Site icon Sanchika

నేను నా బుడిగి-2

[box type=’note’ fontsize=’16’] “మన చుట్టూ వున్నవాళ్ళంతా మనవాళ్ళే అనుకుంటూ మనం అందరితో మంచిగుంటే వాళ్ళూ మనతో మంచిగా వుంటారని చెప్పింది అమ్మ” అంటూ “నేను నా బుడిగి” కథ రెండవ భాగంలో చెబుతున్నారు వాసవి పైడి. [/box]

[dropcap]మ[/dropcap]ర్నాడు మేం నిద్రలేచేసరికి అమ్మ, అమ్మమ్మ ఇద్దరూ కనిపించలా. అసలు మేము మా ఇంట్లోనే లేము. ఆరిఫా వాళ్ళింట్లో వున్నాం. ఆ రోజంతా ఆరిఫా మాతోనే వుంది. అన్వర్ కూడా మాతోనే బుధ్ధిగా వున్నాడు. వాడికి కూడా నాకులానే తినడానికి ఒకదాని తర్వాత ఒకటి వస్తా వుంటే బానే వుంటాడు. నలుగురం చాలాసేపు చాలా చాలా ఆటలు ఆడుకున్నాం. అయినా ఒక్కసారి కూడా అన్వరూ, నేను కొట్టుకోలా. ఒక్కసారిగా మేమింత మంచివాళ్ళం ఎట్టయిపోయామో!

తమ్మున్ని తీసుకురావడానికి హాస్పిటల్‌కు వెళ్ళారంట అమ్మమ్మ, అమ్మ అని చెప్పారు ఆరిఫా వాళ్ళమ్మ ఫాతిమా ఆంటీ. సాయంకాలానికి అమ్మమ్మ వచ్చింది. చెల్లి పుట్టిందని చెప్పగానే అందరం ‘భలే -భలే’ అంటూ చప్పట్లు కొట్టాం. ఆరిఫా, అనిత, నేనూ సంతోషంతో బాగా గంతులేసాం. కాసేపయ్యాక అన్వరు కూడా కలిసాడులే.

ఫాతిమా ఆంటీ బెల్లం పాయసం చేసి నాకు బాగా ఇష్టమని పెద్ద గ్లాసులో పోసిచ్చారు. అమ్మమ్మ మాత్రం కొంచెం బాధగానే వుంది. రాముడు దేముడు తన మాట వినలేదని చింత కాబోలు. చిన్నచెల్లిని చూద్దామంటే “పొద్దున్నే నాన్నతో వద్దురులే” అని చెప్పి మళ్ళీ అమ్మ దగ్గరకు వెళ్ళింది. రాత్రి ఆరిఫా వాళ్ళింట్లో అన్నం తినేసాక నాన్న ఇంటికొచ్చారు. అప్పుడు మా ఇంట్లోనే నాన్న దగ్గర పడుకున్నాం. నాన్నతో చిన్నచెల్లి గురించి మాట్లాడాలనుకుంటే నాన్నేమో పడుకున్న వెంటనే గుర్రుపెట్టేసారు.

మర్నాడు పొద్దున్నే నాన్న త్వరగా లేచేసి స్నానం చేసి అనితనూ, నన్నూ లేపి స్నానం చేయించి  రెడీ అవమని చెప్పి, ఆ తర్వాత ముగ్గురం కలిసి హాస్పిటల్ కెళ్ళాం. అక్కడ అమ్మ పక్కనే పడుకోనున్న చెల్లిని చూసాం. బుజ్జిగా వుంది. తల తప్ప ఇంకేం కనిపించకుండా తెల్ల టవలు చుట్టేసుకుని కళ్ళు మూసుకొని నిద్ర  పోతావుంది. అమ్మ దగ్గరకెళ్ళి చిన్నగా ‘చెల్లీ’ అని పిలిచాం. నిద్రలో వుంది కదా! వినిపించుకోలేదు. చెల్లికి మేమొచ్చామని తెలీదు. అందుకే నిద్రపోతావుంది.

“నేనొచ్చేదాకా అల్లరి చేయకుండా అమ్మమ్మ చెప్పినట్లు వుండండి.”ముఖ్యంగా నావైపు తిరిగి నన్నే చూస్తా జాగ్రత్తలు చెప్పింది అమ్మ. అమ్మకు ఎప్పుడూ నా అల్లరి గురించిన ఆలోచనే కదా!

“సరేలేమ్మా! నువ్వు కూడా చిన్నచెల్లిని జాగ్రత్తగా చూసుకో” అని అమ్మతో చెప్పేసి, అమ్మమ్మతో కలిసి ఇంటికొచ్చేసాం. రోజూ పొద్దునా, సాయంత్రం నాన్నతో అమ్మ, చిన్నచెల్లి దగ్గరకెళ్ళి, అమ్మమ్మతో తిరిగొస్తుంటే భలేగా వున్నది. హాస్పిటల్లో ఇంకా చాలామంది చిట్టిపాపలు వాళ్ళమ్మ దగ్గర బజ్జోనుంటే వాళ్ళందరినీ కూడా అమ్మమ్మతో వెళ్ళి చూసి, పలకరించి వచ్చేస్తాం అనిత, నేనూ. ఇంటికొచ్చాక ఆరిఫా, అన్వరుతో ఇవన్నీ చెప్పుకొని ఆడుకుంటూ వుంటే ఒకరోజు అమ్మ, చిట్టి చెల్లి ఇంటికొచ్చేసారు.

చిన్నచెల్లి వచ్చాక ఇల్లంతా మారిపోయింది. నాన్నగదిలో పెద్ద ఉయ్యాల, అందులో చిన్న పరుపు. అందులో చెల్లిని పడుకోబెట్టి చుట్టూ దోమతెర వుంచేస్తారు. అమ్మమ్మ చెల్లికి స్నానం చేయించి అమ్మ దగ్గర యిచ్చేసి ఇల్లంతా పొగ వేస్తుంది. అప్పుడు ముక్కుకి మంచి వాసన. స్నానం చేయించినంతసేపూ ఏడ్చి, ఆ తర్వాత చాలాసేపు నిద్రపోతుంది చిన్నచెల్లి. అలా వున్నప్పుడే అమ్మ తనకు పౌడర్ రాసి, బొట్టుపెట్టి, గౌను వేసుంచితే, అమ్మమ్మ వచ్చి ఉయ్యాలలో పడుకోపెడుతుంది. అనిత, నేనూ కాసేపు చిన్నగా ఉయ్యాల వూపి వచ్చేస్తాం. చెల్లిని ఎప్పుడంటే అప్పుడు చూడకూడదంట. ముఖ్యంగా బయటకెళ్ళి వచ్చాక అమ్మమ్మ మమ్మల్నా గది లోకే వెళ్ళనివ్వడంలేదు.

అనితలా నాతో ఆడుకోని చెల్లిని నేనూ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కాని, నాన్న మాత్రం నన్ను బాగా పట్టించుకున్నారు.

చెల్లి వచ్చిన కొన్ని రోజులకే నన్ను ఆరిఫా వాళ్ళ బడిలో చేర్పించారు. అంతకుముందు నాకు బడిలో చేరే టయిము యింకా రాలేదని చేర్చుకోలేదు. కాని యిప్పుడు నాన్న, “అలవాటు చేసుకోవాలి”, అని చెప్పి చేర్పించేసారు. ఇప్పుడు అన్వరూ, నేనూ ఒకే బడి, ఒకే క్లాసు. చెల్లి పుట్టినప్పుడు వాళ్ళింట్లోనే వున్నాం కదా! “మాకు చెప్పకుండా మమ్మల్నలా వదిలిపెట్టిపోతే ఎలాగమ్మా?”, అని అమ్మనడిగా.

మన చుట్టూ వున్నవాళ్ళంతా మనవాళ్ళే అనుకుంటూ మనం అందరితో మంచిగుంటే వాళ్ళూ మనతో మంచిగా వుంటారని చెప్పింది అమ్మ. ఆరోజు ఆరిఫా, అన్వర్‌లతో పాటూ అనితనూ, నన్నూ ఫాతిమాఆంటీ వాళ్ళూ ఎంతబాగా చూసుకున్నారో. అన్వర్ కూడా వాళ్ళింట్లో వున్నంతసేపూ నేనేం చేసినా ఏమీ అనలేదు. అన్వర్ కూడా మంచిపిల్లాడే.

చిన్నచెల్లి వల్ల నేనుకూడా మంచిగా పెద్దయి పోయా. ఇప్పుడు అన్వరూ, నేనూ ఊరికే గొడవపడకుండా బుధ్ధిగా బడికెళ్తాం. రాముడు దేముడు నాకు చిన్నచెల్లితో పాటూ అన్వర్‌ను  కూడా మంచి ఫ్రండ్‌గా చేసిచ్చాడు. ఇప్పుడు రాత్రి వినాయకుడితో మాట్లాడడంలేదు. అరుగుపైన అరటిపండ్లన్నీ అలాగే వుంటున్నాయి. సాయంకాలం ఆటలయ్యాక మాత్రం మా నలుగురికీ ఆహారమైపోతుంది.

బడికెళుతున్నప్పటినుండి నాకు మునపటిలా తీరిక చిక్కడం లేదు. బడిలో టీచరు, పాఠం, బెత్తంతో సరిపోతుంది. ఇంటిదగ్గర వున్నంతసేపూ అనిత, నేనూ అమ్మతో, చెల్లితో వుంటాం. ఎంతసేపూ చిన్నచెల్లి నిద్రపోవడం, కాసేపు ఏడ్చి పాలు తాగడం, మళ్ళీ నిద్రపోవడం. రోజంతా అదే పని. నేను బడికెళ్ళినప్పుడు కూడా అంతే అంట అనిత చెప్పింది.

“ఏంటమ్మా! చెల్లి మాతో ఆడుకోదా?” అనడిగా అమ్మను. “కొంచెం పెద్దవనీ” అంది అమ్మ.

“అంటే యిప్పుడు ఏంటి? ఇది చెల్లికాదా! బుడిగీనా?” అన్నా విసుగొచ్చి. మా ఊరెళ్ళినప్పుడు పెద్దగుడి దగ్గర అంగళ్ళలో బుల్లి తాటాకుబుట్టల్లో వుండే ‘చెక్కబుడిగీ’లను కొనిచ్చింది అమ్మ. అందులో వంటింట్లోవుండే సామాన్లు బుల్లివిగా వుంటాయి. వాటిలో ఉత్తుత్తిగా వంటచేసి, ఇంట్లో అందరికీ పెడుతుంటాం చెల్లీ, నేనూ.

చూడబోతే చిన్నచెల్లి అలాగే వుంది.

రాత్రి నాన్నొచ్చాక చెల్లి మాతో ఎప్పుడు ఆడుకుంటుందని అడిగా. “అప్పుడేనా! దానికింకా పేరు పెట్టలేదు. నడక రాలేదు. ఇంకా మాటల్రావు” అన్నారు.

“మరయితే త్వరగా పేరు పెట్టేసేయ్ నాన్నా! పిలుస్తావుంటే తొందరగా పెద్దవుతుంది” అన్నా.

“ఎప్పుడంటే అప్పుడు కాదు. ఊర్నుండి చుట్టాలంతా రావాలి” అన్నారు.

“ఎప్పుడొస్తారు?” అంటే. “వాళ్ళకు తీరిక దొరికినప్పుడు”అని చెప్పి నా చేతికి ఒక మురుకు యిచ్చి నా నోటికి మాట్లాడే తీరిక లేకుండా చేసేసాడు.

ఆరోజు రాత్రి నిద్రపోయేముందు అనితతో, “చెల్లికి మనమే ఏదోఒక పేరు పెట్టేస్తామా! తొందరగా పెద్దయి మనతో ఆడుకుంటుంది” అని చెప్పా. మళ్ళా నేనే ‘వద్దులే’ అనేసా తమ్ముడి విషయం గుర్తొచ్చి”పోనీ ఓ పని చేద్దాం… చెల్లికి మనం పేరు పెట్టి ఆ పేరు ఎవ్వరికీ చెప్పకుండా మనిద్దరమే పిలుచుకుందామా!” అన్నా తన చెవిలో గుసగుసగా.

అనిత “సరే-సరే” అనింది. ఒళ్ళంతా కదిలిస్తా. ఏం పేరు పెడుదాం? అని కాసేపు ఆలోచించా. ఏ పేరూ తట్టడం లేదు గాని, ఈ లోపల అమ్మమ్మ, “తొందరగా పడుకోకపోతే పొద్దున్నే మెలకువరాదు, పడుకోండి” అని అరవడం మొదలుపెట్టేసింది. కాని, ఏదో ఒక పేరు అనుకోకపోతే నాకు నిద్దర పట్టదే. “బుడిగి అందామా”అన్నా అనితతో.

“అవునవును. బుడిగీనే. భలే బావుంది” కిలకిలా నవ్వుతా అంది. “ఏందే బాగుండేది? పొద్దస్తమానం బుడిగీలే!! పడుకోండి” విసుగ్గా అనింది అమ్మమ్మ.

నోటికి చెయ్యడ్డం పెట్టుకొని చప్పుడు లేకుండా మంచం కదిలిపోయేలా… నిద్రపోయేదాకా… మళ్ళా పొద్దున మెలకువొచ్చేదాకా మాకిద్దరికీ నవ్వులే నవ్వులంట. ఉదయం నిద్రలేచాక అమ్మమ్మే చెప్పింది.

ఆరోజు బడికి పోయేముందు అనిత, నేనూ చిన్నగా చెల్లి ఉయ్యాల దగ్గరగా వెళ్ళి ‘బుడిగీ-బుడిగీ’ అని  పిలిచాం. అప్పుడు మళ్ళీ మాకిద్దరికీ ఒళ్ళంతా చప్పుడు లేని నవ్వులు. మళ్ళా అవి ఇళ్ళంతా ఒలికిపోతా.

బడికి పొయేప్పుడు దారిలో ఆరిఫాకి, అన్వర్‌కి బుడిగి గురించి చెప్పా. అన్వరూ, నేను కలిసి క్లాసులో అందరికీ చెప్పేసాం. ఇంట్రవెల్‌లో మా టీచరు “మీ చెల్లి ముద్దుపేరు తమాషాగా వుందే!” అని కూడా అనేసారు. మధ్యాహ్నం ఇంటికొచ్చాక, అందరం అన్నం తింటుంటే బుడిగి నిద్దరలేచి ఏడుస్తావుంది. అప్పుడు  అమ్మ, “ఇదిగో ఆగవే బుడిగీ వచ్చేస్తాం” అనింది. అప్పుడు  నేను తప్ప మిగతావాళ్ళంతా నోటికి ఎంగిలిచెయ్యి అడ్డం పెట్టుకొని నవ్విందే నవ్వింది. నాకు మాత్రం నవ్వురాలా. ఈ పేరు చెల్లికి నచ్చకపోతే నా జుట్టు పీకదు కదా!! మళ్ళా ఈ జుట్టు పీక్కునే పని నా నెత్తిమీదకి నేనే తెచ్చుకున్నాను కదా! అనేదే నా బాధ సామీ.

ఓ పక్కన నాన్న ఇంటికి చుట్టాలనెప్పుడు పిలుచుకొనొస్తారో… బుడిగికి ఏం పేరు పెడతారా! అని ఎదురుచూస్తావుంటే చుట్టాలసంగతేమో గాని, చెల్లికి ఒళ్ళు బాగలేదని ఇంటికి డాక్టరుగారు మాత్రం హడావిడిగా వచ్చేసారు. అప్పటినుండి అప్పుడప్పుడు చిన్నచెల్లికి ఊపిరాడకుండా వుండడం-అరనిముషంలోనే డొక్కలెగరేస్తా ఇంట్లో పెద్దోళ్ళనంతా భయపెట్టేస్తా వుంది. అలాగ ఎప్పుడు ఎలా వచ్చేస్తుందో ఎవరికీ తెలీదు. అసలే చిన్నది -ఎప్పుడూ నిద్రపోతావుంటుందనుకుంటే ఇప్పడు ఈ ఆయాసంతో వున్న బుడిగిని చూస్తే భయంగా వుంది. కొంచెం పెద్దయ్యేవరకు అలాగే వుంటుందంట. జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అన్నారు నాన్న.

చుట్టాలనెవ్వరినీ పిలవకుండానే నాన్న బుడిగికి పేరు పెట్టేసారు. ‘సరిత’ అని. దానికన్నా బుడిగీనే బావుందన్నా. అనిత కూడా “అవున్నాన్నా” అంది. అమ్మ “సరేలేర్రా” అనింది. అమ్మమ్మ మాత్రం మూడోరాణి ఎట్టుండబోతుందో అని ఆకాశం కేసి చూస్తా… అక్కడెవరు కనిపించారో…. దణ్ణం పెట్టింది. ఆరోజూ నాన్న బుడిగికి బంగారు చైను తెచ్చారు. అంతకుముందే అమ్మ మా ముగ్గురికీ గౌన్లు కుట్టిచ్చింది. అమ్మమ్మ చాలా లడ్లు చేసి చుట్టుపక్కల అందరికీ ఆరిఫా సాయంతో నాచేత పంచిపెట్టిచ్చింది.

నాచేతినుంచి లడ్డూలు తీసుకున్నోల్లంతా నాన్నని మెచ్చుకుంటుంటే భలేగా వుంది. అమ్మమ్మ మాత్రం మాకులాగా నవ్వతా లేదు. రాత్రి నిద్రపోయేప్పుడు “ముగ్గురాడపిల్లలకు పెళ్ళి చేసి పంపాల. ఎంత కష్టపడాలో కదా! భగవంతుడు ఒక్క కొడుకునన్నా యీకపోయెనే!!” అని బాధపడింది. అది చూసి నాకూ బాధేసింది. అమ్మమ్మ దగ్గరకెళ్ళి “ఆరోజు నా కలలో తమ్ముడు జుట్టు పీకకుండా వుంటే మేము మొక్కు తీసేసుకునేవాళ్ళం కాదు. అప్పుడు తప్పకుండా తమ్ముడే పుట్టుండేవాడు” అని చెప్పా.

అమ్మమ్మ కళ్ళు పెద్దవి చేసి నా వంక అదోలాచూసి “అయ్యో దేవుడా! దీనికి తిండి ధ్యాస తప్ప తెలివిలేక పాయె. రెండోదానికి రెండూ తక్కువే. ఇక ఇప్పుడు పుట్టిన పిల్లకు ఒళ్ళు సరిలే. ఇక అంతా నీదే భారం తండ్రీ” అని కిటికీ లోంచి కనిపించే ఆకాశం కేసి చూస్తా దణ్ణం పెట్టుకొని, నాతో “ఇక పడుకో తల్లీ” అని అదో మాదిరిగా అనింది. నాకు అమ్మమ్మ మాటలు అర్ధం కాకపోయినా నవ్వులేని ఆ మొహంలో ఏదో వుందనిపించింది. అందుకే ఇక మీదట దేని గురించయినా దేవుడికి మొక్కుకునే ముందు అమ్మకు చెప్పేయాలి అని మాత్రం అనిపించింది.

బడికి పోవడం వల్ల నాకు చాలామంది ఫ్రండ్సయిపోయారు, సాయంత్రం బడినుంచొచ్చాక  అన్వరూ వాళ్ళతో కలిసి ఆడుకుంటాడు. నాకు వెళ్ళాలనున్నా అమ్మ పంపదు. అనితతో ఆడుకోమంటుంది. అప్పుడు ఊరుకుంటా గాని, సాయంత్రం నాన్న ఆఫీసునుండి తొందరగా ఇంటికొచ్చి, మళ్ళీ ఎక్కడికన్నా వెళుతుంటే మాత్రం నేనూ వెళ్తా. అలా నాన్నతో కొన్ని సినిమాలు చూసా. అందులో కొన్ని తెలుగులో మాట్లాడవు. కొన్ని ఆరిఫా వాళ్ళ మాటలుంటాయి. కొన్నయితే అసలేమీ అర్ధంకావు. అయినా నాన్నతో పోయేది మాత్రం మానను. అక్కడ కోకోకోలా, క్యాడ్ బరి చాక్లెట్, హనీకేక్ నాకోసం చూస్తుంటాయి కదా.

కొన్నిరోజులయ్యాక చిన్నమామయ్యొచ్చాడు. ఎందుకొచ్చాడంటే అమ్మమ్మను ఊరికి తీసుకెళ్ళడానికి. ఆరోజు నేను బడికి వెళ్ళనన్నాను. అప్పుడంతా అమ్మమ్మ పైన కోపం వచ్చేది కాని, ఇప్పుడు అమ్మమ్మ ఊరెళుతుందంటే ఏడుపొస్తుంది. వెళ్ళొద్దని నేనూ, నన్ను చూసి అనిత ఏడ్చాం. బుడిగి వచ్చినప్పటినుండి మాకేం కావాలన్నా అమ్మమ్మే చూసుకుంటుంది. ముఖ్యంగా రోజూ నాకు తినడానికి ఏదో ఒకటి చేసిపెడుతుంది. ఇంకా రాత్రి పడుకునేముందు దేవుడి కథలు చెబుతుంది. ఇంకా, శుభ్రంగా స్నానం చేయడం, బట్టలు పాడు చేసుకోకుండా వుండడం ఇలాంటివి చాలానే చెప్పించింది. అందుకే వద్దని చెప్పాను. మామయ్య మాత్రం మళ్ళీ తీసుకొచ్చేస్తానులే అని చెప్పి రాత్రి మేము నిద్రపోయి తెల్లవారి లేచి చూచేసరికి అమ్మమ్మతో పాటూ బుడిగిని కూడా తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు మాత్రం అమ్మతో అనిత కోప్పడింది. ఎందుకోగాని, నాకు మాత్రం ఏమీ అనిపీలా.

మళ్ళీ ఇంట్లో మేము నలుగురమే అయిపోయాము. అమ్మకు బుడిగి లేదు కాబట్టి చాలా తీరిక వచ్చేసింది. నన్ను బడికి రెడీ చేసి అనితతో వీధి గేటు వరకు వచ్చి టాటా చెప్పిస్తుంది. అనితకు, నాకూ చాలా గౌన్లు కుట్టిచ్చి, వాటిమీద పువ్వులు, పక్షులు ఇంకా ఏమేమో బొమ్మలు సూదికి రంగురంగుల దారాలు యెక్కిచ్చి కుడుతుంది. ఇవన్నీ ఫాతిమా ఆంటీ కూడా చేస్తారు. ఒక్కోసారి ఆరిఫా, అనిత, నాకూ ముగ్గురికీ ఒకేలా వుండే గౌన్లు కుట్టిస్తారు.

ఇప్పుడు నేను అన్వర్‌తోగాని, ఆరిఫాతో గాని అంగడికి వెళ్ళి సరుకులు, ఇంకా కూరలూ పట్టుకొస్తాను. అప్పుడు అమ్మమ్మ తప్పకుండా గుర్తొస్తుంది. మామయ్యనుండి జాబు వచ్చినపుడు అమ్మ బుడిగి గురించి చెబుతుంది. నాకిప్పుడు బుడిగి గుర్తు రాదు. ఎందుకంటే ఇప్పుడు నాకు బోలెడంత మంది  ఫ్రండ్స్, ఇంకా చాలా పనులు వుంటున్నాయి. అనితతో బుడిగీలాట అయిపోయాక మాత్రం అనిపిస్తుంది… ఏమంటే… తాటాకుబుట్టలో మా బుడిగీలు భద్రంగా దాచిపెట్టుకున్నట్టు మన బుడిగీని అమ్మ అమ్మమ్మ దగ్గర జాగ్రత్తగా దాపెట్టిందని. అమ్మతో “అంతేకదా!” అంటే, “నీకు చాలా విషయాలు తెలుసు పిల్లా” అని శబ్దం లేకుండా నవ్వి నా నెత్తిపై చిన్నగా మొట్టుతుంది.

అమ్మ చెప్పింది నిజం కాదని నాకూ ఇప్పుడిప్పుడే తెలుస్తూంది. నాకు చాలా విషయాలు తెలియవు. కొన్ని బడిలో టీచరు, ఫ్రండ్స్, ఇంటి దగ్గర ఆరిఫా వల్ల తెలుసుకుంటున్నా. ఒకరోజు అన్వరు, నేనూ మా వీధి చివర వుండే అంగడికి వెళ్ళొస్తా దారిలో ఒక ఇంటి ముందు గేటు లోపల మీంచి గోడ పై నంతా కొమ్మలు పరచుకొని వుండే సపోటా చెట్టు చూసాం. చెట్టు నిండా గట్టిగా వుండే పండ్లు చాలా వున్నాయి. గేటు పైనుండి గోడ యెక్కితే అవన్నీ అందుతాయి. అన్వర్ గేటు మీదుగా గోడెక్కి కాయలు కోస్తుంటె నేను చూస్తూ… కిందపడిన కాయలు యెత్తుకుంటూ వున్నా. ఆ ఇంట్లో నుండి అమ్మమ్మ అంతావిడ వచ్చి మమ్మల్ని పిలిచి “ఎవరుమీరు? ఎవరి పిల్లలు? మీ ఇల్లెక్కడ?” అని గట్టిగా అడుగుతూ కోప్పడ్డారు. “ఇంకెప్పుడూ చెట్టు గల్లవాళ్ళను అడగకుండా అలా గోడెక్కి కాయలు కోసుకోవద్దు” అని మందలించారు. మేం కోసుకున్న కాయలన్నీ యిచ్చేయమంటే మాత్రం నాకు చాలా కోపం వచ్చేసింది, “మేం కష్టపడి గేటు మీంచి  గోడెక్కి కోసుకుంటే… అలా తీసేసుకుంటారే! తప్పుకదా!” అన్నా. అప్పుడు మాత్రం అమ్మమ్మ లాంటామె అన్వర్‌ని అక్కడే వుండమని నాతో “మీ పెద్దోళ్ళని పిలుచూకొనిరా పో. అప్పుడిస్తాను.” అన్నారు. నేనూ “సరే”, అని చెప్పి ఇంటికి వెళుతుంటే… కొంచెం సేపటికి అన్వర్ కూడా వచ్చేసాడు. సపోటాలు వద్దని చెప్పి వచ్చేసాడంట.

ఇంటికి వెళ్ళాక ఈ విషయం ముందుగా అన్వర్ వాళ్ళమ్మకు చెప్పాం. అంతే కర్ర తీసుకొని అన్వర్ కాళ్ళూ, చేతులపై గట్టిగా కొట్టింది వాళ్ళమ్మ. వాడు ఇల్లంతా పరిగెడతా చాలా దెబ్బలు తప్పించుకున్నాడు. దాంతో నేనేమీ చెప్పకుండానే అమ్మకు తెలిసిపోయి నన్ను కూడా నాన్నగీతలు గీసుకునే రూళ్ళకర్రతో బాగానే వాయించింది. తగిలిన దెబ్బలకు నేనూ, ఇదంతా చూసిన భయంతో అనిత బాగానే ఏడ్చాం.

రాత్రి అన్నం తింటున్నప్పుడు నాన్నకు సపోటాల గురించి చెప్పింది అమ్మ. “చెట్టుగల వాళ్ళకు చెప్పకుండా అలా కోసుకోవడం తప్పు. ఇంకెప్పుడూ అలా చేయవు కదా కవితా తల్లీ!” అన్నారు నాన్న. “సరే నాన్నా! రేపు మేమిద్దరం ముందుగా వాళ్ళకు చెప్పి మరీ కోసుకుంటాములే” అని చెప్పా. అప్పుడు కూడా అమ్మకు కోపం వచ్చేసింది. పక్కనేవున్న గరిటతో మళ్ళీ నెత్తిన ఒక్కటిచ్చింది. “ముక్కూ, మొహం తెలీని వాళ్ళని అలా అడగకూడదు” అంటూ… ముక్కు, మొహం అమ్మమ్మవి లాగున్నాయి, నాకు తెలుసు అని చెప్పాలనుకున్నా. కాని, అమ్మ కోపం చూసి భయమేసి అప్పటికి ఊరుకున్నా. ఇలా ఇంకా ఎన్ని విషయాలూ తెలుసుకోవాలో!! ఎన్ని దెబ్బలు తినాలో అని కొంచెం కాదులే చాలా ఎక్కువగానే భయమేసింది కాని, అప్పుడు మాత్రం అన్వర్ గాడు గుర్తొచ్చాడు. వాడు వాళ్ళమ్మ దగ్గర చాలా దెబ్బలు తగలకుండా తప్పించుకున్నాడు. ఇంకా… సపోటా అమ్మమ్మ నుంచి కూడా పెద్దోళ్ళ సాయం లేకుండానే వచ్చేసాడ… ఇలాంటి విషయాలలో వాడిని చూసి చాలానే నేర్చుకోవాలి అని మాత్రం  గట్టిగా అనుకున్నా. ఎందుకంటే అమ్మకు కోపం వస్తేనే అంత గట్టిగా దెబ్బలేసిందే, మరి నాన్నకు కోపం వస్తే ఇంకా గట్టిదెబ్బలు తగులుతాయి కదా! అందుకు.

(ఇంకా ఉంది)

Exit mobile version