ’. బాధ్యతారాహిత్యానికి స్వేచ్ఛ అనే ముసుగు వేసుకోకూడని సూచిస్తుందీ కథ.

భావుకత్వం కల భార్యకీ, యాంత్రికత నిండిన భర్తకీ మధ్య దాంపత్యం ఎలా ఉంటుందో ‘శృతి చేసిన హృదయవీణ’ కథ చెబుతుంది. తన మీద ప్రేమ ఉన్నా వ్యక్తీకరణలో తేడాల వల్ల తను ఆశించనట్టుగా ఉండలేని భర్త అంతరంగాన్ని భార్య తెలుసుకున్న పద్ధతి; భార్య ఇంట్లో లేనప్పుడు – ఆమె లేని లోటు వల్ల ఆమె ప్రేమని గుర్తించి ఆమె ఆశించినట్లు తనని తాను మలుచుకున్న భర్త చర్యలు అత్యంత సహజంగా ఉంటాయి.

అల్లుడే కొడుకై అత్తగారికి ముదిమి వయసులో మరో తోడును అందించిన కథ ‘అల్లుడుగారు’. మలి వయసులో జీవితానికి భరోసా ఇచ్చే తోడు దొరికినప్పుడు సమాజానికి వెరవనవసరం లేదని చెబుతుందీ కథ.

సమాజంలోని చాలా ఇళ్ళల్లో ఉండే సమస్యలు ఈ కథల్లోనూ ఉన్నాయి. కానీ సమస్యలని భూతాల్లా చూస్తూ నిశ్శబ్దంగా బాధలని సహిస్తూ నిష్క్రియాపరంగా ఉంటూ నెగటివిటీనీ పెంచే పాత్రలు మాత్రమే కాదు; సమస్యలని తెలివిగా, ధైర్యంగా ఎదుర్కుని – జీవితం పట్ల ఆశని, విశ్వాసాన్ని కోల్పోక తాము సానుకూల దృక్పథంతో ఉంటూ, తోటివారికి కూడా భరోసా కల్పించే పాత్రలు కూడా ఉన్నాయి. అందుకే ఈ కథలు చదువుతున్నప్పుడు హృదయభారం కలగదు, మనోనిబ్బరం కలుగుతుంది. కొందరి ప్రవర్తన పట్ల రోత, జుగుప్స కాకుండా, వారెందుకు అలా ప్రవర్తిస్తున్నారో అన్న ఆలోచన కలుగుతుంది, నాలుగు మంచి మాటలు చెబుదాం, వీలైతే కాస్త మారతారు అన్న భావన కలుగుతుంది. జీవితం పట్ల పాజిటివిటీ కల్పించడంలో ఈ పుస్తకం తప్పక ప్రభావం చూపుతుంది. పాఠకులను నిరాశపరచదు ఈ పుస్తకం.

***

నేను మంచిదాన్నేనా.. (కథా సంపుటి)
రచన: రామిగాని ఉమాదేవి
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 120
వెల: ₹ 150.00
ప్రతులకు:
అచ్చంగా తెలుగు
ఫోన్‌: 8558899478
ఆన్‍లైన్‌ ద్వారా తెప్పించుకునేందుకు లింక్:
https://books.acchamgatelugu.com/product/nenu-manchidannena/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here