(ఇతివృత్తం: “తన కోపమే తనకు శత్రువు… తన శాంతమే తనకు రక్ష…” …అనే నానుడిని ఇతివృత్తంగా తీసుకుని నడుస్తుంది ఈ నాటిక!)
[dropcap]ని[/dropcap]జానికి కోపాన్ని తగ్గించుకుని శాంతంగా వుండాలని కోరుకుంటాం మనమంతా!
కాని పరిస్థితులు మనల్ని అలా శాంతంగా ఉండనిస్తాయా? ఉండనీయవవు కదా!
కాని మనసు నియంత్రించుకుంటూ, పరిస్థితులను అధిగమించి ‘కోపం’ స్థానంలో ‘శాంతం’ని ప్రతిష్ఠించడంలో కృతకృత్యుడైన కేశవరావుని గురించి తెలుసుకోవడమే ఈ నాటిక ఉద్దేశ్యం….!
ఇందులో పాత్రలు:
కేశవరావు : వయసు 65సం.. రిటైర్డ్ బ్యాంకు అధికారి.
సోమనాధం : వయసు 63 సం… రిటైర్డ్ ప్రభుత్వ అధికారి.
హాస్పిటల్‍లో : రిసెప్షనిస్టు – పేషెంటు నెం. 1 – పేషెంటు నెం. 2
బస్సులో : డ్రైవర్ – ప్రయాణీకుడు నెం. 1 – ప్రయాణీకుడు నెం. 2 – ప్రయాణీకుడు నెం. 3
హోటల్‍లో : బేరర్ నెం. 1 – బేరర్ నెం. 2, హోటల్ మేనేజర్
***
అమెరికాలో కొడుకు దగ్గర ఓ ఆరునెలలు గడిపి, ఇండియా తిరిగొచ్చిన సోమనాధం, స్నేహితుడు కేశవరావుని కలిసేందుకు కేశవరావు ఇంటికి వచ్చాడు.
***
కేశవరావు : హల్లో సోమనాధం! వెల్‍కం బ్యాక్ టు ఇండియా…! యు.యస్ నుంచి ఎప్పుడొచ్చావురా? కనీసం వస్తున్నట్లు ఒక్క ఫోను కూడా చేయలేదేంటి?
సోమనాధం : వచ్చి మూడురోజులైందిలే…! నిన్ను సర్‍ప్రైజ్ చేద్దామని ఫోను చెయ్యలేదురా! ఇంతకీ మీరందరూ ఎలా వున్నారు?
కేశవరావు : మేమంతా బాగున్నాంరా! మరి మీ మాటేంటి?
సోమనాధం : మేము కూడా బాగున్నాం. అన్నట్లు నువ్వో టైం కాంన్షస్ మనిషివి కదా! అందుకే నీకో రిస్టువాచి గిఫ్టుగా తెచ్చాను… ఇదిగో… తీసుకోరా!
కేశవరావు : వావ్! చాలా బాగుందిరా ఈ వాచీ! థాంక్స్ రా!
సోమనాధం : దాందేవుంది లేరా!… ఆ… రేపటి నుండి మార్నింగ్ వాక్‍కి కూడా వస్తాను. ఇక మనం రోజూ కలుసుకుందాం.
కేశవరావు : రేపట్నుంచి రారా బాబూ… మన ఫ్రెండ్స్ అంతా నిన్ను ఒకటే కలవరిస్తున్నారు. అది సరేగాని ఇప్పుడు నిన్నో విషయం అడుగుతాను. నిర్భయంగా నిజం చెప్పరా…
సోమనాధం : ఓ.కే! అడుక్కో!
కేశవరావు : ఆరునెలల తరువాత నన్ను చూస్తున్నావు కదా! నాలో ఏమైనా మార్పు కనిపిస్తుందా?
సోమనాధం : మార్పా! నాకేం కనపడడం లేదురా! అదే ఎత్తు… అదే లావు… అదే రంగు… ఎందుకలా అడుగుతున్నావ్!!
కేశవరావు : అది కాదురా! ఇంకోసారి చూసి చెప్పు!
సోమనాధం : ఎన్నిసార్లు చూసినా… ఎటునుంచి చూసినా అంతేరా… నో ఛేంజ్! అయినా ఏంట్రా నీ సొద?
కేశవరావు : అదేరా… నేనో పెద్ద కోపిష్టినని నీకు తెలుసుకదా?
సోమనాధం : అవునూ… కోపంలో విశ్వామిత్రుడి కజిన్ బ్రదర్‍వి కదా! అందులో డౌటేముంది?!
కేశవరావు : మరదే! విశేషం ఏమిటంటే… ఈ మధ్యకాలంలో నాలో కోపం పూర్తిగా తగ్గిపోయింది. అదే నాలో పెద్ద మార్పు!
సోమనాధం : అయినా నీ పిచ్చిగాని… కోపం తగ్గిందా లేదా… అన్నది కేవలం నిన్ను చూసినంత మాత్రాన ఎలా తెలుస్తుందిరా? నీకు కోపం తెప్పించే పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వెలా ప్రతిస్పందిస్తావు అనేదాన్ని బట్టి తెలుస్తుంది నీకు కోపం తగ్గిందా లేదా అన్నది!!
కేశవరావు : అంతేనంటావా?
సోమనాధం : మరంతేగా!
కేశవరావు : సరే! ఒక పన్జేస్తా, ఆ మధ్య కాలంలో నాకు బాగా కోపం తెప్పించిన పరిస్థితులు, అలాంటి పరిస్థితులే ఈ మధ్యకాలంలో వచ్చినప్పుడు, నేనెలా శాంతంగా వున్నానో నీకు సోదాహరణంగా చెప్తాను. శ్రద్ధగా విను! ఆ తర్వాత చెప్పు… నాకు కోపం తగ్గిందా లేదా అని! ఓకేనా?
సోమనాధం : ఆ… ఓకే! మొదలెట్టూ!
కేశవరావు : ఆ మధ్య నేను అనారోగ్య సమస్యతో హాస్పిటల్‍కి వెళ్ళాను. అప్పుడేం జరిగిందంటే!!
***
కేశవరావు :(ప్రక్కనున్న పేషేంట్ నెం. 1తో) ఏవండీ! మీ అప్పాయింట్‍మెంట్ ఎన్నిగంటలకి?
పేషెంట్ నెం. 1 : 6 గంటలకు. మరి మీది?
కేశవరావు : నాది 6 1/2 గంటలకి!
పేషెంట్ నెం. 1 : ఇప్పుడు 7 1/2 గంటలు కావస్తున్నది. ఇంతవరకు మనల్ని పిలవలేదు.
కేశవరావు : అంతేనండి ఈ డాక్టర్లు! వాళ్ళ దయ మన ప్రాప్తం!
పేషెంట్ నెం. 1 : (అప్పుడే క్యాబిన్ నుండి బయటకు వచ్చి హడావిడిగా బయటికెళ్తున్న డాక్టర్ని చూసి) అరెరే! ఏంటిది? డాక్టర్ గారు బయటికెళ్తున్నారేంటి?
కేశవరావు : అవును నిజమే! ఇక్కడ ఇంతమంది వెయిటింగ్‍లో వున్నారు. అయినా… తనకేమీ పట్టనట్లు అలా వెళ్ళిపోయారేంటి? ఉండండి… రిసెప్షనిస్టుని అడిగొస్తాను! (రిసెప్షనిస్టుతో) ఏమ్మా! ఏంటిది? డాక్టరుగారు బయటికెళ్లారేంటి? తిరిగి ఎప్పుడొస్తారు?
రిసెప్షనిస్టు : ఏమో!! మాకెలా తెలుస్తుందండీ?
కేశవరావు : అదేంటమ్మా? అలా మాట్లాడతావేంటి! ఇంతమంది పేషంట్లు ఇక్కడ వెయిటింగ్‍లో ఉంటే మీరు డాక్టర్‍గారికి చెప్పరా!!!
రిసెప్షనిస్టు : మేం చెప్పాల్సిన పనిలేదు సార్… మీ అందరి ఫైళ్ళు డాక్టరుగారి టేబిల్‍పైనే వున్నాయి వరుసగా పిలుస్తారు.
కేశవరావు : ఏంటమ్మా పిలిచేది? నా అపాయింట్‍మెంట్ ఆరున్నరగంటలకి. ఇప్పుడు ఏడున్నర అయింది! ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఓ అర్థం పర్థం ఉండక్కార్లా!
రిసెప్షనిస్టు : కాసేపు వెయిట్ చేయండి… డాక్టరుగారు వస్తారు కదా! ఈలోపు అక్కడున్న పేపర్లు చదువుకోండి… ఇక్కడున్న టి.వి చూడండి.
కేశవరావు : అవును ఇంక మాకు వేరే పన్లేమీ లేవు మరి. ఇక్కడ కూర్చుని పేపరు చదవాలా! టి.వి చూడాలా!! ఏం చెప్తున్నావమ్మా!!!
రిసెప్షనిస్టు : సార్! పెద్దగా అరవకండి సార్… కోపగించుకోకండి! అందరూ మిమ్మల్నే చూస్తున్నారు. వెళ్ళి కూర్చోండి సార్!
కేశవరావు : అంతేలే… కూర్చోక ఏం చేస్తాం! ఇంతింత డబ్బులు పోసి మీ ఎదురుగా కూర్చుని జాగారం చేయాలి. తప్పుతుందా! అంతా నా ఖర్మ! (అని తలకొట్టుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు)
పేషెంటు నెం. 1 : ఏమంటుందండి ఆ అమ్మాయి? డాక్టరుగారు ఎప్పుడొస్తారంట?
కేశవరావు : ఎప్పుడొస్తారో తెలియదంట! అందాకా ఇవిగో ఈ పేపర్లు చదువుకుంటూ… ఆ టి.వీ చూసుకుంటూ కూర్చోమంది!
పేషెంటు నెం. 1 : ఆ! ఇది మరీ బాగుంది! సరే కానివ్వండి… ఏంచేస్తాం!!
***
కేశవరావు : చూశావుగా సోమనాధం? ఆ రోజు నేను హాస్పిటల్‍లో కోపంతో ప్రవర్తించిన తీరు!
సోమనాధం : మొత్తానికి ఓ వీరంగం వేశావు కదరా!
కేశవరావు : కదా!… మరలా ఈ మధ్యనే నేను అదే హాస్పిటల్‍కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే…!
***
పేషంటు నెం. 2 : ఏవండీ! మీ అపాయింట్‍మెంట్ ఎన్నింటికి?
కేశవరావు : ఆరుగంటలకి. మరి మీది?
పేషంటు నెం. 2 : నాది ఆరున్నర గంటలకి. ఇప్పుడు ఏడున్నర కావస్తుంది! ఇంతవరకు మనల్ని పిలవలేదు!!
కేశవరావు : బహుశా… మనకంటే ముందొచ్చిన పేషెంట్లని చూస్తూ వుంటారు డాక్టర్‍గారు
పేషంటు నెం. 2 : (కేబిన్ నుండి బయటికొచ్చి హడావిడిగా బయటికి వెళ్తున్న డాక్టర్‍ని చూసి) అరెరే! ఏంటిది? డాక్టర్‍గారు బయటికెళ్తున్నారేంటి? ఇంతమంది ఇక్కడ వెయిటింగ్‍లో ఉన్నాం! అయినా తనకేమీ పట్టనట్లు అలా వెళ్ళిపోయారేంటండీ బాబూ!
కేశవరావు : ఏదైనా అత్యవసర పనిమీద వెళ్ళారేమో!! కాసేపట్లో వస్తార్లెండి!
పేషంటు నెం. 2 : ఏంటండీ మీరనేది? ఇంత డబ్బూ పోసి, వీళ్ళకోసం గంటల తరబడి వెయిట్ చెయ్యాలా?!
కేశవరావు : తప్పదుమరి!… అవసరం మనది కదా! అయినా పెద్దలు చెప్పినట్లు… “ది ట్రెయిన్ విల్ నాట్ వెయిట్ ఫర్ ది పాసింజర్స్… బట్ ది పాసింజర్స్ మస్ట్ వెయిట్ ఫర్ ది ట్రెయిన్” అలాగే ‘డాక్టరు పేషెంట్ల కోసం వెయిట్ చేయరు. పేషంట్లే డాక్టరుకోసం వెయిట్ చేయాలి’.
పేషంటు నెం. 2 : అంటే… ఏంటండీ మీ ఉద్దేశం? ఎంతసేపైనా వెయిట్ చేయాల్సిందేనంటారా?
కేశవరావు : తప్పదుమరి చూడండి! దేవుడి దర్శనం కోసం గుడికెళ్తాం. క్యూలో నిల్చుంటాం… నెమ్మదిగా నడుస్తూ మనవంతు వచ్చేవరకు వేచివుంటాం…! అంతేగాని ఆలస్యం అవుతుందని ఆ దేవుడ్ని నిందించం కదా!
పేషంటు నెం. 2 : అవున్లెండి! మీరు చెప్పిందాంట్లో కూడా ఓ లాజిక్ లేకపోలేదు!
కేశవరావు : అవును కదా! మరెందుకాలస్యం… చక్కగా పేపర్లు చదువుకుంటూ కాసేపు టి.వీ చూడండి! ఈలోపు డాక్టర్ గారు రానే వస్తారు! ఏమంటారు?
పేషంటు నెం. 2 : ఏవంటాను! మీరు చెప్పింది కరెక్టేనంటాను!
***
కేశవరావు : చూశావుగా సోమనాధం! అప్పుడు నేను హాస్పిటల్‍లో కోపంతో ప్రవర్తించిన తీరు… ఇప్పుడు శాంతంతో ప్రవర్తించిన తీరు… నీకు నాలో మార్పు కనిపించలేదా?
సోమనాధం : కొంచెం మార్పు ఉన్నట్లే కేశవరావు….
కేశవరావు : సరే! ఇంకో సందర్భం చెప్తా విను!
సోమనాధం : ఓ.కే చెప్పు….
కేశవరావు : ఆ మధ్య విజయవాడ వెళ్ళేందుకు టికెట్ రిజర్వు చేసుకుని రాత్రి పదిగంటల బస్సెక్కాను…. అప్పుడేం జరిగిందంటే!
***
కేశవరావు : (తనకు కేటాయించిన సీట్లో కూర్చున్న ఒక వ్యక్తిని చూసి) ఏవండీ! ఈ సీటు నాది. నేను రిజర్వు చేసుకున్నాను! మీరెళ్ళి మీ సీట్లో కూర్చోండి!
ప్రయాణీకుడు నెం.1 : మీ సీటే కాదనను, అయినా వెనుక బోల్డు సీట్లు ఖాళీగా వున్నాయ్! వెళ్ళి కూర్చోండి!
కేశవరావు : ఏం మాట్లాడుతున్నారండీ? నా సీట్లో కూర్చొని నన్నే వెళ్ళమంటారేంటి? అదేదో మీరే వెళ్ళి కూర్చోవచ్చు కదా!
ప్రయాణీకుడు నెం. 1 : వెనక్కివెళ్ళి కూర్చోవయ్యా… అనవసరంగా ఈ మాట్లేంటి?
కేశవరావు : మర్యాదగా లేచి వెళ్తారా? లేదా? వెళ్ళకపోతే బస్సు ఆపించి విషయం తేల్చమంటారా? (ప్రయాణీకుడు నెం 1 సీట్లో లేచేట్లు కనపడకపోయేసరికి పెద్దగా అరుస్తూ) డ్రైవర్ గారూ! ఒక్కసారి బస్సాపి ఇలా రండి. ఈయనెవరో నా సీట్లో కూర్చుని నాపైనే రుబాబు చేస్తున్నాడు!
డ్రైవర్ : (పెద్దగా) సార్! ఎలాగో అడ్జెస్ట్ చేసుకోండి సార్!
కేశవరావు : ఏంటయ్యా అడ్జస్టు చేసుకునేది? ముందు నువ్వు బస్సాపి ఇలా రా!
డ్రైవర్ : (బస్సాపి కేశవరావు దగ్గరకు వచ్చి) ఏంటి సార్ ప్రాబ్లమ్?
కేశవరావు : ఇది నా సీటు. ఇతను నా సీట్లో కూర్చుని లేవట్లేదు. నా సీటు నాకిప్పించండి అంతే!
డ్రైవర్ : (ప్రయాణీకుడు నెం 1 తో) సార్ (గట్టిగా పెద్దగా) మీరు ముందు లేవండి. ఆయన సీటు ఆయనకివ్వండి. మీరెళ్ళి మీ సీట్లో కూర్చోండి… ఇప్పటికే లేటయింది, త్వరగా వెళ్ళండి సార్! (చెప్పి డ్రైవరు సీటు దగ్గరికెళ్ళాడు)
కేశవరావు : (లేచి వెళ్తున్న ప్రయాణీకుడు నెం1 ని చూస్తూ) మర్యాదగా చెప్తే ఎవరూ వినరు మరి! (అని గొణుక్కుంటూ తన సీట్లో కూర్చున్నాడు)
***
కేశవరావు : చూశావుగా సోమనాధం! ఆరోజు బస్సులో కోపంతో నేను ప్రవర్తించిన తీరు…
సోమనాధం : మొత్తానికి నీ విశ్వరూపం చూపించావన్నమాట!
కేశవరావు : అవును… మరలా ఈ మధ్యనే నేను విజయవాడ వెళ్ళేందుకు టికెట్ రిజర్వు చేయించుకుని రాత్రి పదిగంటల బస్సెక్కాను… అప్పుడేం జరిగిందంటే….
***
కేశవరావు : (తనకు కేటాయించిన సీట్లో కూర్చునివున్న ఒక వ్యక్తిని చూసి) ఏవండీ! ఈ సీటు నాది, నేను రిజర్వు చేసుకున్నాను. మీరెళ్ళి మీ సీట్లో కూర్చోండి సార్!
ప్రయాణీకుడు నెం 2 : వెనకవరసలో విండో సీటు మాదే! వెళ్ళి కూర్చోండి!
కేశవరావు : సర్! వెనక సీట్లో కూర్చోలేకనే కొంచెం కంఫర్ట్‌గా ఉంటుందని ఈ సీటు ముందుగానే రిజర్వు చేయించుకున్నాను.
ప్రయాణీకుడు నెం 2 : ఏం ఫరవాలేదు వెళ్ళి కూర్చోండి.
కేశవరావు : సర్! నేనొక సీనియర్ సిటీజన్‍ని… దయచేసి నా బాధను అర్థం చేసుకోండి!
ప్రయాణీకుడు నెం 2 : చెప్తున్నాం కదా, మీరే అర్థం చేసుకుని వెనక్కి వెళ్ళి కూర్చోండి!
కేశవరావు : సర్… సర్…! అలా అంటారేంటండీ?
ప్రయాణీకుడు నెం 2 : అలా కాక ఇంకెలా అనమంటావ్? వెళ్ళవయ్యా వెళ్ళు!
ప్రయాణీకుడు నెం 3 : (కల్పించుకుని ప్రయాణీకుడు నెం.2 తో) ఇందాకట్నుంచి చూస్తున్నాను ఏంటండీ మీ వరస! పాపం! ఆ పెద్దాయన అంతగా బతిమాలుతున్నారు. పైగా అది ఆయన సీటే… మర్యాదగా మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి… (గదుముతూ) ఆయన సీటు ఆయనకివ్వండి! (ఆ మాటలకు ప్రయాణీకుడు నెం 2 సీట్లోంచి లేచి తన సీటు వైపు నడిచాడు. ప్రయాణీకుడు నెం 3కి కృతజ్ఞతలు చెప్తూ తన సీట్లో కూలబడ్డాడు కేశవరావు).
***
కేశవరావు : చూశావుగా సోమానాధం? అప్పుడు నేను బస్సులో కోపంగా ప్రవర్తించిన తీరు… ఇప్పుడు శాంతంతో ప్రవర్తించిన తీరు! మరి నీకు నాలో మార్పు కనిపించిందా? లేదా?
సోమనాధం : ఆ! ఆ! కొంచెం మార్పు కనిపించిందిలే!
కేశవరావు : సరే… ఇంకో సందర్భం చెప్తా విను!
సోమనాధం : ఆ! చెప్పు!
కేశవరావు : ఆ మధ్య నేను ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్‍కి వెళ్ళాను. అప్పుడేం జరిగిందంటే…
***
బేరర్ నెం 1 : సార్! ఆర్డర్ చెప్పండి సార్!
కేశవరావు : రెండు వెజ్ బిర్యానీ, రెండు కర్డ్ రైస్…!
బేరర్ నెం 1 : (రెండు నిమిషాల తరువాత… కర్డ్ రైస్‍తో టేబిల్ వద్దకు వచ్చి) సర్ కర్డ్ రైస్! ఇంకో ఐదు నిమిషాల్లో బిర్యానీ తెస్తాను సార్!
కేశవరావు : (కోపంతో) ఏవయ్యా? నీకసలు తలకాయ ఉందా?
బేరర్ నెం 1 : (ఆశ్చర్యంగా) ఏంటి సార్! అంతమాటన్నారు!!
కేశవరావు : (ఇంకా కోపంతో) లేకపోతే ఏంటయ్యా? బిర్యానీ, కర్డ్ రైస్ ఆర్డరు చేస్తే ముందు బిర్యానీ ఇచ్చి, అ తరువాత కర్డ్ రైస్ ఇవ్వాలి అంతేగాని ముందే కర్డ్ రైస్ తెస్తావా? ఆ…!
బేరర్ నెం 1 : సార్! కాసేపట్లో బిర్యానీ కూడా తెస్తాను సార్!
కేశవరావు : (తీవ్ర స్వరంతో) అసలు నీకెవడయ్యా ఉద్యోగం ఇచ్చింది? పిలువ్… మీ మేనేజర్‍ని…. ఆయనతోనే మాట్లాడతా!
బేరర్ నెం 1 : (ప్రాధేయపడుతూ) సార్…. సార్…. కోపగించుకోకండి సార్! కంప్లైంట్ చేయొద్దండీ నా ఉద్యోగం పోతుంది సార్!
కేశవరావు : (ఊగిపోతూ) నీలాంటి వాళ్ళకు అలాంటి శాస్తి జరగాల్సిందే! లేకపోతే ఇదిగో… ఇలాగే మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు.
బేరర్ నెం 1 : (బ్రతిమాలుతూ) సార్… సార్! ఈసారికి వదిలేయండి సార్! ఇక నుండి మీరు చెప్పినట్లే చేస్తాను సార్!
కేశవరావు : సరే… వెళ్ళు… వెళ్ళి బిర్యానీ తెచ్చేడువ్!
***
కేశవరావు : చూశావా సోమనాధం! ఆ రోజు రెస్టారెంట్లో నా కోపం!
సోమనాధం : ఆ! ఆ! మొత్తానికీ నీ ఉగ్రరూపం చూపించావ్!
కేశవరావు : మరలా ఈ మధ్యనే ఇద్దరు స్నేహితులతో కలిసి అదే రెస్టారెంట్‍కి లంచ్ చేద్దామని వెళ్ళాను.. అప్పుడేం జరిగిందంటే!
***
బేరర్ నెం 2 : (కేశవరావు కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చి) సార్! ఆర్డర్ చెప్పండి సార్!
కేశవరావు : మూడు థాలీ… ఒకటి వెజిటేరియన్… రెండు నాన్ వెజిటేరియన్… ఆ! కొంచెం త్వరగా తీసుకురా బాబూ! అర్జెంటుగా వెళ్ళాలి.
బేరర్ నెం 2 : ఐదు నిముషాల్లో తెస్తాను సార్!
కేశవరావు : (భోజనం ముగించుకుని) బేరర్! ఇలా… రా!
బేరర్ నెం 2 : (టేబిల్ దగ్గరికొచ్చి) చెప్పండి సార్!
కేశవరావు : ఏం లేదు గాని సాంబార్ అన్నం తింటుంటే ఈ స్టాప్లర్ పిన్ను (చూపిస్తూ) నా నోట్లోకి వచ్చింది. లక్కీగా దాన్ని పట్టుకుని బయటకు తీశాను! అది లోపలికెళ్ళుంటే ఏం అయ్యుండేదో!
బేరర్ నెం 2 : సారీ సార్… సారీ సార్!
కేశవరావు : ఫర్వాలేదులే! అయినా ఒకసారి మీ మేనేజర్‍కి ఈ విషయం చెప్పు… ఇలాంటివి ముందు ముందు జరక్కుండా చూసుకోమని చెప్పు! సరేనా?
బేరర్ నెం 2 : అలాగే సార్! తప్పకుండా చెప్తాను!
కేశవరావు : గుడ్… బిల్ పట్రా!
బేరర్ నెం 2 : ష్యూర్ సార్!
(ఇంతలో బిల్‍ని ఓ ప్లేటులో పెట్టుకుని అక్కడికొచ్చిన మేనేజరు, దాన్ని కేశవరావు ముందు పెట్టాడు)
మేనేజర్ : సార్! ఈ రోజు జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాము! దయచేసి మమ్మల్ని క్షమించండి! ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరక్కుండా చూసుకుంటాం సార్!
కేశవరావు : గుడ్! ఇకముందు జాగ్రత్తగా చూసుకోండి!
మేనేజర్ : సార్! ఈ రోజు మీ ముగ్గురికీ మా రెస్టారెంట్ తరపున లంచ్ కాంప్లిమెంటరీ ఇస్తున్నాం సార్!!!
కేశవరావు : ఓ అలాగా! మీరు చాలా గ్రేట్! థ్యాంక్యూ… థ్యాంక్యూ! గాడ్ బ్లెస్ యూ ఆల్!
మేనేజరు : థ్యాంక్యూ సార్!
***
కేశవరావు : చూశావుగా సోమనాధం… అప్పుడు నేను రెస్టారెంట్లో కోపంగా ప్రవర్తించిన తీరు, ఇప్పుడు శాంతంగా ప్రవర్తించిన తీరు! మరి, ఇప్పుడేమంటావ్? నాలో మార్పు వచ్చిందంటావా?
సోమనాధం : ఆ! ఆ!… కనిపించింది కేశవరావ్! కనిపించింది!
కేశవరావు : హమ్మయ్యా! మొత్తానికి నాలో మార్పు వచ్చిందని ఒప్పుకున్నావ్! సంతోషం!!
సోమనాధం : ఒప్పుకున్నట్లే కాని… కాని!
కేశవరావు : ఇంకా ఏంటి సోమనాధం! ఏమిటి నీ సందేహం!!
సోమనాధం : ఆ! ఏం లేదు చిన్నప్పటి నుండి నిన్నే అంటిపెట్టుకుని ఉన్న ఆ కోపం అంత తొందరగా నిన్ను విడిచి వెళ్ళిపోతుందంటావా? అహహా… అలా అని కాదు. ఓ చిన్న డౌట్… అంతే!
(ఆ మాటలు విన్న కేశవరావు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న కోపంతో… గుడ్లురిమి సోమనాధం పైపైకి వెళ్తూ…)
కేశవరావు : ఏంటి… డౌటా! అసలు నాకు తెలియక అడుగుతా… నీకు మతుండే మాట్లాడుతున్నావా? కడుపుకి అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? లేకపోతే ఏంటి? మూడు సందర్భాల్లో జరిగిన పరిస్థితులు… అంత వివరంగా చెప్పినా నీకర్థమవలేదంటే ఏమనుకోవాలి? నీ గురించి! హు… నాకు కోపం తగ్గలేదంటావా? అవున్లే నీ వెధవ బుద్ది పోనిచ్చుకున్నావ్ కాదు!
(కేశవరావు కోపంతో అన్నమాటలకు భయపడ్డ సోమనాధం… హతాశుడై వెనక్కి వాలాడు… అంతలోనే కేశవరావు శాంతించి సోమనాధం కేసి నవ్వుతూ చూస్తూ)
కేశవరావు : అని… అంటాననుకున్నావ్ కదూ! నో… అవి ఒకప్పటి మాటలు. కాని… ఇప్పుడు అలా అనను కాక అనను… పోనీలే సోమనాధం… నీ అభిప్రాయం అది… దాన్ని నేను గౌరవిస్తాను. అయినా, భవిష్యత్తులో మనిద్దరం కలిసే తిరుగుతుంటాం కదా! ఎప్పుడో ఒకప్పుడు నాకు కోపం తెప్పించే పరిస్థితులు రాకపోతాయా! అప్పుడు నేనెలా శాంతంగా ఉంటానో నువ్వు చూడకపోతావా!! అప్పుడైనా తెలుస్తుందిలే నీకు… నాలో కోపం తగ్గిందని… చూద్దాం! లే భోంచేద్దాం పద!
(కేశవరావు మాటలతో కొంచెంగా తేరుకున్న సోమనాధం… మారుమాట్లాడకుండా కేశవరావుని అనుసరించాడు)