Site icon Sanchika

నేను నా బుడిగి – 6

[box type=’note’ fontsize=’16’] “ఇక్కడ చెల్లికి బాలేదు, అక్కడికెళ్ళాక నాకు బాగుండదు. మనకు సాకులు చెప్పి ట్యూషన్ మానేసే హక్కులు లేకపోయె” అంటున్నారు వాసవి పైడి ‘నేను నా బుడిగి’ కథ ఆరవ భాగంలో. [/box]

[dropcap]ఆ[/dropcap]నందమంతా ఆదివారానికే సొంతం కాబోలు. సోమవారం మళ్ళీ మామూలే. అలారం గంట మోగినట్లు అన్ని పనులూ ఒకదాని తర్వాతొకటి అయిపోతావుంటాయి. మేము బడికి వెళ్ళేప్పటికి బుడిగి లేవలా. నాన్నలాగా బజ్జోనే వుంది. కాని, బడి నుంచొచ్చాక మాత్రం మాకోసం వరండాలో అమ్మమ్మతో పాటూ చూస్తా వున్నది. కాని, మనకు అప్పుడు టయిమెక్కడ? కాళ్ళూ చేతులు కడుక్కోని, అమ్మ పెట్టిన టిఫెన్‌తో పాటూ కొన్ని తిట్లు కూడా తినేసి కాసేపు అమ్మను విసిగించేస్తే ట్యూషన్ టైం వచ్చేస్తుంది. అప్పుడు అమ్మ ఆగమన్నా మేం ఆగం. ఎందుకంటే లేటుగా వెళ్తే సార్ గోడకుర్చీ వేయిస్తారు. బుడిగికి ‘టా టా’ చెప్పి ట్యూషన్ కొచ్చేసాం. అక్కడ కాసేపటికి జరిగిందొక వింత…

ట్యూషన్‌కు బుడిగిని ఎత్తుకొని పెద్దసార్, ఆ వెనకాలే చిన్నసార్ వచ్చారు. “ఎవరా పాప? భలే వుంది. ఆ జుట్టు చూడు రింగులు రింగులుగా” అంది నా పక్కనే వున్న భాగ్య. అది మా చెల్లి అని చెప్పింది అనిత. “బాగుండేవన్నీ మీవే అని చెప్పేస్తారే! మీ ఇంట్లో ఎప్పుడూ చూల్లేదు ఇప్పుడెలా వచ్చేసింది నడుచుకుంటా ఈ పిల్ల” అని భాగ్యతో పాటూ అంతా అనడమేకాని ఎవ్వరూ మా మాట వినిపించుకోలేదు. దానికితోడు బుడిగిని సార్ దించగానే అది వెళ్ళి మణి పక్కన కూర్చుంది. “మీ చెల్లి అన్నారే! మరి మీ దగ్గరకే రాలేదు” మాచుట్టూ వున్న స్నేహితుల ప్రశ్నలకు నేనేమి సమాధానం చెప్పేది? అనిత ఏం మాట్లాడకుండా గమ్మునే చూస్తుంది. ఇలాంటప్పుడు ఏంచేయాలో, నాకేమైనా అర్థమయితే కదా! ఇప్పుడు వెళ్ళి బుడిగిని పిలిస్తే అది రాలేదనుకో అ తరవాత చేయడానికింకేం వుండదు. ఏం మాట్లాడకుండా కూర్చున్నా.

పాఠం అయిపోయి ఆటల దగ్గరకొచ్చాం. అందరం ఆడుకుంటుంటే మణి ఒక్కడే పాఠం చదువుతున్నాడు. బుడిగి లేచి మణి చేయిపట్టుకుంది ‘రా అక్కడికెళ్దాం’ అంటూ మమ్మల్ని చూపుతున్నట్లుంది… మణి మాట్లాడకుండా వున్నాడు. సార్ దగ్గరకెళ్ళి ఏం చెప్పిందో వినబడలేదు కాని, మణి వచ్చి మాతో ఆడుకున్నాడు. ఆటంటే అందరూ రౌండ్‌గా కూర్చుంటే ఒకరు టవల్ పట్టుకొని రౌండ్ చుట్టూ పరిగెత్తుతూ, ఎవరో ఒకరి దగ్గర వాళ్ళ చేతిలోని టవల్ చప్పుడు లేకుండా వుంచి మరలా పరిగెడుతుంటారు. ఈలోగా రౌండ్లో టవల్ వెనకవున్న విషయం చూసుకుంటే సరి, లేకపోతే పరిగెడుతున్నవాళ్ళక్కడికి వచ్చి టవల్ తీసుకొని ముందున్న వాళ్ళని ఆ టవల్‌తో బాదుతూ ఔట్ చేస్తారు. కొట్టుకునే ఆటలు పిల్లలకు సరదాగా వుంటుంది కదా, ఈ ఆట! చూసేవాళ్ళకు కూడా సరదానే. ఆటలైన తర్వాత ఇక ఇంటికెళ్తూ బుడిగికోసం చూస్తే అక్కడలేదు. ఆరోజు నా స్నేహితులంతా నేనేదో తప్పు చేసినట్లు నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు.

ఇంటికి వెళ్ళేసరికి బుడిగి అమ్మమ్మ దగ్గర అన్నం తింటూంది. అమ్మ దగ్గరకెళ్ళి “బుడిగి మా చెల్లి అంటే ఎవరూ నమ్మలేదమ్మా! బుడిగి కూడా అక్కడ మాతో లేదు. అందరూ నేను అబద్దం చెప్పానన్నారు” అంటూ చెప్తుంటే నాకు ఏడుపొస్తూంది. అనిత అయితే ఊ.. ఊ… అని ఏడ్చేస్తూంది. అమ్మ ఏం పట్టించుకోకుండా వంటింట్లోకెళ్ళింది. ఏదైనా తనకు నచ్చని విషయమైతే అమ్మ సమాధానం చెప్పదు.

వంటింట్లో అమ్మ ఆయుధాలుంటాయి, అక్కడ మనం ఏంచేసినా అవి ఎగిరి మన మీదపడుతాయి అందుకే ఏం మాట్లాడకుండా బుడిగినే చూస్తున్నా. ఇక ఈ విషయం నాన్నవచ్చాక నాన్నకు చెప్పాల్సిందే.

ఉదయం బడికెళ్ళేముందు నాన్నని నిద్రలేపి బుడిగి గురించి అడిగా. “అది నాతో కూడా మాట్లాడడం లేదే!” అన్నారు ఆవులిస్తా. అది నిజమేకదా! అమ్మమ్మ దగ్గరకెళ్ళి అడిగా. “బుడిగి చిన్నపిల్ల కదా! అందరినీ మర్చిపోయింది. కొత్తగా వుంది అందుకే అలా చేస్తుంది” అని తేలికగా తీసిపడేసింది. ఈలోగా బామ్మ వచ్చి “ఏం కవితా, చెల్లితో ఆడుకుంటా ప్రసాదం సంగతి కూడా మర్చిపోయావు” అంటూ బెల్లం పొంగలి వున్న గిన్నె నా చేతిలో పెట్టి వెళ్ళింది… ఈ బామ్మ ఒకటి అసలే చెల్లి మాతో కలవట్లేదని మేమేడుస్తుంటే, అనుకుంటా వుంటే ఐడియా వచ్చింది…

అప్పుడే నిద్రలేచొచ్చిన బుడిగి చేతీలో ప్రసాదం గిన్నె వుంచి బామ్మ చేసిన ప్రసాదం తినమని చెప్పా. తియ్యగా రుచిగా వుంటుందికదా! మొత్తం తినేసింది. సాయంత్రం ట్యూషన్‌కు నాతో వస్తావా! అనడిగా. ‘ఊ’, అని తలూపింది. హమ్మయ్య నాతోపాటూ చెల్లిని తీసుకెళ్తే ఇంకెవ్వరూ ప్రశ్నలేయరు. ఎగురుకుంటా బడికెళ్ళా.

బడిలో అందరికీ వాళ్ళు అడగకముందే చెల్లిని సాయంత్రం ట్యూషన్‌కి నేనే తీసుకొస్తానని చెప్పా. ఎవరూ నమ్మినట్లు లేరు. అందుకే ఏంమాట్లాడలేదు. సాయంత్రం చూసుకోవచ్చనుకున్నారేమో! ఒక్కోసారి వినాయకుడు నేను చెప్పేది సరిగ్గా అర్ధంకాక వేరేలా చేసేస్తాడు. సాయంత్రం అనిత, నేనూ ఇంటికొస్తే ఇల్లు తాళమేసుంది. బామ్మ ఇంటివైపువెళ్ళా. అక్కడ బామ్మ ఒక్కటే దేవుడి పుస్తకం చదువుకుంటూంది. మమ్మల్ని చూసి లోపలికెళ్ళి తాళంచెవి తీసుకోని ఇంటి తాళంతీసి “పుస్తకాలు లోపలపెట్టి కాళ్ళూ, చేతులు మొహం కడుక్కోని వంటగదిలో ఉప్మా వుంది తినేసి ట్యూషన్ వెళ్ళండి. బుడిగికి ఆయాసం గుందని, డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళారు, కాసేపట్లో వచ్చేస్తారు” అని చెప్పి వెళ్ళిపోయింది బామ్మ. మాకు, చిన్నప్పుడు బాగలేకుండా వచ్చిన బుడిగి గుర్తొచ్చింది. ఇప్పుడు, ట్యూషన్ కెళ్ళాలంటేనే భయంగుంది. ఇక్కడ చెల్లికి బాలేదు, అక్కడికెళ్ళాక నాకు బాగుండదు. మనకు సాకులు చెప్పి ట్యూషన్ మానేసే హక్కులు లేకపోయె. కాళ్ళీడ్చుకుంటా అనితతో కలిసి వెళ్ళా. అక్కడ చిన్నసార్ ఒక్కరే ఉన్నారు. నన్ను చూడగానే ‘రా రా.. కవి అక్కా’ అని పిలిచారు. బుడిగి వచ్చినప్పటి నుండి మనం అందరికీ అక్కే. దగ్గరికెళ్ళాక అనితనీ, నన్ను తన దగ్గరే కూర్చోమని చెప్పి మాకు రాజకుమారుడు- రెక్కలగుర్రం కథ చెప్పారు. కథ ఎంత బాగుందో అందరూ కథలోమునిగి నన్ను ఏమీ అడగలేదు. అందులోనూ సార్ పక్కనే కూర్చోనున్నాను కదా! ఏమీ జరగలా. లేకపోతే అందరూ బుడిగిని మర్చిపోయారా? ఏమో! కథ అవగానే అందరినీ సార్ ఇంటికి పంపేసారు. దారిలో అందరూ రెక్కలగుర్రంగురించే మాట్లాడుకుంటున్నారు ఈరోజు. చిన్నసార్ వినాయకుడిలా నాకుచాలా సాయంచేసారు.

ఇంటికెళ్ళేసరికి బుడిగి నిద్రపోతా వుంది. అమ్మ వంటింట్లో వుంది. నాన్న దగ్గరికెళ్ళాం ఏమైంది? అనడిగా బుడిగి తీపి ఏమీ తినకూడదంట తియ్యగావుండే పండ్లు, చల్లగావుండే ఐస్ క్రీం, ఇంకా నెయ్యి ఇవేమీ తినకూడదు. తింటే ఆయాసం వచ్చేస్తుంది. అప్పుడు బుడిగికి ఊపిరితీసుకోవాలంటే చాలా బాధ. చిన్నప్పుడు చూసాం కదా! ఉదయం బామ్మ ఇచ్చిన బెల్లంపొంగలి తిన్నది అందుకేనా ఇలా అన్నాను. అవును అన్నారు నాకు ఏడుపొచ్చేసింది. “నేనే నాన్నా తినమని ఇచ్చాను. తనకేం తెలీదు. తియ్యగా వుందికదా! మొత్తం తినేసింది” అని చెప్పి, అయ్యో! అని బుడిగి దగ్గరకెళ్ళా ఇప్పుడు గమ్మనే నిద్రపోతావుంది.

అమ్మ దగ్గరకెళ్ళాలంటే భయమేస్తుంది. ఎంత భద్రంగా అమ్మమ్మ దగ్గర ఉంచుకుంది బుడిగిని ఇవాళ నావల్లే కదా! అమ్మకు సారీ చెప్దామన్నా భయమేస్తుంది. శబ్దంచేయకుండా అమ్మమ్మ దగ్గరికెళ్ళి కూర్చున్నాం. బామ్మకూడా అప్పుడే వచ్చింది. చెల్లి కొంచెం పెద్దయ్యేదాకా జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత ఇంకెప్పుడూ ఇలా రాదని చెప్పింది బామ్మ. అమ్మమ్మ కూడా అది నిజమని చెప్పింది.

అమ్మ వంట పూర్తయింది. అన్నాలు తినేప్పుడు ఎవరూ మాట్లాడుకోలేదు. అమ్మకి కోపంగావుందా- బాధగావుందా! నాకైతే ఏమీ అర్థంకాలేదు. రాత్రి నిద్రపోగానే వెలుగొస్తుందికదా! మధ్యలో కలవస్తుంది. అన్నీ అప్పుడు వినాయకుడు చెబుతాడు.

బుడిగి నాదగ్గరే ఎందుకుండదు? చిన్నప్పుడు అమ్మమ్మతోనే వున్నది. అక్కడ అందరితో ఆడుకున్నట్లు ఇక్కడ కూడా చేస్తుంది. సార్ వాళ్ళు రాజు మామయ్యలా అనిపిస్తారేమో! ఇక బామ్మ అమ్మమ్మలా వుంటుంది. మరి పాపం నాన్న. నాన్నదగ్గరికి ఇప్పటివరకూ వెళ్ళలేదు. అమ్మతోనూ అంతే ఇక అనిత, నేనూ మా ఫ్రండ్స్ అందరం ఒకటేగా వున్నాం, అందుకనే అందరితో అలాగేవుంది. ఇప్పుడేమో తెలీక తీపి పొంగలి తినిపించానా! ఇంక నాతో ఎప్పటికీ మాట్లాడదేమో! కనీసం అనితతో నైనా వుండచ్చుకదా! బుడిగి లేచాక సారీ చెప్పాలికాని,. తనకి సారీ అంటే తెలీదుకదా! ఇపుడెలా?? వినాయకుడు వచ్చేదాక ఆగలేనే!

చలి వున్నప్పుడు ఉదయం ఎండ ఆలస్యంగా వస్తుంది. కాని, బామ్మ పూజలన్నీ ఎండరాకముందే అయిపోతాయి. బుడిగి ఆయాసం చూసి బామ్మ చలి తగ్గేవరకూ పూలుకోసే డ్యూటీ గణేశ్ వాళ్ళ పనిమనిషి కప్పజెప్పింది. పాపం గణేశ్‌కేమో చలికి పూలు కాకుండా పరుగు మొదలైంది. సార్‌లిద్దరూ మణిని, గణేశ్‌ని తీసుకొని రోజూ గ్రౌండ్ కెళ్ళి రౌండ్లు వేసొస్తారు. ఇంకా కొంతమంది అబ్బాయిలు వెళతారు. అమ్మాయిలు అమ్మకు సాయంగా ముగ్గులు, గొబ్బెమ్మలు. మాకు ట్యూషన్ ఉదయం ఆలస్యంగా, సాయంత్రం త్వరగా మొదలై గంటసేపు తగ్గిపోయింది. చలి ఎక్కువగా వుందని బుడిగి ట్యూషన్‌కు రావడంలేదు. మా ఫ్రండ్స్ ఏమో చలికి ఇల్లు కదలకుండా వున్నారు. బుడిగి మా చెల్లి అని వాళ్ళకు ఎలా చెప్పాలో నాకు వినాయకుడు ఇంకా చెప్పలేదు. ఐస్‌కొండపై వుండేవాళ్ళకు కూడా చలి కాలం వుంటుందా? ఏమో ఎన్నని గుర్తుపెట్టుకొని అడిగేది! బామ్మ దేవుడికి నైవేద్యం తీపి చేయడం లేదు పులిహోర, పొంగలి, పాలన్నం పెట్టి పక్కనొక బెల్లంముక్క పెడుతుంది. అలా చేయమని పెద్దసార్ చెప్పారంట. బుడిగి బామ్మని వదిలిపెట్టదు. బామ్మ చుట్టూతా తిరుగుతా వుంటుంది. బామ్మ మడికట్టుకున్నప్పుడూ సార్ వాళ్ళ దగ్గరవుంటుంది. మొత్తానికి మాఇంట్లోకన్నా బామ్మ ఇంట్లోనే వుంటుంది. ఇంట్లో వుంటే అమ్మమ్మతో. అనిత, నేనూ బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు మా దగ్గర కూర్చోని చూస్తూ వుంటుంది. కొంచెం సేపయ్యాక ఏదో ఒక బొమ్మ తీసుకోని అమ్మమ్మ దగ్గర కూర్చుంటుంది. ఆట మధ్యలో అలా చేయకూడదు బొమ్మ ఇచ్చేయ్ అంటే ‘ఊ… హూ’ అంటుందే కాని ఇవ్వదు. అన్నీ ఏం మాట్లాడకుండానే చేసేస్తుంది. బుడిగికి అమ్మ కుట్టించిన గౌన్లు, వాటిపైన అమ్మ కుట్టిన పువ్వులు అన్నీ చూపిస్తా. వాటిని లాక్కొని అమ్మమ్మ దగ్గరకి పరిగెడుతా దారిలో అన్నీ పడేస్తుంది. చక్కగా ఇస్త్రీ చేసి మడతపెట్టినవి నలిగిపోతాయి. అమ్మ చూస్తే నాపై కేకలు. బుడిగి కోసం అన్నీ భరించాలనే వుంటుందిలే. కాని బుడిగి మాత్రం మాతో అంతగా ఏం ఆడుకోదు. ఇక్కడ మమ్మల్నిలా సతాయిస్తుందా! అక్కడ ట్యూషన్‌లో మణి పక్కనే కూర్చుంటుంది కదా! ఏదైనా చేస్తే ఎక్కడ మణికి కోపమొచ్చి బుడిగిని కూడా దెబ్బలెస్తాడేమోననే భయం. అయితే మణి ఎప్పుడూ అలా ఏం చేయలా. ఇంకా అప్పటినుంచే పాఠం పైన శ్రధ్ధ చూపాడు త్వరగా నేర్చేసుకొని ఆటలకొచ్చేసేవాడు.

ఇప్పుడు అందరికీ ఆటల టయిములో బుడిగితో ఆడుకోవడమే ఒక ఆటై పోయింది. మణిలో ఎంత మార్పు? గణేశ్ సార్ వాళ్ళ దగ్గర కొచ్చాక కొంచెం దారిలోకి వచ్చాడు కాని, మణి అలాగే వుండేవాడు. రోజూ రావడం, నిలబడి ఇంపోజిషన్ రాయడం. ఇప్పుడు బుడిగి వచ్చి మణి పక్కన కూర్చున్నప్పటినుండి ఇంటి దగ్గరే హోమ్ వర్క్ రాసేస్తాడు. మాతోపాటూ ఆటలకొస్తాడు. బుడిగి మా చెల్లెలే అని ఇక మేము అందరికీ చెప్పకనే తెలిసిపోయింది. ఎలాగంటే మణిలో మార్పు చూసి పెద్దసారు “మన కవిత చెల్లెలు చూడండర్రా మణిని మీతో ఆడుకునేలా చేసింది” అని అనడంతో. కాని అప్పటికే బుడిగి అక్కడ వున్నవాళ్ళదరికీ చెల్లెలై పోయిందిగా. అయితేనేం బుడిగికి పెద్ద అక్కని మాత్రం నేనే. అనితతో అదే చెప్తా. అనిత కూడా “అవునవును నువ్వు పెద్ద- నేను చిన్న”, అంటుంది. ఇద్దరం తలఎగరేస్తాం నవ్వుకుంటా.

ఇంట్లో కూడా బుడిగి తీరే వేరు. నాన్నంటే లెక్కేలేదు. నిజం చెప్పాలంటే నాన్నకే అదంటే భయం. పిలిస్తే పలకదేమో! ఎత్తుకుంటే ఏడుస్తుందేమోనని. అమ్మ దగ్గరా అంతే! అనిత, నేనూ అడిగినట్లు నెమ్మదిగా మర్యాదగా ప్రేమనో, మారాంనో ఏదో ఒకటి కలిపి ప్రాధేయపడినట్లు అడగదు. అన్నీ ఆర్డర్ వేసినట్టు అడగడమే. అమ్మమ్మ దగ్గరా అంతే, కాకపోతే వద్దంటే కాసేపు ఎవరితో మాట్లాడకుండా వుంటుంది. ఆ తర్వాత మర్చిపోతుంది కాబట్టి అమ్మ, నాన్న సేఫ్.

మా అల్లరి కొంచెం తగ్గిందని సార్లతో పాటూ ఇంట్లో వాళ్ళూ కొంచెం చూసి చూడనట్టు వదిలేయడం- మణి, గణేశ్‌ల మార్కులు చూసి ఖుషీ అయిపోయి వాళ్ళింట్లోవాళ్ళూ… మాకు చెట్లెక్కడానికి అడ్డం చెప్పకపోవడంతో సార్ వాళ్ళతో సహా అందరం కోతికొమ్మచ్చి ఆడ్డమే. చిన్నసార్ చెట్లు అలాగ్గా ఎక్కేస్తాడు. కాని పెద్దసార్ మాత్రం ఎక్కనంటాడు. అక్కడే మా పిల్లలకు అనుమానాలొచ్చేస్తుంటాయి అసలు పెద్దసారుకు చెట్లెక్కడమొచ్చా? అని.

ఆటలాడేప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలబ్బా. ఏమైనా! ఒకరోజు అందరిలోకి అర్భకుడు-అంతకన్నా ఎక్కువగా అల్లరోడు సంతోష్ జామచెట్టు చిటారుకొమ్మపై నుంచి ఊయలూగుతా దిగుతావున్నాడా! ఎక్కడో పట్టుతప్పి- కొమ్మలనుంచి జారుతూ కింద పడిపోతావున్నాడు. అక్కడే వున్న పెద్దసార్ వాడు కిందపడకముందే, కొమ్మలమీదే వాడిని పట్టుకునేసాడు. కాని సంతోష్ భయంతో కొంచెంసేపు కళ్ళు తెరవలా. గణేశ్ నానమ్మ వచ్చి అందరితోపాటూ సార్ వాళ్ళనీ బాగా అరిచారు. అందరికీ భయం పట్టుకుంది. పక్క వీధిలో భాగ్య వాళ్ళింటి పక్కఇంట్లో ఓ డాక్టరుగారున్నారు ఆయనొచ్చి చూసి సంతోష్‌ని లేపి నువ్వు మేలురా కాలో, చెయ్యో విరగ్గొట్టుకోలేదు. అదే నేను నీ వయసులో ఇలాగే చెట్టుమీంచి కిందపడి కుడిచెయ్యి విరిగింది. నెలరొజులు బడికి డుమ్మా. భలేవున్నదిరా అప్పుడు. ఆ తర్వాత మా బామ్మ పట్టుపట్టి నన్ను డాక్టరవమంది. ఈ రోజు నీవల్ల ఆ రోజులు గుర్తొచ్చాయని చెప్పి భలే నవ్వించారు, ఫీజుకూడా తీసుకోకుండా. దాంతో కాసేపటిముందు మాకు చెట్లెక్కడమంటే వున్న భయం ‘ఉష్’ మంటా వెళ్ళిపోయింది. “అయినా… పడితే పట్టుకోడానికి మా పెద్దసార్- ఏమన్నా విరిగితే కట్టుకట్టడానికి డాక్టరుగారూ దగ్గరేవుంటే మనకెందుకు భయ్యం!?” అనుకున్నాం అందరం. అందరిళ్ళల్లో పెద్దోళ్ళు ఒళ్ళు దగ్గరబెట్టుకొని ఆడుకోండర్రా అంటూ అరిచింది మాత్రం వీధంతా వినపడినా ఎవరూచెవిలో వేసుకోలా.

“ఏంటీ అల్లరి? పెద్దపిల్లవి ఆ మాత్రం తెలీదూ!” ఈమధ్య అమ్మనాతో మాట్లాడే తీరు ఈ తీరుగుంది. నా తర్వాత ఇద్దరు పిల్లలుంటే నేను పెద్దపిల్లయిపోతానా? అదే నా ఈడు భాగ్యని వాళ్ళింట్లో ఇద్దరు అక్కలు ప్రతి దానికి చిన్నపిల్లవి నువ్వు ఊరుకో అంటా వుండడం. మమ్మల్నిలా గందరగోళంలో పడేస్తే మేమేమైపోవాల!? ఇంటికి పెద్దపిల్లగా అస్సలు పుట్టకూడదు అని నేనంటే- ఆఖరిపిల్లగా పెరిగేకన్నా అడవిలో కోతిపిల్లగా పెరగడమే సుఖం అని ఇక్కడ భాగ్య బాధ.

బుడిగి ఇప్పుడు చుట్టుపక్కల అన్నీ చూసి తెలుసుకుంటూంది. అనిత, నేనూ ఆడుకుంటుంటే దగ్గరేవుండి చూస్తూంటుంది. బుడిగిని చూస్తుంటే అమ్మ మాటలు గుర్తొస్తూనే వుంటుంది. పెద్దపిల్లని కాబట్టి యే పని చేసినా మన వెనకాలే వచ్చేవాళ్ళకు మనమెప్పుడూ లీడర్‌గానే వుండాలి. అచ్చు ట్యూషన్ సార్ వాళ్ళున్నట్లుగా వుండాలి. ఈ విషయంలో అమ్మమ్మ, బామ్మ నాకు బాగా సాయం చేస్తారు. అయినా… అప్పుడప్పుడు కవిత కోతిపిల్లగా అయిపోతూ వుంటుందిలే, అప్పుడు మాత్రం అమ్మకు దొరక్కుండా, నాన్నచేత కాజా తినకుండా వినాయకుడు సాయం చేస్తాడు.

మూడు విషయాలు చెప్పాలని ముఫ్ఫైఆరు సంగతులు చెప్పేసానా!! అయినా కూడా చెప్పాల్సినవింకా చాలానే వున్నాయి. కాని, ఈ లోపల మా బడికి వేసవి సెలవలు వచ్చేసాయి. పిల్లలందరం అమ్మమ్మ వాళ్ళూరు వెళ్ళాలి. ఆటలాడుకోవాలి. అక్కన్నుంచొచ్చాక అందరితో కలిసి అన్ని విషయాలూ వివరంగా చెప్పేస్తాగా..

(అయిపోయింది)

Exit mobile version